Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మాది పేదల ప్రభుత్వం

బడ్జెట్‌లో కేటాయించే ప్రతి పైసాను తెలంగాణ పేద ప్రజల సంక్షేమం కోసమే వెచ్చిస్తాం. ప్రతి పైసాలో మేం తెలంగాణ ప్రజల చెమట చుక్కలు చూస్తున్నాం.. రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమానికి గత ప్రభుత్వాలు బడ్జెట్‌లో రూ.8,450 కోట్లు విడుదల చేస్తే, మా ప్రభుత్వం రూ.12 వేల కోట్లు పెంచి ప్రతి సంవత్సరం రూ.20 వేల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది.

KCR

మన దగ్గర ఇంజినీరింగ్ చేసినోళ్లు హోం గార్డులుగా, సెక్యూరిటీ గార్డులుగా, ఆఫీస్ బాయ్‌లుగా పనిచేస్తున్నరు. ఇంజినీరింగ్ చేస్తే తల ఎత్తుకోవడం కాదు, బోగస్ కాలేజీలతో వారి బతుకులు నాశనం అవుతున్నయి. దేశంలో వంద నకిలీ సర్టిఫికెట్లు దొరికితే అందులో 70 హైదరాబాద్‌కు చెందినవే ఉంటున్నయి. అందుకే పోలీసులతో ప్రత్యేకంగా సమావేశం పెట్టి ఆరాలు తీస్తున్నం. ఇంజినీరింగ్ కాలేజీలను అనుబంధ రంగాలకు అనుసంధానం చేసి వారిలో నైపుణ్యం మెరుగుపడేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

-ప్రజల కోసం వచ్చే ఐదేండ్లలో 6 లక్షల కోట్లు -ప్రణాళికేతర వ్యయం రూ.3.75 లక్షల కోట్లు – 3,36,869 మందికి త్వరలో ఉచితంగా పట్టాలు – రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు – విపక్షాలు ధర్నాల బదులు దరఖాస్తులు చేయించాలి – దళితులకు 3 ఎకరాల భూమి తప్పకుండా ఇస్తాం – అంగన్‌వాడీల్లో కడుపునిండా భోజనం పెడుతం – వచ్చే మార్చి నుంచి రైతులకు 9 గం. విద్యుత్ – ఆంధ్ర ఉద్యోగులు మనకు టూరిస్టులు – ట్యాక్స్ పేయర్స్‌ని ఎందుకు వెళ్లగొడతాం? – బాబు ఇప్పుడు కరెంటిస్తనన్నా తీసుకోం – గవర్నర్ ప్రసంగానికి సీఎం ధన్యవాదాలు – గంటన్నరపాటు సమాధానం.. -సభ ఏకగ్రీవ ఆమోదం

తమది పేదల ప్రభుత్వమని, బడ్జెట్‌లో కేటాయించే ప్రతి పైసాను తెలంగాణ పేదల సంక్షేమానికే వెచ్చిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విస్పష్టంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే రానున్న ఐదేండ్లలో రూ.6లక్షల కోట్లను ప్రజలకోసం ఖర్చుచేస్తామని చెప్పారు. ఇందులో రూ.3.75 లక్షల కోట్లను ప్రణాళికేతర వ్యయంగా, రూ.2.25 లక్షల కోట్లను ప్రణాళిక రూపంలో ఖర్చు చేస్తామని తెలిపారు. ప్రతి పైసాలో తెలంగాణ ప్రజల చెమట చుక్కలు చూస్తున్నామని ముఖ్యమంత్రి ఉద్వేగభరితంగా చెప్పారు.

