Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మాది పేదల ప్రభుత్వం

మన పథకాలు దేశానికే ఆదర్శం – సంక్షేమానికి 40వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం -తెలంగాణ మీద విష ప్రచారాలు పటాపంచలు చేశాం -అమరావతి బానిసలు, ఢిల్లీ పాదసేవకులు మనకు అక్కరలేదు -మన రాష్ట్రంలో మన పార్టీయే ఉండాలి -తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన ఘనత నిజామాబాద్‌ది -ఆర్మూర్ జనహిత ప్రగతి సభలో మంత్రి కే తారకరామారావు

తమది పేదలకోసం పనిచేసే ప్రభుత్వమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. పేదల సంక్షేమానికి రూ.40వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం దేశంలో ఒక్క తెలంగాణయేనని ఆయన చెప్పారు. అనేక రాష్ర్టాలు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. పెన్షన్లు మొదలుకొని సన్నబియ్యం, కల్యాణలక్ష్మి వరకు పేదలకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్, ఇప్పుడు అమ్మఒడి పథకం కింద గర్భిణులకు రూ.12వేలతో పాటు పుట్టిన పిల్లలకు కిట్ కూడా అందజేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాకముందు విషప్రచారాలు చేశారని, గత 33 నెలల కాలంలో వాటిని పటాపంచలు చేశామని చెప్పారు. 70 ఏండ్ల స్వాతంత్య్రంలో అధిక సమయం పాలించిన కాంగ్రెస్ నేతలు ఇంతకాలం గుడ్డిగుర్రాలకు పండ్లుతోమి, ఇపుడు 33 నెలల ప్రభుత్వం మీద అవాకులు, చెవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల మీద కేసులు పెట్టి అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. అమరావతి బానిసలు, ఢిల్లీ పాదసేవకులను తోసిపుచ్చి మనకోసం పనిచేసే మన పార్టీనే ఆదరించాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన కేటీఆర్, మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన తెలంగాణ జనహిత ప్రగతి సభలో ప్రసంగించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.100కోట్లు, ఐదు మున్సిపాలిటీలకు రూ.50కోట్ల చొప్పున ఇస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే..

రాష్ర్టాలకు మనమే స్ఫూర్తి.. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. అక్కడి సీఎం యోగి ఆదిత్యనాథ్ రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఆ రాష్ట్రంలో తెలంగాణ కంటే జనాభా ఎక్కువ. అక్కడ 22 కోట్ల మంది ప్రజలుంటే, మనదగ్గర ఉన్నది మూడున్నర కోట్లే. సీఎం కేసీఆర్ ఇక్కడ రూ.17వేల కోట్లు మాఫీ చేస్తే, 22కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో రూ.36వేల కోట్లు మాత్ర మే మాఫీ చేస్తున్నారు. ఒకేసారి చేద్దామా.. రెండుసార్లు చేద్దామా.. తెలంగాణ లెక్క నాలుగుసార్లు చేద్దామా? అని ఆలోచిస్తున్నారు. మనం షీ టీమ్స్ పెడితే అక్కడ యాంటీ రోమియో టీంలు పెట్టారు. ఇలా ఎన్నో రంగాల్లో తెలంగాణ వివిధ రాష్ర్టాలకు స్ఫూర్తిగా మారింది. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించబోతున్నాం. మన ఊళ్లో సర్పంచ్ గీ పనిచేయకపోతే మళ్లీ ఎన్నికల నిలబడను అని చెప్పలేరు. అలాంటిది రెండేండ్లలో తాగునీరు ఇవ్వకుంటే ఓట్లు అడుగం అని ప్రకటించిన దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్. మిషన్ కాకతీయ కింద46వేల చెరువులను బాగు చేసుకుంటున్నాం. హరితహారం పథకం కింద వనాలు పెంచుకుంటున్నాం. వానలు వాపస్ రావాలని ప్రయత్నిస్తున్నాం.

నవ్విన నాపచేనే పండింది.. తెలంగాణ రాకముందు ఎన్నో ప్రచారాలు జరిగాయి. టీవీలు, పేపర్లలో తెలంగాణ వస్తే లాభమా.. నష్టమా? మంచా చెడా? అని చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ఆఖరి కిరణం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందని, బోర్లమీద ఆధారపడ్డ రైతులు బొక్కబోర్ల పడతారని అసెంబ్లీలో అన్నారు. కొందరు నక్సలైట్లు వస్తారని బెదిరిస్తే మరికొందరు భూస్వాములు వస్తారని, ఇంకొందరు వీధిపోరాటాలు జరుగుతాయని, ఆంధ్రవారిని వెళ్లగొడతారని ఎన్నో విష ప్రచారాలు చేశారు. నవ్విన నాపచేనే పండుతుందన్నట్టుగా 33 నెలల్లో తెలంగాణ నిలబడింది. విద్యుత్ రంగం ముందుకు వెళ్తుంది.

