Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మార్పుకోసం ముందడుగు

-నగదురహిత లావాదేవీల వైపు పయనిద్దాం -ఉద్యమంగా ప్రజలందరికీ బ్యాంకింగ్ ఖాతాలు.. పల్లెలకు అందుబాటులో ఏటీఎంలు రావాలి -నల్లధనం అన్నిరూపాలూ నాశనం కావాలి.. ఎన్నికల ఖర్చును ప్రభుత్వమే భరించాలి -రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అనంతరం విలేకరులతో సీఎం కేసీఆర్ -భారత దేశాన్ని భ్రష్టాచార్ ముఫ్త్ భారత్‌గా చేయాలి – క్రాంతి రావాలి.. కానీ.. అది సంపూర్ణ క్రాంతి కావాలి – ప్రధానితో అనేక విషయాలు చర్చించి.. సూచనలు చేశాను – కేంద్రం తీసుకున్న నిర్ణయం మంచో చెడో ప్రజలు నిర్ణయిస్తారు – నల్లధనాన్ని పెంచి పోషించిందే కాంగ్రెస్.. మాపై విమర్శలా? – పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు మొబైల్ పేమెంట్స్, ఈ-అకౌంట్లను ప్రోత్సహించాలి – ప్రజలు ఆందోళన పడొద్దు.. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది – భవిష్యత్తులో జీఎస్టీ, బీటీటీ మాత్రమే ఉంటాయి – స్కీంలో ముందుకు పోతూపోతూ.. నగదు విత్‌డ్రాపై ఆంక్షలు పెట్టాలి – నల్లడబ్బు విధ్వంసం కాకుంటే విఫల ప్రయోగం

cm-kcr-press-meet-after-holding-a-cabinet-meeting

క్యాబినెట్ నిర్ణయాలు – క్యాష్‌లెస్ నియోజకవర్గంగా సిద్దిపేటలో ప్రయోగం – అక్కడ రూ.500పైబడిన లావాదేవీలన్నీ నగదురహితంగానే..దాని అనుభవాలతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాం – త్వరలో ఐటీ శాఖ నుంచి టీఎస్ వ్యాలెట్ – రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నగదు రహిత లావాదేవీలు – నాలుగైదు రోజుల్లో కలెక్టర్ల సమావేశం.. జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు – భవన నిర్మాణ కార్మికులను ఆదుకునేందుకు వేగంగా డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం – జీహెచ్‌ఎంసీలో రూ.5 భోజనం కేంద్రాలను 50 నుంచి 150కి పెంచుతున్నాం

సంపూర్ణ క్రాంతి కావాలి.. నల్లధనం ఎన్ని రూపాల్లో ఉంటే అన్ని రూపాల్లో దానిని నిర్మూలించాల్సి ఉంటది. కేంద్ర ప్రభుత్వం కేవలం నోట్లు రద్దు చేసి చక్కిలిగింతలు పెడితే అయ్యేది కాదు. నల్లధనం ఏ రూపంలో నైనా ఉంటది. వజ్రాలు, బంగారం, బంగళా, పైసలు, సైట్స్, విదేశీ కరెన్సీ రూపంలో ఉంటది. మారిషస్, మనీలా, సింగపూర్ వంటి దేశాల్లో మనీలాండరింగ్ విధానంలో కూడా ఉండే అవకాశముంది. షేర్ మార్కెట్‌లో కూడా ఉంటది. ఇట్ల అన్ని రూపాల్ల్లో ఉన్న నల్లధనాన్ని నిర్మూలించాలిగానీ.. కొన్నింటిని చేసి, కొన్నింటిని వదిలేస్తే పూర్తయ్యేది కాదు. అందుకే ప్రధానమంత్రితో నేను ఇదే చెప్పిన. క్రాంతి రావాలిగానీ అది సంపూర్ణ క్రాంతి కావాలని చెప్పిన. ప్రధానమంత్రి కూడా సంపూర్ణ్ క్రాంతి కే తరఫ్ కదమ్ ఉఠాయే అన్నరు. అన్ని రూపాల్లోని నల్లధనాన్ని బయటికి తెచ్చి.. దేశంలోని నలుపును తీసేసి, అవినీతిరహిత దేశంగా చేయాలి. – ముఖ్యమంత్రి కేసీఆర్

