-రాష్ట్రంలో మహిళలకుపెద్దపీట వేసిన సీఎం కేసీఆర్ -జీహెచ్ఎంసీ మేయర్అభినందన సభలోమంత్రి సత్యవతి రాథోడ్

తెలంగాణలో మహిళల జోలికి వెళితే అక్కడి ప్రభుత్వం ఊరుకోదు అనే వాతావరణాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీసుకొచ్చారని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతీరాథోడ్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి, మోతె శ్రీలతాశోభన్‌రెడ్డి అభినందన సభను తెలంగాణ భవన్లో శుక్రవారం నిర్వహించారు. ఈ సభలో మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను మహిళలకు కేటాయించిన సీఎం కేసీఆర్‌కు రాష్ట్రంలోని మహిళా లోకం పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించటమే కాకుండా జీహెచ్ఎంసీలో అదనంగా మరో పది సీట్లు కేటాయించారని తెలిపారు. మార్కెట్ కమిటీల్లోనూ మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించి రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం కల్పించారని పేర్కొన్నారు. దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన మహిళా నాయకురాలు కానీ, అనేక రాష్ర్టాల్లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన మహిళలు కానీ స్త్రీలకు ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మూడోవంతు జనాభా ఉన్న హైదరాబాద్ నగరాన్ని ఆడబిడ్డల చేతిలో పెట్టిన సీఎం కేసీఆర్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విశ్వనగర సంకల్పానికి అనుగుణంగా కొత్త జీహెచ్ఎంసీ పాలకవర్గం పనిచేయాలని, అందుకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఆమె పేర్కొన్నారు. పార్లమెంట్ చరిత్రలో లంబాడా బిడ్డనైన తనకు ఎంపీగా అవకాశం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత పేర్కొన్నారు. మహిళా సంక్షేమానికి, ఆర్థిక స్వావలంబనకు, బీసీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఇస్తున్న ప్రాధాన్యం ఈ దేశంలో మరే పార్టీ, మరే ప్రభుత్వం ఇవ్వటంలేదని టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి చెప్పారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి పేర్కొన్నారు. అందరి సహకారంతో ప్రజలకు గ్రేటర్ హైదరాబాద్ నుంచి అందవలసిన సేవల్ని సకాలంలో అందేవిధంగా కృషి చేస్తామని చెప్పారు.