Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మాది రైతు ప్రభుత్వం

– వందకు వందశాతం హామీలన్నీ నెరవేరుస్తాం
– గతంలో మాదిరిగానే రుణమాఫీ అమలుపరుస్తాం
– భూరికార్డులను సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తాం..
– నీటిపారుదలకు ప్రథమ ప్రాధాన్యమిస్తాం చెప్పినవేకాదు.. చెప్పనివీ చేస్తాం
– ఇండ్ల పథకంలో అక్రమాలు లేకుండా పకడ్బందీ విధానం
– ఆయుష్మాన్ భారత్ కన్నా ఆరోగ్యశ్రీ పథకమే అద్భుతం
– గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదతీర్మానంపై చర్చలో సీఎం కేసీఆర్ స్పష్టీకరణ
– కేంద్రంలో అనుకూల ప్రభుత్వం లేదు..ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదు
– నీతిఆయోగ్ రూ.24వేల కోట్లు ఇవ్వాలంటే కేంద్రప్రభుత్వం పైసా విదిల్చలేదని విమర్శ

ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వందకు వందశాతం.. గతంలో నెరవేర్చినట్టుగానే ఇప్పుడు కూడా నెరవేరుస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ముమ్మాటికీ రైతుపక్షపాతిగా వ్యవహరిస్తుందని చెప్పారు. గతంలో మాదిరిగానే రుణమాఫీ అమలుపరుస్తామని, రైతుల అభివృదే ్ధ టీఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. భూరికార్డులను వందశాతం ప్రక్షాళిస్తామని, నీటిపారుదలకు ప్రథమ ప్రాధాన్యమిస్తామని చెప్పారు. చీకట్లో ఇష్టానుసారంగా బాణం వేయమని.. అన్నీ ఆలోచించే చేస్తామన్నారు. ఐదేండ్లకాలంలో హామీలన్నీ పూర్తిచేస్తామని చెప్పారు. ఇండ్ల పథకంలో అక్రమాలు లేకుండా పకడ్బందీ విధానాన్ని అనుసరిస్తున్నామని, కేంద్రప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ కన్నా మన ఆరోగ్యశ్రీ పథకమే అద్భుతమని పేర్కొన్నారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆదివారం చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ప్రతిపాదించగా, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి బలపరిచారు. అనంతరం తీర్మానంపై చర్చలో వివిధ పార్టీల సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..
చర్చలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆచరించిన, అనుసరించిన, అవలంబించిన అన్ని విధానాలను ప్రజలు గత నాలుగున్నర సంవత్సరాలు పరిశీలించారని, అనంతరమే తిరిగి అఖండ మెజార్టీ ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించారని పేర్కొన్నారు. ఇంతటి విశ్వాసాన్ని తమ మీద ఉంచినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. గవర్నర్ ప్రసంగం పబ్లిక్ మీటింగ్‌లో కేసీఆర్ ప్రసంగంలాగా ఉందని విపక్షాలు చేసిన విమర్శలపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగాన్ని విమర్శించినవారి రాజకీయ పరిజ్ఞానానికి జాలిపడటం తప్ప చేయగలిగింది ఏమీలేదన్నారు. ఏ పార్టీ ప్రభుత్వాన్ని గెలిపించారో, ఆ పార్టీ మ్యానిఫెస్టో.. అదే పాలసీ గవర్నర్ ప్రసంగంలో ఉంటదని కేసీఆర్ స్పష్టం చేశారు. గవర్నర్ మంచి సమయం ఇచ్చి, మంచి ప్రసంగం చేశారని, ఆయనకు ధన్యవాదాలు తెలుపడం మనందరి ధర్మమని చెప్పారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ఏకగీవ్రంగా ఆమోదించాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రాథమ్యాలను, వివిధ కార్యక్రమాల అమలుతీరును సోదాహరణంగా వివరించారు.