బంగారం, వజ్రాలు, షేర్లు, బంగళాలు, భూములు, విదేశీ కరెన్సీ సహా నల్లధనం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తేల్చి చెప్పారు. కొన్నింటిని నిర్మూలించి, కొన్నింటిని వదిలివేస్తే పూర్తయ్యేది కాదని అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మార్పు దిశగా ముందడుగు వేసిందని ప్రశంసించారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం రాష్ట్రంపై ఎలా ఉంది? ప్రజల సమస్యలను అధిగమించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే అంశాలపై సోమవారం రాష్ట్ర క్యాబినెట్ సమావేశం చర్చింది. సమావేశ వివరాలను అనంతరం సీఎం కేసీఆర్ మీడియాకు వివరించారు. నగదు రహిత లావాదేవీల రాష్ట్రంగా తెలంగాణను తయారు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్టు సీఎం తెలిపారు. అన్ని వర్గాల వారు ఉపయోగించుకునేందుకు వీలుగా టీఎస్‌వ్యాలెట్‌ను రూపొందిస్తున్నామని చెప్పారు.

నోట్ల రద్దులో రాష్ర్టాల పాత్రేమీలేదు.. కేంద్రం తీసుకున్న నిర్ణయం, దాని పరిణామాలు.. మనమేం చేయాలి? మనమెట్ల ముందుకుపోవాలనే దానిపై క్యాబినెట్‌లో చర్చించినం. వాస్తవంగా దీనిని అమలు చేసే దాంట్లో మా పాత్ర లేదు. ఎందుకంటే నోట్లు రాష్ర్టాలు ప్రింట్ చేయవు, సరఫరా చేయవు. ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం. కేంద్రం తీసుకునే నిర్ణయం దేశమంతా అమలవుతుంది. నోట్ల రద్దుపై కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్నది. ఒక్క రాష్ట్రం, ఒక్క గ్రామం అని కాదు.. దేశవ్యాప్తంగా అమలు జరుగుతున్నది. 18 రోజులు గడిచిపోయినయి. కొన్ని సమస్యలు వచ్చినయి. అయితే అమలులో ఉన్న సమస్యలు, వాటిని ఎలా అధిగమించాలనే దానిపై ప్రధానికి ఒక నోట్ ఇచ్చిన. నోట్ల రద్దు, ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో ఏయే సమస్యలు ఉత్పన్నమైనయి? ఎట్ల చేస్తే బాగుంటదనే దానిపై నా పరంగా సూచనలు ఇచ్చిన. ప్రధాని హైదరాబాద్ వచ్చినపుడు, పోయేటపుడు కూడా మాట్లాడినపుడు సూచనలు ఇచ్చిన. ఆయన వెళ్లిన తర్వాత కూడా కొన్ని సూచనలను ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫ్యాక్స్ చేసిన.

చేపలు కొనుక్కునేందుకు చెక్కులిచ్చినమా? జన్‌ధన్ ఖాతాల పేరుతో దేశవ్యాప్తంగా 25 కోట్ల అకౌంట్లు తెరిచినట్లు మనకు తెలుసు. దీంట్లో 82 లక్షల ఖాతాలు తెలంగాణలోనే తెరిచారు. సాధారణంగా మనది ఇన్‌ఫార్మల్ మార్కెట్. ఎందుకంటే ఒక కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటరు. వాళ్లు భోజనం తర్వాత అరటి పండ్లు తినే అలవాటు ఉంటది. పిల్లలు ఒక్కొక్కటి తిన్నా.. ఆరు అరటి పండ్లు కొనుక్కునే సామాన్య కుటుంబం అది. మరి చెక్కు ఇచ్చి అరటిపండ్లు కొనే అలవాటు మన దేశంల లేదు. చేపలు, కూరగాయలకు చెక్కు ఇచ్చి కొనే విధానం దేశంలో లేదు. మనది ఎక్కువగా క్యాష్ ఎకానమి. దానిని స్విచాఫ్ చేసినపుడు ఇబ్బందులు వస్తయి. అదే ప్రధానికి చెప్పిన. మన దేశ ఆర్థిక వ్యవస్థ సామర్థ్యం 140లక్షల కోట్లు. ఆర్థిక శాస్త్రవేత్తల అంచనా ప్రకారం దీనిలో నగదు భాగం 12 శాతం. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పుడు ఆ 12 శాతం క్లోజ్ అవుతుంది. మిగతాది 88 శాతం. కాబట్టి కొంతకాలం పాటు ఇబ్బందులు వస్తయి. అయితే ఆ సమయంలో రాష్ర్టాల్ని ఎట్ల ఆదుకోవాలి? ఏం చేయాలి? అనే విషయంలో తప్పకుండా కేంద్రం ముందుకు రావాలి.

