Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మాది అభివృద్ధి బాట

-విశ్వనగరమే లక్ష్యంగా పనిచేస్తున్నాం -మౌలిక వసతుల కల్పనలో ఇది ఆరంభమే -సీఎం కేసీఆర్ కార్యదక్షతతో నగరాభివృద్ధికి కృషిచేస్తాం -బాలానగర్ ఫ్లై ఓవర్ శంకుస్థాపనలో మంత్రి కేటీఆర్ -నవంబర్ చివర్లో 30 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ప్రారంభం -మొదటిదశ పూర్తయ్యాక మెట్రో రెండో దశ నిర్మాణానికి శ్రీకారం -మూడు వేల కోట్లతో రోడ్లు, ఫ్లై ఓవర్లు, జంక్షన్ల అభివృద్ధి -డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణకు 11వేల కోట్లతో ప్రతిపాదనలు -రెండు వేల కోట్లతో రెండు చోట్ల స్కైవేల నిర్మాణాలు -ఉప్పల్ నుంచి నారపల్లికి వెయ్యి కోట్లతో ఫ్లై ఓవర్ -ఛే నంబరు నుంచి రామంతపూర్‌కు 250కోట్లతో మరోటి -కోర్టు కేసులు వేశామని నిస్సిగ్గుగా చెప్పిన కాంగ్రెసోళ్లు -2019లో కేసీఆర్‌కే ప్రజలు పట్టం కడుతారని వారికీ తెలుసు

రాష్ట్ర ప్రభుత్వానిది అభివృద్ధి బాట అని పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారక రామారావు చెప్పారు. ఇప్పటిదాకా ప్రభుత్వంచేసిన కృషితో సంతృప్తిచెందడం లేదని, ఇది ఆరంభం మాత్రమేనని అన్నారు. హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) రూ.387కోట్లతో ఆరు లేన్లతో నిర్మించతలపెట్టిన బాలానగర్ భారీ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులకు సోమవారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ, రాబోయే ఏడెనిమిదేండ్లలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్నారు. కేవలం రోడ్లు, ఫ్లై ఓవర్లు, జంక్షన్ల అభివృద్ధికి రూ.3వేల కోట్లతో పనులు చేపడుతున్నామని చెప్పారు. మెరుగైన డ్రైనేజీ వ్యవస్థకోసం 11వేల కోట్లతో ప్రతిపాదనలు రూపొందించామన్నారు. రూ.2వేల కోట్లతో శివారు మున్సిపాలిటీల్లో ఇంటింటికీ నీళ్లు అందించే ప్రయత్నంచేశామని చెప్పారు. కచ్చితంగా మెట్రో రెండోదశ, హైదరాబాద్ నగరంలో స్కైవేలకు సీఎం కేసీఆర్ సారథ్యంలోనే శ్రీకారం చుడుతామని ప్రకటించారు. ఈ ప్రభుత్వంలో పేదలకు అందుతున్న ఫలాలు ఆరంభం మాత్రమేనని, సీఎం కేసీఆర్ మనసులో చాలా ఆలోచనలున్నాయని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ కార్యదక్షతతో హైదరాబాద్ అభివృద్ధికి అన్ని విధాలా కృషిచేస్తామని అన్నారు.

