Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మా హైకోర్టు మాకే

-స్తంభించిన లోక్‌సభ మూడుసార్లు వాయిదా -హైకోర్టు విభజనకు మరో చట్టం చేయాలా?:కేంద్రాన్ని నిలదీసిన పార్లమెంటు సభ్యులు -తక్షణమే విభజించాలంటూ సభలో ఆందోళన -ఎంఐఎం, కాంగ్రెస్ సహా పలు విపక్షాల మద్దతు -న్యాయమంత్రి సమాధానంతో సంతృప్తి చెందని ఎంపీలు -నిర్దిష్ట గడువుతేదీ స్పష్టం చేయాలని మంత్రిపై ఒత్తిడి -రేపు టీఆర్‌ఎస్ ఎంపీలతో సమావేశానికి మంత్రి హామీ -గాంధీ విగ్రహం దగ్గర ఎంపీల నిరసన -పార్లమెంటులో ఎలుగెత్తిన టీఆర్‌ఎస్ ఎంపీలు

MP Vinod & Jithender Reddy

రాష్ట్ర విభజనకోసం చేసినట్లు హైకోర్టు విభజనకు కూడా చట్టం చేయాలా? అని టీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ప్రత్యేకంగా హైకోర్టు ఉండాల్సిందేనని స్పష్టంచేశారు. హైకోర్టు విభజన అంశాన్ని మంగళవారం లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీలు లేవనెత్తారు. వారికి కాంగ్రెస్, ఎంఐఎం సహా పలు ప్రతిపక్ష పార్టీల నేతలు మద్దతు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో స్పష్టంగా హైకోర్టు విభజన గురించి పేర్కొన్నారని, కానీ రాష్ట్ర విభజన జరిగి 11 నెలలు గడిచినప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని టీఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభలో ప్రస్తావించారు. పార్లమెంటు చేసిన చట్టానికి తగిన గౌరవం లభించలేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఎంపీలు ఇదే అంశంపై సభను స్తంభింపజేయడం, పోడియం వద్ద కు వెళ్లి నిరసన తెలియజేయడంతో సభ మూడుసార్లు వాయిదా పడింది. అంతకు ముందు టీఆర్‌ఎస్‌కు చెందిన పది మంది ఎంపీలు హైకోర్టును తక్షణమే విభజించాలని డిమాండ్‌చేస్తూ పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహంవద్ద ప్లకార్డులు చేబూని నిరసన తెలిపారు. సభ వెలుపల, సభ లోపల ఎంపీలు చేపట్టిన ఆందోళనతో దిగి వచ్చిన కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ.. ఈ అంశంపై గురువారం టీఆర్‌ఎస్ ఎంపీలతో సమావేశమవుతానని, సాధ్యమైనంత త్వరలో పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారం భం కాగానే టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి హైకోర్టు విభజనపై వాయిదా తీర్మానాన్ని ప్రస్తావించి, చర్చకు అవకాశం ఇవ్వాలని పట్టుపట్టారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయాలని, ఒక రాష్ట్ర హైకోర్టు విభజనకు సంబంధించిన అంశం చాలా ముఖ్యమైనదని అన్నా రు. వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగనివ్వబోమని జితేందర్‌రెడ్డి స్పష్టంచేశారు. పార్లమెంటు చేసిన చట్టానికి సైతం తగిన గౌరవం లేకపోతే ఇక ప్రజాస్వామ్యంలో విలువేముందని ప్రశ్నించారు. ఇది పార్లమెంటు ఇజ్జత్ కా సవాల్ అని వ్యాఖ్యానించిన ఆయన ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో టీఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభలో నినాదాలు చేశారు. తెలంగాణకు న్యాయం చేయాలని నినదించారు. అరవై ఏండ్లుగా మోసపోయిన తెలంగాణకు ఇంకా న్యాయం జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పోడియం వద్దకు టీఆర్‌ఎస్ ఎంపీలు చర్చకు అనుమతి ఇవ్వాలని కోరినా స్పీకర్ సుమిత్రా మహాజన్ నిరాకరించడంతో ఎంపీలంతా పోడియం దగ్గరకు వెళ్లారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఇలాంటి నిరసనలకు అనుమతి లేదని స్పీకర్ఈ సమయంలో ఎంపీలనుద్దేశించి అన్నారు. దీనికి ఎంపీలు స్పందిస్తూ అన్యాయానికి గురైనప్పుడు, పార్లమెంటు చేసిన చట్టానికి తగిన గౌరవం లేనప్పుడు ఆ పార్లమెంటే తగిన పరిష్కారం చూపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నిరసనల మధ్య సభ నిర్వహణ సాధ్యం కాకపోవడంతో 11.12 గంటలకు సభను స్పీకర్ కొద్దిసేపు వాయిదా వేశారు. తిరిగి 11.20 గంటలకు సభ మొదలైంది. చర్చకు స్పీకర్ అనుమతి ఇవ్వకపోవడంతో ఎంపీలు మళ్లీ నిరసనకు దిగారు. పలుమార్లు స్పీకర్ జోక్యం చేసుకుని ఎవరి సీట్లలో వారిని కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కేంద్రం స్పష్టమైన సమాధానం ఇవ్వనిదే ఆందోళన విరమించేది లేదని, ఈ అంశంపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అనుమతి ఇవ్వాల్సిందేనని ఎంపీలు పట్టుబట్టారు. ఉయ్ వాంట్ జస్టిస్, మా రాష్ట్రం – మా హైకోర్టు…అంటూ నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేశారు.