నీతిఆయోగ్ సిఫారసు చేసినా నిధులివ్వని కేంద్రం
కేంద్రంలో అనుకూల ప్రభుత్వం లేదని, తెలంగాణకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. కేంద్రం అండ లేకున్నా అద్భుతప్రగతి సాధిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మనకు అదనంగా ఒక్క రూపాయి కూడా ఇయ్యలేదు. కనీసంగా 500 వినతిపత్రాలు ఇచ్చినం. అయ్యా.. సమైక్య రాష్ట్రంలో కష్టపడింది మేం. ఇబ్బందులు పడ్డది మేం. నష్టపోయింది మేం. వలసలు పోయింది.. ఆత్మహత్యలు చేసుకున్నది మా రైతులు. నీళ్లు మాకు రాలే. మా గొంతులు ఎండినయి, మా పొలాలు బీళ్లు వారినయి అని దండం పెట్టి.. నేనుగానీ, మంత్రులుగానీ 500 వినతిపత్రాలు ఇచ్చినం. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అనే రెండు పథకాలు మంచిగ ఉన్నయని నీతిఆయోగ్ వాళ్లు రెండింటికి కలిపి రూ.24 వేల కోట్లు ఇయ్యండని కేంద్ర ప్రభుత్వానికి రికమండ్ చేస్తే రూ.24 కూడా ఇయ్యలే. ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యమని అడిగినం. కానీ ఇయ్యలేదు. ఏ రంగంలో కూడా ఒక్క రూపాయి కూడా ఇయ్యలేదు.

రాజ్యాంగబద్ధంగా కేంద్ర పన్నుల వాటాల్లో రావాల్సిన డెవల్యూషన్ ఫండ్స్ వాటా తప్ప అదనంగా ఒక్క రూపాయి రాలేదు. గత నాలుగున్నర సంవత్సరాల్లో కేంద్రంలో మనకు అననుకూలమైన ప్రభుత్వం ఉంది తప్ప అనుకూలమైన ప్రభుత్వం లేదు. అయినప్పటికీ ఈ గ్రోత్ సాధించినం అని ముఖ్యమంత్రి చెప్పారు. వచ్చే ఐదేండ్లలో తెలంగాణ సమకూర్చుకునే ఆదాయం.. పెట్టే ఖర్చు రూ.10 లక్షల కోట్లపైనే ఉంటది. ఈ ఐదేండ్లలో రూ.2 లక్షల 40 వేల కోట్ల అప్పు చెల్లించాలి. నాలుగు నుంచి ఐదు లక్షల కోట్లు అభివృద్ధిపనులకు ఉంటాయి. రుణాలపై సమగ్ర అధ్యయనం చేసిన తర్వాత ఎన్ని విడతల్లో మాఫీచేయాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటాం అని తెలిపారు. కొన్ని పనుల ప్రారంభానికి ఎన్నికల కోడ్ అవరోధంగా మారిందన్నారు. లోక్‌సభ ఎన్నికలు పూర్తికాగానే పనులు, సంస్కరణల్లో వేగం పెరుగుతుందని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలవల్లే పోడు భూముల సమస్య పరిష్కారంకాకుండా పోయిందన్నారు. పొరుగు రాష్ర్టాల నుంచి కోయలు వలసరావడం కూడా పోడు భూముల విషయంలో సమస్యగా మారిందని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆ సమస్యను తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పారు. పోడు సమస్యపై త్వరలోనే రాష్ట్రంలోని గిరిజన ప్రజాప్రతినిధులందరితో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.

