Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మహిళా సాధికారతకు వీ-హబ్..

-దేశంలోనే మొట్టమొదటిసారి రాష్ట్రంలో.. 15 కోట్లతో కార్పస్ ఫండ్ -25 లక్షల నుంచి గరిష్ఠంగా కోటి పెట్టుబడి -రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్

మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి దేశంలోనే ప్రప్రథమంగా వీ-హబ్‌ను రాష్ట్రంలో ఏర్పాటుచేయనున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. మూడ్రోజులపాటు నిర్వహించిన జీఈఎస్ (గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్) విజయవంతంగా ముగిసిన సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. టీ-హబ్ తరహాలోనే విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ హబ్ (వీ-హబ్)కు రూ.15 కోట్ల కార్పస్ నిధిని కేటాయిస్తున్నట్టు తెలిపారు. జీఈ సదస్సులో పాల్గొన్న మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు నిధుల సమస్య ఏర్పడుతున్నదనే విషయం అర్థమైందన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి దేశంలోనే ప్రప్రథమంగా వీ-హబ్‌కు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. దీనిద్వారా మహిళా పారిశ్రామికవేత్తల సంస్థల్లో రూ.25 లక్షల నుంచి కోటి దాకా పెట్టుబడి పెడుతామని వివరించారు. ఇందుకోసం ప్రొక్యూర్‌మెంట్ పాలసీని బలోపేతం చేస్తామని చెప్పారు. ప్రైవేటు ఎంఎస్‌ఎంఈల ద్వారా 20% సొమ్మును సేకరిస్తామన్నారు. దక్షిణాసియాలో వైభవంగా జీఈఎస్ సదస్సు జరిగిందని.. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారని కేటీఆర్ తెలిపారు. ఇందులో మహిళలే 52.5% వరకు ఉన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో, తమ ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు విప్లవాత్మకమైన విధానాలకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. ప్రపంచ మహిళా పారిశ్రామికవేత్తల నుంచి స్ఫూర్తి పొంది.. నారీమణుల కోసం ప్రత్యేక హబ్‌ను ప్రారంభిస్తున్నామన్నారు. తెలంగాణలో ఇప్పటికే మహిళలకే మూడు ప్రత్యేక పార్కులను ఏర్పాటుచేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు.

వాణిజ్య బంధం.. మరింత దృఢం అమెరికాలోని 35 రాష్ట్రాల నుంచి వచ్చిన 350 మంది ప్రతినిధుల బృందానికి అమెరికా అధ్యక్ష సలహాదారు ఇవాంకా ట్రంప్ సారథ్యం వహించడం.. దక్షిణాసియాలోనే ప్రప్రథమంగా హైదరాబాద్‌కు రావడంతో ప్రపంచం దృష్టి తెలంగాణ వైపు పడిందంటూ ఇవాంకాకు కేటీఆర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య వాణిజ్య బంధం మరింత దృఢం అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీఈఎస్ ప్రారంభోత్సవానికి హాజరై, ఫెడరలిజం స్ఫూర్తికి సరికొత్త అర్థం తీసుకువచ్చారని ప్రశంసించారు. ఆయన మార్గదర్శకం చేశారని చెప్పారు. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్, ఆయన బృందం సభ్యులంతా కలిసి జీఈఎస్ సదస్సును అద్భుతంగా నిర్వహించారని అన్నారు. ఎనిమిదో జీఈఎస్ సదస్సులో పాల్గొన్న 140 మంది దేశాల ప్రతినిధులతో చర్చించానని కేటీఆర్ చెప్పారు. ఇందులో పాల్గొన్న నిపుణులైన 200 మంది ఉపన్యాసకులు, నిర్వహించిన 53 సెషన్లు, నెట్‌వర్క్ అవకాశాలు, వెంచర్ క్యాపిటల్ లావాదేవీలు తదితరాలను గమనిస్తే.. జీఈఎస్ సదస్సు అద్భుతమైన విజయం సాధించిందని వెల్లడించారు. ప్రపంచదేశాల ప్రతినిధులు పాల్గొన్న చర్చలద్వారా ఆసక్తికరమైన కొత్త విషయాలు తమ దృష్టికి వచ్చాయన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కేవలం మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి.. ప్రత్యేకంగా మూడు పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. ప్రధాని మోదీ, ఇవాంకా ట్రంప్‌లు తెలంగాణ రాష్ట్రం వినూత్న ఆవిష్కరణల గురించి ప్రస్తావించారంటే తమ రాష్ట్రం ప్రత్యేకత ప్రపంచవ్యాప్తంగా అర్థమైందన్నారు. ఇప్పటికే టీహబ్ ద్వారా గోవా, త్రిపుర, ఢిల్లీ, అసోం వంటి నాలుగు రాష్ట్రాలకు తమ సేవలను అందిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్‌ను వచ్చే ఏడాది ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ జీఈ సదస్సు స్వాగతోపన్యాసంలో ప్రకటించారని గుర్తుచేశారు.

కొత్త ఉద్యోగాలు వీటినుంచే.. ఫోర్బ్స్ ప్రకటించిన కంపెనీల బదులు భవిష్యత్‌లో యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌ల నుంచి కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కాబట్టి, వీరిని ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. ఇందుకు సంబంధించిన రోడ్ మ్యాప్‌ను రూపొందించాలని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్‌ను ఆయన కోరారు. మరెన్నో అంతర్జాతీయ సదస్సులను నిర్వహించగల సత్తా తెలంగాణ ప్రభుత్వానికి ఉందన్నారు. నగరాలంటే కేవలం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చన్నై మాత్రమే కాదని.. దేశంలోని ఇతర నగరాలు అద్భుత ఆవిష్కరణలతో ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్నాయని చెప్పారు. మెట్రో నగరాల పరిధిదాటి నీతిఆయోగ్ కొత్త నగరాలను ప్రోత్సహించాలని విజ్ఞప్తిచేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.