-ఆన్లైన్ ద్వారానే భవననిర్మాణ అనుమతులు -85% మొక్కలు దక్కకుంటే పదవులకు గండమే -ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆసరా పింఛన్లు అందజేత -పార్టీలకు అతీతంగా పురపాలికల అభివృద్ధి -బంగారు తెలంగాణ స్వాప్నికుడు సీఎం కేసీఆర్ -పల్లెలు, పట్టణాల ప్రగతితోనే సీఎం కల సాకారం: పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు -జనగామ, భువనగిరి పట్టణప్రగతిలో ప్రజలతో మంత్రి ముఖాముఖి

పట్టణాల్లో భవననిర్మాణాల అనుమతుల కోసం ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని.. ఎవరైనా లంచం డిమాండ్ చేసినట్లు తేలితే.. సహించబోమని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. ప్రజలకు పారదర్శకంగా పరిపాలన అందించడంకోసమే కొత్త మున్సిపల్ చట్టంలో అనేక వెసులుబాట్లు కల్పించామని పేర్కొన్నారు. ‘కొత్త చట్టం ప్రకారం 596 చదరపు గజాల స్థలంవరకు ఆన్లైన్లో దరఖాస్తుచేసుకొన్న 21 రోజుల్లో భవన నిర్మాణ అనుమతులు ఇస్తున్నాం. 75 గజాల లోపు స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇండ్లు నిర్మించుకోవచ్చు.
టౌన్‌ప్లానింగ్ అధికారులు లంచం అడిగినా ఇవ్వొద్దు. ఒకవేళ డిమాండ్ చేస్తే కలెక్టర్‌కు ఫిర్యాదు చేయండి. వారిపై కఠినచర్యలు తీసుకొనే బాధ్యత మాది’ అని తెలిపారు. అక్రమ లే-అవుట్లు, దొంగ వెంచర్లపై ఉక్కుపాదం మోపాలని.. అందరూ పన్నులు చెల్లించేలా చర్యలు తీసుకొంటే ఆదాయం పెరుగుతుందని పురపాలకశాఖ అధికారులకు సూచించారు. పట్టణ ప్రగతి మూడోరోజు కార్యక్రమంలో భాగంగా బుధవారం మంత్రి కేటీఆర్ జనగామ, భువనగిరి పట్టణాల్లో పర్యటించారు. జనగామ మున్సిపాలిటీలోని 13, 30 వార్డుల్లో ఆకస్మికంగా తనిఖీచేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిలతో కలిసి కాలి నడకన పర్యటించారు. స్థానికులను కలిసి వారి సమస్యలను తెలుసుకొన్నారు. ఆసరా పింఛన్లు వస్తున్నాయా అని ఆరాతీశారు.
సంక్షేమపథకాలు అందుతున్న తీరు, తాగునీరు, విద్యుత్ సరఫరాల గురించి ప్రశ్నించారు. అనంతరం అంబేద్కర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించారు. ఖాళీ స్థలాల్లో మురికి తుమ్మలు, చెత్తచెదారం ఉంటే స్థల యజమానికి నోటీసు ఇవ్వాలని, వినకుంటే ఐదువేల జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. జరిమానా విధించిన తర్వాత కూడా వినకుంటే స్థలాన్ని మున్సిపాలిటీ స్వాధీనంచేసుకొంటామని చెప్పారు. పట్టణంలో పందులు ఉండకుండా పెంపకందారులకు ఉ పాధికల్పించాలని సూచించారు. తడి, పొడి చెత్తబుట్టలద్వారా చెత్తను వేరుచేసి మున్సిపల్ సిబ్బందికి విడివిడిగా ఇవ్వాలని.. వాటిద్వారా ఎరువులు తయారుచేయొచ్చని, విద్యుత్ ఉత్పత్తిచేయవచ్చని తెలిపారు. ‘పల్లెప్రగతిలో గ్రా మాలు.. పట్టణప్రగతితో పట్టణాలు, నగరాల రూపురేఖలుమారితే రాష్ట్రమంతా బాగుపడ్డట్టే లెక్క. అందుకోసమే సీఎం కేసీఆర్ పకడ్బందీ గా కొత్త చట్టాలను తెచ్చారు’ అని పేర్కొన్నారు.

