Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మాకు ప్రజలే బాసులు

-ఢిల్లీ, అమరావతి గులాంలు మనకొద్దు
-బీడీ కార్మికులకు 2014 కటాఫ్ తీసేస్తం
-ముథోల్ సభలో సీఎం కేసీఆర్

ప్రజలే తమకు బాసులు, అధిష్ఠానాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. చంద్రబాబు పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చే టైంలో ఢిల్లీ ఏపీభవన్‌లో నిరాహార దీక్ష చేశారని గుర్తుచేశారు. నేను మీ అందరికీ మనవి చేస్తున్నది ఒక్కటే.. మనకు ఎవరి పెత్తనం వద్దు. ఢిల్లీ గులాంలు అవసరంలేదు. తెలంగాణలో నిర్ణయాలు తెలంగాణలోనే జరుగాలి. టీఆర్‌ఎస్‌కు ఎవరైనా బాసులు, అధిష్టానం ఉన్నారంటే అది తెలంగాణ ప్రజలే అని చెప్పారు. అదే తప్పిపోయి కాంగ్రెస్ గెలిస్తే.. నేను గ్యారెంటీ చెప్తున్న.. కాంగ్రెస్‌వాళ్లకు తెలివిలేదు. వాళ్లకు పరిపాలన చెయ్యరాదు. మళ్లా కరెంటు కిందిమీదికి అయితది. పాతగోస తప్పదు. మళ్లా కందిళ్లు.. ఎక్కలు పెట్టుకోవాలి. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. గురువారం ముథోల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం ముఖ్యాంశాలు.. ఆయన మాటల్లోనే..

వచ్చేది శబ్ద విప్లవమే
ఇంత పెద్దసంఖ్యలో మీరు వచ్చారంటే.. విఠల్‌రెడ్డి విజయం ఖాయమైనట్టే. కాంగ్రెస్‌వాళ్లు నిశ్శబ్ద విప్లవం అంటున్నరు.. ఈ సభకు తరలివచ్చిన ప్రజలను చూస్తుంటే వచ్చేది.. నిశ్శబ్ద విప్లవంకాదు.. శబ్దవిప్లమే అనిపిస్తున్నది. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన గడ్డెన్నగారి కొడుకే విఠల్‌రెడ్డి. తండ్రికితగ్గ తనయుడుగా విఠల్‌రెడ్డి పనిచేస్తున్నారు. పార్టీలోకి చేరడానికి వచ్చినప్పుడు కూడా నాకు లక్ష్యం ఒక్కటే సార్.. అధికారపార్టీలో చేరితే నా బలం పెరుగుతది. నా నియోజకవర్గానికి మేలు జరుగుతది అన్నరు. గోదావరిపై పంచగుడి బ్రిడ్జిని కొట్లాడి సాధించారు. అట్లా పనిచేస్తారు. విఠల్‌రెడ్డి ఎక్కడో హైదరాబాద్‌లో ఉండరు.. రోజూ మీ మధ్యే ఉంటారు.

బీడీ కార్మికులకు కటాఫ్ తీసేస్తం
బీడీ కార్మికుల గురించి గతంలో పాలించినవాళ్లు ఎవరూ పట్టించుకోలేదు. బీడీకార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని, మా అంతట మేమే ఆలోచనచేసి వాళ్లకు కూడా అందరితోపాటు వెయ్యిరూపాయలు పింఛన్ ఇస్తున్నం. 2014 వరకే పీఎఫ్ కటాఫ్ ఉన్నది సార్.. అది తీసేసి 2018 వరకు పెట్టాలి అని ఇందాక విఠల్‌రెడ్డి కోరారు. గ్యారెంటీగా గవర్నమెంట్ వచ్చిన తెల్లారే ఆ నిర్ణయం తీసుకుంటం.