గత ప్రభుత్వాలు సంక్షేమంకోసం బడ్జెట్‌లో రూ.8,450 కోట్లు కేటాయిస్తే, తమ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఏకంగా రూ.12 వేల కోట్లు పెంచి రూ.20వేల కోట్ల బడ్జెట్‌తో ప్రజల సంక్షేమాన్ని అగ్రభాగంలో నిలబెట్టిందని సీఎం విశదీకరించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈనెల 7న రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో రాజకీయ పార్టీలు పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి మంగళవారం సాయంత్రం ఏకంగా గంటన్నరపాటు మాట్లాడారు. మరో అరగంటపాటు విపక్ష సభ్యులు చర్చ సందర్భంగా లేవనెత్తిన ప్రశ్నలకు జవాబిచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశంలోని ధనిక రాష్ట్రాల్లో గుజరాత్ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందన్నారు. జాతీయ ఆదాయంలోనూ, దేశంలోనే రాష్ట్రం రెండో స్థానంలో ఉందన్నారు. గతంలో ప్రణాళిక సంఘం పూర్తిగా కేంద్రం పరిధిలో ఉండేదని, ఇప్పుడు నీతి ఆయోగ్‌లో అన్ని రాష్ట్రాల సీఎంలకు స్థానం కల్పించటంద్వారా మన వాదనలు వినిపించే అవకాశం దక్కిందని చెప్పారు.

రాష్ట్ర విభజన సందర్భంగా 11 వేల కోట్లు ఉన్న ఎఫ్‌ఆర్‌బీఎం, ఇప్పుడు రూ.14 వేల కోట్లకు పెరగనుందని, ఇది ఇంకా పెరిగి రూ.16 వేల కోట్లకుపోయే అవకాశం ఉందని తెలిపారు. ఆర్థిక అంశాలలో కరీంనగర్ జిల్లా బిడ్డ ప్రొఫెసర్ జీఆర్ రెడ్డి సలహాలతో రాష్ట్ర ప్రభుత్వం అంచనాలకు అనుగుణంగా ముందుకు సాగుతుందని సీఎం చెప్పారు. గత బడ్జెట్‌లో లక్షా ఆరు వందల కోట్లు అంచనాగా పెట్టుకోగా, రూ.60వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరిందన్నారు. కొన్ని శాఖల్లో నష్టం వాటిల్లిందని, ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి కేంద్రం 40% కోతలు విధించిన కారణంగా ఆదాయంలో కోత పడిందని సీఎం వివరించారు.

భూములు విక్రయించలేదు జంట నగరాల్లోని ప్రభుత్వ భూముల విక్రయంద్వారా రూ.6,500 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేసిన విషయాన్ని గుర్తు చేసిన సీఎం.. కానీ బూమ్ అంతగా లేని సమయంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం సమంజసం కాదనే ఉద్దేశంతో భూములను విక్రయించలేదని తెలిపారు. ఈ సమయంలో విలువైన భూములను అమ్మటం సరైంది కాదని అమ్మలేదు. ఆ కార్యక్రమం ఆపినం. ప్రజల సొమ్ము ప్రజల ఖజానాకు చేరాలే. అటు కేంద్రం విధించిన కోత, ఇటు భూములు విక్రయించని కారణంగా రూ.1500 కోట్లు మనం ఆర్జించలేకపోయినం. అవి లేకుండా మనం వేసుకున్న అంచనాలు కరెక్టు అని సీఎం చెప్పారు.

సంక్షేమానికి ఏటా రూ.20 వేల కోట్లు రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమానికి గత ప్రభుత్వాలు బడ్జెట్‌లో రూ.8,450 కోట్లు విడుదలచేస్తే, తమ ప్రభుత్వం రూ.12 వేల కోట్లు పెంచి ప్రతీ సంవత్సరం రూ.20 వేల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించిందని సీఎం కేసీఆర్ చెప్పారు. మిషన్ కాకతీయ, ఆర్‌అండ్‌బీ రహదారుల విషయంలోకూడా గతంలో ఏ ప్రభుత్వం చేయనివిధంగా తమ ప్రభుత్వం చేస్తున్నదని తెలిపారు. భూములు అమ్మకపోయినా క్రమబద్ధీకరణతో నిధులు సమీకరించుకోవాలని నిర్ణయించామన్నారు. పాపం కొన్ని మీడియా సంస్థలకు అవగాహన లేక తప్పుడు ప్రచారం చేశాయి. భూములు అమ్మటంద్వారా ఇరవై వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకున్న సర్కార్‌కు చేదు అనుభవం ఎదురైందని, ఖజానా ఖాళీ అయ్యిందని ఇష్టం వచ్చినట్లు రాసుకున్నారు.