జీరో అవర్‌లో చర్చ సభ తిరిగి పన్నెండు గంటలకు జీరో అవర్‌తో ప్రారంభమైంది. తొలుత హైకోర్టు విభజనపై చర్చకు అవకాశమిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఎంపీ జితేందర్‌రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు వేర్వేరు హైకోర్టులు ఏర్పడాల్సి ఉన్నదని చెప్పారు. ఈ అంశంపైన చర్చకు పట్టుబట్టామని, 377వ నిబంధన కింద చర్చకు కూడా విజ్ఞప్తి చేశామని అన్నారు. గతంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్న రవిశంకర్ ప్రసాద్‌ను, ఆ తర్వాత ప్రస్తుత మంత్రి సదానందగౌడతోనూ చర్చించామని తెలిపారు. ఇద్దరూ కూడా హైకోర్టు విభజనకు సానుకూలం స్పందించడమే కాకుండా, తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ ప్రతినిధులుసైతం ఇదే అంశాన్ని సదానందగౌడతో చర్చించారని ప్రస్తావించారు. వారంలో హైకోర్టు విభజన చేపడతామని మంత్రి హామీ ఇచ్చారని, కానీ ఆ హామీ అమలులోకి రాకపోవడంతో న్యాయవాదులు సుమారు 45 రోజుల పాటు కోర్టు విధులను బహిష్కరించారని గుర్తుచేశారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి తెలంగాణ ప్రభుత్వం తగిన స్థలాన్ని, భవనాన్ని, మౌలిక సౌకర్యాలను కల్పించినట్లయితే వెంటనే రెండు రాష్ర్టాలకు వేర్వేరు హైకోర్టును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నైజాంకాలం నుంచి వారసత్వ సంపదగా ఉన్న ప్రస్తుతం హైకోర్టు పని చేస్తున్న భవనాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అవసరాలకు వినియోగించుకోవచ్చునని స్వచ్ఛందంగా ముందుకొచ్చారని, ఆ మేరకు సదానందగౌడకు లేఖ కూడా రాశారని తెలిపారు. ఈ విషయాన్ని పరిశీలించిన మంత్రి వారంలోనే హైకోర్టు విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని అన్నారు.

ఉమ్మడి హైకోర్టులో ఆరుగురే తెలంగాణ న్యాయమూర్తులు ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో పనిచేస్తున్న 29 మంది న్యాయమూర్తుల్లో కేవలం ఆరుగురు మాత్రమే తెలంగాణ ప్రాంతానికి చెందినవారని, మిగిలినవారంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారేనని జితేందర్‌రెడ్డి సభ దృష్టికి తెచ్చారు. తెలంగాణకు సంబంధించిన కేసులన్నీ పెండింగ్‌లో ఉండిపోతున్నాయని, ఆంధ్ర ప్రాంతానికి చెందిన కేసులు మాత్రం విచారణకు వస్తున్నాయని చెప్పారు. తెలంగాణ న్యాయవాదుల కేసులేవీ కూడా విచారణకు రావడం లేదని అన్నారు. కేసుల విచారణలో చాలా వివక్ష కొనసాగుతున్నదని, తెలంగాణపట్ల ఇంకా వివక్ష కొనసాగుతున్నదనడానికి హైకోర్టులో జరుగుతున్న వ్యవహారం, హైకోర్టు విభజనలో జరుగుతున్న జాప్యం నిదర్శనమని అన్నారు. ఈ సభలే చట్టం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని ప్రసాదించాయని, అందువల్ల న్యాయశాఖ మంత్రి ఈ సభలో స్పష్టమైన ప్రకటన చేసి తెలంగాణకు విడి హైకోర్టును ఎప్పటికల్లా ఇస్తారో చెప్పాలని జితేందర్‌రెడ్డి కోరారు.

