Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

లంచమంటే తోలుతీస్తా!

-ఎవరన్న పైసలడిగితే నాకు ఫోన్ చేయండి -నా ఫోన్ నంబర్ 040-23454071 -వరంగల్‌లో ఆరు పక్కాగృహాల కాలనీలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన -400 కోట్లతో 3957 ఇండ్ల నిర్మాణం -కాలనీల్లో త్వరలో అధికారుల ఆర్థికసర్వే -ఉపాధికి కార్పొరేషన్లనుంచి రుణాలు -ఇండ్ల నిర్మాణాల పర్యవేక్షణ బాధ్యత ఎంపీ, ఎమ్మెల్యేలదే -పది రోజుల్లో మళ్లీ వస్తా: కేసీఆర్

KCR-addressing-in-warangal ప్రభుత్వం ఇస్తున్న ఇండ్లకు ఎవరైనా లంచం అడిగితే తోలు తీస్తానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వమే మొత్తం డబ్బు ఇస్తుందని, ఎవరూ ఒక్క రూపాయికూడా ఇచ్చే పనిలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్‌ను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దుతానని కేసీఆర్ చెప్పారు. నగరంలో మిగిలిన మురికివాడల్లో కూడా ఇండ్లు కట్టిస్తానని, ఆర్థిక సర్వేలు నిర్వహించి వివిధ కార్పొరేషన్ల ద్వారా ఉపాధికోసం రుణాలు కూడా ఇప్పిస్తామని చెప్పారు. నగరంలో మరో రెండు షాదీఖానాలు నిర్మిస్తామని, అలాగే అధునాతన రీతిలో కూరగాయలు, మాంసం మార్కెట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గృహనిర్మాణాలపై నిరంతర పర్యవేక్షణ చేస్తానని మరో పది రోజుల్లో తిరిగి నగరానికి వస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆదివారం వరంగల్ నగరంలోని లక్ష్మీపురం, శాకరాశికుంట, గిరిప్రసాద్‌నగర్, దీన్‌దయాల్‌నగర్, ప్రగతినగర్, అంబేద్కర్‌నగర్ మురికివాడల గుడిసెల్లో నివాసం ఉంటున్న పేదల పక్కా గృహాల నిర్మాణాలకు పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో సీఎం మాట్లాడారు.

ఇండ్లకోసం మొత్తం పైసలు మంజూరు చేసిన. మీరు ఎవడికి ఒక్క రూపాయి ఇచ్చేపనిలేదు. ఎవడన్న లంచం అడిగితే తోలు తీస్త. మీరు రూపాయి ఇచ్చినట్టు తెలిసినా పొట్టుపొట్టు సంపుత అని కేసీఆర్ అన్నారు.ఎవడన్న లంచం అడిగితే నాకు ఫోన్ చేయండి. వాని మైలపోలు తీస్త. నా ఫోన్ నంబర్ 040-23454071. దీనికి ఫోన్ చేస్తే ఏం పైసలు పడయి. సీఎం ఆఫీసుల హెల్ప్‌లైన్ పెడ్త. ఆ పైసలు అడుగుడేందో, మీరు ఇచ్చుడేందో అన్నిటి సంగతి తేలుస్తా. గంతపెద్ద తెలంగాణనే సాధించుకున్న మనం గీ కాలనీలను బాగుచేసుకోలేమా? ఓపిక కావాలె. చిత్తశుద్ధి కావాలె. కమిట్‌మెంట్‌తో పనిచేయాలె. కానీ వానికి వీనికి పైసలు ఇత్తే పనైతదని ఎక్కడికెక్కడికో పోవద్దు. పోయి ఆగం కావద్దు అని సీఎం స్పష్టం చేశారు.

