Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మహా జలబంధం

మూడు నదులు.. మూడు బ్యారేజీలు తెలంగాణ, మహారాష్ట్ర మధ్య చరిత్రాత్మక ఒప్పందం

ఆకుపచ్చ తెలంగాణకు శ్రీకారం -మేడిగడ్డ, తమ్మిడిహట్టి, చనాక-కొరాట ప్రాజెక్టుల పనుల ప్రారంభానికి తొలిగిన అన్ని అడ్డంకులు -మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ చైర్మన్‌గా బోర్డు భేటీ -అంగీకార పత్రాలపై ఇద్దరు సీఎంల సంతకాలు -దేశానికి మంచి సందేశం పంపిన మహాఘట్టం -సీఎం కేసీఆర్ జలదౌత్యానికి ఘనవిజయం -ఇక రెండున్నరేండ్లలో మూడు ప్రాజెక్టులు పూర్తి -తెలంగాణ మాగాణంలో రానున్నవి సిరుల పంటలే

CM-KCR-with-Maharashtra-CM-Devendra-fadnavis ఒక మహాఘట్టం.. రెండు రాష్ర్టాలు.. మూడు నదులపై మూడు ప్రాజెక్టులు! నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఫలించిన శుభసందర్భం! సహ్యాద్రి అతిథిగృహం వేదికగా చరిత్రలో లిఖితమైన సువర్ణాధ్యాయం! ఒకవైపు పలు పొరుగు రాష్ర్టాలు జల జగడాల్లో మునిగి తేలుతుంటే.. కేంద్రం జోక్యంలేకుండా.. పరస్పర అవగాహనతో చేయీచేయి కలిపిన జలబంధం! మంగళవారం సరిగ్గా 2.55 గంటల సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ చేసిన సంతకాలు.. మొత్తం దేశానికే శుభ సందేశాన్ని పంపాయి! క్లిష్టమైన సమస్యకూ సామరస్య పరిష్కారం ఉంటుందని నిరూపించాయి! రెండేండ్లక్రితం కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు అహరహం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలకు.. రాజనీతిజ్ఞతకు నిదర్శనంగా నిలిచాయి. వెరసి.. కోటి ఎకరాలకు నీరందించేందుకు కేసీఆర్ తీసుకున్న సంకల్పం.. సాకారం కానున్నది! గత మార్చిలోనే ముఖ్యమంత్రుల స్థాయి చర్చలకు ముంబై వెళ్లిన సీఎం కేసీఆర్.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో సమావేశమై.. రెండు రాష్ర్టాల మధ్య బ్యారేజీల నిర్మాణంపై ప్రాథమిక భూమిక ఏర్పాటు చేశారు. అదే సమయంలో ఈ విషయంలో అంతర్రాష్ట బోర్డు ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది.

ఇప్పుడు దాని కొనసాగింపుగా జరిగిన సమావేశంలో.. నాలుగు దశాబ్దాలుగా మూరెడు కూడా కదలని మూడు ప్రాజెక్టులను శరవేగంతో పూర్తి చేసేందుకు అవసరమైన సాంకేతిక ఒప్పందానికి ఇరు రాష్ర్టాల సీఎంల ఆమోదముద్ర లభించింది! చర్చలు, సంప్రదింపుల మార్గంలో రెండేండ్లుగా చేసిన కృషి.. కనబర్చిన లక్ష్యశుద్ధి.. చనాక-కొరాట (పెనుగంగ నది), తమ్మిడిహట్టి (ప్రాణహిత నది), మేడిగడ్డ (గోదావరి నది) బ్యారేజీల ఒప్పందాలపై కించిత్ వివాదంలేకుండా ముందడుగు వేయించింది! ఒకప్పుడు కాగితాలపై మురిపించి.. ఓట్లు రాబట్టుకునేందుకు ఉపయోగపడిన ప్రాజెక్టులు.. ఇప్పుడు రైతుల అవసరాలు తీర్చేందుకు.. అరవై ఏండ్ల సాగునీటి గోసలకు చరమగీతం పాడేందుకు.. అడ్డంకులు తొలగించుకుని.. కసరత్తులు పూర్తి చేసుకుని నిర్మాణానికి పునాదులేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి! నిజానికి మహారాష్ట్రతో ఒకే రోజు మూడు ప్రాజెక్టులపై గతంలో ఒప్పందాలు కుదిరాయి. 1975 అక్టోబర్ ఆరున మహారాష్ట్ర, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్య లెండి, లోయర్ పెనుగంగ, ప్రాణహిత ప్రాజెక్టులపై లాంఛనప్రాయ ఒప్పందాలు జరిగాయని గోదావరి జలాల వివాదాల ట్రిబ్యునల్ (డీడబ్ల్యూడీటీ) నివేదిక పేర్కొంటున్నది. ఈ ఒప్పందాలను అప్పటి పాలకులు చిత్తశుద్ధితో తీసుకొని ఉంటే.. అనంతరం అమలుపై దృష్టిసారించి ఉంటే.. తెలంగాణకు ఇన్నేండ్లలో సాగునీటి గోస ఉండేది కాదు. కానీ.. సిరులు పండించగల తెలంగాణ మాగాణానికి నీటి దప్పిక తీర్చేందుకు, సాగునీటికోసం నానా యాతనలు పడుతున్న రైతాంగాన్ని కష్టాల సుడిగుండం నుంచి తప్పించేందుకు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ సర్కారు కంకణం కట్టుకున్నది. ఏడాదిన్నర-రెండేండ్లలోపే బీడు భూములకు గోదావరి జలాల్ని మళ్లించేందుకు జల సంకల్పంతో మహారాష్ట్రతో సాంకేతిక ఒప్పందాన్ని పూర్తి చేసుకుంది. ఈ కీలక ఘట్టంలో రెండు రాష్ర్టాల నీటిపారుదల శాఖ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, గిరీశ్‌మహాజన్, ఆర్థిక మంత్రులు ఈటల రాజేందర్, సుధీర్ మంత్రగాయ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్, రెవిన్యూ మంత్రులు మహమూద్ అలీ, చంద్రకాంత్ పాటిల్, తెలంగాణ మంత్రులు జోగు రామన్న, జీ జగదీశ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఎంపీలు బాల్క సుమన్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పుట్ట మధు, ప్రభుత్వ సీఎస్ రాజీవ్ శర్మ, ఇరిగేషన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ఆర్థిక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్లు ఎన్ వెంకటేశ్వర్లు, భగవంత్‌రావు, ఇరిగేషన్ ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

మినిట్స్‌లో తొమ్మిది ఎజెండా అంశాలు

బోర్డు సమావేశం మినిట్స్‌లో 9 ఎజెండా అంశాలు పొందుపరిచారు. ఈ ఏడాది మార్చి 8న రెండు రాష్ర్టాలు అంతర్రాష్ట్ర బోర్డు ఏర్పాటుపై ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. దాని విధి విధానాల ప్రకారం బోర్డుకు ఒక్కో సంవత్సరం ఒక్కో సీఎం చైర్మన్‌గా ఉంటారు. రెండవ రాష్ట్ర సీఎం కోచైర్మన్‌గా వ్యవహరిస్తారు. బుధవారంనాటి సమావేశానికి మహారాష్ట్ర సీఎం చైర్మన్‌గా, తెలంగాణ సీఎం కోచైర్మన్‌గా వ్యవహరించారు. ఎజెండా అంశాల్లో మూడు బ్యారేజీలకు సంబంధించిన సమగ్ర సాంకేతిక అంశాలను పొందుపరిచారు.

ఎజెండా-1: రెండు రాష్ర్టాల మధ్య జరిగిన ఒప్పంద పురోగతిపై ఆమోదం.

ఎజెండా-2: అంతర్రాష్ట్ర బోర్డు వ్యవహారాలు, నియమావళి కోసం రూపొందించిన నిబంధనలకు ఆమోదం.

ఎజెండా-3: అంతర్రాష్ట్ర బోర్డు సచివాలయం పురోగతిపై సమీక్ష.

ఎజెండా-4 (తమ్మిడిహట్టి బ్యారేజీ): స్టాండింగ్ కమిటీ సిఫార్సు మేరకు ఎఫ్‌ఆర్‌ఎల్ 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం.

ఎజెండా-5 (మేడిగడ్డ బ్యారేజీ): స్టాండింగ్ కమిటీ సిఫార్సు మేరకు వంద మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం. డిజైన్‌ను 101 మీటర్ల ఎత్తులో రూపొందించినందున భవిష్యత్తులో మరో మీటరు ఎత్తు పెంచుకునే వెసులుబాటు. ఎత్తు పెంపును వాస్తవ ముంపును గుర్తించిన తర్వాత అంతర్రాష్ట్ర బోర్డు నిర్ణయంతో చేపట్టాల్సి ఉంటుంది.

ఎజెండా-6 (చనాక-కొరాట బ్యారేజీ): 213 మీటర్ల ఎత్తులో నిర్మించాలి. నిర్మాణ వ్యయాన్ని తెలంగాణ, మహారాష్ట్ర 80ః20 దామాషా ప్రకారం భరించాలి. బ్యారేజీ నిర్మాణాన్ని చేపట్టడంతో ముందుకు పోవాల్సిందిగా అంతర్రాష్ట్ర బోర్డు అనుమతినిస్తుంది.

