-ఇదో చారిత్రాత్మకమైన రోజు -సీఎంల భేటీ అందుకు తొలి అడుగు -మీడియాతో తెలంగాణ, ఏపీ మంత్రులు ఈటల, బుగ్గన
రెండు తెలుగు రాష్ర్టాలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవించే సంప్రదాయాన్ని నెలకొల్పడమే కాకుండా, రెండురాష్ర్టాల స్నేహబంధం దేశానికే ఆదర్శంగా నిలువాలనేది ఇద్దరు ముఖ్యమంత్రుల అభిమతమని, అందులో భాగంగానే రెండు రాష్ర్టాల సీఎంల భేటీతో ముందడుగువేశామని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టంచేశారు. ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ జరిగిన శుక్రవారాన్ని చారిత్రాత్మక దినంగా అభివర్ణించారు. ప్రగతిభవన్‌లో తెలంగాణ సీఎం కే సీఆర్ , ఏపీ సీఎం జగన్, రెండు రాష్ర్టాల మంత్రులు, అధికారుల భేటీల తర్వాత ఈ టల, బుగ్గన సమావేశం సారాంశాన్ని వివరించారు. మీడియా సమావేశం లో ఏమన్నారో వారిమాటల్లోనే..

గొప్ప రాష్ర్టాలుగా విరాజిల్లాలి: ఈటల రెండు రాష్ర్టాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి జీవించే సంప్రదా యం నెలకొల్పాలనేది తెలంగాణ ప్రభుత్వ అభిమతం. విడిపోయి న రాష్ర్టాలు కలిసికట్టుగా, ఎంత గొప్పగా ముందుకుపోతున్నాయోనన్న సంప్రదాయాన్ని ఈ దేశానికి అందించాలని తెలంగాణ భావిస్తున్నది. నీళ్ల కోసం ప్రజలు ఎట్ల తపనపడ్డరో.. కరంటు కష్టా లు ఎదుర్కొని కరువుకాటకాలతో ఎట్ల ఇబ్బందిపడ్డరో ఆనాటి ఉద్యమనేతగా కేసీఆర్ కండ్లారా చూ శారు. అందుకే ఏపీ అయినా, తె లంగాణ అయినా.. రెండు రాష్ర్టా ల్లో తాగు, సాగునీరు లేక ఇబ్బం ది పడుతున్న మెట్ట ప్రాంతాలతోపాటు కోస్తాంధ్ర, రాయలసీమ, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు నీళ్లందించాలని సంకల్పించారు. దీనిపై ఇరురాష్ట్రాల ఇంజినీర్లు అధ్యయనంచేసి, రైతాంగం, పొలాలకు నీళ్లందించే చర్యలను వేగవంతం చేయాలని కోరారు. ఇప్పటికే తెలంగాణలో ఈ సమస్యను అధిగమించేందుకు చేపట్టిన చర్యలను సమావేశంలో సీఎం కేసీఆర్ వివరించారు.
అందుకే నదీజలాలను రెండురాష్ర్టాలకు ఉపయోగపడేలా చేసుకోవాలని నిర్ణయించారు. పొరుగు రాష్ట్రాలతో ఘర్షణ వాతావరణం లేకుండా, ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో ఉండాలనేది తెలంగాణ అభిమతం. గతంలో తెలంగాణ సర్కారు మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పం దం, కర్ణాటకతో మాట్లాడుకున్న తీరు అందరికీ తెలుసు. ఈరోజు ఏపీతో కలిసిమెలిసి ఉండే పరిస్థితిని చూస్తున్నాం. రెండు రాష్ర్టా లు అన్నదమ్ముల్లాగా, మనస్పర్థలు లేకుం డా, కలిసి పనిచేసి అన్నిరంగాల్లో దేశంలోనే గొప్ప రాష్ర్టాలుగా ఎదిగేందుకు పునాదులు వేసుకోవాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించా రు. మిగిలిన అంశాలపై రెండురాష్ర్టాల సలహాదారులు, ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులు శనివారం కూడా చర్చిస్తారు. వ్యవసాయరంగంలో గొప్ప రాష్ర్టాలుగా ఎదగాలని, కరంటు కష్టాలు తీర్చుకొని, గొప్ప రాష్ర్టాలుగా విరాజిల్లాలనేది ఇన్ని గంటల సమావేశ సారాంశం. ఈ ఒరవడి కొనసాగించాలని నిర్ణయించాం.
