Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మాది సంక్షేమ ప్రభుత్వం

-మాకు సంక్షేమమే ధ్యేయం.. మాపైనే విమర్శలా? -బీసీల కోసం 50 వేల కోట్లు ఖర్చు చేస్తాం -మైనార్టీలకు 15 పాయింట్ ఫార్ములా పాటిస్తాం -కులవృత్తుల వారి రుణం తీర్చుకుంటాం -సంక్షేమ పద్దుపై చర్చ సందర్భంగా ఆర్థికమంత్రి ఈటల సమాధానం -సంక్షేమ పద్దుకు శాసనసభ ఆమోదం -ప్రభుత్వ జవాబు సంతృప్తికరంగా లేదంటూ టీడీపీ, బీజేపీ వాకౌట్ -టీడీపీ, బీజేపీ తీరుపై మంత్రులు హరీశ్, ఈటెల ఆగ్రహం

Etela Rajendar 01

రాష్ట్రంలోని సంక్షేమశాఖల పద్దుకు శాసనసభ మంగళవారం ఆమోదం తెలిపింది. గృహనిర్మాణం, సాంఘిక, గిరిజన, బీసీ, మైనారిటీ, మహిళాశిశు సంరక్షణశాఖలకు కేటాయించిన బడ్జెట్‌పై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. అన్నిపార్టీలు తమ అభిప్రాయాలను తెలియజేశాయి. ఆ తర్వాత ప్రభుత్వం తరఫున ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ సమాధానమిచ్చారు. సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని.. బంగారు తెలంగాణ కోసం ప్రయాణం కొనసాగుతున్నదని ఈ సందర్భంగా మంత్రి స్పష్టంచేశారు. అయితే ప్రభుత్వ సమాధానం సంతృప్తికరంగా లేదంటూ టీడీపీ, బీజేపీ సభ నుంచి వాకౌట్ చేశాయి. కాంగ్రెస్ కూడా వాకౌట్ చేయాలని మొదట భావించినా.. ప్రభుత్వ సమాధానంతో సంతృప్తిచెంది ఆ ఆలోచనను విరమించుకున్నది. టీడీపీ, బీజేపీ తీరుపై మంత్రులు హరీశ్‌రావు, ఈటల తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం ఒక్కో అంశంపై సుదీర్ఘంగా చర్చిస్తున్నా.. తమను అభినందిచాల్సిందిపోయి విమర్శించడం సరికాదన్నారు.

ఆ తర్వాత సంక్షేమశాఖల పద్దుపై సుదీర్ఘ చర్చ జరిగిందని, ఈ పద్దును సభ ఆమోదిస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రకటించారు. అనంతరం పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పద్దుపై చర్చ మొదలైంది. అయితే చర్చను తర్వాత కొనసాగిద్దామంటూ డిప్యూటీ స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేశారు.

ఈటల భావోద్వేగ సమాధానం: ఎవరైనా ఒక మాట గట్టిగా అంటే మనసుకు గుచ్చుకుంటుంది. కానీ మా ముఖ్యమంత్రి కేసీఆర్ మెదడుకు గుచ్చుకుంటుంది. మేం ఏమైనా తప్పులు చేస్తే తప్పుపట్టండి. కానీ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న మాపై విమర్శలు ఎందుకు? మాకు ప్రజల ఆశీర్వాదాలున్నాయి అని ఆర్థికమంత్రి ఈటల ఒకింత భావోద్వేగంతో ప్రసంగించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమశాఖలతోపాటు గృహనిర్మాణశాఖ పద్దుపై ఆయన సుదీర్ఘ వివరణ ఇచ్చారు.

విదేశాల్లో చదువుకోవాలనుకునే ఎస్సీ విద్యార్థుల కోసం ప్రస్తుతం రూ.10 లక్షలు ఇస్తున్నామని, దాన్ని పెంచే అంశంపై సీఎం సమీక్ష చేస్తున్నారని తెలిపారు. డిక్కీ ద్వారా దళిత పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దళితులకు బియ్యం, పెన్షన్, భూపంపిణీ చేయడంతోపాటు ఎస్సీ హాస్టళ్లను సమర్థంగా నిర్వహిస్తామని తెలిపారు. ఎస్సీ యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థలు ఏర్పాటుచేస్తామని వెల్లడించారు.

వ్యవసాయ విప్లవంలో భాగంగా గ్రీన్‌హౌజ్ కల్టివేషన్, డ్రిప్ ఇరిగేషన్‌లో 100 శాతం సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. దళితులకు భూపంపిణీతోపాటు బోరు, కరెంటు కనెక్షన్, ఏడాది పెట్టుబడి ఇస్తున్నామని చెప్పారు. తండాలను మేమే పాలించుకుంటామంటే ఎవరూ పట్టించుకోలేదని, తమ ప్రభుత్వం రాగానే తండాలను గ్రామపంచాయతీలుగా చేసేందుకు జీవో ఇచ్చామని గుర్తుచేశారు.

