-రోజూ ఉదయం 6 నుంచి 10 వరకు మినహాయింపు -నిత్యావసరాల కొనుగోలు ఆ టైమ్‌లోనే -వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు -లాక్డౌన్ నుంచి పూర్తి మినహాయింపు -వ్యాక్సిన్ల కొనుగోలుకు గ్లోబల్ టెండర్ -రాష్ట్ర మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయాలు -20వ తేదీన మళ్లీ క్యాబినెట్ సమావేశం -జిల్లాల్లో మంత్రుల అధ్యక్షతన కమిటీలు -పరిస్థితిపై ప్రతి రోజు సమీక్షలకు ఆదేశం -రెమ్‌డెసివిర్ ఉత్పత్తిదారులకు సీఎం ఫోన్ -రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి -వైద్య సిబ్బందికి ప్రత్యేక పాసులు.. 33% సిబ్బందితో ప్రభుత్వ ఆఫీసుల్లో పని -పెండ్లిళ్లకు ముందస్తు అనుమతి తప్పనిసరి.. అతిథులు నలభై మందికి మించకూడదు -అంత్యక్రియలకు 20 మంది మాత్రమే.. సరిహద్దుల్లో రహదారులపై చెక్‌పోస్టులు -మీడియా సంస్థలకు మినహాయింపులు.. ప్రభుత్వం వెల్లడి.. మార్గదర్శకాలు జారీ
పూర్తిగా మినహాయింపు ఇచ్చినవి -వ్యవసాయం, ధాన్యం కొనుగోళ్లు -కోల్డ్ స్టోరేజీ, ఉపాధిహామీ -వైద్యం, ఫార్మా పరిశ్రమలు -ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు -హైవేలపై రవాణా, పెట్రోల్ పంప్‌లు -మీడియా, బ్యాంకులు, ఏటీఎంలు -మినహాయింపు పొందిన సేవలు -తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ -విద్యుదుత్పత్తి, సరఫరా -కుకింగ్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లు, సరఫరా -ఉదయం 6 నుంచి 10వరకు.. -మెట్రో, ఆర్టీసీ కొనసాగింపు. -రేషన్ షాపులు, అన్ని దుకాణాలు

రాష్ట్రంలో లాక్డౌన్ కారణంగా పది రోజులపాటు వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే స్లాట్‌బుక్ చేసుకున్నవారికి రీషెడ్యూల్ అవకాశం కల్పిస్తామని చెప్పారు. లాక్డౌన్ అనంతరం వీటిపై మార్గదర్శకాలు జారీ చేస్తామని వెల్లడించారు. ప్రజలెవరూ తాసిల్దార్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లకు రావొద్దని సూచించారు.
ఆలయాల మూసివేత లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలను బుధవారం నుంచి మూసివేయనున్నారు. యాదాద్రి, వేములవాడ దేవస్థానాలతోపాటు ప్రముఖ ఆలయాల్లో ఈ నెల 12 నుంచి 22 వరకు భక్తులకు దర్శనాలను రద్దుచేశారు.
కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్రంలో లాక్డౌన్ విధించారు. మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి పది రోజులపాటు లాక్డౌన్ అమలుచేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. లాక్డౌన్ కాలంలో ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ప్రజల అవసరాల కోసం సడలింపు ఉంటుంది. ఆ 4 గంటలపాటు మాత్రమే అన్నిరకాల షాపులు తెరిచి ఉంటాయి. మిగతా 20 గంటలపాటు లాక్డౌన్ కఠినంగా అమల్లో ఉంటుంది. కరోనా సెకండ్‌వేవ్ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏమిచేయాలన్న అంశంపై నిర్ణయం తీసుకోవడానికి ప్రగతిభవన్‌లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. కరోనా తీవ్రతను తగ్గించాలంటే లాక్డౌన్ కూడా అమలుచేయాలని నిర్ణయం తీసుకున్నది. అయితే నిత్యావసరాల కోసం ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది.
లాక్డౌన్ 10 రోజులు రాష్ట్రంలో 18 ఏండ్లు పైబడిన అందరికీ టీకా వేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. వ్యాక్సిన్ల కొరత రాకుండా టీకాల కొనుగోలుకు గ్లోబల్ టెండర్లను పిలవాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. లాక్డౌన్ పాటించే ఈ పదిరోజుల్లో రాష్ట్రంలో మందుల కొరత రాకుండా చూడాలని తీర్మానించింది. ఈ మేరకు మందులు, వ్యాక్సిన్ల సరఫరా కోసం మంత్రి కే తారకరామారావు అధ్యక్షతన టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. కరోనా కట్టడి కోసం అన్ని జిల్లాల్లో మంత్రుల అధ్యక్షతన కలెక్టర్, డీఎంహెచ్‌వో, జిల్లా కేంద్రంలోని దవాఖాన సూపరింటెండెంట్, డ్రగ్ ఇన్స్పెక్టర్లతో కమిటీ వేయాలని నిర్ణయించింది. మంత్రులు ప్రతి రోజు జిల్లాకేంద్రాల్లో సమీక్షచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇదే సమయంలో వ్యవసాయం, దాని అనుబంధ కార్యక్రమాలు యథావిధిగా జరుగడానికి క్యాబినెట్ అనుమతి ఇచ్చింది. ధాన్యం కొనుగోళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదని నిర్ణయించింది. వైద్యరంగంలో పనిచేసే డాక్టర్లు, సిబ్బంది, మెడికల్ ఏజెన్సీలు, మెడికల్‌షాపుల కార్యకలాపాలకు అనుమతిచ్చింది.