కేసీఆర్‌కు నిజామాబాద్ మీద మక్కువ.. నిజామాబాద్ జిల్లా వ్యవసాయ జిల్లా. ఆదర్శవంతమైన రైతులున్నారు. ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి భూములు కొన్నవాళ్లు ఉన్నారు. వారందరినీ కలుపుకొని పోయిన సంస్కారం ఈ జిల్లాది. 2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనపుడు నిజామాబాద్ జెడ్పీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అన్ని పార్టీలను ఊడ్చిపారేసింది. మోతె గ్రామంలో ఏకగ్రీవ తీర్మానం చేసి తెలంగాణ ఉద్యమానికి ఎంతో స్ఫూర్తిని నింపింది. సీఎం కేసీఆర్‌కు నిజామాబాద్ జిల్లామీద చాలా మక్కువ.

రూ.75 నుంచి రూ.వెయ్యికి పెన్షన్ ఇవాళ మన ప్రభుత్వం రూ.5300 కోట్లు ఖర్చు పెట్టి 40లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నది. తెలుగుదేశం ప్రభుత్వం రూ.75 పెన్షన్ మాత్రమే ఇచ్చేది. మన ప్రభుత్వం 40 లక్షల పెన్షన్లు ఇస్తూ, యేటా రూ.5,300కోట్లు ఖర్చు పెడుతున్నది. ఇప్పుడు ఏ రోజుకు 65ఏళ్లు నిండినా వెళ్లి దరఖాస్తు పెట్టుకుంటే పెన్షన్ ఇస్తారు. పేదింట్లో ఆడపిల్లలకు మేనమామ కట్నం పెట్టినా.. పెట్టకున్నా సీఎం కేసీఆర్ మాత్రం కల్యాణ లక్ష్మికింద రూ.75,116 ఇస్తున్నారు. రూ.1.49 లక్షల కోట్ల బడ్జెట్‌లో రూ.40వేల కోట్లు సంక్షేమ రంగంపై మీద ఖర్చు పెడుతున్నం. నిరుపేద యువతులు గర్భవతులైనా పనులకు వెళ్తూనే ఉంటారు. వారు అలా కష్టపడకూడదని అమ్మ ఒడి పథకం కింద ప్రసవించే వరకు రూ.12వేలు ఇస్తున్నాం. బాలింతకు, పుట్టిన పాపకు 13 వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్‌ను ఇస్తున్నం. ఇందుకు బడ్జెట్‌లో రూ.605కోట్లు పెట్టుకున్నం. అన్నం ఉడికిందా లేదా? అని చూడటానికి ఒక్క మెతుకు ముట్టుకుంటాం.మనది పేదల ప్రభుత్వమా? పెద్దల ప్రభుత్వమా? అర్థం చేసుకోండి.

పసిగుడ్డుపై కాంగ్రెస్ దాడి.. మన ప్రభుత్వం 33నెలల పసిగుడ్డు. దీనిమీద కాంగ్రెస్ నాయకులు దాడి చేస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లు అవుతుంది. నెహ్రూ నుంచి మొదలు పెడితే ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, నిన్నమొన్నటి వరకు సోనియాగాంధీ వరకు 50ఏండ్లు పాలించింది కాంగ్రెసే. అయినా ఈరోజు దాక వేల గ్రామాలకు కరెంటు లేదు. రోడ్లులేవు. తాగునీరు లేదు. దీనికి ఎవరు కారణం? అంతకాలం అధికారంలో ఉండి వీళ్లు ఏం చేశారు.. గుడ్డిగుర్రాల పండ్లు తోమారా? కాంగ్రెస్ వారు సచ్చిపోయిన వారి పేరుమీద కూడా కేసులు వేసి ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారు. ఈమాట నిజమేనని జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అసెంబ్లీలనే ఒప్పకున్నాడు. జయశంకర్‌సార్ మట్టికైనా ఎట్టికైనా మనోడే కావాలని అనేవారు. అమరావతిలో ఉన్నవాళ్లకు బానిసలు, ఢిల్లీనాయకుల కాళ్లదగ్గరున్న వారు మనకు అవసరం లేదు. తెలంగాణలో మన పార్టీయే ఉండాలె.