వేగంగా డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం నోట్ల రద్దు ప్రభావం రియల్ ఎస్టేట్‌పై ఎక్కువ ఉన్నది. హైదరాబాద్‌లో బిల్డింగ్ ఇండస్ట్రీ చాలా పెద్దది. దీనిపై ఆధారపడి లక్షల సంఖ్యలో పొట్టపోసుకుంటున్నరు. నోట్ల రద్దుతో ఈ ఇండస్ట్రీ కొంత స్తంభించే ఆస్కారం ఉంది. కాబట్టి జీహెచ్ ఎంసీ, పాత రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కొంత భాగంలో ఉండేటువంటి కార్మికులకు పని కల్పించాల్సిన అవసరమున్నది. అందుకే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను కూడా క్యాబినెట్ సమావేశానికి పిలిచినం. పని కల్పించేందుకు రూ.5వేల కోట్లతో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాన్ని వేగంగా చేయమని చెప్పినం.

నగదురహిత లావాదేవీలతోనే రాష్ర్టాల పురోగమనం.. నగదురహిత లావాదేవీలతో రాష్ర్టాల పురోగమనం సాధ్యమవుతుంది. తొలుత కొన్ని ఇబ్బందులు ఎదురైనా అంతిమంగా లాభమే. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరన్నా కొంటేనే దుకాణదారుడికి వ్యాపారం నడుస్తది. గుమస్తా, సేల్స్‌మెన్ బతుకుతరు. రైతులు పండించిన పంట మార్కెట్‌కు తేవాలి, కొనుగోళ్లు కచ్చితంగ జరుగాలి. ప్రజలు తమ అవసరాలు తీర్చుకోవాలి. స్కీంలో ముందుకు పోతూ.. నగదు విత్‌డ్రాపై ఆంక్షలు పెట్టాలి. చివరిలో వ్యక్తి ఎంత నగదు కలిగి ఉండాలో నిర్ణయించాలి. బ్యాంకు లావాదేవీలు చెక్కులు, మొబైల్ యాప్‌లు, మిషన్లు, కార్డులద్వారా జరుగాలి. ఇదంతా సాధ్యమేనా అన్న అనుమానాలు వస్తాయి. మొబైల్ ఫోన్లు వచ్చినపుడు మనం నమ్మలె. కానీ ఇప్పుడు పశువులకాపరి కూడా ఫోన్ వాడుతున్నరు. మార్పు ఆటోమెటిక్‌గా వస్తది. రాష్ట్రం జీవితం కొనసాగించాలంటే ఒక్కటే ఆప్షన్. ఏ రాష్ట్ర ప్రజలు ముందుకొచ్చి బ్యాంకుల ద్వారా లావాదేవీలు చేసుకుంటే వాళ్లే లాభపడుతరు. మిగిలిన వారు నష్టపోతరు. రాష్ర్టానికి ఆదాయం రావాలంటే మారకం జరుగాల్సిందే. బ్యాంకుల ద్వారా లావాదేవీలను ప్రభుత్వం ప్రోత్సహించాలి. అకౌంట్లు ఎన్ని ఉన్నయో పరిశీలించాలి. లేని వారికి అకౌంట్లు తెరిపించాలి. ఇది తక్షణం చేయాలని క్యాబినెట్‌లో నిర్ణయించినం. నోట్ల రద్దులో కేవలం కేంద్రం పాత్రనే ఉన్నదని.. రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించడం సరైంది కాదు. వంద శాతం బ్యాంకుల ద్వారా లావాదేవీలు జరిగేలా ఏ రాష్ట్రమైతే చేసుకుంటదో ఆ రాష్ట్రం కచ్చితంగా పురోగమించి, ముందుకుపోయే ఆస్కారం ఉంటది.