గత ప్రభుత్వాలకు పేదలు అనగానే జేసీబీలు పంపించటం, గుడిసెలు కనపడితే కూల్చటం మాత్రమే తెలుసు. ఈ సంఘటనలపై కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. కానీ మేం అలా చేయం. ఇది పేదల ప్రభుత్వం. నిరుపేదల సంక్షేమమే మా లక్ష్యం అని సీఎం ప్రకటించారు.

సదుద్దేశంతో కల్యాణలక్ష్మి కల్యాణలక్ష్మి పథకాన్ని సదుద్దేశంతో ప్రవేశపెట్టామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఏ పథకానికి సంబంధించైనా ప్రారంభంలో బాలారిష్టాలు ఉంటాయని, ఏవైనా అంతరాలు ఉంటే సభ్యులు మంత్రుల దృష్టికి తీసుకురావాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం బంగారుతల్లి పథకం ప్రవేశపెట్టిందని పెద్దలు జీవన్‌రెడ్డి చెప్పినరు. జనరల్ ఎలక్షన్స్‌కు నాలుగు నెలల ముందు హడావుడిగా చేసిన ప్రకటన అది. అందులో విధి విధానాలు నిర్ణయం కాలేదు. ఈ సమావేశాలు ముగిసేలోపు దానిపై కూడా నిర్ణయం తీసుకుంటాం అని చెప్పారు. హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యం ఇచ్చేందుకు ప్రభుత్వంపై రూ.125కోట్ల అదనపు భారం పడినా భరించడానికి సిద్ధమయ్యాం. ఆ పిల్లలు తెలంగాణ భవిష్యత్తు. కాబట్టి ఎంత భారాన్ని అయినా భరిస్తాం. మెస్ చార్జీలు కూడా పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది అని సీఎం తెలిపారు.

కేజీ టూ పీజీ చిన్న విషయం కాదు కేజీ నుంచి పీజీ విద్య విషయంలో కూడా సీఎం కేసీఆర్ ఘాటైన సమాధానమిచ్చారు. ఇది రాత్రికి రాత్రి పూర్తయ్యే విషయం కాదు. మా ప్రభుత్వం వచ్చి 9నెలలే అయ్యింది. మాకు ఐదేండ్ల సమయం ఉంది. ఇదేమీ చిన్న విషయం కాదు. కేజీ టూ పీజీ విద్య గురించి చుక్కా రామయ్యే కన్‌ఫ్యూజ్ అయ్యారని గౌరవ సభ్యులు లక్ష్మణ్ చెప్పినరు. చుక్కా రామయ్యలాంటి వారికే కన్‌ఫ్యూజన్ ఉంటే, దాని అమలు అంత తేలికైన విషయం కాదన్నది సభ్యులు అర్థం చేసుకోవాలి. కలిగినవారి పిల్లలకు ప్లే స్కూల్స్ ఉన్నాయి. ఆంగ్ల మాధ్యమంలో చెప్పిద్దామంటే ఇప్పుడు ఉన్న టీచర్ల సామర్థ్యం సరిపోదు. బోలెడు ప్రైవేటు స్కూల్స్ ఉన్నయి.

