– తెలంగాణలో టీఆర్‌ఎస్‌దే – మొదటి ప్రభుత్వం: కేటీఆర్
కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వానికి సంబంధించి మద్దతు అంశంపై తమకు ఎలాంటి పరిమితులు లేవని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ నిర్దిష్టంగా యూపీఏకుగానీ, ఎన్డీయేకుగానీ మద్దతివ్వాలనే నిర్ణయం తీసుకోలేదని, పరిస్థితులను బట్టి ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చని చెప్పారు. టీఆర్‌ఎస్‌కు అత్యధిక సంఖ్యలో లోక్‌సభ స్థానాలు వస్తాయని, తెలంగాణలో టీఆర్‌ఎస్‌దే మొదటి ప్రభుత్వమని విశ్వాసం వ్యక్తం చేశారు. శనివారం కేటీఆర్ టీ మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో ఏర్పాటయ్యే కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తామన్న నమ్మకం తమకుందని అన్నారు. తెలంగాణ రాష్ర్టానికి వీలైనంత ఎక్కువగా మేలు చేయడమే టీఆర్‌ఎస్ లక్ష్యం కనుక కేంద్రం నుంచి తెలంగాణకు ఎక్కువ వనరులు, నిధులు వచ్చేలా ఒత్తిడి చేయడమే తమ ఏకైక ఎజెండా అని చెప్పారు. కాంగ్రెస్-సీపీఐ, టీడీపీ-బీజేపీ పొత్తులతో బరిలో నిలిచాయని, టీఆర్‌ఎస్ మాత్రమే సొంతంగా పోరుచేసినందన్నారు. సీమాంధ్రలో టీడీపీతో బీజేపీ పొత్తుపెట్టుకోవడం అంటే ఆత్మహత్య చేసుకోవడమేనని కేటీఆర్ అన్నారు.