సీఎం కేసీఆర్ ప్రస్తావనతో ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన రాష్ట్రంలో అదుపులోనే కరోనా వీడియోకాన్ఫ్రెన్స్లో సీఎంకేసీఆర్

దేశంలో లాక్డౌన్ల దశ ముగిసిందని, ఇక అన్‌లాక్‌ల దశ ప్రారంభమైందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. మళ్లీ లాక్డౌన్ విధించేది లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అన్‌లాక్ 1.0 నడుస్తున్నదని, అన్‌లాక్ 2.0 ఎలా అమలుచేయాలనే విషయమై చర్చించుకోవాల్సి ఉన్నదని చెప్పారు. కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్న రాష్ర్టాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ బుధవారం వీడియో కాన్ఫ్రెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు లాక్డౌన్ అంశాన్ని ప్రస్తావించారు. దేశంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారన్న వదంతులు వినిపిస్తున్నాయని, దీనిపై స్పష్టతనివ్వాలని కోరారు. ‘ప్రధాని మీడియాతో మాట్లాడుతున్నారనగానే లాక్డౌన్ ప్రకటనచేస్తారనుకుంటున్నారు. ప్రధాని అందరు సీఎంలతో మాట్లాడకుండా లాక్డౌన్ విషయంలో నిర్ణయం తీసుకోరని నేను చెప్తున్నాను. దీనిపై స్పష్టత ఇవ్వండి’ అని సీఎం కోరారు. దీనికి ప్రధాని స్పందిస్తూ.. ‘దేశంలో మళ్లీ లాక్డౌన్ ఉండదు. 4 దశల లాక్డౌన్ ముగిసింది. అన్‌లాక్ 1.0 నడుస్తున్నది. అన్‌లాక్ 2.0 అమలుపై మనం చర్చించుకోవాలి’ అని అన్నారు.

వైరస్ వ్యాప్తి నివారణకు కృషి చేస్తున్నాం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు పటిష్ఠమైన చర్యలు చేపడుతున్నామని సీఎం కేసీఆర్ ప్రధానికి వివరించారు. ‘కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం గట్టిగా కృషిచేస్తున్నది. ప్రస్తుతం అదుపులోనే ఉన్నది. మరణాలరేటు తక్కువగానే ఉన్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా సాగిస్తున్న పోరులో తప్పక విజయం సాధిస్తామనే విశ్వాసం మాకుంది. హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లో మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ కూడా కొద్ది రోజుల్లోనే వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తుందనే నమ్మకం నాకున్నది. మళ్లీ మా మూలు జీవితం ప్రారంభమవుతున్నది. కూలీ లు, కార్మికులు, హమాలీలు పనిచేసుకోవడానికి వివిధ రాష్ర్టాలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. వారికి అవకాశమివ్వాలి. దేశమంతా ఒక్కటే, ఎక్కడి వారు ఎక్కడికైనా వెళ్లి పనిచేసుకునే అవకాశముండాలి. బీహార్ నుంచి హమాలీలు తెలంగాణకు రావడానికి సిద్ధమవుతున్నారు’ అని సీఎం చెప్పారు.

మా సీఎస్ మీ బీహారీయే.. బీహార్ నుంచి వచ్చే హమాలీలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ వారిస్తున్నట్లు వచ్చిన వార్తలపై ముఖ్యమంత్రి సరదా వ్యాఖ్యలు చేశారు. ‘నితీశ్‌గారు.. మేము తెలంగాణలో మీ హమాలీలను బాగా చూసుకుంటాం, మా సీఎస్ కూడా మీ బీహార్ వారే, దయచేసి పంపించండి’ అని కేసీఆర్ అన్నారు.