వాటిని ఏం చేయాలి? బోలెడన్ని సమస్యలు ఉన్నాయి. 12వ తరగతివరకూ సీబీఎస్‌సీ సిలబస్‌లో చెప్పిస్తం. ఆ తర్వాత ఏంది? అక్కడినుంచి కొందరు వేర్వేరు కోర్సులకు పోతరు. ఇలా ఎన్నో సమస్యలు ఉన్నవి. ఇంకో ఏడాది టైమ్ తీసుకుని అయినా విద్యావేత్తలతో చర్చించి ఈ పథకాన్ని అమలుచేస్తం. కేజీ టూ పీజీ ప్రారంభించేది మాత్రం ఖాయం. నియోజకవర్గానికి ఒక స్కూల్‌తో ప్రారంభించి, అది ఎట్ల నడుస్తుందో పరిశీలించి, క్రమంగా విస్తరించుకుంటూపోతం అని సీఎం వివరించారు.

కోళ్ల ఫారాలలో ఇంజినీరింగ్ కాలేజీలు మొన్నామధ్య నేను నాస్‌కామ్ మీటింగ్‌కిపోతే మీ వాళ్లను క్యాంపస్ ఇంటర్యూలకు సెలక్ట్ చేయడం లేదు అని చెప్పినరు. అదేంది? అని నేను అడిగితే.. మీ దగ్గర పౌల్ట్రీ ఫారాల్లో ఇంజినీరింగ్ కాలేజీలు పెట్టినరు అని చెప్పారు అని సీఎం ప్రస్తావించారు. ఇంజినీరింగ్ కాలేజీలను ప్రభుత్వం రద్దు చేస్తున్నదని లక్ష్మణ్ అన్నారు. ఒక విద్యార్ధి ఇంజినీరైతే గ్రామానికి మంచి పేరువస్తదని చెప్పారు.

అన్నా! మన దగ్గర ఇంజినీరింగ్ చేసినోళ్లు హోం గార్డులు, సెక్యూరిటీ గార్డులు, ఆఫీస్ బాయ్‌లుగా పని చేస్తున్నరు. ఇంజినీరింగ్ చేస్తే తల ఎత్తుకోవడం కాదు, బోగస్ కాలేజీలతో బతుకులు నాశనం అవుతున్నాయి అని బీజేపీ సభ్యుడు లక్ష్మణ్‌ను ఉద్దేశించి కేసీఆర్ అన్నారు. దేశంలో వంద నకిలీ సర్టిఫికెట్లు దొరికితే అందులో 70 హైదరాబాద్‌కు చెందినవే ఉంటున్నయి. అందుకే పోలీసులతో ప్రత్యేకంగా సమావేశం పెట్టి ఆరా తీస్తున్నం. ఇంజినీరింగ్ కాలేజీను అనుబంధరంగాలకు అనుసంధానంచేసి, వారిలో నైపుణ్యం మెరుగుపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇంజినీరింగ్ కాలేజీకి సంబంధించి ప్రభుత్వం ఉదయం జీవో ఇస్తే గంటకల్లా స్టే తెచ్చుకుంటున్నరు. హైకోర్టుకి వెళితే సుప్రీంకోర్టుకు అంటూ తిప్పుతున్నరు. ఇటీవల జేఎన్‌టీయూ అధికారులతో తనిఖీలు నిర్వహిస్తే ఒక ఫ్యాకల్టీని 9 కాలేజీల్లో పని చేస్తున్నట్లు చూపారని తేలింది.

ఇవి ఇంజినీరింగ్ కాలేజీలా? ఇలాంటి కాలేజీలు ఉండాలా లక్ష్మణ్ గారు? అని సీఎం ప్రశ్నించారు. శాసనసభ్యులు ఎవ్వరూ ఇందులో జోక్యం చేసుకోకపోవడంవల్ల తనిఖీలు సవ్యంగా జరుగుతున్నాయని సీఎం చెప్పారు. ఇంజినీరింగ్ కాలేజీల తనిఖీల్లో తమ మంత్రి మహేందర్‌రెడ్డి కాలేజీలు, మరో ఎమ్మెల్యేకు చెందిన రెండు కాలేజీలు పోయాయని సీఎం తెలిపారు. పుట్టగొడుగుల్లాంటి ఈ కాలేజీలవల్ల రాష్ట్రం పరువు పోతుందన్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం ఎదురు చూస్తున్నా, కమలనాథన్ కమిటీ నిర్ణయంకోసం వేచి చూడాల్సి వస్తున్నదని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేసి తీరుతామని స్పష్టంచేశారు. కమలనాథన్ కమిటీ తీర్పు మేరకు మన రాష్ట్రం వాళ్లు మనకు మిగిలితే, రాబోయే రెండేండ్లలో తెలంగాణ యువతకు 2 లక్షల ఉద్యోగాలు వస్తయని సీఎం చెప్పారు.

