-16 లోక్‌సభ సీట్లే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి -సభ నిర్వహణకు సకల ఏర్పాట్లు పూర్తి -స్వచ్ఛందంగా తరలిరానున్న వివిధ సంఘాలు -బొట్టుపెట్టి ఆహ్వానిస్తున్న మహిళా కార్యకర్తలు -16 సీట్లే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి -సభ నిర్వహణకు సకల ఏర్పాట్లు పూర్తి -స్వచ్ఛందంగా తరలిరానున్న వివిధ సంఘాలు -బొట్టుపెట్టి ఆహ్వానిస్తున్న మహిళా కార్యకర్తలు

అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాలే స్ఫూర్తిగా లోక్‌సభ సమరానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారం శంఖారావం పూరించనున్నారు. రాష్ట్రంలో పదహారు లోక్‌సభ నియోజకవర్గాల్లో గులాబీ బావుటా ఎగరేయటమే లక్ష్యంగా నిర్వహించే ఎన్నికల ప్రచార సభలకు పోరాటాల పురిటిగడ్డ.. టీఆర్ఎస్కు అచ్చొచ్చిన కరీంనగర్ నుంచి శ్రీకారం చుట్టనున్నారు. సోమవారం నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభంకానున్న నేపథ్యంలో అంతకుముందురోజు దాదాపు రెండు లక్షలమందితో కరీంనగర్‌లోని స్పోర్ట్స్ స్కూల్ మైదానంలో ఏర్పాటుచేస్తున్న తొలిసభ.. గులాబీ శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపుతుందని పార్టీవర్గాలు విశ్వాసంతో ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం మొదలు ఏ కార్యక్రమం అయినా కరీంనగర్ నుంచే కేసీఆర్ ప్రారంభిస్తుంటారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ సభతో మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి కూడా కరీంనగర్‌నే ఎంచుకున్నారు. దీంతో ఈ సభ నిర్వహణను కరీంనగర్ టీఆర్ఎస్ నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. రెండు లక్షలకుపైగా ప్రజలు హాజరవుతారని భావిస్తున్న సభకు పకడ్బందీ ఏర్పాట్లుచేస్తున్నారు. ఇప్పటికే పలు సంఘాలు ఈ సభకు పెద్దసంఖ్యలో తరలివస్తామని స్వచ్ఛందంగా ప్రకటించాయి. సభను విజయవంతం చేసే క్రమంలో ఇంటింటికీ తిరుగుతున్న టీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు.. మహిళలకు బొట్టుపెట్టి సభకు ఆహ్వానిస్తున్నారు. దీని తదుపరి బహిరంగసభ ఈ నెల 19న నిజామాబాద్‌లో నిర్వహించనున్నారు. నామినేషన్ల దాఖలు అనంతరం వివిధ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటుచేసే బహిరంగసభల్లో సీఎం పాల్గొననున్నారు.

రాష్ట్రంలో టీఆర్ఎస్ పోటీచేసే 16 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచార సభలుంటాయి. అయితే.. వివిధ జిల్లాల్లో విస్తరించి ఉన్న నాలుగైదు నియోజవకర్గాలకు సంబంధించి రెండు మూడు సభలు ఉంటాయని తెలుస్తున్నది. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలని, సరికొత్త నమూనాను దేశానికి పరిచయం చేయాలని సంకల్పించిన ముఖ్యమంత్రి ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీఆర్ఎస్ను 16 సీట్లలో ఎందుకు గెలిపించాలో వివరించనున్న సీఎం.. దేశానికి అవసరమైన ప్రత్యామ్నాయ విధానాలపై తన ఆలోచనలను పంచుకునే అవకాశం ఉన్నది. జాతీయ పార్టీల కంటే మిన్నగా జాతి ఆకాంక్షల పట్ల, జాతి ప్రయోజనాల పట్ల నిబద్ధత, విధానపరమైన స్పష్టత, రాష్ట్రంలో ఆదర్శవంతమైన పరిపాలనను అందిస్తున్న విషయాలు వివరించనున్నారు.
దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి, జాతీయ పార్టీలుగా చెప్పుకునే పార్టీలు ఏ విధంగా వైఫల్యం చెందాయి.. స్వాతంత్య్రం వచ్చి 71 ఏండ్లు అయినా.. దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో ఎందుకు సఫలంకాలేకపోయాయి.. తదితర విషయాలు వివరిస్తూ, జాతీయభావాలు కలిగిన ప్రాంతీయపార్టీగా జాతి ఆకాంక్షల కోసం ఏ రకంగా టీఆర్ఎస్ నడుంబిగించాలి.. ఇతర పార్టీల మద్దతు ఏ రకంగా కూడగట్టాలనే అంశాలపై కేసీఆర్ ప్రసంగించే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో కేసీఆర్ ప్రభుత్వం అమలుచేసిన పథకాలను వివరించడంతోపాటు దేశం బలోపేతం కావాలంటే రాష్ర్టాలు బలోపేతం కావాలనే నినాదాన్ని జాతి ముందు ఉంచనున్నారు. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు నియోజకవర్గాలవారీగా నిర్వహించిన సన్నాహక సమావేశాలకు పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు పోటెత్తారు. ఈ సమావేశాలు పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఎన్నికల సమరానికి సీఎం కేసీఆర్ సమరభేరీ మోగించనున్నారు.
రెండు లక్షల మంది సమీకరణకు ఏర్పాట్లు కరీంనగర్సభకు రెండున్నర లక్షలమందికి తగ్గకుండా సమీకరించేందుకు పార్టీ నేతలు లక్ష్యాలు పెట్టుకున్నారు. అయితే.. ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు లక్షల మంది హాజరయ్యేలా చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు నియోజకవర్గాల నేతలకు బాధ్యతలు అప్పగించారు. సభ నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ నిర్వర్తిస్తున్నారు. గత నాలుగు రోజులుగా జిల్లా కేంద్రంలోనే మకాంవేసిన మంత్రులు.. రోజువారీగా సభాస్థలిని పరిశీలిస్తూ ఏర్పాట్లు చేస్తున్నారు.