ఉదయం ఆరుగంటల నుం చి ఉదయం 10 గంటల మధ్య.. నాలుగుగంటల కాలంలో మెట్రో, ఆర్టీసీ రవాణాకు క్యాబినెట్ అనుమతి ఇచ్చింది. ప్రభుత్వరంగంతోపాటు ప్రైవేట్‌రంగంలో కూడా రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు, ఆక్సిజన్, ఇతర కరోనా ఔషధాలను అందుబాటులోకి తేవాలని, వీటి కొరత రాకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను క్యాబినెట్ ఆదేశించింది. రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ ఉత్పత్తిదారులతో క్యాబినెట్ సమావేశంనుంచే ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్రానికి తగినన్ని మందులను సరఫరాచేయాలని కోరారు. ఏ రోజుకారోజు మందులు, వ్యాక్సిన్లను వేగవంతంగా సమకూర్చి, సరఫరా చేయడం కోసం పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి టాస్‌ఫోర్స్ నియామకానికి క్యాబినెట్ ఆమోదంతెలిపింది. పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్‌రాజ్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సీఎంవో నుంచి సీఎం కార్యదర్శి, కొవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్‌రెడ్డి ఈ టాస్ఫోర్స్లో సభ్యులుగా ఉంటారు. మినహాయింపులను పూర్తిస్థాయిలో కొవిడ్ నిబంధనలను కఠినంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని క్యాబినెట్ ఆదేశించింది. 10 రోజుల లాక్డౌన్లో వచ్చే ఫలితాలపై ఆధారపడి తదుపరి నిర్ణయం తీసుకోవడానికి ఈ నెల 20న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది.
అనుమతించే కార్యకలాపాలు వైద్యంపై ఆంక్షల్లేవ్: దవాఖానలు, డయాగ్నస్టిక్ సెంటర్లపై ఆంక్షలుండవు. వ్యాక్సినేషన్, అనుబంధ కార్యకలాపాలు కొనసాగుతాయి. మెడికల్ షాపులు తెరిచే ఉంటాయి. ఔ షధాల ఉత్పత్తి, వైద్యపరికరాల రవాణా కొనసాగుతుంది.
‘సాగు’ కొనసాగుతుంది: వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలు కొనసాగుతాయి. రైస్ మిల్లులు నడుస్తాయి. వ్యవసాయ ఉత్పత్తులు, హమాలీల రవాణా, కోల్డ్ స్టోరేజీలు, గోదాములపై ఆంక్షలు లేవు.
సేవలకు ఢోకా ఉండదు: విద్యుత్తు ఉత్పత్తి, మంచినీటి నీటి సరఫరాలో ఆటంకాలు ఉండవు. ఆయా సిబ్బంది ర వాణాకు అనుమతిచ్చారు. పారిశుద్ధ్య పనులు కొనసాగుతాయి. బ్యాంకులు, ఏటీఎంలు, అనుబంధ సర్వీసులు కొనసాగుతాయి. గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ఆంక్షల్లేవు.
‘ఉపాధి’కి హామీ: గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు కొనసాగుతాయి. నిర్మాణ రంగానికి సంబంధించి కార్మికులు అక్కడే నివసించేలా క్యాంపులు, ఇతర ఏర్పాట్లు ఉన్న ప్రాజెక్టులు కొనసాగుతాయి.
బంకులపై ఆంక్షలు: జాతీయ రహదారుల వెంట ఉన్న పెట్రోల్ బంకులు 24 గంటలు తెరిచే ఉంటాయి. మిగ తాచోట్ల ఉదయం 6-10 గంటల మధ్యే పనిచేస్తాయి.
మీడియాకు అనుమతి: ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి రవాణా ఆంక్షల నుంచి మినహాయింపు.
‘ఆహారం’ ఆగదు: పాలు, పాల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు తదితర ఆహార ఉత్పత్తుల రవాణాకు అవకాశం.
ఈ-కామర్స్ రైట్ రైట్: ఆన్‌లైన్‌ద్వారా నిత్యావసరాలు, ఆహారం, ఔషధాలు, వైద్య పరికరాలకు హోం డెలివరీ.
