Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మాది ప్రత్యేక టీమ్

-మేం ఎవరికీ బీ టీమ్ కాదు.. దేశం గుణాత్మక మార్పు కోరుకుంటున్నది
-ఆ దిశగానే మా ప్రయత్నం.. ప్రాంతీయపార్టీలు ఏకంకావాల్సిన అవసరముంది: కేసీఆర్
-ఒడిశాలో రైతు సంక్షేమ పథకాలు ప్రశంసనీయం
-దేశంలోనే రోల్‌మోడల్ సీఎం నవీన్ పట్నాయక్
-చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజ ర్వేషన్లకు టీఆర్‌ఎస్ మద్దతు
-భువనేశ్వర్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
-ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో ఫెడరల్ చర్చలు
-భావసారూప్యంగల పార్టీలు ఒకటికావాలి
-మాది ఫెడరల్ ఫ్రెండ్‌షిప్
-తెలంగాణ పథకాలపై చర్చించాం
-అద్భుత విజయాన్ని సాధించిన కేసీఆర్‌కు అభినందనలు
-మా చర్చలు కొనసాగుతాయి: నవీన్ పట్నాయక్
-విశాఖ శారదాపీఠంలో రాజశ్యామలదేవికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూజలు
-స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు
-నేడు కోణార్క్, పూరీ జగన్నాథ ఆలయాల సందర్శన
-సాయంత్రం బెంగాల్ సీఎం మమతతో భేటీ
-కలకత్తా కాళి దర్శనం.. అనంతరం ఢిల్లీ పయనం

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు అవసరమని.. ఇందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలు నిలుస్తాయని ఆయన అన్నారు. ఇందుకోసం భావసారూప్య పార్టీలతో కలిసి ముందుకు సాగుతామని తెలిపారు. తాము ఎవరికీ బీటీమ్ కాదని.. తమది ప్రత్యేక టీమ్ అని స్పష్టంచేశారు. కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ లక్ష్యంగా దేశవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆదివారం భువనేశ్వర్‌లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నవీన్ పట్నాయక్ తన అధికార నివాసంలో స్వయంగా స్వాగతించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యద్భుత విజయాన్ని సాధించిన కేసీఆర్‌ను పట్నాయక్ అభినందించారు. ఫెడరల్ ఫ్రంట్‌తోపాటు పలు ఇతర అంశాలపై ఇరువురు నేతలు అరగంటకుపైగా చర్చించారు.

ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యాలను, ఉద్దేశాలను పట్నాయక్‌కు సీఎం కేసీఆర్ వివరించారు. చర్చల అనంతరం సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా సమాఖ్యకూటమికోసం ప్రాంతీయ పార్టీల నేతలు ఏకంకావాలని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా తమ చర్చలు సానుకూల ధోరణిలో జరిగాయని.. ఇవి దేశానికి మేలుచేస్తాయన్నారు. ఫెడరల్ ఫ్రంట్‌తోపాటు తెలంగాణలో అమలవుతున్న పథకాలు, ఇతర అంశాలపై చర్చించామని పేర్కొన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకొని అక్కడి శారదాపీఠంలో పూజలు నిర్వహించి, పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులను అందుకొన్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఘనస్వాగతం లభించింది. కేసీఆర్ జిందాబాద్ అన్న నినాదాలతో ఉక్కునగరం ప్రతిధ్వనించింది. భువనేశ్వర్ విమానాశ్రయంలో సీఎం కేసీఆర్‌కు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి తేజావత్ రామచంద్రు నాయక్, ఆంధ్ర సంస్కృతి సమితి శాఖ నాయకులు, కేసీఆర్ అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.

మాది ప్రత్యేక టీమ్
కేసీఆర్ కాంగ్రెస్‌కు బీ టీమ్ అని ప్రధాని మోదీ, బీజేపీకి బీ టీమ్ అని సోనియా రాహుల్ హైదరాబాద్‌కు వచ్చి అంటారని.. తాము ఎవరికీ బీ టీమ్ కాదని.. తమది ప్రత్యేకమైన టీమ్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. ఇందుకోసమే దేశంలో అత్యంత సీనియర్ నాయకుడైన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో భేటీ అయ్యానని వెల్లడించారు. చర్చలు ప్రారంభమయ్యాయని, త్వరలో మళ్లీ కలిసి చర్చిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా మరికొందరు జాతీయస్థాయి నాయకులతో మాట్లాడాల్సి ఉన్నదని తెలిపారు. చర్చలు ఇప్పుడే మొదలయ్యాయని, ఇంకా స్పష్టత రాలేదని, త్వరలోనే ఒక నిర్మాణాత్మక రూపం వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఫెడరల్ ఫ్రంట్‌పై తమకు తొందరేంలేదని స్పష్టంచేశారు. రాబోయేరోజుల్లో ఏం జరుగుతుందో మీరే చూస్తారని విలేఖరులతో అన్నారు. తమ చర్చల వల్ల దేశానికి మేలు జరుగుతుందన్నారు. దేశంలో గొప్ప రాజకీయ నాయకుడిగా నవీన్ పట్నాయక్‌ను కేసీఆర్ అభినందించారు.

