Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మహిళలకు మహర్దశ

-పంటలకు గిట్టుబాటు
-మరో ఆహార విప్లవం
-పంట కాలనీలుగా తెలంగాణ
-మహిళాసంఘాలు పంటలు కొనుగోలుచేస్తయి
-ప్రతి నియోజకవర్గంలో ఆహార పరిశ్రమలు
-మహిళాసంఘాలకే పరిశ్రమల బాధ్యత
-ఐకేపీల ఉద్యోగాల పర్మినెంట్
-కల్తీలేని ఆహారోత్పత్తుల తయారీ
-పంపిణీ బాధ్యత రేషన్ డీలర్లకు
-తెలంగాణలో నవశకం: సీఎం కేసీఆర్
-రైతుల అప్పులు పోవాలి.. ఖాతాలో డబ్బులు నిండాలి
-కొత్త పథకం వివరాలు మ్యానిఫెస్టోలో వెల్లడిస్తం
-ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం ఖరాబు
-తెలంగాణ రైతులందరూ అప్పుల పాలు
-విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోక తప్పదు
-ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కీలక ప్రకటన
-సిద్దిపేటకు రెండేండ్లలో రైలొస్తది
-కాళేశ్వరం ఎత్తిపోతల పూర్తయితే 365 రోజులు రిజర్వాయర్లలో నీళ్లు
-సిద్దిపేటలో సీఎం సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి

రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం.. పండిన పంటలను ప్రతి నియోజకవర్గంలో ఐకేపీ మహిళా సంఘాలు కొనుగోలుచేసి, అవి నిర్వహించే దాదాపు 200 ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లలో ప్రాసెసింగ్ చేయడం.. తద్వారా నాణ్యమైన, కల్తీలేని ఆహార పదార్థాలను ప్రజలకు అందించడం- ఎగుమతి.. రేషన్ డీలర్ల వ్యవస్థ బలోపేతం అనే లక్ష్యాలతో బహుముఖ ప్రయోజనం కల్పించే అద్భుత పథకానికి రాబోయే ప్రభుత్వంలో శ్రీకారం చుట్టనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రైతును రాజును చేయడానికి, మహిళలకు మహర్దశ కల్పించడానికి, అంతిమంగా ప్రజలకు ఉపయోగపడటానికి రాబోయే రోజుల్లో దీనిని చేపట్టనున్నట్టు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సిద్దిపేట, హుజూరాబాద్, సిరిసిల్ల, ఎల్లారెడ్డిలో నిర్వహించిన భారీ బహిరంగసభల్లో సీఎం పాల్గొన్నారు. సిద్దిపేట సభలో కాంగ్రెస్ మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనకు సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సీఎం మాట్లాడు తూ.. ఉమ్మడిరాష్ట్రంలో తెలంగాణ వ్యవసాయరంగం తీవ్రంగా నష్టపోయిందని, రైతులందరూ అప్పులపాలయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదన్నారు. ఈ బ్రహ్మాండమైన పథకం పూర్తి వివరాలన్నీ మ్యానిఫెస్టోలో వెల్లడిస్తామన్నారు. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చినందుకు సీఎం సంతోషం వ్యక్తంచేశారు. హరీశ్, రామలింగారెడ్డి గెలుస్తరు.. డౌట్ లేదు. లక్షకుపైగా మెజార్టీలతో వారిని గెలిపించాలి. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఐదు లక్షలతో ప్రభాకర్‌రెడ్డి గెలుస్తడన్న సంకేతం పోవాలి అన్నారు. సీఎం ప్రసంగం ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

ఉమ్మడి రాష్ట్రంలో రైతుల బతుకు ఖరాబు
తెలంగాణలో 70% ప్రజలు వ్యవసాయం, వ్యవసాయ అనుబంధరంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. 24 గంటలపాటు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం. రైతులు పేరుకు పటేల్ పటేల్ అంటే సంతోషపడుతరు. కానీ అందరికీ అప్పులే. తెలంగాణ రైతుల బతుకు ఉమ్మడి రాష్ట్రంలో ఎంత ఖరాబు అయ్యిందో నాకు తెలుసు. నేను కూడా కాపోన్నే.. నేనూ రైతుబిడ్డనే. నాకూ ఆ బాధ తెలుసు. తెలంగాణ రైతులకు అప్పులు పోయి, వారి ఖాతాల్లో 5, 10 లక్షల రూపాయలు ఉండాలంటే కొన్ని గట్టి చర్యలు తీసుకోవాలి.