ఐటీ సేవల కొనసాగింపు: ఐటీ, అనుబంధ సేవలు, టెలికం, పోస్టల్, ఇంటర్నెట్ సేవలు కొనసాగుతాయి. అయితే ఆయా రంగాల్లో వీలైనంత మంది వర్క్ ఫ్రమ్ హోం చేసేలా ప్రోత్సహించాలి.
లాక్డౌన్ కాలంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అవి ఇలా..
సరిహద్దు దాటనివ్వరు: ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను సరిహద్దుల వద్ద నిలిపివేస్తారు. నిత్యావసర సరుకుల రవాణా వాహనాలను అనుమతిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను పూర్తిగా రద్దుచేశారు. ప్రజలు లాక్డౌన్ పూర్తయ్యే వరకు సరిహద్దు దాటే అవకాశం లేదు.
10 గంటల దాకా ప్రజారవాణా: ఆర్టీసీ బస్సులు, సెట్విన్, హైదరాబాద్ మెట్రో, ట్యాక్సీలు, ఆటోలు ఉదయం 6 గంటల నుంచి 10 గంటలవరకే తిరుగుతాయి. వైద్యసిబ్బంది, వైద్యం కోసం అత్యవసరంగా వెళ్లే ప్రయాణికులకు అనుమతి ఇస్తారు.
ఐసొలేషన్ దాటొద్దు: కరోనా సోకినవారు లేదా కొవిడ్ లక్షణాలతో హోం ఐసొలేషన్‌లో ఉన్నవారు గడప దాటొద్దు. ఒకవేళ హద్దు మీరినట్టు తెలిస్తే క్రిమినల్ కేసులు పెట్టడమేకాకుండా ప్రభుత్వ ఐసొలేషన్ కేంద్రాలకు తరలిస్తారు.
పూర్తి జీతం ఇవ్వాల్సిందే: ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ పూర్తిగా వేతనాలు చెల్లించాలని, లాక్డౌన్ వంకపెట్టి జీతాల్లో కోత విధించరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకూ ఇది వర్తిస్తుంది. దీన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.
కొవిడ్ నిబంధనల మధ్యే పెండ్లి: ఇప్పటికే అధికారుల నుంచి అనుమతి తీసుకున్న వివాహాలను ముహూర్త సమయానికి జరిపించవచ్చు. గరిష్ఠంగా 40 మంది అతిథులే ఉండాలి. పెండ్లి సమయంలో కొవిడ్ నిబంధనలను పాటించాలి.
అంత్యక్రియలపైనా ఆంక్షలు: అంత్యక్రియలకు గరిష్ఠంగా 20 మందే హాజరుకావాలి. కొవిడ్ నిబంధనలు తప్పనిసరి.
ప్రార్థనా మందిరాలు బంద్: అన్నిరకాల ప్రార్థనా మందిరాల ను మూసివేస్తారు. మతపర కార్యక్రమాలకు అనుమతి లేదు.
అమ్మలకు భరోసా: పదిరోజులపాటు అంగన్వాడీ కేంద్రాలను మూసివేస్తారు. గర్భిణులు, బాలింతలు అంగన్వాడీకేంద్రాల నుంచి బియ్యం, నూనె, పప్పులు ఇంటికి తీసుకెళ్లవచ్చు.
చెక్‌పోస్ట్‌లు: అవసరమైన చోట్ల పోలీస్ చెక్‌పోస్ట్‌లు పెడ్తారు.
పూర్తిస్థాయి సిబ్బందితో నడిచే ప్రభుత్వ శాఖలు వైద్యారోగ్యం, పోలీస్, పంచాయతీరాజ్, పురపాలక సంఘా లు, అగ్నిమాపకశాఖ, విద్యుత్తు, నీటిసరఫరా, ఆదాయం పన్ను, వాణిజ్యపన్నులు, ఎక్సైజ్, రవాణా, అన్ని రకాల కార్పొరేషన్లు, వ్యవసాయం, హార్టికల్చర్, అనుబంధ రంగా లు, పౌరసరఫరాలు, కొవిడ్ విధులు అప్పగించిన ఇతర శాఖ లు. వీటితోపాటు ప్రభుత్వం అప్పటికప్పుడు నోటిఫై చేసే శాఖల్లో సిబ్బంది పూర్తిస్థాయిలో హాజరుకావాల్సి ఉంటుంది.
పైన పేర్కొన్న శాఖలే కాకుండా.. మిగతా అన్ని విభాగాల్లో 33 %మంది సిబ్బంది హాజరుకావాల్సి ఉంటుంది. నిషేధిత జాబితా: సినిమాహాళ్లు, అమ్యూజ్మెంట్ పార్కులు, క్లబ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్, జిమ్‌లు పూర్తిగా మూసివేయాలి.