ఐదేండ్లకాలంలో హామీలన్నీ పూర్తి
వందకు వందశాతం.. మ్యానిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను నెరవేర్చుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఐదేండ్లకాలంలో పూర్తిచేయాల్సిన హామీలపై ఇప్పటినుంచే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయొద్దని సూచించారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీని గతంలో మాదిరిగానే మాఫీచేసి తీరుతామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వకాలంలో రూ.17వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశామని, ఐదేండ్లలో రూ.24 వేల కోట్లు రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. ఈ విషయంపై విధివిధానాల రూపకల్పన జరుగుతున్నదని తెలిపారు. ఆర్థికశాఖ కార్యదర్శి బ్యాంకర్లతో మాట్లాడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రెండులక్షల రుణమాఫీ చేస్తామన్నా ప్రజలు నమ్మలేదన్నారు. కాంగ్రెస్‌పాలిత రాష్ట్రమైన పంజాబ్ ఒకేసారి రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటికీ పూర్తికాలేదని చెప్పారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తున్నట్లు ఫైల్‌పై సంతకం చేసినా అమలుకాలేదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభు త్వం చెప్పింది తప్పక చేస్తుందని గతంలో మాదిరిగానే ఈసారి కూడా రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఎన్ని విడుతలుగా అనేది పరిశీలిస్తున్నామన్నారు. ఐకేపీ ఉద్యోగులను రెగ్యులర్‌చేసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణ బాధ్యత వారికే అప్పగిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఎక్కడన్న కొనవలసి వస్తే వెనక్కి పోకుండా కొంటంతప్ప ప్రజలకు, పారిశ్రామికవేత్తలు, రైతులకు విద్యుత్ రంగంలో ఎలాంటి బాధలు రానీయమని హామీ ఇస్తున్నానన్నారు. రైతులకు మద్దతు ధరను రాబట్టే విషయంలో తాము అవలంబించాలనుకున్న వ్యూహం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అని, దాని అమలుకు త్వరలోనే ప్రయత్నిస్తామని చెప్పారు. గత ప్రభుత్వ కాలంలో మ్యానిఫెస్టోలో లేని 76 పథకాలను అమలుచేశామని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పింఛన్ల పెంపు అమలవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. నిరుద్యోగ భృతికి మాత్రం నాలుగైదు నెలల సమయం పడతదని చెప్పారు. నిరుద్యోగులు అంటే ఎవరనేది డెఫినేషన్ రావాలని, అన్ని పార్టీల శాసనసభ్యులను పిలిచి మాట్లాడుతానని తెలిపారు.

వందశాతం భూరికార్డుల ప్రక్షాళన
రైతుల అభివృద్ధే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం చెప్పారు. వందశాతం భూరికార్డుల ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ధరణి వెబ్‌సైట్‌లో భూముల వివరాలు పొందుపరుస్తామని తెలిపారు. 54 లక్షల మంది రైతులకు పాస్‌పుస్తకాలు అందించామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మరోసారి విశ్వాసం ఉంచిన ప్రజలకు శిర స్సు వంచి నమస్కరిస్తున్నానని.. గత ప్రభుత్వాలు రైతులను నిర్లక్ష్యంగా వదిలేశాయని కేసీఆర్ చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిజంగా రుణమాఫీ చేయకపోతే ప్రజలు మళ్లీ తమకు ఎందుకు ఓటు వేశారని విపక్ష సభ్యులను ప్రశ్నించారు. రైతుబీమా పరిహారం బాధిత కుటుంబాలకు కేవలం పదిరోజుల్లోనే అందుతున్నదని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలకు తిరుగకుండా, పైరవీలు చేయకుండానే బాధిత కుటుంబాల ఖాతాల్లో పరిహారం సొమ్ము జమ అవుతున్నదన్నారు. ఇప్పటికే 6,062 మందికి రైతుబీమా అందిందని, మొత్తం రూ.303 కోట్లు ఆయా రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ అధికారులను కూడా నియమించలేదని సీఎం మండిపడ్డారు. ఇదివరలో సర్వేయర్లు లేరు.. వ్యవసాయ విస్తరణాధికారుల వ్యవస్థను కూడా నిర్వీర్యంచేశారు. మేం చెప్పింది చేసి చూపెట్టాం కాబట్టే ప్రజలు ఈసారి కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో మమ్మల్ని గెలిపించారు. డిమాండ్‌ను బట్టి అవసరమైన ప్రతీచోట ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేస్తాం అని సీఎం తెలిపారు. తెలంగాణలో రైతే రాజు అయ్యే పరిస్థితులు వచ్చాయని ఇప్పటికే పలువురు ప్రశంసించారని పేర్కొన్నారు. ధరణి వెబ్‌సైట్‌తో భూరికార్డుల ప్రక్షాళన పూర్తిచేసి దేశంలో భూరికార్డులకు కూడా రైతుబంధు, రైతుబీమా పథకాల మాదిరిగా మార్గదర్శకంగా నిలువబోతున్నామని తెలిపారు.