మిషన్ కాకతీయ ప్రారంభం… ఈనెల 12న నిజామాబాద్ జిల్లాలో మిషన్ కాకతీయ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటివరకు 3,150 చెరువులకు టెండర్లు ఆహ్వానించారని తెలిపారు. మిషన్ కాకతీయలో అందరు ఎమ్మెల్యేలు భాగస్వాములు కావాలని కోరారు. వాటర్ గ్రిడ్‌కు సంబంధించి ప్రతి వ్యక్తికి 100 లీటర్ల నుంచి 135 లీటర్ల శుద్ధి చేసిన నీరు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం వివరించారు. త్వరలో ప్రపంచంలోనే మేలైన పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో కొంత గందరగోళం ఉన్నా, ఇప్పుడు పూర్తిగా విద్యార్థులకు న్యాయంచేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని చెప్పారు.

మొదట్లో స్థానికత ఆధారంగానా? ఆర్టికల్ 371 (డీ) ఆధారంగానా? అనే మీమాంసలో ఉన్నం. ఇవాళ సీట్లు పోవాలి. రేపు ఉద్యోగాలు కూడా పోవాలా? అని ఆలోచించినం. చివరికి 371 (డీ) ప్రకారం స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని నిర్ణయించినం. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన 4 సంవత్సరాల బకాయిలు కూడా చెల్లించినం అని సీఎం వివరించారు.

ఏడాది చివరికి జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఈ ఏడాది చివరి నాటికి ప్రతి జిల్లాలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి తెచ్చి తీరుతమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. అలాగే గాంధీ, ఉస్మానియా, నిమ్స్, నిలోఫర్ ఆస్పత్రులను మెరుగుపరుస్తామని చెప్పారు. రాబోయే నెల రోజుల్లో వేయి 104, 108 వాహనాలు రాబోతున్నాయని సీఎం ప్రకటించారు. ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్ ఉండకూడదని కొందరు సభ్యులు సూచించారని ప్రస్తావించిన సీఎం.. దీనిపై ఒక కమిటీని వేశామని చెప్పారు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు కల్పిస్తామని, అసెంబ్లీలో తీర్మానంచేసి, క్యాబినెట్‌లో కూడా తీర్మానం చేసిన తర్వాత, అఖిలపక్షం తరఫున ఢిల్లీ వెళ్లి ఆమోదం పొందుదామని చెప్పారు.

దళితులకు 3 ఎకరాలు ఇచ్చితీరుతం దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చి తీరుతామని కేసీఆర్ పునరుద్ఘాటించారు. విపక్ష సభ్యుడు జీవన్‌రెడ్డి ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. గత ప్రభుత్వాల పంపకాలు అశాస్త్రీయంగా జరిగాయన్నారు. జరిగిన పంపకాల్లో 17-18శాతం భూములు అన్యాక్రాంతమయ్యాయని, హైదరాబాద్ చుట్టుపక్కల అనేక రకాల సంస్థల నిర్మాణం జరిగిపోయిందని సీఎం ఆవేదన వ్యక్తంచేశారు. ఆ లెక్కలన్నీ సీసీఎల్‌ఏ తీస్తున్నది. ఈ విషయంలో అవసరమైతే అఖిలపక్షం వేద్దాం. అందరం కూర్చుని దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుందాం అని విపక్షాలకు సీఎం సూచించారు. దళితులకు ఇచ్చేందుకు అవసరమైన భూమి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం రూ.185 కోట్లు విడుదలచేసింది.

