Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

లెక్కలన్నీ తప్పే

-జీవో 233 సంగతేమిటో చెప్పండి? -జీవో 107కు సవరణ.. 834 అడుగులకు వెసులుబాటు -తన ఘనతేనని మీసాలు తిప్పింది దేవినేనే -శ్రీశైలంపై ఇవాళ మాట మార్చి కాకిలెక్కలు -నీటిపారుదల మంత్రి హరీశ్ రావు మండిపాటు -ఈ ఏడాది 9వేల చెరువుల పునరుద్ధరణ -ఖరీఫ్ నాటికి రైతులకు ఫలితాలు -20 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ -పనుల్లో టెండర్ విధానం,ఈ-ప్రొక్యూర్‌మెంట్ -రింగ్ అవకాశం లేకుండా స్థానికులకు ప్రాధాన్యం -చిన్న నీటిపారుదలకు ఇక ఇద్దరు సీఈలు : హరీశ్

Harish Rao

శ్రీశైలం జలవినియోగం విషయంలో ఏపీ ప్రభుత్వ వాదనలన్నీ కాకి లెక్కలేనని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జీవో 107 గురించి గొప్పగా మాట్లాడుతున్న ఏపీ సర్కారు, ఆ రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ అదే 107 జీవోను సవరిస్తూ రాజశేఖర్‌రెడ్డి జారీచేసిన మరో జీవో 233 విషయాన్ని ఎందుకు దాస్తున్నారని నిలదీశారు. జీవో 107కు సవరణగా వచ్చిన జీవో 233 ప్రకారం పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు 34 టీఎంసీల నీటిని వాడుకున్న తర్వాత మిగతా నీటిని 834 అడుగుల వరకూ వాడుకోవచ్చని హరీశ్‌రావు చెప్పారు. దానిని దేవినేని ఎందుకు ప్రస్తావించడం లేదని సూటిగా ప్రశ్నించారు. వైఎస్ ప్రభుత్వం జీవో 233 జారీచేసినపుడు తమ ఉద్యమం వల్లనే ఈ సవరణ జీవో జారీ అయిందని దేవినేని గొప్పగా చెప్పుకొన్నారని, ఇప్పుడు మాట మార్చి మళ్లీ 107 జీవో గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

డెల్టా, రాయలసీమ నేతలు తమ తమ ఆధిపత్యం కోసం శ్రీశైలం నీటితో ఆడుకున్నారని, తెలంగాణను నిలువునా దగా చేశారని ఆయన దుయ్యబట్టారు. ఆదివారం సచివాలయంలో మన ఊరు-మన చెరువు కార్యక్రమంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు. శ్రీశైలం జలవివాదం, చెరువుల పునరుద్ధరణ తదితర అంశాలను మీడియాకు వివరించారు. సమీక్షా సమావేశంలో ఈ ఏడు 9 వేల చెరువుల పునరుద్ధరణ జరపాలని నిర్ణయించామని చెప్పారు. రూ.4500 కోట్లతో చేపడుతున్న ఈ పనులన్నీ టెండర్ విధానం, ఈ-ప్రొక్యూర్‌మెంట్ టెండర్ విధానంలో జరపాలని, పనులు వేగంగా పారదర్శకంగా జరపాలని సీఎం ఆదేశించారని వివరించారు.

మా పంటలు ఎండబెట్టాలనే ఈ కుట్రలు..: తెలంగాణ పంటలను ఎండబెట్టి, తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు ఏపీ సర్కారు ఈ కుట్రలు అమలు చేస్తున్నదని హరీశ్‌రావు అన్నారు. వాళ్ల కుట్రలకు ఎర్రబెల్లి వంటి టీడీపీ నాయకులు వంతపాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన 54 శాతం విద్యుత్‌ను ఇవ్వకుండా, శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపి వేస్తే 300 మెగావాట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పడం సిగ్గు చేటన్నారు. 54 శాతం వాటా కింద వెయ్యి మెగావాట్ల విద్యుత్ తెలంగాణకు రావాల్సి ఉందని, దానికి బదులు 300 మెగావాట్లు ఇస్తాననడం ఏంటని నిలదీశారు.