మొదటి ప్రాధాన్యం ఇరిగేషన్ రంగానికే
రాష్ట్ర ప్రభుత్వ మొదటి ప్రాధాన్యం ఇరిగేషన్ అని, రానున్న మూడేండ్లలో కోటీ 25 లక్షల ఎకరాలకు నీరందించబోతున్నామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. సాగునీటి ప్రాజెక్టులపై ఇప్పటివరకు రూ.99 వేల కోట్లు ఖర్చుపెట్టామని, వచ్చే మార్చినాటికి మరో ఏడెనిమిది వేల కోట్లు ఖర్చవుతాయని చెప్పారు. ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయడానికి రూ.లక్షా 17వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామన్నారు. మనకు కేటాయించిన నీటివాటాను సంపూర్ణంగా వినియోగించుకునేలా ప్రణాళికలు అమలుచేస్తున్నామని చెప్పారు. కౌలురైతుల సంక్షేమాన్ని చూసే బాధ్యతను భూ యజమానులే తీసుకోవాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తిచేశారు. రెండో ప్రాధాన్యం రహదారులని, కొత్తగా ఏర్పడిన అన్ని గ్రామపంచాయతీలకు బీటీ రోడ్లు వేస్తామని సీఎం తెలిపారు. పాత రోడ్లను అద్దాల్లాగా తీర్చిదిద్దేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మేం ప్రకటించిన అన్ని హామీలు అమలుచేస్తం. నిరుద్యోగభృతిని క్షుణ్ణంగా అధ్యయనంచేసి ఎలాంటి లోటుపాట్లులేకుం డా అమలుచేస్తం. శాంతిభద్రతలు అద్భుతంగా అమలుకావడం మాకు గర్వకారణం. పోలీస్ కమాండ్ కంట్రోల్ అన్ని విభాగాలను సమన్వయం చేసుకునేలా ఏర్పాట్లుచేస్తున్నాం. శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదు అని తెలిపారు.

ఆరోగ్యశ్రీ అద్భుతమైన పథకం
ఆరోగ్యశ్రీ పథకం అద్భుతమైనదని ముఖ్యమంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కంటే ఇదే మేలయినదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, నాకు మధ్య చాలాసార్లు ఇదే వాదన వస్తది. నేను పోయిన ప్రతిసారీ ఒక కాగితం ఇస్తరు. అందులో మొదటి లైన్‌లోనే.. తెలంగాణ డిడ్‌నాట్ జాయిన్ ఇన్ ఆయుష్మాన్ భారత్ స్కీం అని ఉంటది. మేం అందులో జాయిన్ కాలేదు. ఎందుకంటే ప్రజలకు లాభం కంటే కీడు ఎక్కువ ఉంది. మంచి పథకాలను ఎవరుతెస్తే వారికి చరిత్రలో కీర్తి ఉంటది. మంచి పథకాలను ఎవరూ కాదనలేరు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగ ఉన్నపుడు తెచ్చిన పథకం ఆరోగ్యశ్రీ. ఇది చాలా మంచి పథకం. మాకు భేషజాలు లేవు. మంచిని మంచి అని ఒప్పుకోవాలి. ఇది కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఆయుష్మాన్ భారత్ కంటే ఎన్నో రెట్లు మంచి పథకం. అందుకే గత నాలుగున్నరేండ్లుగా దానిని మేం కొనసాగిస్తూనే ఉన్నం. ఇప్పుడు కూడా ముందుకు తీసుకుపోతం. నేను మోదీకి అదే చెప్పిన. చాలా మంచి పథకం. దానిని ఇంకా బెటర్ చేసుకుంటున్నం. దానికి అడిషన్స్ చేసుకుంటున్నం. ఆయన ఉన్నపుడు 108 అని పెట్టినరు, మేం ఇంకోటి.. అమ్మ ఒడి వంటివి కూడా యాడ్ చేసినం. మీ పథకం ఇన్ఫీరియర్ స్కీం, అందుకే జాయిన్ కామని కుండబద్దలు కొట్టినట్లు చెప్పినం అని ఆయన తెలిపారు. అట్లనే కొన్ని భ్రమలు ఉన్నయి. ఇక్కడ బీజేపీవాళ్లు కూడా తమాషాలు మాట్లాడుతరు. మేం ఇన్ని డబ్బులు ఇచ్చినం అని అంటరు. మీరిచ్చేదేంది? మా హక్కు అది. కేంద్ర పన్నుల్లో వాటా. ఇది రాజ్యాంగబద్ధమైన హక్కు. దానిని ఏ కేంద్ర ప్రభుత్వమైనా ఇవ్వాల్సిందే. అందుకే ఆ భ్రమల నుంచి బీజేపీవాళ్లు బయటికి రావాలి. కేసీఆర్ కిట్స్‌లో కేంద్ర ప్రభుత్వ వాటానే లేదు. అచ్చంగ మనదే అని ఆయన స్పష్టం చేశారు.

