Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మాది చేతల ప్రభుత్వం.. చేనేతల ప్రభుత్వం

-నేత కార్మికులకు బతుకు భరోసా, మార్కెటింగ్ భద్రత లక్ష్యం -చేనేత మిత్ర పథకం ప్రారంభించిన మంత్రి కేటీఆర్ -నూలు, రంగులు, రసాయనాలపై సబ్సిడీ ఇక 40% -గద్వాల్‌లో హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటు చేస్తాం -కాంగ్రెస్‌ను పాతాళంలోకి తొక్కితేనే బంగారు తెలంగాణ -వరంగల్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం త్వరలో నగరానికి -మరో రెండు మూడు ప్రముఖ కంపెనీలు -వరంగల్ పర్యటనలో మంత్రి కే తారక రామారావు -ఒక్కరోజులో 110 కోట్ల విలువైన పథకాలకు శ్రీకారం -తెలంగాణకు ఐకాన్.. యువతకు స్ఫూర్తి -కేటీఆర్‌పై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రశంసల జల్లు

ఉద్యమ నాయకుడిగా ఉన్న నాటినుంచి చేనేత కార్మికుల సమస్యలపై స్పందించిన సీఎం కేసీఆర్.. నేతన్నల బతుకులకు భరోసా కల్పించేందుకు, వారి జీవితాల్లో శాశ్వత వెలుగులు నింపేందుకు అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారని రాష్ట్ర ఐటీ, జౌళి, పురపాలకశాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు. మాటలు చెప్పి చేతులు ముడుచుకున్న పాలకులను చూశారు. నేతన్నల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వాలను చూశారు. మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం.. చేనేతల ప్రభుత్వం అని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి శనివారం వరంగల్‌లో కేటీఆర్ విస్తృతంగా పర్యటించారు.

నూలు, రంగులు, రసాయనాలపై 40% సబ్సిడీ ఇచ్చే ప్రతిష్ఠాత్మక చేనేతమిత్ర పథకాన్ని మంత్రి ప్రారంభించారు. ఒక్క వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోనే రూ.110 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలుచేశారు. హన్మకొండలో బస్‌బే, అమ్మవారిపేటలో మానవ వ్యర్థ్యాల శుద్ధీకరణ కేంద్రం, సమ్మయ్యనగర్‌లో డబుల్‌బెడ్‌రూం ఇండ్లకు శంకుస్థాపన, 47వ డివిజన్‌లో అత్యాధునిక ఉద్యానవనం, స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా ఆటోల ప్రారంభం, అండర్‌గ్రౌండ్ గార్బేజీ డస్ట్‌బిన్‌ల ప్రారంభం తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలు, సమావేశాల్లో కేటీఆర్ మాట్లాడారు. నూలు, రంగులు, రసాయనాలకు 40% సబ్సిడీ పథకం నేతన్నలకు వరమని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం అందిస్తున్న 20% సబ్సిడీని 40శాతానికి పెంచుతూ ఈ పథకానికి సీఎం రూపకల్పన చేశారని చెప్పారు.

కేంద్రం ఇస్తున్న పదిశాతం కూడా కలుపుకొంటే మొత్తం సబ్సిడీ 50%గా ఉంటుందని వివరించారు. దీనితో 40వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని, మూడు నుంచి 4వేల వరకు ఆదాయం పెరుగుతుందని అన్నారు. చేనేతమిత్ర పథకంలో దళారీవ్యవస్థను సహించేది లేదని స్పష్టంచేశారు. నేరుగా చేనేత కార్మికుడి ఖాతాలోకి సబ్సిడీ చేరుతుందని తెలిపారు. 70ఏండ్ల స్వాతంత్ర భారత చరిత్రలో ఎన్నడూలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం చేనేత రంగంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని కేటీఆర్ చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యంతో నేత కార్మికుల ఆకలి చావులు చూసి ఆనాడు కేసీఆర్ చలించి పోయారన్నారు. 2003లో భూదాన్‌పోచంపల్లిలో ఎనిమిదిమంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్ జోలెపట్టి విరాళాలు వసూలుచేసి ఆ కుటుంబాలను ఆదుకున్న విషయాన్ని గుర్తుచేశారు. సిరిసిల్లలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పార్టీపరంగా రూ.50లక్షలు పంపిణీచేసి అండగా నిలిచిన చరిత్ర కేసీఆర్‌దన్నారు. నేతన్నల బతుకుల్లో భరోసా నింపేందుకే దేశంలో ఏ రాష్ట్రంలో కేటాయించని విధంగా బడ్జెట్‌లో రూ.70కోట్ల నుంచి రూ.1283 కోట్లు చేనేత రంగానికి కేటాయించామని చెప్పారు.