అంతా మంచే జరుగుతుంది రెండు వేల రూపాయల నోటు ప్రజలకు ఉపయోగపడ్తలేదు. పైస ఉందికాని పనికి వస్తలేదు. దీని వల్ల ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఇదే విషయాన్ని ప్రధానమంత్రికి స్వయంగా చెప్పా. చిల్లర నోట్లను పంపించాలని చెప్పా. అంతా మంచే జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. నాకు కూడా మంచి జరుగుతుందనే అనిపిస్తున్నది. ఇంత జరిగిన తర్వాత ఇక నల్లదొంగలు బతికి ఉండవద్దు. హైదరాబాద్ వేదికగా నేను మరోసారి ప్రధానికి ఇదే విజ్ఞప్తి చేస్తున్నా. ఈ దేశాన్ని బ్లాక్ మనీ ఫ్రీ కంట్రీగా చేయాలి. భ్రష్టాచార్ ముఫ్త భారత్‌గా చేయాలి. ఎవరూ ఎవర్నీ లంచం అడుగొద్దు. స్వచ్ఛమైనటువంటి భారతదేశాన్ని తయారు చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకుంటే వందశాతం తెలంగాణ రాష్ట్రంగా మేం మీకు మద్దతు ఇస్తాం. ఢిల్లీలో నేను ప్రధానమంత్రిని కల్సినపుడు కూడా ఇదే విషయాన్ని ఆయనకు చెప్పాను. ఇప్పుడూ చెబుతున్నా.

క్రాంతి రావాలి.. కానీ.. అది సంపూర్ణ క్రాంతి కావాలి దేశంలో నల్లధనాన్ని సమూలంగా నిర్మూలించి, అభ్యుదయ, నగదురహిత దేశంగా, ద్రవ్యమారకం మొత్తం బ్యాంకుల ద్వారానే, పారదర్శకంగా జరిగే విధంగా కొత్త విధానం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ దరిమిలా నేను ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలిసి సుమారు గంటకు పైగా మాట్లాడాను. గతంలో నేను రవాణాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఒక సెంటర్ నడిపేవాళ్లం. ఇద్దరు జర్నలిస్టు మిత్రులు (ఆంధ్రభూమి చారి, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రామకృష్ణ) కలిసి సెంటర్ ఫర్ సబ్‌ఆల్ట్రన్ స్టడీస్‌ద్వారా అనేక అంశాలపై చర్చించేవాళ్లం. అణగారిన జాతులు, వారి బాధలు, వాటిని తగ్గించడానికి ఉన్న మార్గాలేమిటి? అని అధ్యయనం చేసే సెంటర్ అది. అవినీతి, లంచగొండితనం, వంటి జాడ్యాలు పోవాలంటే ఏం చేయాలి? లంచం తీసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపై స్టడీ చేసినం. ఇలా చేయడం వల్ల ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ స్కీంపై నాకు కొంత అవగాహన ఉంది. నేను ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రితో నా ఆలోచన కూడా పంచుకున్నాను. ఫైనల్‌గా ఈ కార్యక్రమం ఒక్కచోట ఆగేది కాదు.