అయితే కేవలం రూ.56 కోట్లు మాత్రమే ఖర్చు చేసిండ్రు. గౌరవ సభ్యులు ఈ విషయంలో కలెక్టర్లకు సహకారం అందించాలి. 14వ ఆర్థిక సంఘం తీర్పుకోసం చకోర పక్షుల్లా వేచిచూసినం. గతంలో యూపీఏ, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది. కేంద్రం ఎన్ని నిధులు ఇస్తుందోనని వేచి చూసినం. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణీ స్త్రీలు, పిల్లలకు ఇచ్చే పౌష్టికాహారం (ఐసీడీఎస్) నిధుల్లో కోత విధించారు. అంగన్‌వాడీ ఉద్యోగులు తక్కువ జీతంతో అర్ధాకలితో నెలకు రూ.2,200, రూ.4,200 జీతంతో బతుకుతున్నారు. కేంద్రం వారిపై దయ చూపించాల్సిందిపోయి కోత విధించింది.

గత ఏడాది రూ.15,880 కోట్లు నిధులు కేటాయిస్తే, 50 శాతం కోత విధించి రూ.8వేల కోట్లకు సరిపెట్టింది. ఇది సరైంది కాదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, సహాయ మంత్రి, అలాగే కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, వెంకయ్యనాయుడులకు చెప్పిన. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్న. కేంద్రం నిర్ణయం ఎలా ఉన్నా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఐసీడీఎస్ పథకాన్ని 100శాతం కొనసాగిస్తది. జీతాలు కూడా ఎంతో కొంత పెంచుతం. గ్రాములు లేవు మన్ను లేదు.. కడుపునిండా భోజనం పెడతం అని సీఎం కేసీఆర్ ఉద్వేగభరితంగా చెప్పారు. ఇటీవలే తాను అంగన్‌వాడీ ఉద్యోగులను పిలిచి మాట్లాడానని, కనీసం వంట పాత్రలు కూడా ఇవ్వకపోతే, ఇళ్లనుంచి తెచ్చి వంటలు చేస్తున్నామని చెబితే తన కడుపు తరుక్కుపోయిందని చెప్పారు. ఆ టెక్కులు కట్టినం, ఈ టెక్కులు కట్టినం అని చెప్పుకునే వారు ఈ విషయంలో ఏం చెబుతరు? వెంటనే మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పిలిచి వారికి వంట పాత్రలు కొనుగోలు చేసి ఇవ్వాలని చెప్పిన అని సీఎం తెలిపారు.

ధర్నాలు కాదు దరఖాస్తులు చేయించండి.. గత ప్రభుత్వాలు పెన్షన్‌కింద రూ.70, రూ.100 ఇస్తే తమ ప్రభుత్వం ఏకంగా రూ.1000 ఇస్తున్నదని సీఎం చెప్పారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఏం చెప్పినమో అదే చేస్తున్నం. రాష్ట్రవ్యాప్తంగా 30,76,000 మందికి పింఛన్ ఇస్తున్నం అని సీఎం చెప్పారు. ఇంకా ఎక్కడైనా అర్హులకు పెన్షన్ రావడం లేదని సభ్యుల దృష్టికివస్తే, దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసురావాలని సూచించారు. పెన్షన్ రానివారు ధర్నాలు చేస్తున్నారని గౌరవ సభ్యులు పాయం వెంకటేశ్వర్లు చెప్పినరు. ఆ ధర్నాలు రాజకీయాలకోసం చేసేవి. దయచేసి నేను సభ్యులకు చెప్పెడిది ఏందంటే, ధర్నాలు వద్దు దరఖాస్తులు చేయించండి. మైనార్టీల సంఖ్య తక్కువగా ఉందని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ చెప్పారు. 76 వేల మందికే పెన్షన్ వస్తున్నదన్నరు. నేను అధికారుల వద్ద ధ్రువీకరించుకుంటే రాష్ట్రవ్యాప్తంగా 2,43,613మంది ముస్లింలకు పెన్షన్లు వస్తున్నాయని చెప్పినరు. అంటే ముస్లిం జనాభాలో 8 శాతం మందికి పెన్షన్ వస్తున్నది అని సీఎం వివరించారు.

