-కాంగ్రెస్‌కు మరోసారి గుణపాఠం తప్పదు -త్యాగాల చరిత్ర టీఆర్ఎస్ది.. వెన్నుపోటు చరిత్ర టీడీపీది -ఉమ్మడి పాలనలో పక్కపొంటి నీళ్లుపోయినా వాడుకోనివ్వలేదు -కాళేశ్వరంతో ప్రతిఎకరాను నీళ్లతో తడుపుతాం -కాంగ్రెస్, టీడీపీలు ముదిరాజ్‌లను వాడుకొని వదిలేశాయి -గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌కు అన్నివర్గాల ఆదరణ -నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు -ముదిరాజ్‌లు ఏకమై కేసీఆర్‌కు భారీ మెజార్టీ కట్టబెట్టాలి:మంత్రి ఈటల రాజేందర్ పిలుపు
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ పాలనలో అనుభవించిన కష్టాలు ఇంకా మర్చిపోనేలేదు. తెలంగాణ సాధనలో ఉద్యమ గాయాలు ఇంకా మాననేలేదు. మరోసారి తెలంగాణ ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీయడానికి ఆ రెండుపార్టీలు మహాకూటమి పేరుతో ప్రజల్లోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. వాటి కుట్రలను తిప్పికొడుదాం అని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. డిసెంబర్ 11న మహాకూటమికి మహాఓటమే మిగులుతుందని, కాంగ్రెస్, టీడీపీది ముగిసిన అధ్యాయంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో సోమవారం నిర్వహించిన ముదిరాజ్‌ల ఆత్మీయసమ్మేళనంలో మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్ పాల్గొన్నారు. సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణం కోసం అహర్నిషలు కృషిచేస్తున్న సీఎం కేసీఆర్‌కు బాసటగా నిలిచి, మహాకూటమికి గుణపాఠం చెప్పాలని కోరారు. ఉమ్మడి పాలనలో తెలంగాణ పక్కనుంచి నీటి వనరులు పోతున్నా రైతులకు వాడుకునేందుకు ఇవ్వలేదని.. టీఆర్ఎస్ పాలనలో ప్రతి ఎకరాకు సాగునీటినందిస్తున్నామని చెప్పారు. టీఆర్ఎస్ పాలనలో పేదలందరికీ సంక్షేమపథకాలు అందాయని, రైతులు పండించిన ధాన్యా న్ని ప్రభుత్వమే మద్దతుధర ఇచ్చి కొనుగోలు చేసిందని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ది త్యాగాల చరిత్ర టీఆర్ఎస్ది త్యాగాల చరిత్ర అని.. తెలంగాణ కోసం పదవులను గడ్డిపోచలా త్యజించిన చరిత్ర అని హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ది అవినీతి, అక్రమాల చరిత్ర కాగా, టీడీపీది వెన్నుపోటు రాజకీయాల చరిత్ర అని ఎద్దేవా చేశారు. తెలంగాణ పోరాటంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆత్మైస్థెర్యంతో విజయాన్ని సాధించామని చెప్పారు. విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన టీఆర్ఎస్పై ప్రజలకు నమ్మకం ఉందని, సీఎం కేసీఆర్‌ను భారీమెజార్టీతో గెలిపించుకుంటారని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయడానికి వస్తు న్న కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్ దక్కనివ్వబోమని స్పష్టంచేశారు. ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ మెజార్టీ పెంచుకుంటూ పోతుంటే.. ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు గల్లంతవుతున్నాయని చెప్పారు. అనేకసార్లు మోసంచేసిన కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం పోయిందని, తెలంగాణలో టీడీపీది ముగిసిన అధ్యాయమని అన్నారు.

సబ్బండవర్ణాల సంక్షేమమే లక్ష్యం సబ్బండవర్ణాల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం దృఢసంకల్పంతో పనిచేస్తున్నదని హరీశ్‌రావు పేర్కొన్నారు. మిషన్‌భగీరథతో ఇంటింటికీ తాగునీరు అందించిన మహనీయుడు కేసీఆర్ అని, ఒక్కొక్కరికి ఆరుకిలోల బియ్యం, రూ.1000 పింఛన్ అందించి పేదల ఆకలి సమస్య తీర్చిన గొప్పవ్యక్తి అని తెలిపారు. గర్భిణులకు ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా కాన్పుచేసి, కేసీఆర్ కిట్స్, రూ.12 వేల నగదు అందించడమే కాకుండా.. నయాపైసా ఖర్చులేకుండా ఇంటివద్ద దింపారని గుర్తుచేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో ఆడబిడ్డ పెండ్లికి రూ. లక్షా16లు ఇచ్చి పేద కుటుంబాలకు కేసీఆర్ బాసటగా నిలిచారన్నారు.