తెలంగాణకు దానం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. 300 మెగావాట్ల విద్యుత్ ఇస్తానన్నా తీసుకోవడం లేదని ఎర్రబెల్లి దయాకర్ రావు చిన్న పిల్లవాడిలాగా మాట్లాడుతున్నారని 800 మెగావాట్ల బంద్‌పెట్టి ఎవరన్నా 300 మెగావాట్లు తీసుకుంటారా? అని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. చట్టాలు, నిబంధనలు, జీవోల ప్రకారం తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలను, విద్యుత్‌ను వాడుకొని తీరుతామని స్పష్టం చేశారు. దేవినేని ఉమ, పరకాల ప్రభాకర్‌లు సన్నాయి నొక్కులు నొక్కినంత మాత్రాన ప్రజలను మభ్యపెట్టలేరని స్పష్టం చేశారు.

పారదర్శకంగా చెరువుల పునరుద్ధరణ: రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా, వేగవంతంగా జరిపేందుకు సీఎంతో జరిపిన సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని హరీశ్‌రావు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 9వేల చెరువులను రూ.4500కోట్లతో పునరుద్ధరించనున్నామని తెలిపారు. ఈ పనులను డిసెంబరు మొదటి వారంలో ప్రారంభించాలని సీఎం ఆదేశించారని ఆయన చెప్పారు.

పనులను పూర్తిగా టెండర్ విధానం, ఈ-ప్రొక్యూర్‌మెంట్ టెండర్ విధానంలో జరపాలని, నామినేషన్‌పై ఏ ఒక్క పని కూడా ఇవ్వవద్దని నిర్ణయించినట్లు తెలిపారు. చెరువుల పునరుద్ధరణకు ముందు ఉన్న పరిస్థితి తెలిపే ఫొటోలు ముందు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి.. పనులు పూర్తయిన తర్వాత ఫొటోలు తీసి ఆ పక్కనే అప్‌లోడ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు.

నియోజకవర్గ కేంద్రాల్లో మినీ ట్యాంక్‌బండ్‌లు..: ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా మార్చాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో చెరువుల పునరుద్ధరణ వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. ఏ చెరువుకు ఆ చెరువుగా టెండర్ పిలుస్తామన్నారు. పెద్ద కాంట్రాక్టర్లు రింగ్ కాకుండా పారదర్శకంగా ఉండాలని సీఎం ఆదేశించారన్నారు.

ఇది ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో ప్రజా కార్యక్రమంలా చేపడతామన్నారు. ఏ గ్రామంలో అయితే రైతులు ముందుకు వచ్చి పూడికతీత మట్టిని తమ పంట పొలాలకు తీసుకెళ్లేందుకు ముందుకు వస్తారో.. ఆ గ్రామాలకు మొదటి విడతలో తొలి ప్రాధాన్యత దక్కుతుందన్నారు.

డాక్యుమెంటరీలు, కళాజాతలు.. ఈ కార్యక్రమం గురించి విస్తృత ప్రచారం చేపడతామని.. డాక్యుమెంటరీలు, కళాజాతలు, వాల్ రైటింగులు, టీవీ, సినిమా ప్రకటనలు ఇస్తామన్నారు. ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, స్కౌట్స్, గైడ్స్‌తో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ముందుకు వెళ్తామన్నారు. ఎవరైనా ఎన్‌ఆర్‌ఐలు వారి గ్రామ చెరువు బాగుకు ముందుకు వచ్చి ఖర్చును భరిస్తే.. ఆ చెరువుకు వారి పేరు, వారి తల్లిదండ్రుల పేరు పెట్టేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. చెరువుల పునరుద్ధరణ, చెరువుల ప్రాధాన్యతపై పాఠశాల, కళాశాల విద్యార్థుల్లో అవగాహన కలిగించేందుకు వ్యాసరచన పోటీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించామన్నారు.

ఇక ఇద్దరు సీఈలు చిన్న నీటి పారుదల శాఖ బలోపేతం, ఆధునీకరణ ఫైల్‌కు సీఎం ఆమోద ముద్ర వేశారని మంత్రి వివరించారు. ఇకపై తెలంగాణ రాష్ర్టానికి ఇద్దరు సీఈలు, జిల్లాకో ఎస్‌ఈ, రెండు మూడు నియోజకవర్గాలకు ఈఈ, సెగ్మెంటుకో డీఈఈ, మండలానికో ఏఈ నియామకం చేస్తామని.. అదనపు పోస్టుల మంజూరుకు సీఎం నేడు ఆమోదించారన్నారు. ఇంజనీర్లకు అవసరమైన సర్వే ఎక్విప్‌మెంట్, ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు కూడా సీఎం ఆమోదం తెలిపారన్నారు.