మొక్కలు కాపాడకుంటే పదవులు పోతాయి కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం పనిచేసే ప్రజాప్రతినిధులకు బాధ్యతలతోపాటే గౌరవం ఉన్నది.. అదే సమయంలో నిర్లక్ష్యంగా పనిచేసే చైర్మన్, కౌన్సిలర్లను పదవుల నుంచి తొలగించే అధికారం కూడా కలెక్టర్లకు ఉన్నదని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ‘జనగామ మున్సిపాలిటీకి రూ.12.45కోట్ల బడ్జెట్ ఉన్న ది. ఇందులో పదిశాతం హరితహారానికి కేటాయించాలి. ప్రతివార్డులో నిర్దేశించిన మేరకు మొక్కలునాటాలి. ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవసరమైన మొక్కల వివరాలతో హరిత ప్రణాళికద్వారా మొక్కలు అందించి నాటినవాటిలో 85శాతం బతికేలా చూసే బాధ్యత వార్డు కౌన్సిలర్‌పై ఉన్నది. కౌన్సిలర్లు ఏ పార్టీవారైనా.. మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యంచేసినా.. పట్టణ ప్రగతి లక్ష్యాలను నెరవేర్చకున్నా చైర్మన్ సహా కౌన్సిలర్ల పదవులు పోతాయి’ అని స్పష్టంచేశారు.
లక్ష జనాభా ఉన్న మున్సిపాలిటీలో ప్రతి వెయ్యిమందికి ఒక పబ్లిక్ టాయిలెట్ ఉండాలని చెప్పారు. జనగామలో రాను న్న రెండు నెలల్లో వంద టాయిలెట్లను నిర్మించాలన్నారు. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు సవాలుగా తీసుకొని జనగామ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని కోరారు. పట్టణ ప్రణాళికలో భాగస్వాములవుతున్న ప్రత్యేక అధికారులు, అభివృద్ధి కమిటీల సభ్యులు ఆయా వార్డుల్లో పారిశుద్ధ్యం, హరితహారం పర్యవేక్షించాలని, ప్రతి మనిషికి రో జూ 135 లీటర్ల నీళ్లు అందేవిధంగా వాటర్ ఆడిట్‌చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచుతూ.. ఆ ఆదాయాన్ని పేదలకు పంచడమే ప్రభుత్వ లక్ష్యమని.. ఈ లక్ష్యసాధనకు సీఎం ఒక్కొక్క కార్యక్రమాన్ని చేసుకొంటూ ముందుకుపోతున్నారని చెప్పారు.
ఏప్రిల్‌లో కొత్త పింఛన్లు.. ఆలస్యమైనా అర్హులకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు తప్పకుండా అందుతాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. ‘రందిపడొద్దు. బాధపడద్దు. పైరవీలు చేయొద్దు. ఎవరికీ ఒక్క పైసా ఇవ్వ ద్దు. సమగ్ర కుటుంబసర్వే ద్వారా సేకరించిన ప్రజల వివరాలన్నీ ప్రభుత్వం వద్ద ఉన్నాయి. అర్హులైనవారికి ఏప్రిల్‌లో కొత్త పింఛన్లు అందిస్తాం. నిరుపేదలను దేవులాడి (వెతికి) మొదటి విడుతలో డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తాం. రెండోవిడుతలో గుడిసెలు, రేకుల ఇం డ్లు ఉన్నవారికి ఇస్తాం’ అని హామీ ఇచ్చారు. పింఛన్ల పెంపు, సన్నబియ్యం, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను సమర్థంగా అమలుచేస్తున్నామని.. ఇన్నిరోజుల దరిద్రాన్ని పోగొట్టడానికి సమయం పడుతుందని చెప్పారు. వచ్చే నాలుగేండ్లలో ఎన్నికలు లేవ ని.. ఓట్లయిన తర్వాత ప్రజల దగ్గరకు వచ్చేవాడే నిజమైన నాయకుడన్నారు. ప్రజల అవసరాలను పదిరోజుల్లో గుర్తిస్తే.. ఆరునెలల్లో పూర్తిచేస్తామని తెలిపారు.