ఈ సంవత్సరం గిరిజనుల కోసం రూ.4590 కోట్లు కేటాయించామని చెప్పారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని.. గిరిజన యువత కోసం స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్లున్నాయని, వాటిని బలోపేతం చేస్తామని తెలిపారు. స్టడీసెంటర్లను బాగా తీర్చిదిద్దుతామని.. సొంత భవనాలు నిర్మిస్తామని ఆర్థికమంత్రి తెలిపారు.

బీసీల కోసం 50 వేల కోట్లు: బీసీ జనాభా 51 శాతమని.. వీరికి ప్రతి ఏడాది రూ.10 వేల కోట్ల ఖర్చుచేయాలని తమ మ్యానిఫెస్టోలో రాసుకున్నామని ఈటల తెలిపారు. ఐదేండ్లలో వీరి అభివృద్ధికి రూ.50 వేల కోట్లు ఖర్చుపెడతామని వెల్లడించారు. పవర్‌లూమ్ కార్మికులకు కూడా రుణమాఫీ చేసేందుకు ఆలోచిస్తున్నామని వెల్లడించారు. ఉద్యమంలో అన్ని కులవృత్తుల పాత్ర ఉందని, వారి రుణం తీర్చుకుంటామని చెప్పారు.

మహిళాసంక్షేమంపై సీఎం ఒకరోజుపాటు చర్చించారని, తెలంగాణలో ప్రస్తుతం 35,973 అంగన్‌వాడీ సెంటర్లున్నాయని తెలిపారు. గతంలో గర్భిణీకి నెలకు 25 గుడ్లు ఇస్తే ఇప్పుడు 30 ఇస్తున్నామని, ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల శిశువుకు గతంలో 8 గుడ్లు ఇస్తే ఇప్పుడు 30 ఇస్తున్నామని, 3-6 సంవత్సరాల వారికి గతంలో 16 గుడ్లు ఇస్తే ఇప్పుడు 30 ఇస్తున్నామని ఆర్థికమంత్రి తెలిపారు. వృద్ధులు, వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నామన్నారు. ఇక మైనారిటీ సంక్షేమం గురించి మాట్లాడుతూ.. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఆవేదనకు అర్థం ఉందని, గత పదేండ్లుగా ఇక్కడ ఏ సమస్యకు పరిష్కారం లభించలేదనే భావనతోనే మాట్లాడారని అన్నారు. అందుకే తమ ప్రభుత్వం వెయ్యి కోట్లు కేటాయించిందని తెలిపారు.

గృహనిర్మాణంలో అవినీతి: గుడిసెలు లేని రాష్ట్రమంటూ ఇందిరమ్మ గృహనిర్మాణం ప్రవేశపెట్టారని, కానీ అందులో అవినీతే జరిగిందని, దాన్ని నాటి ప్రభుత్వమే అంగీకరించిందని మంత్రి ఈటల అన్నారు. ఈ సంవత్సరం గృహనిర్మాణానికి రూ.1041 కోట్లు కేటాయించామని తెలిపారు. పాత ఇండ్ల నిర్మాణానికి రూ.781 కోట్లు ఇస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి ఐడీఏ కాలనీకి వెళ్లినప్పుడు అక్కడున్న ఇండ్లను చూసి నగరాన్ని స్లమ్‌లెస్ సిటీగా చేస్తామన్నారని వెల్లడించారు. అక్కడ 386 ఇండ్లు నిర్మిస్తామని, ఇందులో ఎస్సీసీపీ, టీఎస్‌పీ నిధులతో నిర్మించే ఇండ్లు మినహా 79 ఇండ్లకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు.

శాసనసభ చరిత్రలో లేదు: మంత్రి హరీశ్‌రావు టీడీపీ, బీజేపీ తీరుపై శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఒక్కో అంశంపై అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం కల్పించామని, ఇంత మంచి సంప్రదాయం గతంలో ఎన్నడూ లేదన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తుంటే అభినందించాల్సిందిపోయి, అనవసర ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు.

బాగా పనిచేస్తున్నామని వాకౌట్ చేస్తున్నారా: ఈటెల ఏనాడు మైనారిటీలకు 450 కోట్లు కూడా కేటాయించని గత ప్రభుత్వాలకు భిన్నంగా మేము వెయ్యి కోట్లు కేటాయించామని వాకౌట్ చేశారా? రాళ్లురప్పలతో కూడిన భూములను, ఎందుకు పనికిరాని 100, 150 గజాలు కాకుండా మేము 3 ఎకరాలు ఇస్తున్నామని వాకౌట్ చేశారా? వసతిగృహాల్లోని విద్యార్థులకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని వాకౌట్‌చేశారా? అని ఈటల టీడీపీ, బీజేపీలను నిలదీశారు. సంక్షేపద్దుపై ఎవరేమన్నారంటే..: బీసీ ఫెడరేషన్లు పునరుద్ధరించాలి.

ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీ మరోసారి తీర్మానం చేయాలి అని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి కోరారు. ఎస్సీ వర్గీకరణపై ఉషామెహ్రా కమిటీ నివేదికను అమలుపరచాలి. అంగన్‌వాడీలకు జీతాలు పెంచాలిఅని టీడీపీ ఎమ్మెల్యే వెంకటవీరయ్యా డిమాండ్‌చేశారు. మైనారిటీల కోసం జిల్లాకొక స్టడీసెంటర్ పెట్టాలి. మైనారిటీ సబ్‌ప్లాన్ అమలుచేయాలి. ఉద్యోగ పరీక్షలు ఉర్దూలో నిర్వహించాలి అని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ విజ్ఞప్తిచేశారు. బీసీ సబ్‌ప్లాన్ అమలుచేయాలి. లోన్లకు బ్యాంకు లింకేజీని తొలగించి ప్రభుత్వమే ఇవ్వాలి అని బీజేపీ శాసనసభాపక్షనేత లక్ష్మణ్ కోరారు. ఇతర వర్గాల్లోని పేద కుటుంబాలకు కూడా కల్యాణలక్ష్మి అమలుచేయాలని, ఖమ్మం జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుచేయాలని వైసీపీ నేత వెంకటేశ్వర్లు విజ్ఞప్తిచేశారు. బడ్జెట్‌లో బీసీలకు 2 శాతం నిధులే కేటాయించారు.

ఫెడరేషన్లకు నిధులు పెంచాలి. ఆదాయపరిమితిని బీసీలకు లక్షకు పెంచాలి అని టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య డిమాండ్‌చేశారు. ఈ బడ్జెట్‌పై దళితబహుజనులంతా హర్షిస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రసమయి అన్నారు. తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నంరాజయ్య అన్నారు. ఈ డిమాండ్లపై ఆర్థికమంత్రి స్పందిస్తూ.. కులవృత్తులకు 50 శాతం కరెంటుచార్జీల మాఫీని పరిశీలిస్తాం. ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకొంటాం. గిరిజన కో ఆపరేటివ్ సొసైటీ ఏర్పాటుచేస్తాం. మైనార్టీలకు 15 పాయింట్‌ఫార్ములా అమలుచేస్తామని హామీ ఇచ్చారు.

ఇకపై హాస్టళ్లకు బీపీటీ బియ్యం:ఈటెల రాష్ట్రంలోని సంక్షేమ హాస్టలన్నింటికీ బీపీటీ బియ్యాన్ని సరఫరా చేయనున్నట్లు ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. స్టూడెంట్ మేనేజ్‌మెంట్ హాస్టళ్ల నిర్వహణను ప్రభుత్వపరంగా చేపట్టేందుకు ప్రయత్నిస్తామన్నారు. సంక్షేమశాఖల డిమాండ్లపై చర్చకు ఆయన సమాధానమిస్తూ.. మా బడ్జెట్ అంకెల కోసం, లాభనష్టాల కోసం కాదు. మానవీయకోణంలో ఉంది. నేను తొమ్మిదవ తరగతి నుంచి హాస్టల్‌లో ఉండి చదువుకున్నా. హాస్టల్ పిల్లల ఆకలి కేకలు, వారి బాధలు ఏమిటో తెలిసిన వాణ్ని. ఇప్పుడు ఆ వర్గాల సమస్యల మీదే మాట్లాడే భాగ్యం ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు కల్పించారు అని వివరించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా ఇప్పటికే ఎన్నో చేతల్లో చేసి చూపిందని తెలిపారు.

దళితుల్లో ఇప్పటికే 447 మంది లబ్ధిదారులకు 1158 ఎకరాల భూమిని పంపిణీ చేశామని, ఇది నిరంతర ప్రక్రియ అని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రుణాలు ఇస్తే తిరిగి చెల్లించరనే అపవాదును అంటగట్టారని, ఈ వర్గాలకు ఇప్పటివరకు ఇచ్చిన రుణాలు ఒక్క పారిశ్రామికవేత్త రుణ ఎగవేతకు కూడా సమానం కాదని తెలిపారు. అణగారిన వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు బ్యాంకుల భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వమే నేరుగా రుణాలు అందిస్తుందని మంత్రి ఈటల వెల్లడించారు.

 

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.