రైతుల ఆదాయం పెరుగాలి
ఎవరూ ఊహించని విధంగా మీ గ్రామాలకే వచ్చి పాస్‌బుక్కులిచ్చారు. భూరికార్డుల ప్రక్షాళనచేశారు. మిగిలిన ఒకశాతం పనికూడా పూర్తిచేస్తరు. రైతుబంధు పేరిట ఎకరాకు ఏడాదికి రూ.8 వేలు ఇస్తున్నం. వచ్చేసారి రూ.10 వేలు ఇస్తం. కరంట్ బాగుచేసుకున్నం. 24గంటల కరంట్ వస్తున్నది. మిషన్‌భగీరథతో నీటిసమస్య తొలిగిపోయింది. రైతులు బాగుండాలంటే తియ్యటిపుల్లటి మాటలతోకాదు. పకడ్బందీగా మూడునాలుగు విషయాలు జరిగితే బాగుపడుతరు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు 24 గంటల ఉచిత కరంట్ ఇచ్చితీరుతం. ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకోవాలి. కోటి ఎకరాలు సాగుకావాలి. ప్రాజెక్టులన్నీ వచ్చే ఏడాది పూర్తవుతయి. సిద్దిపేట, దుబ్బాక ప్రజలు అదృష్టవంతులు. ఇక్కడి నుంచే నీళ్ల మంత్రి ఉన్నరు. ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేసుకుంటున్నరు.

పంటకాలనీలుగా తెలంగాణ
సిద్దిపేట గడ్డ నుంచి విప్లవాత్మక విషయం చెప్పాలని వచ్చాను. నీళ్లు, కరంటు సరఫరా ఉన్నది. భూగర్భజలాలు పెరుగుతయి. ఎరువులు, విత్తనాలు సకాలంలో దొరుకుతున్నయి. పంటలు దండిగా పండుతయి. పంట అమ్ముకోవడంలో మధ్యదళారీ వ్యవస్థ పోవాలి. మంచి కార్యక్రమానికి, అద్భుతంగా రూపకల్పనచేస్తున్నం. మ్యానిఫెస్టోలో వెల్లడిస్తం. తెలంగాణను పంటకాలనీలుగా విభజిస్తం. రైతులు పండించిన పంట ఆన్ డిమాండ్ అమ్ముడుపోవాలి. అలా ఉండాలంటే ఏ ఏరియాలో ఎక్కడ ఎలాంటి పంటలు పండుతయో గుర్తించాలి. మన అగ్రికల్చర్ యూనివర్సిటీవాళ్లు ప్రణాళిక తయారుచేస్తున్నరు. పంట కాలనీలుగా మొత్తం రాష్ట్రాన్ని విభజిస్తరు. దాని ప్రకారం పంటలు వేయాలి.

మహిళా సంఘాల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్
ఈరోజు ఏది కొనబోయినా, తినబోయినా కల్తీ. పసుపు, కారం, నూనెలు ఇలా ఏదైనా కల్తీనే. కల్తీవల్ల విపరీతమైన బీమారి వస్తున్నది. అది పోవాలంటే రైతులు తమ ధాన్యాన్ని గ్రామాల్లోని మహిళా సంఘాలు, సెల్ఫ్‌హెల్ప్ గ్రూపులకు అందించాలి. వీరు ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తరు. ఉత్పత్తికి మరింత విలువ కలుపుతరు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే పండించిన వాటిని మహిళా సంఘాలే కొంటయి. ప్రాసెసింగ్ చేస్తయి. ఉదాహరణకు.. టమాటాలను తీసుకుంటే, మొత్తం వాళ్లే కొంటారు. అవసరానికి మించి ఉన్న టమాటాలను ఉప ఉత్పత్తులుగా మార్చుతరు. వడ్లను బియ్యంచేసి దేశంలో, బయట అమ్ముతరు. కూరగాయలను కూడా ప్రాసెస్ చేస్తరు. పండించిన ఆలుగడ్డలను చిప్స్, లేదా ఇంకేమన్న చేయడమా చూస్తరు. ఇదే ఫుడ్ ప్రాసెసింగ్.