అక్రమాలకు తావులేకుండా ఇండ్ల పథకం
పేదవారికి అన్ని వసతులతో డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్మించి ఇస్తామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. కొంచెం ఆలస్యమైనా అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మా ఆలోచన ప్రకారం డబుల్ బెడ్‌రూం ఇండ్లు కడుతున్నం. మేం కడుతున్న ఇండ్లకు వందకు వందశాతం పూర్తి సబ్సిడీ ఇస్తున్నం. పటిష్ఠంగా కడుతున్నం. కొంచెం ఆలస్యమైతదని ఎన్నికల సభలల్లనే చెప్పిన. గతంలో ఇండ్ల నిర్మాణంలో భయంకరమైన అవినీతి జరిగింది. అందుకే ఆ కార్పొరేషన్‌నే రద్దుచేసినం. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది అని కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్ లోని కొల్లూరులో 15,600 ఇండ్లు ఒకేచోట నిర్మాణం అవుతున్నయి. నగరపరిధిలోనే దాదాపు 30వేల ఇండ్ల నిర్మాణం జరుగుతున్నది. జిల్లాల్లో కూడా జరుగుతున్నయి. లక్ష ఇండ్ల నిర్మాణం కోసం ప్రణాళికలు కూడా జరుగుతున్నయి. మేం ఒక సాహసం చేయబోతున్నం.. కచ్చితంగా గ్రామపంచాయతీ కార్యదర్శులు, సర్పంచులను బాధ్యులనుచేస్తూ గ్రామాల నుంచి వంద శాతం జాబితాను తెప్పిస్తం. రాష్ట్రంలో కట్టాల్సిన ఇండ్ల సంఖ్య ఎంత అనేది కచ్చితంగా తేలుస్తం. పార్లమెంటు ఎన్నికల తర్వాత నిర్ణీత గడువు పెట్టి వివరాలు సేకరిస్తాం. వారి ఊర్లో ఇండ్లు కావాల్సిన పేదలు ఎంతమంది ఉన్నరో వివరాలు ప్రభుత్వానికి ఇయ్యాలి. ప్రభుత్వం కట్టే కాలనీలే కాకుండా సొంతస్థలాలు ఉన్నవారికి కూడా రూ.5-6 లక్షలతో ఇండ్లు కట్టుకునేందుకు ఇస్తమని హామీకి కట్టుబడి ఉంటాం. ఎంతమందికి ఇస్తామనేది బడ్జెట్ సందర్భంగా ప్రకటన చేస్తాం అని తెలిపారు.

ఇతర రాష్ర్టాలకు మార్గదర్శకంగా కంటి వెలుగు
రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకం కూడా ఇతర రాష్ర్టాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నదని సీఎం కేసీఆర్ చెప్పారు. పేదరికంతోపాటు నిర్లక్ష్యం వల్ల చాలామంది కంటిపరీక్షలు చేయించుకోవడం లేదని, ఎవరూ కోరకుండానే మంచి ఉద్దేశంతో కంటివెలుగు ప్రవేశపెట్టామని తెలిపారు. దీనిపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారంచేయడం తగదన్నారు. కంటివెలుగు పథకం కింద ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి ఆపరేషన్లు ప్రారంభించలేదని చెప్పారు. కంటివెలుగు పథకం కింద ఇప్పటివరకు 1.32 కోట్ల మందికి పరీక్షలు జరిగాయని తెలిపారు. కంటివెలుగు పథకాన్ని సునేత్ర పేరు తో ఇతర రాష్ర్టాలు అమలుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. త్వరలో చెవి, ముక్కు, గొంతు పరీక్షల శిబిరాలు కూడా నిర్వహిస్తామని కేసీఆర్ స్పష్టంచేశారు. అనంతరం రాష్ట్రంలోని ప్రజలందరి రక్తపరీక్షలు నిర్వహించి ఆన్‌లైన్‌లో హెల్త్‌ప్రొఫైల్ పొందుపరచనున్నట్లు తెలిపారు.