ఆయన రోల్ మోడల్ సీఎం అని పేర్కొన్నారు. నవీన్ పట్నాయక్ తండ్రి ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన విషయాన్ని గుర్తుచేసుకున్నామని చెప్పారు. ఒడిశాలో రైతుల గురించి ప్రవేశపెట్టిన పథకాలు చాలా బాగున్నాయని ప్రశంసించారు. దేశానికి ఏదో చేయాల్సిన అవసరం ఉన్నదని నవీన్ పట్నాయక్ చర్చల సందర్భంగా తనతో అన్నారని కేసీఆర్ తెలిపారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం నవీన్ పట్నాయక్ చేస్తున్న కృషిని అభినందించారు. ఈ అంశంపై నవీన్ తనకు లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేసిన సీఎం కేసీఆర్.. చట్టసభల్లో మహిళారిజర్వేషన్లకు టీఆర్‌ఎస్ పార్టీ మద్దతు పూర్తిగా ఉంటుందన్నారు. చర్చలు ఫలవంతమయ్యాయని, తన ప్రతిపాదనలకు ఒడిశా సీఎం సానుకూలంగా స్పందించారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

నేడు మమతతో భేటీ</br> ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఉదయం రోడ్డు మార్గం ద్వారా కోణార్క్ దేవాలయం, అనంతరం పూరీ జగన్నాథ దేవాలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత భువనేశ్వర్ చేరుకుని మధ్యాహ్న భోజనం చేస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కోల్‌కతా వెళ్తారు. సాయంత్రం నాలుగు గంటలకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కేసీఆర్ సమావేశమవుతారు. ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చిస్తారు. అనంతరం కాళీమాత దేవాలయాన్ని సందర్శిస్తారు. రాత్రికి ఢిల్లీకి పయనమవుతారు.

భావసారూప్యమున్న పార్టీలు ఏకం కావాలి
-నవీన్ పట్నాయక్

సీఎం కేసీఆర్‌తో జాతీయ దృక్పథంతో చర్చలు జరిగాయని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అన్నారు. ఫెడరల్ ఫ్రంట్‌తోపాటు చాలా అంశాలు చర్చించామని, వీటిని మరోసారి కొనసాగిస్తామని తెలిపారు. భావసారూప్యమున్న పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. 2019 సార్వత్రిక ఎన్నికల గురించి చర్చించలేదని పేర్కొన్నారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రిని కోరానని, ఇందుకు సీఎం కేసీఆర్ మద్దతు తెలిపారని హర్షం వ్యక్తంచేశారు. ప్రాంతీయ పార్టీలు ఎవరికీ బీ టీమ్‌లు కావని, తమకు స్టేట్స్ టీమ్ (రాష్ట్రాల టీమ్) ఉన్నదని అన్నారు. సీఎం కేసీఆర్‌తో తమది ఫెడరల్ ఫ్రెండ్‌షిప్ అని తెలిపారు. తెలంగాణలో రైతుల కోసం అమలుచేస్తున్న పథకాల గురించి.. ముఖ్యంగా వ్యవసాయ పథకాలపై చర్చించానని పట్నాయక్ చెప్పారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయం సాధించి, రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కేసీఆర్‌ను నవీన్ పట్నాయక్ అభినందించారు. ఒడిశాలోని కోణార్క్ సూర్యదేవాలయం, పూరీ జగన్నాథాలయాలను సందర్శనకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. శాలువాకప్పి జ్ఞాపికతో సత్కరించారు. కేసీఆర్ కూడా నవీన్‌పట్నాయక్‌కు శాలువాకప్పి చార్మినార్ ప్రతిమను బహూకరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, టీఎస్‌ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి తదితరులున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.