ముంబై మురికివాడ ఉత్పత్తుల టర్నోవర్ రూ.1176 కోట్లు
ముంబైలో ధారావి అనే మురికివాడ ఉంది. అక్కడ ఒక మహిళ క్రియాశీలకంగా ఆలోచించి పేద మహిళలను జమచేసి, పాపడ్ తయారీ ప్రారంభించారు. ఆ పాపడ్ పేరు లిజ్జత్. దేశవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది. ఆ సంస్థ టర్నోవర్ రూ. 1176 కోట్లు ఉంది.

రేషన్‌షాపులద్వారా కల్తీలేని సరుకులు
రైతులు పండించిన మిర్చిని, పసుపును మహిళా సంఘాలే కొనుగోలు చేస్తయి. వీరు పొడిచేసి అమ్ముతరు. రాష్ట్రంలో రేషన్‌డీలర్లు మా కడుపు నిండుతలేదు, జీతాలు పెంచాలని కోరుతున్నరు. భవిష్యత్‌లో వాళ్లకు ఆ బాధ ఉండదు. మహిళా సంఘాలు తయారుచేసే శుద్ధమైన వస్తువులను మన రేషన్‌డీలర్లద్వారా అన్ని గ్రామాలకు సరఫరాచేస్తం. అటు రేషన్‌డీలర్ల వ్యవస్థ పటిష్ఠమవుతుంది. నెలంతా తెరిచి ఉంచేలా రేషన్‌షాపులను తీర్చిదిద్దే ప్రయత్నంతోపాటు, వారి జీతాలను పెంచే విషయంలో ఎన్నికల తర్వాత చర్చిస్తం. కేవలం బియ్యం ఇయ్యడమే కాదు మిగతా సరుకులు కూడా పంచుతం. మనం పండించినవి మనమే తింటం. మన భూమిలో, మన వాతావరణంలో పెరిగిన తిండి తింటే ఆరోగ్యం బందవస్తుగా ఉంటది. ఇది ఐక్యరాజ్యసమితి చెప్పిన సంగతి.

ఐకేపీ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తం
ఈ ఫ్యాక్టరీలన్నీ మహిళా సంఘాలే నడిపిస్తయి. ఇవన్నీ ఐదారువేల మంది ఉన్న ఐకేపీ ఉద్యోగులే చేస్తరు. రైతుల పక్షాన మహిళా సంఘాలు చేసే ఈ ప్రక్రియలో ఐకేపీ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తం. ఆ పూచీ నాది. మీరు మహిళా సంఘాలకు మద్దతుగా ఉండాలి.

రైతు సమన్వయసమితి వారికి గౌరవవేతనం
రైతుల సంక్షేమంకోసం రైతు సమన్వయ సమితిని ఏర్పాటుచేశారు. రైతు సమన్వయ మిత్రులు కంకణబద్ధులై పనిచేయాలి. ఐకేపీ ఉద్యోగుల వలె సమన్వయ సమితివారికి గౌరవ వేతనం కల్పిస్తం. దీంతో వారు క్రియాశీలకంగా పనిచేస్తరు. రైతు సమన్వయ సమితి మిత్రులు ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ల విషయాన్ని చర్చకు పెట్టాలి. కరపత్రాలు వేయించండి. ప్రచారం చేయించండి. మహిళా సంఘాలు, రేషన్ వ్యవస్థ ఎట్ల మారబోతున్నదో రైతులకు సవివరంగా చెప్పాలి.