 

వరంగల్‌ను అద్దంలా మారుస్తా.. వరంగల్ నగరాన్ని అద్దంలా మారుస్తానని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అన్నారు. రాబోయే మూడేండ్లలో గుడిసెకాలనీలు లేని నగరంగా వరంగల్‌ను తీర్చిదిద్దుతానన్నారు. నాలుగురోజుల పాటు నగరంలోని తాను తొమ్మిది మురికివాడలను పరిశీలించాలని అవన్నీ అధ్వాన్నంగా ఉన్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో అరవై ఏండ్లుగా జరిగింది ఏమీ లేదని అన్నారు. ఆరు చందమామలు, వంద సూర్యుళ్లు దింపినట్టు చెప్పుకున్నారు..కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది. బస్తీల్లోకి పోతే మురికి.. మోరీల కంపు. వానొస్తే మోకాలుమంటి నీళ్లు అని కేసీఆర్ దుయ్యబట్టారు.

కొన్ని బస్తీల్లో వర్షం వస్తే మూడు రోజులు ఎక్కడో తలదాచుకుని నీళ్లు గుంజినంక వచ్చినమని చెప్పిండ్రు.. అని కేసీఆర్ వివరించారు. ఇంకా నగరంలో మరో 60, 70 పెద్దపెద్ద స్లమ్‌లు ఉన్నాయని వాటన్నింటిని కూడా అభివృద్ధి చేస్తామని, అక్కడ నివసిస్తున్న పేదలందరికి దశలవారీగా పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని అన్నారు. ప్రస్తుతం మొదటి విడతగా నగరంలోని ఆరు మురికివాడలను ఎంపిక చేశామన్నారు. ఈ ఆరు మురికివాడల్లో 3957 పక్కా గృహాలను (జీప్లస్ వన్ పద్ధతిన) నిర్మిస్తామన్నారు. ఇందుకు రూ. 400 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశామన్నారు.

ఎంత ఖర్చయినా సరే అనుకున్నది అనుకున్నట్టు జరిగి తీరాలని, అందుకు మీరంతా సంపూర్ణ సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ఇప్పుడు నిర్మిస్తున్న ఆరు కాలనీలు నగరానికే మోడల్ కాలనీలుగా ఉండేవిధంగా చూస్తామన్నారు. ఆయా కాలనీలు భవిష్యత్‌లో నిర్మించే కాలనీ నిర్మాణాలకు మాడల్‌గా నిలవాలంటే ఈ కాలనీలలో నివసిస్తున్న ప్రజలు సహకరించాలని అన్నారు.

పది రోజుల్లో మళ్లీ వస్తా. వారం, పదిరోజుల్లో మళ్లీ వరంగల్‌కు వస్తానని, ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో స్వయంగా పరిశీలిస్తానని కేసీఆర్ అన్నారు. ఇండ్లనిర్మాణ పనులు చూసేందుకు బస్తీవాసులు స్త్రీపురుషులతో కూడిన కమిటీలు వేసుకోవాలని, అందులో సగం మంది మహిళలు, మరో సగం మంది పురుషులు ఉండేటట్లు చూసుకోవాలని, వారి ఫోన్‌నెంబర్లతో సహా తనకు పంపించాలని సీఎం సూచించారు. మధ్య మధ్యలో తాను కమిటీ సభ్యులకు ఫోన్‌చేసి ఇండ్ల నిర్మాణం గురించి అడిగి తెలుసుకుంటానన్నారు. కాలనీ కమిటీలు బాధ్యతగా తమ కాలనీల్లోని గృహనిర్మాణ పనులను పర్యవేక్షించాలని ఆయన సూచించారు.