కలప స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతాం
అడవుల పరిరక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, స్వచ్ఛమైన గాలి పీల్చలేని పరిస్థితులు రాకుండా నిరోధించడం అత్యవసరమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. కలప స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామన్నారు. డ్రగ్స్ కేసు విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ధూల్‌పేట పునరావాసం విషయం అక్కడి ప్రజలతో ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కూడా మాట్లాడుతానని తెలిపారు. గతంలో గ్రామాలపై తీవ్రనిర్లక్ష్యం కొనసాగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ నిరసన వ్యక్తంచేశారు. అందమైన గ్రామసీమల్ని తయారుచేసుకుందామని, అందుకోసమే చాలా పకడ్బందీ, కఠినమైన పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చామని చెప్పారు. రాష్టమంతటా మంచిరోడ్లు వేసుకుందామని అన్నారు. సంక్షేమంలో గతంలో ఎవరూ పట్టించుకోనివాళ్లను కూడా పట్టించుకుంటున్నం. విద్యావైద్య రంగాల్లో కొన్ని మంచి పద్ధతులు తెచ్చినం. గురుకుల పాఠశాలలు పెంచుకుంటూ పోతాం. కొన్ని ఉపాధ్యాయ సంఘాలకు ఇష్టంలేకున్నా దానికి ప్రాధాన్యం ఇస్తం. ఉన్నత విద్యలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచాలనేది పరిశీలించాలి. ఎలాగూ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నం. ప్రైవేటు విద్యాసంస్థలు సమర్థంగా నిర్వహణ చేయగలిగితే వాటి భాగస్వామ్యాన్ని కూడా తీసుకోవాలి అని తెలిపారు.

ఈసారికి రాష్ట్రంలోనూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్
ఈసారికి మన రాష్ట్రంలోనూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నే ప్రవేశపెట్టబోతున్నట్లు సీఎం చెప్పారు. ఈ మే తర్వాత ఏ ప్రభుత్వం వస్తది? ఆ ప్రభుత్వ విధానం ఏమై ఉం టది? అది కూడా తేలాలి. అందుకే మనకు అవకాశం ఉన్నా.. ఆ విషయాలు తేలకుండా ముందుకు పోలేం అని పేర్కొన్నారు. రెండు, మూడు నెలల్లో పెద్దగా మునిగిపోయేది ఏం లేదు. కేంద్రంలోని ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నే పెడుతుంది. బ్రాడ్ పాలసీ వస్తది. ఈలోపు ఫైనాన్స్ కమిషన్ కూడా వస్తది. ఫిబ్రవరిలో మనకు టైం ఇచ్చినరు. నేను కూడా హాజరుకావాల్సి ఉంటది. చెప్పాల్సి ఉంటది. వీటి ప్రాతిపదికనే మనం ముందుకుపోవాలి. అందుకే చీకట్లోకి బాణం వేసినట్లుగా పోదలచుకోలేదు అని చెప్పారు. ప్రస్తుతం మన రాష్ట్రం ఆర్థిక వృద్ధిలో దేశంలోనే నంబర్‌వన్‌గా ఉన్నది. నాలుగేండ్లు వరుసగా, నిలకడగా 17.17 శాతం వృద్ధి ఉంది. ఇప్పుడు జరిగేది ఐదో సంవత్సరం. ఇప్పు డు 29.93 శాతం మన గ్రోత్ ఉంది. ఇది మంచి వృద్ధి. జీఎస్టీ వసూళ్లలో కూడా దేశంలోనే నంబర్‌వన్‌గ ఉన్నం అని ఆయన తెలిపారు.

చెప్పినవే కాదు.. చెప్పనివీ చేస్తం.. పంథా మార్చుకోండి..
ప్రతిపక్షం పంథా మార్చుకోవాలని, ప్రభుత్వ పనితీరు విషయంలో తొందరపాటుతో వ్యవహరించవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. మీ పంథా మార్చుకోమని సలహా చెప్తున్నా. మేం మార్చుకోలేమంటే అది మీ ఇష్టం. ఇంత తొందరపాటు ఎందుకు? మేం ఇచ్చిన వాగ్దానాలకు ఎంత ఖర్చవుతుంది.. ఎలా చేద్దామన్నది చూసుకొని చేస్తం కదా. ఇదెప్పుడు చేస్తరు? పొద్దుగూకేవరకు చేస్తరా అంటే.. అట్ల మేం చెప్పలేదు కదా. మ్యానిఫెస్టోలో ఏదైతే చెప్పినమో వందకు వందశాతం తూ.చ. తప్పకుండా అమలుచేస్తాం. నిన్న గవర్నర్ ప్రసంగంలో కూడా చెప్పినం.. మ్యానిఫెస్టోలో చెప్పని అంశాలు కూడా ప్రాసెస్‌లో.. ప్రయాణంలో మా దృష్టికి ప్రజల సమస్యలు వస్తే.. చెప్పలేదని ఊరుకోం. వాటిని కూడా వందకు వంద శాతం అమలు చేస్తం అని ఆయన పేర్కొన్నారు.