సంపద పెంచాం.. పేదలకు పంచాం
రాష్ట్రం వచ్చిన తరవాత ఒక్కో అడుగు ముందుకువేస్తున్నం. ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వెళ్తున్నం. సంపద పెంచుతున్నం. పేదలకు పంచుతున్నం. కల్యాణలక్ష్మిలాంటి పథకం ఇండియాలోనే ఎక్కడాలేదు. లక్షా నూటపదహారు రూపాయలను ఆడబిడ్డలకు ఇస్తున్నం. దేశంలోనే అత్యధికంగా వేతనం పొందుతున్న అంగన్‌వాడీలు, హోంగార్డులు, కాంట్రాక్టు-ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నరు. ట్రాఫిక్ పోలీసులకు ఊపిరితిత్తులు దెబ్బతింటయని 30% రిస్క్ అలవెన్స్ ఇస్తున్నది దేశంలో తెలంగాణ ప్రభుత్వం ఒక్కటే. తెలంగాణ వేరుపడ్డప్పుడు శాపాలు పెట్టారు. వేరుపడ్డవారే ఇప్పుడు ఆశ్చర్యపోయే పరిస్థితి. ఇవి ఎట్ల సాధ్యమైతది? నేను, హరీశ్‌రావు, రామలింగారెడ్డి ఏమైనా దోపిడీ చేస్తున్నమా? నోరు, కడుపుకట్టుకొని పనిచేస్తున్నం. మునుపటిలెక్క అరాచకాలు లేవు. కుంభకోణాలు, లంబకోణాలు లేవు. పేకాట క్లబ్బులు లేవు. శాంతిభద్రతలు బాగున్నయి. పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నయి. సంపద ఎట్లయితే పెరుగుతన్నదో అట్లనే పేదలకు దానిని పంచుతున్నం.

ఈ గడ్డమీద పుట్టిన..
ఇదే గడ్డమీద పుట్టాను. మీ చేతుల్లో పెరిగాను. మీరందించిన బలంతో తెలంగాణ సాధన కోసం బయలుదేరాను. విజయం సాధించాను. శత్రువులు, గిట్టనివారు కరంట్ ఉండదని, నీళ్లు రావని, ఏపీలో మళ్లీ కలుస్తుందని అపోహలు సృష్టించారు. వాటిన్నింటినీ పటాపంచలుచేస్తూ నంబర్‌వన్ రాష్ట్రంగా తెలంగాణ ముందుకుపోతున్నది. యువకుడు, క్రియాశీలకంగా పనిచేసే హరీశ్ ఇక్కడే ఉన్నాడు. చైతన్యం మీలో ఎక్కువ. మీకు అన్నీ తెలుసు. సిద్దిపేట, దుబ్బాక సభ అంటే దాదాపు లక్షమంది కనిపిస్తున్నారు. హరీశ్‌రావు, రామలింగారెడ్డి ఇద్దరూ జోడుగుర్రాల్లా పనిచేస్తున్నారు. వీరిద్దరూ లక్ష మెజారిటీతో గెలుస్తరు. ఈ రోజే ఎన్నికలైపోయాయి. ఇక మిగిలింది కేవలం తంతు మాత్రమే! మీ ఉత్సాహానికి ధన్యవాదాలు. సిద్దిపేటలో పుట్టినందుకు నేను, సిద్దిపేటలో గెలిచినందుకు హరీశ్, దుబ్బాకలో గెలిచినందుకు రామలింగారెడ్డి కొన్ని మాటలు చెప్పాం. మాట నిలబెట్టుకున్నాం. ఇప్పుడు కండ్లల్ల ఆనందబాష్పాలు వస్తున్నాయి. కలలు నిజమైనాయి.