షాదీఖానాలకు రూ.6 కోట్లు వరంగల్ నగరంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉందని, వారి కోసం నగరంలోని హన్మకొండ, వరంగల్ ప్రాంతాలలో రెండు షాదీఖానాలను నిర్మిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఒక్కో షాదిఖానాను రూ.3కోట్లతో నిర్మిస్తామన్నారు. అలాగే వరంగల్ నగరంలో మోరీలు, రోడ్లపక్కన కూరగాయలు విక్రయిస్తున్నారని అన్నారు. ఇది మారాలని, నగరంలో ఆరోగ్యకర పరిసరాల్లో కూరగాయల విక్రయాలు జరగాలని అన్నారు. త్వరలోనే నగరంలో కూరగాయల మార్కెట్‌లు, మాంసం, చేపల మార్కెట్‌లు నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పేదల కాలనీలలో కమ్యూనిటీహాల్స్, పార్కులు, అంగన్‌వాడీ సెంటర్లు నిర్మిస్తామని, అందుకోసం నగర పరిధిలోని ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయనే దానిపై వివరాలు సేకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని ముఖ్యమంత్రి చెప్పారు.

సీసీ రోడ్లు, ఇండ్లలో నల్లాలు.. నగర పరిధిలో ఆరు కాలనీల్లో నిర్మిస్తున్న పక్కా గృహ నిర్మాణాల పర్యవేక్షణ బాధ్యత వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖలదేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 5నెలల్లో ఈ ఆరు కాలనీలలో చేపట్టిన గృహ నిర్మాణాలు పూర్తికావాలని అన్నారు. ప్రతి కాలనీలో సీసీ రోడ్లు వేయాలని అలాగే ప్రతి ఇంటికి ఇంటిలోపలే మంచినీటి కనెక్షన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ఈ కాలనీల్లో ఆడబిడ్డలు బిందె పట్టుకోని బయట కనిపించొద్దు. కనిపిస్తే ఎమ్మెల్ల్యేలు రాజీనామాలు చేయాలె అని కేసీఆర్ అన్నారు. కాలనీవాసులు కూడా ప్రజాప్రతినిధులతో సహకరించాలని పనులు సరిగా జరగకుంటే ఎంపీ, ఎమ్మెల్యేల ఇండ్లకు వెళ్లి చెప్పాలని ఆయన అన్నారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో రూ. 400 కోట్లతో చేపట్టిన ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.100 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం రాజయ్య, వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్, జడ్పీ చైర్‌పర్సన్ పద్మ, ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, కొండా సురేఖ, ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్, రెడ్యానాయక్, జిల్లా కలెక్టర్ కిషన్, జేసీ పౌసమిబసు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక స్వావలంబనతోనే పేదల బతుకుల్లో మార్పు.. కేవలం ఇండ్లు కట్టిచ్చి ఇస్తే లాభం లేదు. భూమి పట్టాలు ఇస్తే సరిపోదు. మన బతుకులు మారాలె. మన జీవనం గౌరవంగా సాగాలె. అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. నిర్మించబోయే కాలనీల్లో జీవనోపాధికి ఇబ్బంది లేని విధంగా ఉండేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకుందాం అని ముఖ్యమంత్రి అన్నారు. త్వరలోనే కాలనీల్లో ప్రజల ఆర్థిక స్థితిగతులపై అధికారులు సర్వే నిర్వహిస్తారని, ఈ సర్వే వచ్చిన తరువాత ఏం చేయాల్నో ప్రణాళికలు వేస్తామని కేసీఆర్ చెప్పారు. ఆర్థిక సర్వే ఆధారంగా వారి నైపుణ్యానికి తగ్గట్టుగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.

ఆర్థిక స్వావలంబన కల్పించినప్పుడే పేదల బతుకులు మారుతాయన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల వద్ద నిధులు ఉన్నాయని, వాటిని పేదలకు రుణాలుగా ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అవసరమైన వారికి వృత్తి నైపుణ్యాన్ని పెంచేందుకు శిక్షణ ఇస్తామన్నారు. నైపుణ్యాన్ని బట్టి, చదువును బట్టి, చేయగలిగే పరిస్థితులను బట్టి ఆటోలు, డీసీఎంలు, లేత్‌మిషన్లు, షాపులు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.