కేంద్ర ప్రభుత్వం కేవలం నోట్ల రద్దు చేసి చక్కిలిగింతలు పెడితే అయ్యేది కాదు. నల్లధనం ఏ రూపంలోనైనా ఉంటది. వజ్రాలు, బంగారం, బంగళా, పైసలు, సైట్స్, విదేశీ కరెన్సీ రూపంలో ఉంటది. మారిషస్, మనీలా, సింగపూర్ వంటి దేశాల్లో మనీలాండరింగ్ విధానంలో కూడా ఉండే అవకాశమున్నది. ఇట్ల అన్ని మార్గాల్లో ఉన్న నల్లధనాన్ని నిర్మూలించాలిగానీ కొన్నింటిని చేసి, కొన్నింటిని వదిలేస్తే పూర్తయ్యేది కాదు. అందుకే ప్రధానమంత్రితో నేను ఇదే చెప్పిన. క్రాంతి రావాలిగానీ అది సంపూర్ణ క్రాంతి కావాలని చెప్పిన. ప్రధానమంత్రి కూడా సంపూర్ణ్ క్రాంతికే తరఫ్ కదమ్ ఉఠాయే అన్నరు. అన్ని రూపాల్లోని నల్లధనాన్ని బయటికి తెచ్చి.. దేశంలోని నలుపును తీసేసి, అవినీతిరహిత దేశంగా చేయాలి.

నోట్ల రద్దుతో బిత్తరపోవాల్సిందేమీ లేదు నోట్ల రద్దుతో ప్రజలు బిత్తరపోయి, డంగయి పోవాల్సిన అవసరం లేదు. భయపడే అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మీ వెంట ఉంటది. ఇందుకోసం టాస్క్‌ఫోర్స్ కమిటీ వేసినం. దీనికి సీనియర్ ఐఏఎస్ అధికారి సురేశ్ చందా చైర్మన్‌గా, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, సీఎంవో అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతికుమారి, రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్‌రావు, సూర్యాపేట కలెక్టర్ సురేంద్ర మోహన్ సభ్యులుగా ఉన్నరు. వీళ్లు ఈ రోజు ఉదయం సమావేశమై, క్యాబినెట్‌కు కొన్ని సూచనలు చేస్తూ ఒక నోట్ ఇచ్చినరు. ప్రభుత్వ శాఖల్లో నగదు రహిత లావాదేవీలు జరుగాలని సూచించినరు. రిజిస్ట్రేషన్ల శాఖ, గ్యాస్ డీలర్లు (పాయింట్ ఆఫ్ సేల్), చౌక దుకాణ డీలర్లు, వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో రైతులకు చెల్లింపులు చేసే దగ్గర నగదురహితంగా లావాదేవీలు జరిగేలా స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేయాలి. ఇలాంటివి చేస్తూ.. బ్యాంకు అకౌంట్లు ఉండేవాళ్లు కేవలం బ్యాంకుల ద్వారా లావాదేవీలు జరిగేలా చూడాలి. అకౌంట్లులేనివాళ్లకు అకౌంట్లు తెరిపించి, బ్యాంకు ద్వారా లావాదేవీలు చేసేలా చూడాలి. ఇప్పుడున్న బ్యాంకు వ్యవస్థ సరిపోదు. చాలా విస్తరించాలి. కో-ఆపరేటివ్, ప్రైవేటు, కమర్షియల్ బ్యాంకులన్నీ కలిపి తెలంగాణలో ప్రస్తుతం 5200 బ్యాంకు బ్రాంచీలున్నయి. ఇట్ల కాకుండా మూడు, నాలుగు గ్రామాల మధ్య ఒక మంచి బ్యాంకు ఉండేటట్లు, 1000-1500 జనాభా ఉన్న దగ్గర ఒక ఏటీఎం ఉండేటట్లు సౌకర్యాలు కల్పించాలి. నా ప్రతిపాదనకు ప్రధాని కూడా అంగీకరించినరు.

నల్లడబ్బు విధ్వంసం కాకుంటే విఫల ప్రయోగం అవినీతిరహిత, నల్లధనరహితంగా దేశం మార్పుచెంది గొప్ప సమాజంగా అవతరిస్తే అంతకన్నా ఆనందం ఏం కావాలి? నల్ల డబ్బు, నల్ల జబ్బు విధ్వంసం కావాలని కోరుకుంటున్నా. అలాంటపుడే ఇది సఫల ప్రయోగం. లేకపోతే విఫల ప్రయోగమవుతుంది. మనం దీన్ని విఫల ప్రయోగం కానీయవద్దు. తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం, తెలంగాణ సమాజం కేంద్ర ప్రభుత్వానికి సపోర్టుగా ఉంటయి.