మూడింటికీ ఒకేలా: మూడు బ్యారేజీలకు రూపొందించిన విధి విధానాల్లో ఇవి ఒకేలా ఉన్నాయి. బ్యారేజీకి సంబంధించిన అన్ని రకాల అనుమతుల్ని పొందడం తెలంగాణ ప్రభుత్వ బాధ్యత. మహారాష్ట్ర పరిధిలోని వాటికి సంబంధించి ఆ రాష్ట్రం సంపూర్ణ సహకారాలు అందిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం వరద ప్రవాహంపై అధ్యయనం చేసి.. డిజైన్లు రూపొందించి, తెలంగాణ సీడీవో అనుమతి తీసుకోవాలి. అవసరమైతే ఫ్లడ్ బ్యాంక్స్ నిర్మించాలి. నిర్మాణ సమయంలో, ఆ తర్వాత నిరంతరం వరద మట్టాన్ని పర్యవేక్షించాలి. భూసేకరణ/భూ సమీకరణ రెండు రాష్ర్టాలు సంయుక్తంగా, పారదర్శకంగా చేపట్టాలి. వీటికి మహారాష్ట్ర సంపూర్ణ సహకారాన్ని అందిస్తుంది. 2013 చట్టంగానీ రెండు రాష్ర్టాల అంగీకారం మేరకు ఇతర విధానం ద్వారాగానీ భూ సమీకరణ చేపట్టవచ్చు. బ్యారేజీ నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చు తెలంగాణదే. గోదావరి ట్రిబ్యునల్‌కు లోబడి మహారాష్ట్ర నీటి వాడకంపై హక్కును కలిగి ఉంటుంది. నీటి కొరత ఏర్పడితే బ్యారేజీ పరిసర ప్రాంతాల్లోని తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలి. ముంపు ప్రాంతంలో చేపల వేటపై రెండు రాష్ర్టాలకు హక్కులుంటాయి. రెండు రాష్ర్టాలు బ్యారేజీ త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాయి.

ఎజెండా-7 (పింపార్డ్-పర్సోడా బ్యారేజీ): లోయర్ పెనుగంగ ప్రాజెక్టులో భాగంగా డిగ్రాస్ వద్ద పింపార్డ్-పర్సోడా బ్యారేజీ నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఎత్తుపై సమగ్ర సర్వే నివేదిక అందిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.

ఎజెండా-8: ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లు, డిజైన్లు, డ్రాయింగ్స్, ప్రాజెక్టు నివేదికలను రెండు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకోవాలి.

ఎజెండా-9: బోర్డు సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగింది. రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులు గోదావరిపై సంయుక్త ప్రాజెక్టులకు పరస్పర సహకరించుకుంటామని అంగీకరించడంతోపాటు.. అభినందనలు తెలుపుకున్నారు.

యుద్ధప్రాతిపదికన పనులు: తెలంగాణకు సంబంధించి మూడు బ్యారేజీలకు అనుమతులు రావడంతో పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు నీటిపారుదల శాఖ సిద్ధమవుతున్నది. ముఖ్యంగా మేడిగడ్డ వద్ద పంపుహౌజ్ పనుల్ని 18 నెలల్లో పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన దరిమిలా ఆ మేరకు ఇప్పటికే చర్యలు మొదలయ్యాయి. ఇప్పటికే కాంట్రాక్టర్లతో ఒప్పందం కూడా పూర్తి కావడం, ఎగువ నుంచి వరద ఎక్కువగా లేకపోయినందున త్వరలో కాంట్రాక్టర్లను రంగంలోకి దింపేందుకు నీటిపారుదల శాఖ కసరత్తు చేస్తుంది. దీంతో 2018లో ఎట్టి పరిస్థితుల్లోనూ గోదావరిజలాల తరలింపు అనేది సాకారం అవుతుందనేది సుస్పష్టం.

సీఎం కేసీఆర్‌ది స్నేహపూర్వక వైఖరి ఈ ఒప్పందం కుదురడం చాలా సంతోషంగా ఉంది. పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మహారాష్ట్ర మధ్య వివాదాలుండేవి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ స్నేహహస్తం అందించారు. తన పర్యటనలో అనేక అంశాలపై నాతో మాట్లాడారు. పరస్పరం ప్రయోజనం పొందడంతో పాటు రెండు రాష్ర్టాల హక్కుల్ని కాపాడే రీతిలో తమ విధానం ఉంటుందని ఆయన స్పష్టంచేశారు. – మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్

సువర్ణాక్షరాలతో లిఖించే రోజు గోదావరి ప్రాజెక్టులపై తెలంగాణ-మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం చరిత్రాత్మకం. ఇరు రాష్ర్టాల చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. రాష్ర్టాల మధ్య జలయుద్ధాలు జరుగుతున్న సమయంలో రెండు రాష్ర్టాలు సుహృద్భావ వాతావరణంలో సాగునీటి ప్రాజెక్టుల మీద ఒప్పందాలు చేసుకోవటం దేశంలో కొత్త ఒరవడికి నాంది. – ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.