నవంబర్ చివరికల్లా 30 కిలోమీటర్ల మెట్రో రైల్ నవంబర్ చివర్లో నాగోల్ నుంచి మియాపూర్ వరకు 30 కిలోమీటర్ల మేర మెట్రో రైల్‌ను ప్రారంభిస్తామని కేటీఆర్ వెల్లడించారు. వచ్చే సంవత్సరం మిగిలిన దూరాన్ని కూడా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. తదనంతరం మెట్రో రెండో దశను చేపడుతామని చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా నగరంలో డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని కేటీఆర్ చెప్పారు. 24 గంటల వ్యవధిలో 2 సెంటీమీటర్ల వర్షం పడితే నీరు తీసుకునిపోయే వ్యవస్థ లేదన్నారు. రోడ్ల విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పారు. అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో నాణ్యమైన రోడ్లను ఏర్పాటుచేస్తామని అన్నారు. హైదరాబాద్‌లో నాణ్యమైన జీవనాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రూ.2వేల కోట్లతో ప్యారడైజ్ నుంచి కొంపల్లివరకు, జేబీఎస్‌నుంచి తూంకుంటవరకు రెండు స్కైవేలు కట్టబోతున్నామని మంత్రి తెలిపారు. ఈ నిర్మాణాలు రక్షణభూములతో ముడిపడి ఉన్నాయని, వీటిని అప్పగించేందుకు రక్షణ శాఖ అంగీకరించినా ఇంకా ఉత్తర్వులు రాలేదన్నారు. ఇవి రాగానే ఉత్తర తెలంగాణకు కీలకమైన రాజీవ్ రహదారి మీదుగా స్కైవే నిర్మాణాలు చేపడుతామన్నారు. దాంతోపాటు నగరంలో రూ.3వేల కోట్లతో వివిధ ప్రాంతాల్లో భారీ ఫ్లై ఓవర్ల నిర్మాణాలు జరుగుతున్నాయని వివరించారు. అంబర్‌పేటలోని ఛే నంబరు చౌరస్తా నుంచి రామంతపూర్‌వరకు రూ.250 కోట్లతో ైఫ్లె ఓవర్ నిర్మాణం టెండర్ దశలో ఉన్నదని చెప్పారు. ఉప్పల్‌నుంచి నారపల్లివరకు రూ.వెయ్యి కోట్లతో ఫ్లై ఓవర్ చేపట్టి నగరంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తున్నామన్నారు. అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ ఎదుగాలంటే కొంత సమయం పడుతుందని ప్రజలు గమనించాలని కోరారు.

ఈ అభివృద్ధితోనే మేం సంతృప్తి పడం.. ఈ మూడేండ్లలో పారిశ్రామికంగాకానీ, కరెంటు, మంచినీళ్ల విషయంలో కానీ శాంతిభద్రతల విషయంలో కానీ సాధించిన అభివృద్ధితో పొంగిపోవడంలేదని కేటీఆర్ అన్నారు. కొత్త రాష్ట్రం అంటే కొత్త సంసారం లెక్క అని చెప్తూ.. పాలన గాడిలో పడేందుకే సంవత్సరం పట్టిందన్నారు. ముఖ్యంగా సంవత్సరంపాటు కేంద్రం రాచిరంపాన పెట్టిందని విమర్శించారు. అధికారుల విభజన సరిగా చేయలేదని, ఇప్పటికీ హైకోర్టు, చాలా సంస్థల విభజన పూర్తికాలేదని గుర్తుచేశారు. అయినప్పటికీ సీఎం కేసీఆర్ కార్యదక్షతవల్ల అన్ని కుదుటపడ్డాయని అన్నారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన కరెంటు, శాంతిభద్రతలు సహా అన్ని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ పోతున్నామన్నారు. ఈ క్రమంలోనే పెండింగ్‌లో ఉన్న బాలానగర్ ఫ్లై ఓవరును నిర్మిస్తున్నామన్నారు. పీవీ ఎక్స్‌ప్రెస్‌వే తర్వాత ఇంతటి భారీ నిర్మాణం చేపట్టడం నగరంలో ఇదే మొదటిసారి అని చెప్పారు. 18 నెలల్లో దీనిని పూర్తిచేసి తీరుతామని ధీమా వ్యక్తంచేశారు.

ఎవ్వరినైనా ఇబ్బంది పెట్టినమా? ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా మూడేండ్ల రెండు నెలల, పదహారు రోజులు. నాలుగేండ్ల కిందట హైదరాబాద్‌లో ఏ నోట విన్నా తెలంగాణ వస్తే నష్టమా? లాభమా? అనే చర్చ జరిగింది. ఈ సమయంలో ఎన్నోన్నో అనుమానాలు, అపోహలు, దుష్ప్రచారాలు లేవనెత్తారు. తెలంగాణ వస్తే ఇట్లయితది.. అట్లయితది.. ఇక్కడ ఉండనీయరు.. ఆంధ్ర ప్రాంత ప్రజలను బతుకనీయరు.. అంటూ అబద్ధపు ప్రచారాలు చేశారు అని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. కానీ ఈ మూడేండ్లలో ఎవ్వరినైనా కనీసం గిచ్చినమా? ఎక్కడైన ఇబ్బందులకు గురి చేసినమా? అని ప్రశ్నించారు. హోంమంత్రి నాయిని నేతృత్వంలోని పోలీస్‌శాఖ దేశంలోనే సమర్థవంతంగా శాంతిభద్రతలను పరిరక్షిస్తున్నదని కేటీఆర్ చెప్పారు.