టీఎస్ వ్యాలెట్‌ను ప్రైవేటు వాళ్లు కూడా వాడొచ్చు.. టీఎస్ వ్యాలెట్‌ను ఎవ్వరైన ఉపయోగించుకోవచ్చు. మన ఎంప్లాయీస్ కొంత నగదు కూడా అడుగుతున్నరు. బ్యాంకర్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇబ్బందేమీలేదు.

నల్ల డబ్బు సృష్టికర్తనే కాంగ్రెస్.. మాపై విమర్శలా? నేను ఢిల్లీకి పోయినప్పుడు విమర్శలు చేసిన సన్నాసులు గోతిలో పడతరు. ప్రధానిని కలిసింది అవినీతిరహిత, లంచాలు లేని భారతదేశం కోసమే. ఇందులో చీకటి ఒప్పందం ఏముంది? కొన్ని వ్యాఖ్యలు బాధ కలిగిస్తాయి. బీజేపీ నాయకుడు కిషన్‌రెడ్డి కూడా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నడు. ఇన్నాళ్లు నల్ల డబ్బుతోనే ప్రభుత్వం నడిచిందా? అన్నడు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఎట్ల నడిచిందో దేశంలోని అన్ని రాష్ర్టాల్లో పరిపాలన అట్లనే నడిచింది. ఇంకో ఆయన చాడా వెంకటరెడ్డి అంటడు.. ఆంధ్రకు ఎక్కువ తెలంగాణకు తక్కువ డబ్బులు రిజర్వుబ్యాంకు పంపుతున్నదని! ఆయన ఏడ చూశాడు? గాలి మాటలు ఎందుకు? కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడుతరు. నా దగ్గర నల్లడబ్బు ఉందంట.. దాన్ని తెల్లగా మార్చేందుకే ప్రధాని వద్దకు పోయిన్నట. నల్లడబ్బును పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ. నల్లడబ్బు సృష్టికర్తనే కాంగ్రెస్. వీళ్లుకూడా మాట్లాడుతారా? మాట్లాడితే అర్థం ఉండాలి కదా!

నోట్ల రద్దు ఆహ్వానించదగ్గ పరిణామం.. నోట్ల రద్దు ఆహ్వానించదగ్గ పరిణామం. రూ.2000 నోటు కూడా స్విచ్‌ఆఫ్ కావచ్చు. నల్ల కుబేరులను పట్టుకోవాలంటే వ్యూహాలుంటాయి. అందరికీ అర్థం కాకపోవచ్చు. పీఎంతో మాట్లాడినవి నేను కూడా మీకు కొన్ని చెప్పలేకపోవచ్చు. ఎంతవరకు చెప్పాలో అంతే చెప్తాం. కొందరు గుడ్డిగా వ్యతిరేకించే వారు ఉంటారు. మొదటిసారి దేశంలో పెద్ద చర్చ జరుగుతున్నది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మంచో చెడో ప్రజలు నిర్ణయిస్తారు. ఇది తప్పు అయితే ప్రజలు నిర్ణయం ప్రకటిస్తారు. ఇంత పెద్ద దేశంలో నియంతలను అంతమొందించినవారు ప్రజలు. ఎమర్జెన్సీ తరువాత ఎన్నికల్లో ఇందిరాగాంధీని ఓడించలేదా? ప్రజలు శిక్షిస్తారు. ఒక వేళ తప్పు చేస్తే నేను శిక్షకు సిద్ధంగా ఉన్నా అని ప్రధాని మోదీ అన్నరు. దేశంలో మొత్తం వ్యవస్థను మెకనైజ్ చేస్తానన్నప్పుడు స్వాగతిస్తాం.

