Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఎల్బీనగర్‌కు రైలొచ్చింది..రాజధానికి మెట్రో షాన్

-ఇది ప్రజల మెట్రో.. దీనిని ప్రజలే కాపాడుకోవాలి
-మెట్రోతో బహుళప్రయోజనం.. కాలుష్యరహితంగా ప్రయాణం
-అమీర్‌పేట-ఎల్బీనగర్ మెట్రోరైలు ప్రారంభోత్సవంలో గవర్నర్ నరసింహన్
-పీపీపీ విధానంలో దేశంలోనే ఇది ప్రథమం
-మెట్రోస్టేషన్లలో ప్రపంచస్థాయి సదుపాయాలు
-ఆధునిక పరిజ్ఞానంతో మెట్రో నిర్మాణం: పురపాలకశాఖ మంత్రి కేటీఆర్
-ఖైరతాబాద్ నుంచి రాజ్‌భవన్‌కు స్మార్ట్ సైకిళ్లు తొక్కిన గవర్నర్, మంత్రి కేటీఆర్

విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ నగరం తూర్పు, పడమరలను కలుపుతూ మణిహారంగా మెట్రోరైల్ పరుగులు తీస్తున్నది. నాగోల్- మియాపూర్ మార్గాన్ని ఏడాది క్రితమే పూర్తిచేసుకున్న హైదరాబాద్ మెట్రో.. సోమవారం అమీర్‌పేట- ఎల్బీనగర్ మార్గాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావుతో కలిసి అమీర్‌పేటలోని మెట్రోస్టేషన్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ జెండాఊపి ఎల్బీనగర్‌కు మెట్రోరైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్‌లో మీడియా సమావేశం జరిగింది. మెట్రోరైలు ప్రయాణంతో కాలుష్యం నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుందని, ట్రాఫిక్ సమస్య ఉండదని, పెట్రోల్ ధరల భారం కూడా తగ్గుతుంది కనుక ఈ సౌకర్యాన్ని ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలని గవర్నర్ నరసింహన్ సూచించారు. ఇది ప్రభుత్వ మెట్రో కాదని.. ప్రజల మెట్రో అని.. దీనిని ప్రజలే కాపాడుకోవాలని చెప్పారు. మెట్రోరైలుతో బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని, అందువల్ల మెట్రోసేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తిచేశారు.

మెట్రో ప్రయాణికుల సంఖ్య పెరిగితే.. రోడ్లపై వాహనాల రాకపోకలు తగ్గి అంబులెన్స్ వంటి అత్యవసరాల వాహనాలు సులువుగా వెళ్లగలుగుతాయన్నారు. దేశంలోనే హైదరాబాద్ మెట్రో అత్యుత్తమమైనదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలోనే పీపీపీ విధానంలో నిర్మిస్తున్న ప్రప్రథమ ప్రాజెక్టు అని చెప్పారు. స్టేషన్లలో ప్రపంచస్థాయి సదుపాయాలు కల్పించామని తెలిపారు.

ఘనంగా ప్రారంభోత్సవం
రైలు ప్రారంభోత్సవానికి ముందు అమీర్‌పేట మెట్రోస్టేషన్‌కు చేరుకున్న గవర్నర్‌కు మంత్రి కేటీఆర్ స్వాగతం పలికారు. అక్కడే ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్ గురించి ప్రత్యేకంగా వివరించారు. స్టేషన్లను అభివృద్ధిచేయడానికి ముందు ఆయా ప్రాంతాలు ఎలా ఉండేవి? మెట్రో వచ్చాక ఎలా రూపాంతరం చెందాయో గవర్నర్‌కు మంత్రి కేటీఆర్ విపులంగా చెప్పారు. రైలును ప్రారంభిన అనంతరం గవర్నర్.. మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు, ఎంపీలు బండారు దత్తాత్రేయ, చామకూర మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, ఎల్‌అండ్‌టీ మెట్రోరైలు ఎండీ కేవీబీ రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిశోర్, టీఆర్‌ఎస్ నేత దానం నాగేందర్ తదితరులతో కలిసి ఎల్బీనగర్ వరకు ప్రయాణించారు. మధ్యలో ఆసియాలోనే అతి పెద్దదైన ఎంజీబీఎస్ ఇంటర్‌చేంజ్ మెట్రోస్టేషన్‌లో దిగి పరిశీలించారు. ఎల్బీనగర్ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన మెట్రోరైలు ఫొటో ఎగ్జిబిషన్‌ను గవర్నర్ ఆసక్తిగా తిలకించారు. మెట్రో నిర్మాణంలో వినియోగించిన ఆధునిక పరిజ్ఞానం, ఏయే స్టేషన్లను ఎలా అభివృద్ధి చేశారు వంటి విషయాలను మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ మెట్రోస్టేషన్‌లో గవర్నర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మెట్రోరైలు సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, కాలుష్యరహితంగా ఆరోగ్యకరమైన ప్రయాణాన్ని ఆస్వాదించాలని ప్రజలకు సూచించారు. మెట్రోరైలు ఒక అద్భుత నిర్మాణమని, రానున్న రోజుల్లో హైదరాబాద్‌లోని ప్రతిఒక్క మెట్రోస్టేషన్ పర్యాటక ప్రాంతంగా మారుతుందని చెప్పారు.