ఉద్యమమే తర్ఫీదునిచ్చింది ప్రభుత్వ పనుల మీద నేను ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసినప్పుడు వాళ్లు ఒక విషయం చెప్పేవారు. ఈ మధ్య ఒక కేంద్ర మంత్రి కూడా పార్లమెంట్‌లో ఉన్న ఐదుగురు మంచి స్పీకర్లలో మీ సిస్టర్ ఒకరు అని నాతో చెప్పారు. ఈ విషయాన్ని కవితకు ఇప్పటిదాకా నేను చెప్పలేదు. ఇక్కడ ప్రజలందరూ ఉన్నారు కాబట్టి చెప్తున్నా. అలాగే ఢిల్లీలో చాలామంది మీ నాన్న పిల్లలకు బాగా ట్రైనింగ్ ఇచ్చారు అంటుంటారు. కానీ మాకు తర్ఫీదు ఇచ్చింది మా నాన్న కాదు. తెలంగాణ ఉద్యమమే తర్ఫీదునిచ్చింది. తెలంగాణ ప్రజలు ప్రోత్సహించారు. ప్రజల సహకారం వల్లనే తెలంగాణ జాగృతి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించిందిఅని కేటీఆర్ అన్నారు.

మున్సిపాలిటీలకు నిధులిస్తాం.. జిల్లాలోని పట్టణాల రూపురేఖలు మారుస్తాం. జిల్లాకు ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రో ప్రాసెసింగ్ పరిశ్రమలు తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తాం. కవిత ఇప్పటికే రాందేవ్‌బాబా సంస్థ వారిని తీసుకువచ్చారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కొందరు ఎన్నారైలు ఐటీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ఈ జిల్లా వారుకూడా ఆ దిశగా ప్రయత్నం చేయండి అన్నారు.

రాజకీయ సుస్థిరత సాధించాం పేదల కష్టం తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్.. జనహిత ప్రగతి సభలో కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్రం రాజకీయ సుస్థిరతను సాధించి అభివృద్ధిలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణకన్నా ముందు పుట్టిన రాష్ర్టాలైన జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌లలో రాజకీయ సంక్షోభాలు వచ్చాయని, తెలంగాణలో కూడా అలాంటి సంక్షోభం ఏర్పడుతుందని సీమాంధ్రనాయకులు వాదించేవారని చెప్పారు. అయితే సీఎం కేసీఆర్ నేతృత్వంలో అవన్నీ పచ్చి అబద్ధాలుగా నిరూపిస్తూ మంచి సుస్థిరతను సాధించి అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నామని కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో గురువారం జరిగిన జనహిత ప్రగతి సభ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆలోచనలు, మార్గదర్శకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ఆదర్శరాష్ట్రంగా పేరుతెచ్చుకున్నదన్నారు. రాజకీయంగా పచ్చపార్టీకి చుక్కలు చూపించినం. కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించినం అని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని వార్గల వారికి సమున్నత గౌరవం దక్కుతున్నదని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల ఆదరణతో గతంకన్నా మిన్నగా టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు చేస్తున్నామని చెప్పారు. గతంలో 51లక్షల సభ్యత్వం ఉంటే ఇప్పుడు 75లక్షలకు చేరుకున్నామని చెప్పారు.

అమ్మ ఆత్మీయత… నాన్న బాధ్యత తెలంగాణ సంస్కృతిలో అన్నాచెల్లెళ్లకు ప్రత్యేక బంధం ఉంది. అన్న అంటే అమ్మలోని మొదటి అక్షరమైన అ, నాన్నలోని రెండో అక్షరమైన న్న కలిపితేనే అన్న. అమ్మ చూపించే ఆత్మీయత, నాన్నలోని బాధ్యత రెండూ కలిపితే అన్న. ఆడబిడ్డలంతా ఎటువంటి అన్న ఉండాలని కోరుకుంటారో నాకు అటువంటి అన్న ఉన్నాడు. రామన్నకు చెల్లెలునైనందుకు గర్వంగా ఉంది.