వచ్చే మార్చి నుంచి రైతులకు 9 గంటల విద్యుత్ వచ్చే మార్చి తర్వాత రాష్ట్రంలోని రైతులకు ఉదయం 9.15 గంటల నుంచి సాయంత్రం 6.15 గంటల వరకు 9 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అర్ధరాత్రిపూట పొలానికి వెళ్లి పాము కాట్లకు, విద్యుత్ షాకులకు గురై మరణించాల్సిన పరిస్థితులు ఇకపై ఉండబోవన్నారు. పరిశ్రమలకు రెండు రోజుల పవర్ హాలిడే కూడా ఉండదని స్పష్టం చేశారు. ఇప్పటికే పరిశ్రమలకు కోతలు లేకుండా విద్యుత్ సరఫరా అందజేస్తున్నామని చెప్పారు. రైతులకు ఒకేసారి 9 గంటల పగటి పూట విద్యుత్ సరఫరా చేస్తామని తాను అధికారికంగా ప్రకటిస్తున్నానని సీఎం స్పష్టంచేశారు. రాష్ట్రంలో విద్యుత్ లభ్యతపై వివరణ ఇచ్చిన సీఎం.. ప్రస్తుతం హైడ్రో పవర్ కాకుండా 4300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అందుబాటులో ఉందని చెప్పారు.

2018నాటికి 24,575 మెగావాట్లకు విద్యుత్ ఉత్పత్తి పెంచుతామని భరోసా ఇచ్చారు. 2015 చివరినాటికి 7,779 మె.వా, 2016నాటికి 10,509 మె.వా, 2017 నాటికి 11,345 మె.వా, 2018నాటికి 20,633 మె.వా విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్నారు. దీనికితోడు సోలార్ విద్యుత్ 1000 మె.వా, జూరాలనుంచి 200 మె.వా, ఇతరత్రా అన్నీ కలుపుకుని 2018 చివరి నాటికి 24,575 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో ఉంటుందని చెప్పారు. తాను ఆన్ రికార్డు ఈ మాట చెబుతున్నానని కేసీఆర్ ప్రకటించారు.

బాబు కరెంట్ ఇస్తానన్న ఇప్పుడు తీసుకోం చంద్రబాబు ఇప్పుడు కరెంటు ఇస్తామన్నా తీసుకునేది లేదని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ విషయంలో చంద్రబాబు వ్యవహారాన్ని ఎద్దేవా చేస్తూ సీఎం మాట్లాడారు. మొదట్లో నేను చెబితే ఎవ్వరూ నమ్మలే. అద్భుతాలు సాధ్యం కావన్నరు. కరెంట్ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుకు మనం కృతజ్ఞతలు చెప్పాలే. రాష్ట్రం ఏర్పడిన నాడు మనకు రావాల్సిన కరెంటు గురించి అడిగితే ఆయన మనల్ని ఇరుకున పెట్టేందుకు ఎన్ని కుట్రలు పన్నాలో అన్ని చేసిండు. అందుకు బాబుకి ధన్యవాదాలు. ఎందుకంటే.. ఆ రోజు ఆయన కరెంట్ ఇస్తే మనం తీసుకునే పొజిషన్‌లో ఉన్నం. కానీ ఈ రోజు ఆయన ఇస్తనన్న నేను తీసుకోను. పొట్టోడి నెత్తిన పొడుగోడు కొడితే.. పొడుగోడి నెత్తిన పోచమ్మ కొడతది అని తెలంగాణలో ఓ సామెత ఉన్నది. సీలేరు లాకున్నరు. కృష్ణపట్నం, హిందూజానుంచి కరెంట్ రాకుండా అడ్డుకున్నరు. కేంద్రం నియమించిన నీరజ కమిటీ కూడా బాబు చేస్తున్నది తప్పని చెప్పినా కేంద్రం పట్టించుకోలేదు. ఇప్పటివరకు రూ.1500 కోట్లతో విద్యుత్ కొన్నం. ఈరోజు మనకు కరెంట్ కోతలు లేవు. కేరళ నుంచి 500 మె.వా విద్యుత్ రాబోతున్నది. ఈ సీజన్‌లో ఒక్క ఎకరా కూడా ఎండనివ్వం. ఉంటేగింటే ఈ సీజన్‌లోనే కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. భవిష్యత్తులో ఇక ఉండదు.