మార్కెటింగ్‌కు భద్రత చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లకు వందల కోట్ల విలువైన చేనేత వస్ర్తాలు కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. నేత కార్మికుల లక్ష రూపాయల వ్యక్తిగత రుణాల మాఫీతో మూడువేల మంది చేనేత కార్మికులు, నాలుగు వేల మంది పవర్‌లూమ్ కార్మికులు లబ్ధి పొందారని తెలిపారు. 50ఏండ్ల వయస్సు ఉన్న నేత కార్మికులందరికీ పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. నేతన్నలకు సామాజిక భద్రత కల్పించేందుకు జూన్ 24న నేతన్నకు చేయూత పథకాన్ని పోచంపల్లిలో ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ పథకంలో 8% కార్మికులు చెల్లిస్తే ప్రభుత్వం 16% చెల్లించి వారికి అండగా నిలుస్తున్నదని తెలిపారు. ఇటువంటి పథకం మరే రాష్ట్రంలో లేదన్నారు.

త్వరలో గద్వాల్‌లో హ్యాండ్లూం పార్కు చేనేతరంగాన్ని రాష్ట్రమంతా విస్తరించడంలో భాగంగా గద్వాలలో 47 ఎకరాలలో రూ.17 కోట్లతో హ్యాండ్లూం పార్కు ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. వ్యవసాయం తరువాత ఎక్కువ ఉపాధి అవకాశాలున్న చేనేతరంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. నేతన్నల కష్టాలు తెలిసిన సీఎం.. గత పాలకుల నిర్లక్ష్యంతో వలసలువెళ్లిన కార్మికులు పుట్టిన ఊరికి తిరిగొచ్చి ఆత్మగౌరవంతో బతికేలా చేనేతరంగాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. వరంగల్ మెగా టెక్స్‌టైల్ పార్కు ఇందుకోసమేనన్నారు.

వరంగల్‌కు పూర్వవైభవం తెస్తాం యావత్ తెలంగాణకే ఒకప్పుడు రాజధానిగా ఉన్న వరంగల్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని కేటీఆర్ చెప్పారు. ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ అధ్యక్షతన కాకతీయ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి వరంగల్ దిక్సూచిగా పనిచేసిందని, ఇక్కడి ప్రజలు ఇచ్చిన వేయి ఏనుగుల బలంతో ఉద్యమం సాగిందని కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్‌వంటి ఉద్యమకారుడు, జయశంకర్ సార్ వంటి మహనీయులు పుట్టిన గడ్డకు ఉద్యమరుణం తీర్చుకోవాలన్న తపనతో సీఎం ఉన్నారని చెప్పారు. ఈ క్రమంలోనే దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్‌పార్క్‌కు శంకుస్థాపన చేశారని, నగరాన్ని విద్యాకేంద్రంగా తీర్చిదిద్దుతూనే ఐటీ రంగం అభివృద్ధికి కృషిచేస్తున్నామని అన్నారు. కొద్దిరోజుల్లో మరో రెండు మూడు ప్రతిష్ఠాత్మక కంపెనీలు వరంగల్‌కు రాబోతున్నాయని వెల్లడించారు. ఎమ్మెల్యే వినయభాస్కర్ కోరగానే టాస్క్ సెంటర్ కేటాయించామన్నారు. వరంగల్ పారిశ్రామికంగా, పర్యాటకంగా ప్రగతి సాధించేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ఉద్ఘాటించారు. మామునూర్ విమానాశ్రయాన్ని అసవరమైతే రాష్ట్ర నిధులతో పునరుద్ధరిస్తామని ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

