-కేజీ టూ పీజీ ఉచిత విద్యకు వెనుకాడం -త్వరలోనే కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు: మంత్రి ఈటెల

మా ప్రభుత్వానిది మానవీయ కోణం. పేదలకు పట్టెడన్నం పెట్టి వారిలో దైర్యాన్ని కల్పించడంతోపాటు గ్రామస్థాయిలో ప్రజలకు ఏం అవసరమో అవే మా ప్రణాళికలుగా ఉంటాయి అని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. టీఆర్‌ఎస్వీ రూపొందించిన హ్యాండ్‌బుక్‌ను టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన సోమవారం ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆంగ్ల మాధ్యమంలో అందరికీ కేజీ టూ పీజీ ఉచిత విద్య అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందుకు ఎంత ఖర్చైనా వెనుకడుగు వేసేదిలేదని స్పష్టంచేశారు. ఇందుకోసం తీవ్ర కసరత్తు చేస్తున్నామని చెప్పారు. ప్రజల అవసరాలకు తగ్గట్లుగా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు త్వరలోనే వెలువడుతాయని తెలిపారు. శాఖలవారీ సమీక్షలతో ముఖ్యమంత్రి ప్రణాళికాబద్ధమైన కృషి చూస్తే ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పథకాల అమలుకు కట్టుబడి ఉందో అర్థమవుతుందన్నారు. బడ్జెట్ కూర్పుపై కసరత్తు జరుగుతున్నదని తెలిపారు. అన్ని శాఖలనుంచి ప్రతిపాదనలు తెప్పించుకున్న తర్వాత సచివాలయంలో సమావేశం నిర్వహించి బడ్జెట్‌కు తుదిరూపం ఇస్తామని చెప్పారు. బుధవారం క్యాబినెట్ భేటీలో అన్ని అంశాలపై సమగ్రంగా చర్చిస్తామన్నారు.
పోలవరం ఆర్డినెన్స్‌కు టీడీపీ మద్దతు పలకడంపై ఆయన స్పందిస్తూ తెలంగాణ టీడీపీ నేతలు సిగ్గుపడాల్సిన విషయమన్నారు. ఈ ప్రాజెక్టు పేరుతో తెలంగాణ గిరిజనులను ముంచే చర్యలకు పాల్పడిన చంద్రబాబు సిగ్గుతో తలొంచుకోవాలని అభిప్రాయపడ్డారు. దెబ్బలకు, కేసులకు భయపడకుండా తెలంగాణ విముక్తి కోసం ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారని ఈటెల చెప్పారు. కార్యక్రమంలో ఓయూ టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, పెరికె శ్యాం, కోతి విజయ్, హరిబాబు, భగత్, చందు పాల్గొన్నారు.