ఇద్దరు సీఎంలు రాజనీతిజ్ఞులు: బుగ్గన ఇదొక చారిత్రాత్మక దినం. ఏపీ, తెలంగాణ సీఎంలు, మంత్రులు, ప్రధానకార్యదర్శులు, ప్రధాన సలహాదారులు, అధికారులు, ఇంజినీరింగ్ నిపుణులు అందరూ సమావేశమయ్యారు. విభజన సమ్యలు, రెండు రాష్ర్టాలు కలిసి నదీజలాలను ఎలా వినియోగించుకోవాలనే దానిపై ఒక దిశానిర్దేశాన్ని నిర్ణయించారు. ఇద్దరు సీఎంలు నాయకులుగా కాకుండా రాజనీతిజ్ఞులుగా వ్యవహరించా రు. మనం ఒకరి దగ్గరికిపోయేదేముంది? మన సమస్యలను మనమే కూర్చుని పరిష్కరించుకుందాం అని నిశ్చయించారు. భవిష్యత్తులో ప్రతి విషయంలో కలిసి నడువాలని నిర్ణయించాం. నదీజలాల విషయంలో రెండు తెలుగు రాష్ర్టాలు ఉమ్మడిగా పరస్పర ప్రయోజనం ఉండేలా ఒక కార్యాచరణ తయారుచేసుకోవాలని నిర్ణయించాం. రెండు రాష్ర్టాలకు సంబంధించిన కొన్ని అంశాలపై సీఎస్‌లు రెండ్రోజులు చర్చించి తుదినిర్ణయానికి రావాలని చెప్పాం.
నదీజలాల వినియోగంపై మార్గనిర్దేశం సమావేశంలో గోదావరి, ఇతర నదీజలాల్ని ఎలా వినియోగించుకోవాలో పరిశీలనచేశారు. ఒక పరిష్కారాన్ని ఇవ్వాలని అధికారులను ఆదేశించాం. షెడ్యూల్-9, 10 అంశాలను కూడా పరిష్కరించుకునేందుకు ప్రధాన కార్యదర్శులు, ప్రధాన సలహాదారులకు ఆదేశాలిచ్చాం. అన్ని అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో రెండు రాష్ర్టాలు అభివృద్ధిలో ముందుకుపోవాలని, దేశానికే ఆదర్శంగా నిలువాలని ఆలోచనచేశాం. ప్రస్తు తం గోదావరి మిగులుజలాలు అధికంగా ఉ న్నాయి. అందుకే గరిష్ఠ వినియోగం కోసం ఏయే ప్రాంతాలకు గోదావరి జలాల్ని తరలించి, వినియోగించుకునేందుకు అవకాశం ఉన్నదో అధ్యయనం చేయాలని నిర్ణయించి రెండురాష్ర్టాల ఇంజినీరింగ్శాఖలకు బాధ్యత అప్పగించాం. జలాల తరలింపునకు ఉన్న మంచి మార్గాలపై ప్రాథమిక నివేదిక ఇచ్చేందుకు జూలై 15 గడువుగా పెట్టుకున్నాం.
అందుకే భవనాలు అప్పగించాం… హైదరాబాద్ పదేండ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నా.. గత ఏపీ ప్రభుత్వం వివిధ కారణాలతో ఇక్కడి భవనాలను ఖాళీచేసి అమరావతికి తరలివెళ్లింది. కరంటు బిల్లులు, శుభ్రత, నిర్వహణ వంటి కొన్ని అంశాలతో ఆ భవనాలు ముడిపడి ఉన్నాయి. ఇక్కడి భవనాలు ఖాళీగా పెట్టి భూత్బంగ్లాలుగా మార్చడం కన్నా తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తే మంచిదని నిర్ణయం తీసుకున్నాం.