కాంగ్రెస్‌ను పాతాళంలోకి తొక్కితేనే బంగారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని పాతాళంలోకి తొక్కితేనే బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణకు దశాబ్దాలుగా కాంగ్రెస్ దరిద్రం పట్టుకుందని, అది పోవాలంటే ఆ పార్టీని పాతాళంలోకి తొక్కాలని పిలుపునిచ్చారు. 50-60 ఏండ్లుగా రాష్ర్టాన్ని, ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతాన్ని జలగల్లా పీడించిన కాంగ్రెస్ ఇవాళ బంగారు తెలంగాణ దిశగా ముఖ్యమంత్రి అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతుంటే అడుగడుగునా అడ్డుపడుతున్నదని తీవ్రస్థాయిలో ఆగ్రహంవ్యక్తంచేశారు. మా హైకమాండ్ ఢిల్లీలో లేదు. తెలంగాణ గల్లీల్లో ఉన్న ప్రజలే మాకు హైకమాండ్ అని కేటీఆర్ పునరుద్ఘాటించారు. దేశంలోనే నంబర్ వన్ సీఎంగా రికార్డులు సృష్టిస్తూ కేసీఆర్ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, నగరమేయర్ నన్నపునేని నరేందర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, డాక్టర్ టీ రాజయ్య, రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు, హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్ చైర్మన్ గడ్డం వివేక్, మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్‌పర్సన్ గుండు సుధారాణి, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ బొల్లం సంపత్‌కుమార్, ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు, వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మౌలానా, తెలంగాణ రాష్ట్ర టెక్స్‌టైల్ కార్పొరేషన్ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ కలెక్టర్లు అమ్రపాలి కాట, ప్రశాంత్‌జీవన్ పాటిల్, దేవసేన, టీఆర్‌ఎస్ రాష్ట్ర నేతలు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, బండా ప్రకాశ్, మెట్టు శ్రీనివాస్, గుడిమళ్ల రవికుమార్, నాగుర్ల వెంకటేశ్వర్లు, భరత్‌కుమార్‌రెడ్డి, కమ్రున్సీసాబేగం తదితరులు పాల్గొన్నారు.

జనగామలో మెగా ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ జనగామ జిల్లాలో మెగా ఫుడ్‌పార్క్, కాలుష్యరహిత లెదర్‌పార్క్ ఏర్పాటుచేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు కృషి చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా వైద్యశిబిరాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్-వరంగల్‌ను పారిశ్రామిక కారిడార్‌గా గుర్తించిన నేపథ్యంలో పరిశ్రమల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు తరహాలో భువనగిరిలో ప్లాస్టిక్ పరిశ్రమను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. భవిష్యత్తులో కూడా వైద్యరంగంలో ప్రభుత్వం ముందుంటుందని పేర్కొన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎంతో మాట్లాడి ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.100 కోట్లు మంజూరు చేసేదుకు కృషిచేస్తానని ఎమ్మెల్యే రాజయ్యకు హామీ ఇచ్చారు.

తెలంగాణకు ఐకాన్.. కేటీఆర్ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంత్రి కేటీఆర్ ఉద్యమనాయకుడు కేసీఆర్ తనయుడిగానే కాదు ఇవాళ తెలంగాణకు ఐకాన్‌గా ఉన్నారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రశంసించారు. యువతకు స్ఫూర్తి.. భవితకు దిక్సూచీ కేటీఆర్ అని చెప్పారు. తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతూ అభివృద్ధిలో నూతన నిర్వచనాన్ని లిఖిస్తున్నదని శ్రీహరి చెప్పారు. కష్టపడి సాధించుకున్న రాష్ర్టాన్ని ముఖ్యమంత్రి నాయకత్వంలో ఇష్టపడి అభివృద్ధి చేసుకుంటున్నామని అన్నారు. రెండేండ్లలో వరంగల్ మహానగరానికి ముఖ్యమంత్రి రూ.600 కోట్లు ఇచ్చారని అన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.