రెండేండ్లలో సిద్దిపేట నుంచి రైలు పోతది
ప్రాజెక్టులన్నీ పూర్తవుతున్నాయి. రెండేండ్లలో సిద్దిపేట నుంచి రైలు పోతది. ఎన్నో రోజుల కల అయిన జిల్లాను ఏర్పాటు చేసుకున్నాం. ఒకప్పుడు మెడికల్ కాలేజీ అంటే తెలియదు. మెడికల్ కాలేజీ ఏర్పాటుచేసుకున్నాం. చాలా పనులు జరిగాయి. హుషారైన ఎమ్మెల్యేలున్నారు కాబట్టి.. అభివృద్ధి జరుగుతున్నది. మిత్రుడు రామలింగారెడ్డి జర్నలిస్టుగా వచ్చి కష్టపడి పైకి వచ్చాడు. మీ దీవెనతో ఎండనక వాననక మీ ప్రాంతంలో మిషన్ భగీరథను విజయవంతం చేసుకున్నాడు. డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టించాడు. చాలా విషయాల్లో అద్భుతంగా ముందుకు పోతున్నారు. హరీశ్‌రావు, రామలింగారెడ్డి.. ఇద్దర్నీ మీరందరూ దీవించాలి.

పెద్ద మనస్సుతో సేవ చేసే భాగ్యం కల్పించండి : సోలిపేట రామలింగారెడ్డి

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గ ప్రజలు పెద్ద మనస్సుతో ఓటు వేసి సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని దుబ్బాక టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కోరారు. సీఎం కేసీఆర్ ప్రోత్సాహం, ఆశీస్సులతో దుబ్బాక నియోజకవర్గంలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి గోదావరి జలాలను అందిస్తున్నామని చెప్పారు. దుబ్బాక ప్రజల జీవనాడి అయిన కూడవెళ్లి వాగును జీవ నదిలా మార్చుతామని హామీ ఇచ్చారు.

కష్టసుఖాల్లో వెన్నంటి ఉన్నా : మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మీ కష్ట సుఖాల్లో, పండుగల్లో మీ వెంట ఉన్నా.. ఇప్పుడు పరీక్షా సమయం వచ్చింది.. ఎన్ని మార్కులు వేస్తారో మీ చేతుల్లో ఉంది.. మీ కొడుకు పదో తరగతి పరీక్ష రాస్తే మీరందరు మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులు కావాలని కోరుకుంటారు.. మీ కొడుకులా, ఒక కుటుంబసభ్యుడిగా నేను పరీక్షల్లో మీ ముందు నిల్చున్నానని, నాలుగున్నరేండ్లుగా నేను చేసిన అభివృద్ధి మీ కండ్ల ముందే కనిపిస్తున్నది. నేను చేసిన పనికి పరీక్ష రాస్తున్నా.. ఎన్ని మార్కులు వేసి దీవిస్తారో అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రచార సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. సీఎం కేసీఆర్ దీవెనలు.. ప్రజల ఆశీస్సులతో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవ చేసే అదృష్టం కలిగిందన్నారు. సిద్దిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నామని మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు.

1.తెలంగాణను పంటకాలనీలుగా ఏర్పాటు చేసుకోవడం.. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏ పంట ఎక్కడ ఎప్పుడు వేయాలో నిర్ధారించడం.
2.పండిన పంటకు డిమాండ్ లేక రైతులు నష్టపోయే రోజులు ఇక మీదట ఉండకుండా మహిళా సంఘాల సహకారంతో కొనుగోలు చేయడం..
3.మహిళా సంఘాలు మిగులు పంటను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఉప ఉత్పత్తులుగా మార్చి స్వదేశీ, విదేశీ మార్కెట్లో విక్రయిస్తారు.
4.మహిళా సంఘాలు ప్రాసెసింగ్ చేసిన నాణ్యమైన ఉత్పత్తులను రేషన్‌షాపులకు చేరవేస్తాయి. ఈ షాపులు నెలంతా సేవలు అందించేలా చర్యలు.

లక్ష్యాలు
-రైతాంగానికి గిట్టుబాటు ధర
-ప్రజలకు కల్తీలేని నాణ్యమైన ఆహారం
-ఐకేపీ ఉద్యోగులకు ఆత్మగౌరవ జీవనం
-రేషన్ డీలర్లకు మెరుగైన ఆదాయం

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.