రైతులకు ఇబ్బందేమీలేదు..: నగదుపై పరిమితులు విధించడం వల్ల రైతులకు పెద్ద ఇబ్బందేమీ ఉండదు. వారి ఖర్చులకు వారానికి రూ.24 వేలు ఇస్తున్నారు. రైతులకు ఇంతకన్నా పెద్ద ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. నగదు రహిత కార్యకలాపాలకు అలవాటు చేయడం రాత్రికిరాత్రి అయ్యే పనేమీకాదు. క్రమంగా కొన్ని మాసాల వ్యవధిలో జరుగుతుంది. కొత్తగా ఏటీఎంలు వచ్చినపుడు కూడా ఎట్ల పనిచేస్తదో అనుకున్నం. కానీ మంచిగా అందరూ వాడుతున్నరు. కొత్తగా వచ్చినప్పుడు ఏదైనా కొంత వింత అనిపిస్తది. తర్వాత ఆటోమెటిక్‌గా సెట్ అవుతుంది.

ట్యాక్స్ కట్టేవారు ఒక శాతంలోపే.. మనదేశంలో ఆదాయం పన్ను కట్టేవారు ఒక శాతం కంటే తక్కువ. అదికూడా ఉద్యోగులు విధిగా చెల్లించాలి కాబట్టి ఆ లెక్క వస్తుంది. రేపు స్కీం అమలై.. కొంతకాలం గడిచేసరికి అన్ని పన్నులను ధ్వంసం చేస్తుంది. పారదర్శకంగా లావాదేవీలు జరిగినప్పుడు అన్ని పన్నులు వేయాల్సిన అవసరం ఉండదు. ఆదాయం పన్ను రద్దు చేస్తారు. నేను కూడా సలహా ఇచ్చాను. జీఎస్టీ, బ్యాంక్ లావాదేవీల పన్ను (బీటీటీ) మాత్రమే ఉంటుంది. ఈ ట్యాక్స్ అతి స్వల్పంగా ఉంటుంది. ఒక్కొక్క లావాదేవీపై 0.25%, 0.15% పెట్టినా ఇప్పుడొస్తున్నదానికంటే ఎన్నో రెట్లు అధికంగా కేంద్రానికి ఆదాయం వస్తుంది. 98% మంది ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. పేదోనికి పేద లెక్కనే, ధనికుడికి ధనికుడి లెక్కనే ట్యాక్స్ పడుతుంది. దాదాపు 5-6రెట్లు ఆదాయం పెరుగుతుంది.

ప్రధానిని ధైర్యంగా అడిగాను.. కేంద్రం నుంచి గతంలో మనకు 30% ట్యాక్స్ రూపంలో వచ్చేది. మోదీ ప్రధాని అయిన తరువాత 42శాతానికి పెంచారు. దీనివల్ల రాష్ట్రానికి రూ.13వేల కోట్లు ఆదాయం రావాలి. మనకు రమారమి నెలకు రూ.995 కోట్లు వస్తున్నది. ప్రతినెలా 1న నేరుగా అకౌంట్లో పడుతుంది. అది మన హక్కు. ఇప్పుడొస్తున్నదానికి 5-6రెట్లు పెరిగితే మనకు మన స్థాయిలోనే ఆదాయం వస్తుంది. మనమెందుకు వ్యతిరేకిస్తాం? గుడ్డిగా వ్యతిరేకించడం, గుడ్డిగా సమర్థించడం సరైంది కాదు. నాలాగా ప్రధానిని ధైర్యంగా అడిగేవారు ఇప్పటి వరకు ఎవరూ లేరు. చెక్కులిచ్చి చేపలు కొనేవారిని చూపిస్తవా సార్? అన్నా. బంగారం, వెండి రూపంలోనిది కూడా బయటకు రావాలి. ఆంధ్ర, తెలంగాణలో మాకో అలవాటు ఉంది. తల్లి చనిపోతే ఆమె నగలు బిడ్డలకు వస్తయి. బిడ్డకు బంగారం వస్తే లెక్క చెప్పుమంటే ఏడ చెప్పాలి? చిన్నప్పుడు దసరా పండుగకు ఒక బంగారు లేదా వెండి నాణెం ఇస్తారు. అంతా కలిసి జమైతే 10-12 తులాలతో ఆభరణం చేయించుకుంటారు.