అన్యాయం జరుగుతున్నందునే తెలంగాణ ఉద్యమం : ఎంపీ వినోద్ న్యాయవ్యవస్థలోనూ అన్యాయం జరుగుతున్నందువల్లనే అరవై ఏండ్లుగా తెలంగాణ ప్రజలు కొట్లాడుతున్నారని, జితేందర్‌రెడ్డి చెప్పినట్లుగా 29 మంది న్యాయమూర్తుల్లో కేవలం ఆరుగురు మాత్రమే తెలంగాణకు చెందినవారంటే ఎంత అన్యాయం జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చునని ఎంపీ వినోద్‌కుమార్ వ్యాఖ్యానించారు. హైకోర్టు విభజనకు సంబంధించి ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణలో ఉన్నందువల్లనే ప్రక్రియ ముందుకు సాగలేదని మంత్రి చెప్తున్నారుగానీ, ఆ వ్యాజ్యం నాలుగు రోజుల కిందటే పరిష్కారమైపోయిందని గుర్తుచేశారు. పార్లమెంటులో ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి హైకోర్టు మరో రీతిలో వ్యాఖ్యానం చేసిందని అన్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ఏర్పడాల్సిన హైకోర్టు ఎక్కడ ఉండాలన్నదాన్ని రాష్ట్రపతి ప్రకటిస్తారని, కేంద్ర మంత్రివర్గం ఈ అంశంలో నిర్ణయం తీసుకుని రాష్ట్రపతికి తెలియజేస్తే దాని ప్రకారం ప్రకటన వెలువడుతుందని అన్నారు.

పునర్వ్యవస్థీకరణ చట్టంలో లోపం ఉన్నట్లు హైకోర్టు వ్యాఖ్యానించిందని గుర్తు చేశారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాల్ని అమలుచేయాల్సిన కేంద్ర హోం మంత్రి.. హైకోర్టు విభజన అంశం కూడా ఆ చట్టంలో ఉన్నందువల్ల ఎప్పటిలోగా విభజన చేస్తారో ఈ సభలోనే స్పష్టం చేయాలని వినోద్ డిమాండ్ చేశారు. చట్టంలో పేర్కొన్న అంశానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం హైకోర్టు విభజన అంశం విషయంలో హైకోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసిందని గుర్తు చేశారు. పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, రెండు రాష్ర్టాలకు విడివిడి హైకోర్టులు ఉండాలని చట్టం స్పష్టంగా చెప్పినా ఎందుకు విభజన జరగడంలేదని ఆయన ప్రశ్నించారు.

రెండు రోజుల్లో టీఆర్‌ఎస్ ఎంపీలతో మాట్లాడుతా : మంత్రి సదానందగౌడ టీఆర్‌ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌లు సంధించిన ప్రశ్నలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి సభాముఖంగా సమాధానాలు ఇచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఎంపీలు, న్యాయవాదులు తనతో చర్చించారని పేర్కొన్న మంత్రి.. హైకోర్టు విభజన ప్రక్రియను ప్రారంభించే సమయానికి ప్రజా ప్రయోజన వ్యాజ్యం వచ్చి తమ చేతులు కట్టివేసినట్లయిందని, ఈ వ్యాజ్యం ఎప్పుడు పూర్తయితే అప్పుడు విభజన ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటికే హైకోర్టు విభజనపై ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులతో వివరంగా చర్చించామని, కేసీఆర్ నుంచి లేఖ వచ్చిన తర్వాత దాదాపుగా హైకోర్టు విభజన ఒక కొలిక్కి వచ్చిందని భావించామని అన్నారు. హైకోర్టు విభజనకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో తన ప్రయత్నాలన్నీ చేసిందని, ఇంకా చేస్తూ ఉన్నదని, అయితే ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణలో ఉన్నందువల్లనే ఏమీ చేయలేకపోయామని అన్నారు. వీలైనంత త్వరగా హైకోర్టు విభజన ప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు తీర్పును కూడా వెలువరించిందని ఎంపీ వినోద్ స్పష్టం చేయడంతో, ఆ తీర్పు కాపీని పరిశీలించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని సదానందగౌడ సమాధానమిచ్చారు.

ఇప్పటికే రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులతో, ఎంపీలతో చర్చించిన తర్వాత మళ్ళీ చర్చించాల్సిన అవసరమేముంటుంది టీఆర్‌ఎస్ ఎంపీలంతా మంత్రిని ప్రశ్నించడంతో రెండు వారాల్లో టీఆర్‌ఎస్ ఎంపీలతో ఈ విషయమై చర్చిస్తామని, ఆ తర్వాత హైకోర్టు విభజనపై స్పష్టత వస్తుందని మంత్రి బదులిచ్చారు. దీనికి అభ్యంతరం వ్యక్తంచేసిన ఎంపీ జితేందర్‌రెడ్డి… గతంలో ఇరు రాష్ర్టాల సీఎంలతో చర్చించారు. మా ఎంపీలందరితో చర్చించారు. కేసీఆర్ నుంచి స్పష్టమైన లేఖ వచ్చింది. ఇంకా చర్చించడానికి ఏముంది? వెంటనే హైకోర్టు విభజనపై స్పష్టమైన గడువు ప్రకటించాలి అని కోరారు. దీనికి మంత్రి స్పందిస్తూ గురువారమే ఎంపీలతో చర్చస్తానని, ఆ తర్వాత విభజనపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. తొలుత నిర్దిష్ట గడువును చెప్పడానికి మంత్రి నిరాకరించినప్పటికీ ఎంపీల ఒత్తిడితో గురువారానికి సమావేశ తేదీని ఖరారు చేశారు.

 

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.