పనులు పెద్ద ఎత్తున చేపడుతున్నందున గోదావరి పరివాహక ప్రాంతం, కృష్ణా పరివాహక ప్రాంతానికి వేర్వేరుగా సీఈలు పనిచేస్తారన్నారు. పునరుద్ధరణ కార్యక్రమం ఇద్దరు సీఈలు పర్యవేక్షణలో సాగుతుందని వారు స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రి సూచనలు తీసుకుని ఏయే చెరువుల పునరుద్ధరణ చేయాలనే ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయిస్తారన్నారు. టెండర్లు పిలిచేందుకు అవసరమైన అనుమతులు పెంచామని.. ఈఈ స్థాయిలో రూ.50లక్షల వరకు, ఎస్‌ఈ స్థాయిలో రూ.కోటి వరకు, సీఈ స్థాయిలో రూ.కోటికిపైగా పనులను టెండర్లు పిలవాలని నిర్ణయించామన్నారు.

ఖరీఫ్ నాటికి ఫలితాలు.. చెరువులు పునరుద్ధరణ ఫలితాలు ఖరీఫ్ నాటికి ప్రజలకు అందాలనేది తమ భావనని.. డిసెంబరు నుంచి మే వరకు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపడతామని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 46వేల చెరువులు, కుంటలు ఉన్నాయని.. ఏటా 20శాతం చొప్పున పనులు చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో చేపడతామన్నారు. గతంలో చెరువుల మరమ్మతులు అంటే నాలుగు చెట్లు పీకి.. నాలుగు తట్టల మట్టి పోసి బిల్లులు ఎత్తారని, అంతే తప్ప పూడికతీత జరగలేదని అన్నారు.

చిన్న నీటి పారుదల రంగంలో సుమారు 260 టీఎంసీ నీరు కేటాయింపులు కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నాయని పూర్తి స్థాయిలో ఆ నీటిని సద్వినియోగం చేసుకోవటం వల్ల తెలంగాణ ప్రాంత రైతులకు మేలు చేసుకోవాల్సి ఉందన్నారు. నీరు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాకుండా బోరు, బావుల్లో పూర్తి స్థాయి జలకళ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. చిన్న నీటి పారుదల రంగం బలోపేతంతో అదనంగా 20లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తామన్నారు. భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సమయం ఎక్కువ పడుతుందని.. చెరువుల పునరుద్ధరణతో సత్వర ఫలితాలు ప్రజలకు అందించాలని ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.

ఎప్పుడూ తెలంగాణకే అన్యాయం… ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణకు అన్యాయం చేయాలనే చూస్తున్నారని హరీశ్ రావు అన్నారు. సీమాంధ్ర తెలుగుదేశం నేతల తెలంగాణ వివక్ష కారణంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందనే విషయాన్ని మరిచిపోవద్దని ఆయన గుర్తుచేశారు.

రాయలసీమ, ఆంధ్రాలో ఎవరిది పైచేయి అన్న విషయంలోనే ఇపుడీ రాద్ధాంతమంతా సాగుతున్నదని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి దేవినేని దొంగ లెక్కలతో మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 107 జీవో ఇస్తే కృష్ణ డెల్టాకు తీవ్ర అన్యాయం చేస్తున్నారంటూ వీధులకెక్కి ధర్నాలు, ఉద్యమాలు చేసి ఆ జీవో రద్దు చేయాలని డిమాండ్లు చేసిన టీడీపీ నేతలు, ఈ రోజు అదే జీవోలోని అంశాలను ప్రస్తావిస్తూ కాకిలెక్కలు చెబుతున్నారని దుయ్యబట్టారు.

జీవో 107 ద్వారా శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల వరకు నీరు ఆపి ఉంచి పోతిరెడ్డిపాడు ద్వారా సీమకు అక్రమంగా నీటిని తరలించే కుట్ర చేశారని, దానిని అప్పుడూ, ఇప్పుడూ టీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిందని హరీశ్ స్పష్టం చేశారు. ఆనాడు జీవో 107ను రద్దు చేయాలని ధర్నాలు, ఆందోళనలు చేసిన దేవినేని ఉమ, చంద్రబాబు ఇప్పుడు అదే జీవో ప్రకారం శ్రీశైలంలో నీటి నిల్వను ఉంచాలనడం రెండు నాల్కల ధోరణి కాదా? అని ప్రశ్నించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.