రాష్ట్రం అన్నింటిలో నం.1 శాంతి భద్రతల్లో హైదరాబాద్ నంబర్ వన్‌గా ఉందని కేటీఆర్ అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉన్నదని వివరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అవినీతిరహిత పరిపాలన, విధానాల్లో సంస్కరణలు తీసుకురావడం వల్లే ఈ ఘనతలు దక్కాయని చెప్పారు. ఇది మనకి మనం ఇచ్చుకున్న సర్టిఫికెట్ కాదని, స్వయంగా కేంద్ర ప్రభుత్వం 29 రాష్ర్టాలలో విధానాలు, ఆచరణలను బేరీజు వేసి ప్రకటించిందని అన్నారు. తెలంగాణ వచ్చినంక ఇప్పటివరకు టీఎస్ ఐపాస్ ద్వారా 4,100 యూనిట్లకు అనుమతులు ఇచ్చామని, తద్వారా రూ.70వేల కోట్ల పెట్టుబడులు రాష్ర్టానికి తీసుకువచ్చామని వివరించారు. వీటితో 2.30లక్షల మందికి ప్రత్యక్షంగా, అంతకు రెండింతలు పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించినట్టు పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ రంగంపై అపోహలు సృష్టించారని, కానీ భారతదేశం మొత్తంలోనే రియల్ ఎస్టేట్‌పరంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరంగా హైదరాబాద్ నిలబడిందన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లనే సాధ్యమైందన్నారు. జేఎల్‌ఎస్ సంస్థ (రియల్ ఎస్టేట్ అధ్యయన సంస్థ) చాలా పారామీటర్లతో బేరీజు వేసి ఈ మేరకు ప్రకటించిందన్నారు. దేశంలోనే నాణ్యతతో కూడిన జీవన ప్రమాణాలున్న నగరం హైదరాబాద్ అని మెర్సర్ అనే అంతర్జాతీయ సంస్థ ప్రకటించిందన్నారు. గడిచిన మూడేండ్లలో వరుసగా హైదరాబాద్ బెస్ట్ లివింగ్ సిటీగా అగ్రస్థానంలో నిలిచిందని వివరించారు.

జోడెద్దుల మాదిరిగా ముందుకు ఒకవైపు అభివృద్ధి.. రెండోవైపు సంక్షేమం.. రెండింటినీ కలగలిపి జోడెద్దుల మాదిరిగా ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రహ్మాండంగా రాష్ర్టాన్ని ముందుకు తీసుకుపోతున్నారని కేటీఆర్ చెప్పారు. నిరంతర విద్యుత్, మన పంట-మన పెట్టుబడి పేరిట ఎకరానికి ఏటా రూ.8వేలు ఇచ్చే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టబోతున్నారని చెప్పారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతన్నలు గుండెల మీద చేయ్యి వేసుకుని నిద్రపోయే పరిస్థితులను కల్పించామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆలోచనను గుర్తించి వ్యవసాయ రంగంలో అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం గర్వకారణమని అన్నారు. ఆసరా పింఛన్లు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలతోపాటు పేదింటి గర్భిణులకు రూ.12వేల రూపాయలతోపాటు ప్రసవానంతరం 13 రకాల వస్తువులను కేసీఆర్ కిట్ పేరుతో ఇస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ మహా నగరంలో లక్ష మందికి పట్టాలు ఇచ్చామని తెలిపారు.