అందరూ సంతోషంగా ఉంటేనే బంగారు తెలంగాణ
పటిష్ఠంగా ముందుకు వెళుతున్నాం. ఇంకా ముందుకుపోతాం. అన్ని కులాలవాళ్లు, అన్ని మతాలవాళ్లు బాగుపడాలి. అందరు సంతోషంగా ఉంటేనే అది బంగారు తెలంగాణ. రాబోయే రోజుల్లో రైతుల గిట్టుబాటు ధరలకోసం కూడా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాం. యాదాద్రి, వేములవాడ దేవాలయాల మాదిరిగా బాసర అమ్మవారి దేవాలయ అభివృద్ధికి కావాల్సినన్ని నిధులు ఇచ్చి, వచ్చే ఏడాది నేనే ఇక్కడికి వచ్చి దేవాలయ అభివృద్ధికి కృషిచేస్త. దేవుడి దయవల్ల భవిష్యత్తులో ప్రతి కులం, ప్రతి మతం, ప్రతివర్గం, ప్రతి ఒక్క వ్యక్తి మొఖంలో చిరునవ్వులు చూసేలా, చిరునవ్వుల తెలంగాణ చూడాలనుకుంటున్నాం. అల్లా దయతో మనం ఉద్యమంలో విజయం సాధించాం.

కాళేశ్వరంతో ఎస్సారెస్పీకి పునర్జీవం
గడ్డెన్నవాగు నీళ్లు భగీరథకు ఇస్తున్నరు కాబట్టి.. మీకు కొన్ని నీళ్లు తగ్గినయి అన్నరు. శ్రీరాంసాగర్ పునర్జీవ పథకం పెట్టాం. కాళేశ్వరం నీళ్లతోని 365 రోజులు ఎస్సారెస్పీ నిండే ఉంటది. కాబట్టి మీకు ఎప్పుడు కావాలన్నా నీళ్లు తీసుకోవచ్చు. భగీరథతోటి గడ్డెన్నవాగులో తగ్గిన నీళ్లకు రెండురెట్ల నీళ్లు ఇప్పించే బాధ్యత నాది. పిప్రి ఎత్తిపోతల పథకానికి కావాల్సిన నిధులు కచ్చితంగా మంజూరుచేస్తం. కొత్తకుండలో ఈగజొచ్చినట్టు.. కొత్త రాష్ట్రం కాబట్టి ప్లానింగ్‌లోనే ఎక్కువ టైం పోయింది. ఈసారి ఎన్నికల తర్వాత పాత ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో మూడు, నాలుగు రోజులు మకాం వేసి, నేనే స్వయంగా కూర్చుని స్థానిక అవసరాలకు అనుగుణంగా కావాల్సిన ఆర్డర్లు ఇస్త. రైతుబాగుంటేనే, దేశం బాగుంటది. 70% ప్రజలం వ్యవసాయంమీదనే ఆధారపడి బతుకుతున్నాం. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నంతవరకు, కేసీఆర్ ఉన్నంతవరకు రైతులకు 24 గంటలు ఫ్రీ కరంటు ఇస్తం. వ్యవసాయానికి సాగునీళ్లు, ఎరువులు సకాలంలో ఇస్తం.

ముస్లిం సోదరులకు విజ్ఞప్తి
ఏ ప్రభుత్వంలో ఏం జరిగింది.. ఏం జరగలేదో.. ముస్లిం సోదరులకు బాగా తెలుసు. అసదుద్దీన్ ఒవైసీని నిర్మల్ రాకుండా ఇక్కడి రాజకీయనాయకులు ఎలాంటి పనులకు పూనుకున్నారో మీ అందరికీ తెలుసు. అలాంటి తప్పుడువాళ్లకు తగిన బుద్ధిచెప్పాలి. మజ్లిస్‌పార్టీ, మేం కలిసి పనిచేస్తున్నాం. మైనార్టీ పాఠశాలల్లో మన ముస్లిం చిన్నారులు చదువుతున్నారు. రానున్న పదేండ్లలో మన ముస్లిం కుటుంబాల్లో విప్లవం రాబోతున్నది. అమెరికా, ఇంగ్లడ్‌తో పోటీపడే శక్తి మన మైనార్టీ పిల్లల్లో వస్తుంది. ఆ రోజు దగ్గరలోనే ఉంది. టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వండి. మంచి విజయాన్ని అందిస్తే మరింత మంచిగా బాగుచేసుకుందాం. విఠల్‌రెడ్డిని దీవించండి. ఆశీర్వదించండి. గడ్డెన్నగారి పేరు నిలబెట్టేలా అన్ని అభివృద్ధిపనుల్లో విఠల్‌రెడ్డికి అండగా ఉంటా. బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం.