ప్రశాంత ఎన్నికలు టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఘనతనే..
ఇన్సిడెంట్ ఫ్రీ ఎన్నికలు జరిగాయని సభ్యుడు బలాలా అన్నారని, ఈ ఘనత కచ్చితంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని ముఖ్యమంత్రి అన్నారు. గత నాలుగున్నరేండ్లలో రాష్ట్రంలో ఒక్కసారి కూడా మత కలహాలు చెలరేగలేదని, ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తలేదని చెప్పారు. దేశమే గర్వపడే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పోలీసు కమాండ్ అండ్ కంట్రోల్ రూం హైదరాబాద్ నడిబొడ్డులో తయారవుతున్నదని పేర్కొన్నారు. శాంతిభద్రతల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని స్పష్టంచేశారు.

ఆదర్శాన్ని కొనసాగిద్దాం.. గొప్పగా గవర్నర్ ప్రసంగం
గవర్నర్ ప్రసంగం చాలా గొప్పగా ఉందని ముఖ్యమం త్రి పేర్కొన్నారు. ఏం ఉండాల్నో అది ఉంది. ఏం ఉండకూడదో అది లేదు. గవర్నర్ ప్రసంగంలో వివరాలు లేవని వెంకటరమణారెడ్డి అన్నరు. గవర్నర్ ప్రసంగంలో వివరాలు ఉండవు. గవర్నర్ ప్రసంగంలోగానీ, రాష్ట్రపతి ప్రసంగంలోగానీ బ్రాడ్ పర్‌స్పెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్ చెప్తరు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తదో స్థూలంగా చెప్తరు తప్ప గవర్నర్ ప్రసంగంలో అన్నీ చెప్పరు అని అన్నారు. శనివారం గవర్నర్ ప్రసంగ సమయంలో సభ జరిగిన తీరు చాలా హుందాగా, ఔన్నత్యంగా ఉందని ప్రశంసించారని, ఇదే ఆదర్శాన్ని కొనసాగిద్దామని తెలిపారు. ప్రతిపక్ష కాంగ్రెస్ నేతగా నియమితులైన భట్టి విక్రమార్కను ముఖ్యమంత్రి అభినందించారు. విజయవంతంగా పనిచేయాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సహకారాన్ని, సలహాలను ఇవ్వాలని కోరారు. ఏ సమయంలోనైనా శాసనసభ ఎన్నిరోజులంటే అన్ని రోజులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వివక్ష లేకుండా అన్ని పథకాలనూ అన్ని నియోజకవర్గాల్లో ఒకేతీరుగా అమలుపరుస్తున్నామని ఆయన చెప్పారు.

మీ గవర్నర్ కాదు.. మన గవర్నర్
-టీఆర్‌ఎస్ ప్రభుత్వం అని సంబోధిస్తే అంత అసహనం ఎందుకు?
-గండ్రకు సీఎం కేసీఆర్ ఘాటు సమాధానం