చిన్నపిల్లలకు వెండి పళ్లేల్లో తినిపిస్తరు. పూజగదుల్లో దేవతా మూర్తులు ఉంటారు. ఆరో పిడి, ఏడో పిడి నుంచి వస్తుంటుంది. ఎన్ని ఎక్కువ పిడిలు పూజిస్తే అంత గొప్ప అని అంటారు. ఇవన్నీ పీఎంకు చెప్పాను. కుటుంబాలను వేధించడం సరైంది కాదు. ఒక కటికాయన ఉంటారు. గొర్రెలు అమ్మి వచ్చిన డబ్బును తీసుకుపోయి మళ్లీ గొర్రెలే కొంటడు. అది అతని రొటీన్ జిందగీ. కొందరు డబ్బును ఇంట్లో కుండల్లో దాచుకుంటారు. రైతులకు ఇన్‌కం ట్యాక్స్ లేదు. వేరే దేశాల్లో ఇన్‌కం ట్యాక్స్ లేకపోయినా బ్యాంక్‌లో డబ్బు జమచేయాలి. దాని మీద ట్యాక్స్ పడుతుంది.

క్యాష్‌లెస్‌గా పార్టీ ఫండింగ్.. రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చును కేంద్రమే భరించాలి. ఫండింగ్ కూడా క్యాష్‌లెస్‌గా ఉంటుంది. పీఎంకు సలహా ఇచ్చాను. పొలిటికల్ సిస్టంనుకూడా క్లీన్ చేసే మెకానిజం ఉండాలని చెప్పిన. ఎలక్షన్ మనీ కూడా అకౌంట్ల ద్వారా జరుగాలి. దాన్ని మేం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేసి చూపాం. నేను ఒకే సమావేశంలో పాలొన్న. టీవీలు వచ్చాయి. ఈ-క్యాంపెయినింగ్ వచ్చింది. దీని ద్వారా అంతా క్లీన్‌గా ఉంటది. క్లీనింగ్ మెకానిజంలో పొలిటికల్ వ్యవస్థ కూడా ఉండాలి. ఇది పెద్ద సంస్కరణగా ఉంటది. వర్షాకాల సమావేశాలు పెట్టాలి. డిసెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు ఉంటయి. ప్రజలకు మేమేం చేశామో చెప్పుకోవాల్సి ఉంటది.

రాష్ట్ర ఆదాయంపై ప్రభావం.. మనకు వచ్చే ఆదాయంలో కమర్షియల్ ట్యాక్స్ పెద్దది. అక్టోబర్ ట్యాక్స్ ఈ నెలలో వస్తుంది. ఈ నెల ఆదాయ ప్రభావం డిసెంబర్‌లో తెలుస్తుంది. రిజిస్ట్రేషన్ శాఖలో ఎక్కువ తక్కువ జరిగాయి. ఎందువల్ల అంటే 90% లావాదేవీలు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలిన 10% పూర్తవుతున్నాయి. రాష్ర్టాల ఆదాయాలు పడిపోతున్నాయి. రాష్ట్రంలో రూ.75వేల కోట్ల నగదు చెలామణీలో ఉంది. అందులో కేంద్రం చెప్పిన లెక్క ప్రకారం రూ.500, రూ.1000 నోట్లు 86%. అంటే 86% లావాదేవీలు లేనట్లే. ఆమేరకు ఆదాయం కూడా పోయినట్లేగా! డిపాజిట్ల రూపంలో రూ.38 వేల కోట్లు బ్యాంకుల్లో పడ్డాయి. రూ.2000 విలువైన నోట్లు ఇంకా బయటే ఉన్నాయి. దీని వల్ల కొంత ఇబ్బంది ఉంటది. ఆదాయం పడిపోతుంది. ప్రశ్నే లేదు. ఇవాళ ఆదాయం పన్ను చట్ట సవరణ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్న ఇబ్బందులు, రైతుల సమస్యలు తెలియజేస్తాం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.