ఇప్పుడు చంద్రబాబు పిలిచి కరెంట్ ఇస్తమన్న నేను తీసుకోను. వాళ్లు ఇస్తే, మనం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన ఇచ్చే కరెంట్‌ను మనం యూనిట్‌కు ఏడున్నరకు కొంటే, మనం ఇచ్చే కరెంటును వాళ్లు మూడున్నరకు కొంటారు. ఒక రకంగా చూస్తే బాబు మంచి పనే చేసిండు. ఆయనకు ధన్యవాదాలు అన్నారు. ఈ రోజు పొద్దున్నే మా అధికారులకు చెప్పిన. ఈ నాలుగేండ్లు బాబుని మంచిగా చూసుకోండని. వాళ్లు మనకు టూరిస్టులు. వాళ్ల ఉద్యోగులు కూడా ఇక్కడినుంచి వెళ్లనంటే మాకు అభ్యంతరం లేదు. సక్కగ ఈడ్నే ఉంటరు. పన్నులు కూడా ఈడ్నే కడతారు. ట్యాక్స్ పేయర్స్‌ను మనం ఎందుకు వెళ్లగొడతం? అని సీఎం చమత్కరించారు.

నిరుపేదలకు ఉన్న చోటే పట్టాలు 100-125 చదరపు గజాలలోపు ఉన్న నిరుపేదలకు ఎక్కడ ఉంటే అక్కడే పట్టాలు ఇవ్వాలని నిర్ణయించాం. పేదలకు పట్టాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన జీవో 58కి 3,36869 దరఖాస్తులు వచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రభుత్వం సొంత ఖర్చులతో నిరుపేదలందరికీ పట్టాలు జారీ చేస్తుంది. నిరుపేద ప్రజలనుంచి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం తీసుకోదు. జీవో 58కింద ఆదిలాబాద్ జిల్లానుంచి 24,893, హైదరాబాద్ రెవిన్యూ జిల్లానుంచి 60,459, కరీంనగర్ జిల్లానుంచి 10,330, ఖమ్మం జిల్లానుంచి 20,883, మెదక్ జిల్లాలో 1,901, నల్లగొండ జిల్లాలో 15,250, నిజామాబాద్ జిల్లాలో 4,354, రంగారెడ్డి జిల్లాలో 1,43,805 వెరసి.. రాష్ట్రవ్యాప్తంగా 3,36,869 దరఖాస్తులు వచ్చాయి.

ఇక 125 చ.గ పైబడిన వారికోసం జారీచేసిన జీవో 59కింద 1,33,201 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిని మార్కెట్ ధరలో 12% అడ్వాన్స్ చెల్లించమన్నం. ఆ విధంగా ప్రభుత్వ ఖజానాకు రూ.133.5 కోట్లు సమకూరింది. ఈ నిర్ణయంవల్ల మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 4,69,000 కుటుంబాలకు ఉపశమనం లభించబోతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల కల సాకారమవుతున్నది అని సీఎం చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.