అభివృద్ధికి అంకితమవుదాం పార్టీలకతీతంగా రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకొందామని భువనగిరి పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ అన్నారు. భువనగిరి పట్టణ పురపాలక పాలకవర్గం సమావేశానికి హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘మాపార్టీ కౌన్సిలర్లు లేకపోయినంత మాత్రా న ప్రజలు మావారు కాదా. అందరూ మనవారే’ అని వ్యాఖ్యానించారు. అన్ని ప్రాంతాలను వివక్ష లేకుండా అభివృద్ధిచేయాల్సిన బాధ్యత కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లపై ఉన్నదని హితవుచెప్పారు. బంగారు తెలంగాణ స్వాప్నికుడైన సీఎం కేసీఆర్ కలను సాకారంచేద్దామని పిలుపునిచ్చారు. ప్రతిఒక్కరూ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని, తమ ప్రభు త్వం ఏనాడూ ప్రతిపక్షపార్టీల శాసనసభ్యులను మొదలుకొని పంచాయతీ వార్డు సభ్యు ల దాకా ఎలాంటి వివక్ష చూపలేదని స్పష్టంచేశారు. ప్రతిపక్షపార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులోని ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు ఉంటే వాటికోసం నిధులు కేటాయించి అభివృద్ధి జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
భువనగిరిలో పారిశుధ్ధ్య, హరితహారం కార్యక్రమాల గురించి వివరాలు అడిగి తెలుసుకొన్నారు. పారిశుద్ధ్య ప్రణాళికలో భాగంగా పట్టణానికి అవసరమై న స్వచ్ఛవాహనాలు, పారిశుద్ధ్య సిబ్బంది, డంప్ యార్డుల అభివృద్ధి, తడి పొడి చెత్త కార్యక్రమాన్ని అమలుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలుచేశారు. కౌన్సిల ర్లు తమ బాధ్యతలను సంపూర్ణంగా నిర్వర్తిస్తే పట్టణానికి అవసరమైన నిధులను ఇచ్చేందు కు సిద్ధంగా ఉంటామని హామీఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జిల్లా పాలనాధికారి అనితా రామచంద్రన్, భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింత కిష్టయ్య, ఆర్డీవో ఎంవీ భూపాల్‌రెడ్డి, కమిషనర్ నాగిరెడ్డి పాల్గొన్నారు.
హైమమ్మా.. నీళ్లొస్తున్నయా? జనగామ, నమస్తే తెలంగాణ: జనగామ మున్సిపాలిటీ 13వ వార్డులో పాదయాత్రలో భాగంగా మంత్రి కేటీఆర్.. హైమవతి అనే గృహిణి మధ్య జరిగిన సంభాషణ ఇదీ..
కేటీఆర్: రోజూ నల్లా నీళ్లు వస్తున్నాయా? గృహిణి : వస్తున్నయి సార్
మిషన్ భగీరథ నల్లా పెట్టిండ్లా? గృహిణి: పాత నల్లాతో రోజు నీళ్లు వస్తున్నయ్..
చెత్తబండి వస్తున్నదా? గృహిణి: రోజు వస్తున్నది సార్
చెత్త బుట్టలు ఉన్నయా? గృహిణి: ఉన్నయ్
రిక్షాకు చెత్త ఎట్ల ఇస్తున్నవ్.. నీకు టెస్ట్ పెడుతున్న.. ఏవీ మీ ఇంట్లో రెండు బుట్టలు ఉన్నయా? చూపిస్త్తవా? తీసుకురా పో.. గృహిణి: సార్ మాది ఈ ఇల్లు కాదు.. ఎదురిల్లు
మీ ఇంట్లో వాడుతున్నవా? లేదా? గృహిణి: ఒకటే ఉన్నది సార్..
ఇంకోటి ఏమైంది? గృహిణి: అప్పుడిచ్చిండ్లు.. ఇప్పుడు ఇవ్వలేదు సార్
నెలకోటి ఇస్త్తరా ఏందీ? ఆ డబ్బాల్లో పప్పులు పోసిండ్లా? గృహిణి: అవును సార్
అందుకే అడుగుతున్న తెల్వక అడుగుతున్న అనుకున్నవా? గృహిణి: హా అవును సార్ నిజమే
(అధికారులతో)మళ్లీ ఒక రౌండ్ కొత్తగా ఇవ్వండి.. హైమా ఈసారి వాడకపోతే ఫైన్ వేస్తం గృహిణి: కొత్తవి ఇవ్వండి సార్ పప్పులు, బియ్యాలు పొయ్యద్దు మరి గృహిణి: పప్పులు, బియ్యం కాదు.. తడి, పొడి చెత్త వేస్తాం
ఉల్టా నాకే చెప్తున్నవా? (నవ్వులు).. నేను ఇంతసేపు క్లాస్ పీకితే, నువ్వు ఉల్టా నాకే చెప్తావ్.. బాగున్నవ్ తల్లీ.. గృహిణి: మీక్కూడా క్లారిటీ ఇవ్వడం కోసం చెప్తున్నం సార్
ఏం చదువుకున్నవ్.. జీవితం చదివినవా? గృహిణి: ఇంటర్ సార్ చదివేసినవ్ అర్థమైంది.. కానీ బుట్టలు ఇస్తాం.. సిబ్బందిని పెంచుతం కాని దయచేసి వాడండి..(నవ్వుతూ..)