రాష్ట్రంలో నిరుపేదలున్నంత వరకు ఇండ్ల పథకం గతంలో వాంబే, ఇందిరమ్మ ఇండ్లు 150, 200 చదరపు అడుగులతో కట్టి సంసారం చేయమన్నరు. పేదవారంటేనే గత ప్రభుత్వాలకు చిన్నచూపు. కానీ పేదలు తలెత్తుకుని బతికేలా ఇండ్లు ఉండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం అని కేటీఆర్ అన్నారు. అందుకే రూ.8.70లక్షలు ఖర్చు పెట్టి ఉచితంగా ఇల్లు కట్టించి ఇస్తున్నామని పేర్కొన్నారు. ఒక్కో ఇంటి విలువ రూ.35-40లక్షలకు సమానమని చెప్పారు. ఇది లబ్ధిదారుల పిల్లలకు ప్రభుత్వం ఇచ్చే విలువైన కానుక అన్నారు. ఏ రాష్ట్రంలోలేని విధంగా ఒక్క డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసమే రూ.18వేల కోట్లను ఖర్చు చేస్తున్నట్టు వివరించారు. రాష్ట్రంలో నిరుపేదలు ఉన్నంతవరకు ఈ ఇండ్ల పథకాన్ని కొనసాగిస్తామని, ఇది ఎన్నికల కోసం కాదని, నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం కాబట్టే ఈ నెలాఖరు నాటికి లక్ష డబుల్ బెడ్‌రూం ఇండ్లకు టెండర్లు పూర్తి చేసి, వచ్చే సంవత్సరంలో ప్రారంభోత్సవాలు చేస్తామని తెలిపారు.

కోదండరాం కాంగ్రెస్ తొత్తు: హోంమంత్రి నాయిని టీజేఏసీ చైర్మన్ కోదండరాం కాంగ్రెస్‌కు తొత్తుగా వ్యవహరిస్తున్నారని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌తో కలిసి అభివృద్ధి పథకాలకు అడ్డు తగులుతున్నారని మండిపడ్డారు. ఉద్యమకాలంలో కేసీఆర్ మద్దతుతోనే టీజేఏసీ చైర్మన్ అయ్యారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ విషయాన్ని మరిచి ప్రభుత్వంపైన విమర్శలు చేస్తుంటే ప్రజలే ఆయనను అడుగడుగునా అడ్డుకుంటూ చీదరించుకుంటున్నారని చెప్పారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రులు మహేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, సాట్స్ చైర్మన్ ఆలం వెంకటేశ్వరరెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, మెంబర్ ఎస్టేట్ రాజేశం, సీఏవో శరత్‌చంద్ర, ఇన్‌చార్జి సీఈ మాజీద్ షరీఫ్, ఈఈ హుస్సేన్, డిప్యూటీ ఈఈ అప్పారావు, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.

2019లో కేసీఆర్‌కే మళ్లీ పట్టం ప్రజలు 2019 ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్‌కే పట్టం కడుతారని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వాన్ని రోజూ తిడుతున్న కాంగ్రెస్ నాయకులకు కూడా ఈ విషయం బాగా తెలుసునని అన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలోని రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ సహా అందరికీ ఈ విషయం తెలుసని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే జీర్ణించుకోలేక పోతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఎక్కడ అధికారానికి శాశ్వతంగా దూరమైపోతామోనన్న భయంతో ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చనిపోయినవాళ్ల పేరుతోనూ కేసులు వేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వృత్తిపరంగా న్యాయవాది. ఆయన అసెంబ్లీలో తెలిసో తెలియకనో చనిపోయిన వ్యక్తుల వేలిముద్రలతో కేసులు వేసినమని నిస్సిగ్గుగా ఆన్ ద రికార్డు ఒప్పుకున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు. తాను అన్నది అవాస్తవమైతే కాంగ్రెస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మహా నగర ప్రజలకు రెండు, మూడేండ్లు కరువు వచ్చినా మంచినీళ్ల గోస ఉండవద్దని సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తే కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారని మండిపడ్డారు. తాగునీటి కోసం తిప్పల్లేకుండా 10 టీఎంసీల సామర్థ్యంతో డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్‌ను కేశవపూర్, రాచకొండ ప్రాంతాల్లో కడుతున్నట్లు మంత్రి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు చీకటి అయితని అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నడు.. కానీ ఈ రోజు ఎర్రని ఎండల్లోనూ కోతల్లేకుండా కరెంట్ సరఫరా చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌ది అని అన్నారు. ప్రతిపక్షాలకు పనిలేకుండా మెరుగైన నీటి సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రభుత్వంలో ఖాళీ కుండల ప్రదర్శనలకు అవకాశం లేకుండా చేశామని అన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.