Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మాపై విశ్వాసముంచండి

-కుల, మత, ప్రాంతాలకతీతంగా నగరాభివృద్ధి
-పేదల జీవితాల్లో గౌరవాన్ని నింపిన వ్యక్తి కేసీఆర్
-ప్రగతి నిరోధకులు కాంగ్రెస్ నాయకులు
-కాంగ్రెసు కావాలో, ప్రోగ్రెస్ కావాలో తేల్చుకోండి
-గ్రేటర్ రోడ్‌షోలో మంత్రి కేటీఆర్
-సనత్‌నగర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో రోడ్‌షో

కుల, మత, ప్రాంతాలకతీతంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధిచేశామని మంత్రి కే తారకరామారావు చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్నికల సమయంలో కుల, మతాలను తెరమీదకు తెస్తున్నాయని విమర్శించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా 15 మంది సీమాంధ్రులను గెలిపించుకున్నామని, ఎమ్మెల్యేలు కూడా ఇతర ప్రాంతాలవారు ఉన్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌వైపు ఉందామా? ప్రోగ్రెస్‌వైపు ఉందామా? తేల్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ, రాహూల్‌గాంధీ కాదుకదా దేవుడితోనైనా తెలంగాణ ప్రయోజనాలకోసం కొట్లాడే నాయకుడు కేసీఆర్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.

ప్రగతినిరోధకులు కాంగ్రెస్ నాయకులని విమర్శించారు. శనివారం మంత్రి కేటీఆర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శ్రీరాంనగర్‌చౌరస్తా, యూసుఫ్‌గూడచౌరస్తా, సనత్‌నగర్ నియోజకవర్గంలోని సనత్‌నగర్‌బస్టాండ్, అమీర్‌పేట్ సత్యంథియేటర్, పాటిగడ్డ, మహంకాళిటెంపుల్, బాటా దగ్గరలోని సిటీలైట్‌హోటల్, జబ్బార్‌కాంప్లెక్స్ బన్సీలాల్‌పేట, ఐడీహెచ్‌కాలనీ డబుల్‌బెడ్‌రూం హౌసెస్ ప్రాంతాలమీదుగా రోడ్‌షో నిర్వహించి, పలుచోట్ల ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అధికారమే లక్ష్యంగా నాలుగుపార్టీలు కూటమిపేరుతో సీఎం కేసీఆర్‌ను గద్దెదించాలని కుట్రచేస్తున్నాయని, అది జరుగదని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలు ఆలోచించి ఓటేయాలి.. ఆగం కావద్దు.. టీఆర్‌ఎస్‌పై విశ్వాసముంచండి, నమ్మకముంచండని మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు. పేదోళ్ల ప్రభుత్వమా, పెద్దోళ్లా ప్రభుత్వమా? అర్థం చేసుకుని కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని విజ్ఞప్తిచేశారు.

గరీబోళ్ల సంక్షేమమే లక్ష్యం
గరీబోళ్ళ సంక్షేమమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదవారికి సంబంధించిన కార్యక్రమాలు పటిష్ఠగా అమలుచేస్తున్నదని మంత్రి కేటీఆర్ వివరించారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో మనిషికి నాలుగు కిలోల చొప్పున 20 కిలోల పరిమితితో రేషన్‌బియ్యం ఇచ్చేవారని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతమంది కుటుంబసభ్యులుంటే అంతమందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నదని వివరించారు.

పింఛన్లు పెంచిన ఘనత కూడా టీఆర్‌ఎస్‌దేనన్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే పింఛన్లను రూ.2016కు పెంచుతామని భరోసా ఇచ్చారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలతోపాటు రంజాన్, క్రిస్‌మస్ సందర్భంగా దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ ఒక విధానాన్ని అమలుచేస్తున్నారని గుర్తుచేశారు. పేదలందరికీ సరిపడా డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. ప్రస్తుతం నిర్మిస్తున్న 1.75 లక్షల ఇండ్లను ఏప్రిల్ కల్లా పేదలకు అందిస్తామన్నారు. పేదోళ్ల జీవితాల్లో గౌరవాన్ని నింపిన వ్యక్తి కేసీఆర్ అని కేటీఆర్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ అంటే బాగా డబ్బున్నోళ్ల ప్రాంతం అని అందరూ అనునుకుంటారు కానీ ఇక్కడ కూడా బస్తీలు, పేదలు, మురికివాడలు ఉన్నాయని చెప్పారు. బోరబండ, రహ్మత్‌నగర్, ఎర్రగడ్డ, ఎల్లారెడ్డిగూడ, కార్మికనగర్, యూసుఫ్‌గూడ ప్రాంతాల్లో పేదలెక్కువగా ఉన్నారని జూబ్లీహిల్స్ ప్రాంతానికి డబ్బున్నవాళ్లనే బ్రాండ్ పడ్డదని పేర్కొన్నారు.

అన్నా అంటే ఉన్నా అనే శీనన్న
సనత్‌నగర్ నియోజకవర్గంలో అన్నా అంటే నేనున్నా అని పలికే వ్యక్తి తలసాని శ్రీనివాసని కేటీఆర్ ప్రశంసించారు. ప్రజలకోసం కష్టపడే తలసానిని ఎదుర్కోలేక ఇతర పార్టీలు పారిపోయాయని ఎద్దేవాచేశారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి బలిపశువు కాబోతున్నాడని టీఆర్‌ఎస్‌కు పోటీ ఇవ్వలేడని చెప్పారు. మర్రిశశిధర్‌రెడ్డి ఎన్నికలు ఆపడానికి విశ్వప్రయత్నాలు చేసి.. చివరకు పోటీలోలేకుండా పోయాడని విమర్శించారు. సనత్‌నగర్‌లో రూ.800 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని.. భవిష్యత్తులో అండర్‌గ్రౌండ్ పనులు చేపడుతామని చెప్పారు. కాంగ్రెస్, సీపీఐ, కోదండరాం, టీడీపీ కలుస్తాయని ఎప్పుడైనా అనుకున్నారా? కలికాలం కాకపోతే మరేంటని, బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లు చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయన్నారు. ప్రధాని మోదీ మీటర్‌డౌన్ అవుతున్నదని.. బీజేపీ ఐదుసీట్లలో ఎక్కడా గెలువదని చెప్పారు. రోడ్‌షోలో జూబ్లీహిల్స్, సనత్‌నగర్ అభ్యర్థులు మాగంటి గోపీనాథ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబాఫసియుద్దీన్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.