రాష్ట్రంలో గవర్నర్ ఒక్కరే ఉంటారని, ఆయనను ఎవరైనా మన గవర్నర్ అని గౌరవించేలా సంబోధించాలని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా ఆదివారం కాంగ్రెస్ పార్టీకి చెందిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ మీ గవర్నర్ అని సంబోధించారు. దీనికి సీఎం కేసీఆర్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. మీ గవర్నర్ కాదు.. మన గవర్నర్ అనాలని సలహా ఇచ్చారు. మీ గవర్నర్ పదాన్ని రికార్డుల నుంచి తొలిగించి మన గవర్నర్‌గా పేర్కొనాలని సూచించారు. గవర్నర్ కాంగ్రెస్ పార్టీకి ఒకరు, టీఆర్‌ఎస్ పార్టీకి మరొకరు ఉండరని పేర్కొన్నారు. గండ్ర స్పందిస్తూ.. సీఎం మాటలతో తాను ఏకీభవిస్తున్నాననీ, కానీ గవర్నర్ తన ప్రసంగంలో టీఆర్‌ఎస్ పార్టీ కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తుందని అన్నారని చెప్పారు. ఈ వ్యాఖ్యలకు కూడా సీఎం ఘాటుగా సమాధానమిచ్చారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది టీఆర్‌ఎస్ పార్టీయే కాబట్టి, గవర్నర్ అన్నది వందశాతం కరెక్టేనన్నారు. రాజస్థాన్‌లో, మధ్యప్రదేశ్‌లో, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని కాకుండా ఇంకేమంటారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు తమకు ఓట్లేసి గెలిపించారని, కాబట్టి టీఆర్‌ఎస్ పార్టీ అనడంలో తప్పు లేదన్నారు. వాస్తవాన్ని భరించలేక, అంత ఆత్మవంచన, అసహనం ఎందుకని ప్రశ్నించారు. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీని ఏర్పాటుచేస్తామన్న హామీని నెరవేర్చాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జయప్రకాశ్‌రెడ్డి కోరగా.. తగిన చర్యలను తీసుకుంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కల్యాణలక్ష్మి పథకం పేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నదని, కానీ ఆర్థిక సాయం అందడంలో కొన్నిచోట్ల జాప్యం జరుగుతున్నదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. దీనికి సీఎం సమాధానమిస్తూ.. జాప్యం జరిగిన సందర్భం ఒక్కటి కూడా తన దృష్టికి రాలేదని, నిర్దిష్టమైన వివరాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన హామీఇచ్చారు.

శాసనసభ, మండలి నిరవధిక వాయిదా
తెలంగాణ రాష్ట్ర రెండో అసెంబ్లీ మొదటి సమావేశాలు నాలుగు రోజులపాటు జరిగాయి. ఆదివారం మధ్యాహ్నం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నెల 17న ప్రారంభమైన సమావేశాలు ఆదివారం మధ్యాహ్నం ముగిశాయి. నాలుగురోజుల్లో 9 గంటల 28 నిమిషాలపాటు సభ జరిగింది. శాసనమండలి సమావేశాలు ఆదివారం ఒక్కరోజు జరిగాయి. మండలిలో మొత్తం 18 మంది సభ్యులు 4 గంటల 54 నిమిషాలపాటు మాట్లాడారు. శాసనమండలిని కూడా చైర్మన్ స్వామిగౌడ్ నిరవధికంగా వాయిదావేశారు.

మీ పంథా మార్చుకోమని సలహా చెప్తున్నా. మేం మార్చుకోలేమంటే అది మీ ఇష్టం. ఇంత తొందరపాటు ఎందుకు? మేం ఇచ్చిన వాగ్దానాలకు ఎంత ఖర్చవుతుంది.. ఎలా చేద్దామన్నది చూసుకొని చేస్తం కదా. ఇదెప్పుడు చేస్తరు? పొద్దుగూకేవరకు చేస్తరా అంటే.. అట్ల మేం చెప్పలేదు కదా. మ్యానిఫెస్టోలో ఏదైతే చెప్పినమో వందకు వందశాతం తూ.చ. తప్పకుండా అమలుచేస్తాం. నిన్న గవర్నర్ ప్రసంగంలో కూడా చెప్పినం.. మ్యానిఫెస్టోలో చెప్పని అంశాలు కూడా ప్రాసెస్‌లో.. ప్రయాణంలో మా దృష్టికి ప్రజల సమస్యలు వస్తే.. చెప్పలేదని ఊరుకోం. వాటిని కూడా వందకు వంద శాతం అమలు చేస్తం..

టీఆర్‌ఎస్ ప్రభుత్వంఆచరించిన, అనుసరించిన, అవలంబించిన అన్ని విధానాలను ప్రజలు గత నాలుగున్నర సంవత్సరాలు పరిశీలించారు.. అనంతరమే తిరిగి అఖండ మెజార్టీ ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించారు. ఇంతటి విశ్వాసాన్ని మా మీద ఉంచినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. – సీఎం కేసీఆర్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.