చెల్లె అడిగితే కాదనరు.. చెల్లె అడిగితే ఏ అన్నకూడా కాదనడు. నా పార్లమెంట్ స్థానం పరిధిలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. బోధన్, ఆర్మూర్, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీలకు 50కోట్ల చొప్పున నిధులు ఇవ్వాలని రామన్నను కోరుతున్నా. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.100కోట్లు కావాలి మొత్తం రూ.350కోట్లు కావాలి. రైతుల జిల్లా అయిన నిజామాబాద్‌కు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు రావాలి. సోయా, పసుపు పరిశ్రమలు వస్తే రైతులకు ఉపయోగం. ఇండస్ట్రియల్ క్లస్టర్స్‌లో ఈ జిల్లాను కూడా కలుపాలని కోరుతున్నా. ఇక్కడి తెలంగాణ యూనివర్సిటీ 800ఎకరాల్లో ఉంది. దాన్ని ఐటీతో అనుసంధానం చేసి, మినీ టీ-హబ్‌గా మార్చాలి. ముఖ్యమంత్రి నిజామాబాద్ జిల్లాపై ప్రేమతో ఎక్కువ నిధులు ఇస్తున్నారు. వారి బాటలోనే కేటీఆర్ కూడా నడువాలని కోరుకుంటున్నా అన్నారు.

కాంగ్రెస్‌పై పిట్టకథ కాంగ్రెస్ తీరుపై కేటీఆర్ చెప్పిన పిట్టకథ సభికులను ఆకట్టుకుంది. ఒక పిల్లవాడు చిన్నప్పటి నుంచి అన్ని చెడ్డ అలవాట్ల బానిస అవుతాడు. 17 ఏండ్లు వచ్చిన తర్వాత తండ్రి జేబులోంచి డబ్బులు కొట్టేయబోతుంటే తల్లి నిలదీస్తే పక్కనే ఉన్న కట్టెతో కొడితే తల్లి చనిపోతుంది. తండ్రి ఎందుకు కొట్టావని అడిగితే ఆయన్నూ కొడితే, ఆయనా చనిపోతాడు. పోలీసులు పట్టుకుపోయి జడ్జిముందు నిలబెడతారు. నువ్వేం మనిషవయ్యా.. తల్లిదండ్రులను చంపుతావా.. నీకేం శిక్ష వేయాలో నువ్వే చెప్పుకో అన్నాడట. ఆ పిల్లవాడు రెండు చేతులు కట్టుకుని తల్లిదండ్రీ లేనివాడిని.. దయ ఉంచి నన్ను వదిలేయండి అన్నాడట. కాంగ్రెస్ వాళ్ల తీరు ఇలాగే ఉంది. 50ఏండ్లకు పైగా పాలించిన వారే.. అన్ని దరిద్రాలకు కారణం వాళ్లే. కానీ సమస్య కనిపిస్తే 33 నెలల తెలంగాణ ప్రభుత్వమే కారణం అంటున్నారు అని చెప్పారు.

ఏం మాట్లాడాలి? సభలో ప్రసంగాల తీరు మీద కేటీఆర్ చెప్పిన ఓ ఛలోక్తి ప్రజల్లో నవ్వులు పూయించింది. నేను నిజామాబాద్ బయలు దేరుతూ ఇంట్లో మా ఆవిడను అక్కడ ఏం మాట్లాడాలి? అని అడిగాను. అందరికన్నా ముందు మాట్లాడాల్సి వస్తే.. నా తర్వాత చాలామంది మాట్లాడాలి అని తప్పించుకోండి. మధ్యలో మాట్లాడల్సివస్తే కొంతమంది ముందు చెప్పారు. మిగిలింది తర్వాత వాళ్లు చెప్తారు అనండి. చివరలో మాట్లాడాల్సి వస్తే.. నాకన్నా ముందు మాట్లాడిన వాళ్లు అంతా చెప్పారు. ఇక నేను మాట్లాడాల్సింది ఏమీ లేదు అనండి అని సలహా ఇచ్చింది అని కేటీఆర్ ఛలోక్తిగా చెప్పారు.

తెలంగాణ సంస్కృతిలో అన్నా, చెల్లెళ్లకు ప్రత్యేక అనుబంధం ఉంది. అమ్మలోని మొదటి అక్షరాన్ని.. నాన్నలోని రెండో అక్షరాన్ని కలిపితేనే అన్న. అమ్మ చూపించే ఆత్మీయత, నాన్నలోని బాధ్యత రెండు కలిపితే అన్న. ఆడబిడ్డలంతా ఎటువంటి అన్న ఉండాలని కోరుకుంటారో నాకు అటువంటి అన్న ఉన్నాడు. రామన్నకు చెల్లెలునైనందుకు గర్వంగా ఉంది. రామన్న నాకు మాత్రమే కాదు.. తెలంగాణలోని అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములందరికీ కూడా అన్ననే. – ఎంపీ కల్వకుంట్ల కవిత

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.