మెట్రోస్టేషన్లలో అన్నిరకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయని, ప్రయాణికులు ఒక స్మార్ట్ కార్డు ద్వారా సకల సౌకర్యాలు పొందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు. ప్రజల జీవితాన్ని మెట్రోరైలు మరింత సులభతరం చేస్తుందన్నారు. వచ్చే డిసెంబర్ 15వ తేదీనాటికి హైటెక్‌సిటీ మార్గాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని మెట్రో, ఎల్‌అండ్‌టీ అధికారులను ఆదేశించారు.

దేశంలోనే అత్యుత్తమం: మంత్రి కేటీఆర్
ఆధునిక పరిజ్ఞానం, నాణ్యతలో హైదరాబాద్ మెట్రో అత్యుత్తమంగా నిలుస్తుందని మంత్రి కే తారకరామారావు చెప్పారు. దేశంలో అనేక మెట్రోలు ఉన్నప్పటికీ, విభిన్నమైన ఇంజినీరింగ్ సాయంతో మెట్రోను డిజైన్ చేసిన ఘనత కేవలం హైదరాబాద్ మెట్రోరైలుకే దక్కుతుందన్నారు. ప్రపంచంలోనే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపడుతున్న అతిపెద్ద మెట్రోరైలు ప్రాజెక్టుగా హైదరాబాద్ చరిత్ర సృష్టించిందని అన్నారు.

విభిన్నమైన ఇంజినీరింగ్‌తో నిర్మాణం
ప్రతి మెట్రోస్టేషన్‌ను ప్రపంచస్థాయి సదుపాయాలతో అభివృద్ధి చేశామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఫుట్‌పాత్‌లు, పార్కింగ్ సౌకర్యాలు వంటివి ఏర్పాటులో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామన్నారు. ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి మెట్రో నిర్మాణం చేపట్టామన్నారు. అందుకే ఈ ప్రాజెక్టును అనేక అవార్డులు వరించాయని వివరించారు. చాలాచోట్ల విభిన్నమైన ఇంజినీరింగ్‌తో మెట్రోను రూపొందించామని, ఇందుకు పంజాగుట్టలో చేసిన పనులే నిదర్శనమని అన్నారు. సహజసిద్ధమైన వెలుతురు వచ్చేలా మెట్రోస్టేషన్లను తీర్చిదిద్దామన్నారు. స్కైవాకులు ఏర్పాటు చేశామని, ప్రతి స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిలుగా పనికొస్తుందన్నారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ, ఫస్ట్ మైల్ కనెక్టివిటీలో భాగంగా సైక్లింగ్ స్టేషన్లు, ఎలక్ట్రిక్ వాహనాలను పెట్టి కొత్తగా ఉబర్ వంటి కంపెనీలతో చార్జింగ్ స్టేషన్లను ప్రాంభించామన్నారు. జూమ్ కార్లు, బైకులు కూడా అందుబాటులోకి తెచ్చామని వివరించారు. ప్రస్తుతం మెట్రోలో నిత్యం లక్ష మంది ప్రయాణిస్తున్నారని, కొత్త మార్గం ప్రారంభంతో 2 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉన్నదని మంత్రి చెప్పారు.

సైకిల్ తొక్కిన గవర్నర్, కేటీఆర్
మెట్రో ప్రారంభోత్సవం సందర్భంగా ఎల్బీనగర్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్ ఖైరతాబాద్‌లో మెట్రోరైలు దిగారు. స్టేషన్ బయటికొచ్చి స్టాండ్‌లో ఉన్న స్మార్ట్ సైకిళ్లను తీసుకున్నారు. ఇద్దరూ కలిసి స్వయంగా స్మార్ట్ సైకిళ్లు తొక్కుకుంటూ రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. వీరిని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ సైకిళ్లపై అనుసరించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.