మూడు సెగ్మెంట్లు సస్యశ్యామలం
ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతోనిర్మల్ జిల్లాలోని మూడు సెగ్మెంట్లు సస్యశ్యామలం అవుతాయి. ఆర్మూర్, ఆదిలాబాద్ రైల్వేలైన్ ఆమోదం పొందింది. త్వరలో పనులు ప్రారంభమవుతాయి. ఎస్సారెస్పీ, స్వర్ణ, సదర్మాట్ కాలువల ఆధునీకరణ చేపట్టాం. ఈసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపుతాం. -నిర్మల్ బహిరంగసభలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

అడుగకుండానే అన్నీ ఇచ్చారు
అడగందే అమ్మాయినా పెట్టదు, కానీ కేసీఆర్ అడగకుండానే అన్నీ ఇచ్చారు. నాలుగున్నర ఏండ్లుగా ఇక్కడ ప్రజల కోసం రూ. 516 కోట్లతో సదర్మాట్ నిర్మించారు. రూ. 50 కోట్లతో 27,28 డిస్ట్రిబ్యూటరీ కాలువలను మరమ్మతులు చేశారు. సీఎం కేసీఆర్ తాను ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలనూ అమలుచేశారు. -ఖానాపూర్ సభలో టీఆర్‌ఎస్ అభ్యర్థి అజ్మీరా రేఖానాయక్

తెలంగాణ రక్షకుడు కేసీఆర్
తెలంగాణ రక్షకుడు కేసీఆర్. ముథోల్ నియోజకవర్గాన్ని కేసీఆర్ అండదండలతో అభివృద్ధి చేశాను. ముథోల్ మండలంలోని దవాఖానను వంద పడకల వైద్యశాలగా అప్‌గ్రేడ్ చేయాలని కోరుతున్నా. భైంసా దవాఖానకు నిధులు కేటాయించి మరింత అభివృద్ధి చేయాలని, బాసర ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా.
– భైంసా సభలో ముథోల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి విఠల్‌రెడ్డి

2500 కోట్లతో అభివృద్ధి నాలుగేండ్లలో ఆర్మూర్ నియోజకవర్గంలో రూ. 2,500 కోట్ల నిధులతో అభివృద్ధి జరిగింది. ఆర్మూర్‌కు వంద పడకల దవాఖాన, రెవెన్యూ డివిజన్‌గా అప్‌గ్రేడ్, నిజామాబాద్-ఆర్మూర్ రహదారి నాలుగు వరుసలకు విస్తరణ వంటి ఎన్నో పనులు సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగాయి. టీడీపీ, కాంగ్రెస్ 60 ఏండ్లలో చేయని అభివృద్ధి ఈ నాలుగున్నరేండ్లలో చేసి చూపాం.
-ఆర్మూర్ సభలో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి

నియోజకవర్గ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం వెనుకబడిన బోథ్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కుప్టి ప్రాజెక్టు నిర్మాణంతో పాటు పిప్పల్‌కోటి, గోముత్రి ప్రాజెక్టుల కోసం రూ. వందల కోట్లు మంజూరు చేశారు. రహదారుల అభివృద్ధికి నిధులు వచ్చాయన్నారు. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి నాలుగేండ్ల కేసీఆర్ పాలనలో జరిగింది.
-ఇచ్చోడ సభలో బోథ్ టీఆర్‌ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపురావ్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.