కాళేశ్వరంతో సాగుభూములు సస్యశ్యామలం పక్కనే కాలువ ఉన్నా, పొలానికి నీరు వాడుకోలేని రైతు వ్యథకు పరిష్కారం చూపుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరానికి నీరందించే బృహత్ ప్రణాళికతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారని హరీశ్‌రావు తెలిపారు. కాళేశ్వరం పూర్తయితే 46 వేల చెరువులు, కుంటలను నింపడంతో తెలంగాణ సస్యశ్యామలం కావడమే కాకుండా ముదిరాజ్‌లకు, మత్య్సకారులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, చేతినిండా పని, కడుపు నిండా తిండి దొరుకుతుందని చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంట్, మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా నీళ్లు, కాళేశ్వరంతో ప్రతి ఎకరానికి సాగునీరిచ్చే కేసీఆర్‌పై జనం విశ్వాసంతో ఉన్నారన్నారు.

గజ్వేల్‌లో కేసీఆర్‌కు భారీ మెజార్టీ ఖాయం గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధి పనులతో నియోజకవర్గ ప్రజలు సీఎం కేసీఆర్‌కు భారీ మెజార్టీ కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో విశ్వాసఘాతకులుగా ముద్ర పడిపోయారని, రోజురోజుకూ గ్రామాల నుంచి ప్రతిఘటన ఎదురవుతుండటంతో చీకటి ప్రచారానికి పూనుకున్నారని విమర్శించారు. ఆంధ్రాబాబు చంద్రబాబు డబ్బుకట్టలు, మందు పెట్టెలు పంపిస్తుంటే.. రాత్రికి రాత్రే యువతకు తాగించి వారి బంగారు భవిష్యత్‌ను చెడగొట్టాలని చూస్తున్నదని ఆరోపించారు. ప్రజలు ఇప్పటికే అప్రమత్తమై ఇలాంటివారికి బుద్ధి చెప్తున్నారని తెలిపారు.

ముదిరాజ్‌ల సంక్షేమానికి ప్రాధాన్యం : మంత్రి ఈటల ముదిరాజ్‌లు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా నిలదొక్కుకొనేందుకు సీఎం కేసీఆర్ అనేకరకాలుగా సహాయసహకారాలు అందిస్తున్నారని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మత్స్యసంపదను పెంచేందుకు కృషిచేస్తూ మత్స్యకారులకు మరింత ప్రోత్సాహమిస్తున్నారన్నారు. కాంగ్రెస్, టీడీపీలు ముదిరాజ్ కండ్లలో మట్టికొట్టాయని, రాజకీయంగా వాడుకోడమే తప్పా, చేసిందేమీ లేదని ఆరోపించారు. గజ్వేల్‌లో ముదిరాజ్‌లంతా ఇంటింటికీ తిరుగుతూ కేసీఆర్‌కు ఓట్లేయించి భారీ మెజార్టీతో గెలిపించడంటో కీలకం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీలు బండా ప్రకాశ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు భూంరెడ్డి, భూపతిరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, నాయకులు గాడిపల్లి భాస్కర్, కొట్టాల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

వంటేరు, నర్సారెడ్డి ఇద్దరూ దొంగలే: హరీశ్‌రావు సిద్దిపేట: వంటేరు ప్రతాపరెడ్డి, నర్సారెడ్డి ఇద్దరూ దొంగలు అని, ఆ దొంగలిద్దరూ ఇప్పుడు ఒక్కటయ్యారని.. గజ్వేల్ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. గజ్వేల్‌లో అభివృద్ధి కొనసాగాలంటే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని స్పష్టంచేశారు. సోమవారం గజ్వేల్ నియోజకవర్గంలోని కొల్గూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. పేదల కోసం అనేక సంక్షేమపథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు.