Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మాజీ సైనికులకు ఇండ్లు

బంగారు తెలంగాణ నిర్మాణంలో మాజీ సైనికులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మాజీ సైనికుల సహకారం కూడా అవసరమని ఆయన అన్నారు. కరీంనగర్ జిల్లా చిన్న ముల్కనూర్ గ్రామజ్యోతి కార్యక్రమంలో మాజీ సైనికులు పాల్గొనడం ప్రజల్లోకి ఒక మంచి సందేశాన్ని తీసుకువెళ్లిందని ఆయన అభిప్రాయపడ్డారు.

CM KCR meet with former army soldiers

-భృతి 3వేలనుంచి 6వేలకు పెంపు -వచ్చే బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు -వరాలు కురిపించిన సీఎం కేసీఆర్ -కలిసి భోజనం, రాష్ట్ర పరిస్థితిపై వివరణ -బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలని పిలుపు రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికుల గౌరవ భృతిని రూ.3వేలనుంచి రూ. 6వేలకు పెంచుతున్నట్టు సీఎం ప్రకటించారు. ఆర్థికంగా వెనుకబడిన మాజీ సైనికులకు బలహీనవర్గాల గృహనిర్మాణ పథకంలో కొంత శాతం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే తెలంగాణ రాష్ర్టానికి చెంది ప్రతిభ కనబరిచిన సైనికులను వచ్చే రాష్ర్టావతరణ దినోత్సవాల్లో ఘనంగా సన్మానిస్తామని తెలిపారు. వచ్చే బడ్జెట్‌లో మాజీ సైనికుల సంక్షేమానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. గురువారం మధ్యాహ్నం క్యాంపు కార్యాలయంలో మాజీ సైనికోద్యోగులు, మాజీ పోలీస్ అధికారులతో సీఎం సమావేశమయ్యారు.

ముందుగా వారితో కలిసి భోజనం చేసిన సీఎం అనంతరం వారినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ రాష్ర్టానికి చెందిన వివిధ అంశాలను వారితో పంచుకున్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డీజీపీ అనురాగ్‌శర్మ, సైనిక్ వేల్ఫేర్ ఆఫీసర్ శ్రీనేశ్‌కుమార్, డైరెక్టర్ సైనిక్ వేల్ఫేర్ కల్నల్ రమేష్‌కుమార్, మాజీ సైనిక ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఎం సురేశ్‌రెడ్డి, రిటైర్డ్ ఐజీలు వీ భాస్కర్ రెడ్డి, సీ రత్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు త్వరలో పరిష్కరిస్తా.. మాజీ సైనికులు తన దృష్టికి తెచ్చిన సమస్యలు చాలా చిన్నవని, వాటన్నింటినీ ప్రభుత్వం అతి త్వరలో పరిష్కరిస్తుందని సీఎం భరోసా ఇచ్చారు. మీనుంచి ఆరుగురి పేర్లు ఎంపిక చేసి ఇవ్వండి. భవిష్యత్‌లో ప్రభుత్వానికి, మీకు మధ్య వారు వారథిలాగా ఉండి పనిచేస్తారు అని కేసీఆర్ సూచించారు. జిల్లాల వారీగా మాజీ సైనికులు ఇచ్చిన సమస్యలను క్రోడీకరించి తనకు అందజేయాలన్నారు. ప్రభుత్వ ప్రధాన కారద్యర్శి, రాష్ట్ర డీజీపీ, హోంశాఖ కార్యదర్శి తాను కలిసి మాజీ సైనికోద్యోగుల సంక్షేమం కోసం ఒక వ్యూహాన్ని రూపొందిస్తామని సీఎం తెలిపారు.

మనోభావాలు పంచుకున్న సీఎం… సీఎం తన ప్రసంగంలో రాష్ర్టానికి సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమం, తదనంతర పరిణామాలు, తెలంగాణ ఏర్పాటు కావడానికి ముందు పరిస్థితులు, ఆ తరువాత జరుగుతున్న అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను సీఎం మాజీ సైనికులకు వివరించారు. ఆర్థికంగా బాగున్నాం. ధనిక రాష్ట్రంగా పేరు తెచ్చుకున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం రూ.95 వేల కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నాం. మన ఆర్థిక వృద్ధిరేటు బాగుందని నిర్ధారణ అయింది. భవిష్యత్‌లో రాష్ట్ర బడ్జెట్ రూ.1.58 లక్షల కోట్లకు పెరుగుతుంది. మనది ఏ -వన్ రాష్ట్రమని సర్వే సంస్థలు తేల్చాయి. ఉన్నంతలో వ్యూహం వేసుకొని తెలంగాణ ముందుకు పోతున్నది. అని ఆర్థికస్థితిని తెలిపారు.

సాగునీటి రంగంలో అన్యాయం జరిగింది.. ఇవాళ తెలంగాణ వేసే ప్రతి అడుగు భవిష్యత్‌కు పునాది అవుతుంది. అందుకే ప్రభుత్వం కొన్ని ప్రాధాన్యతలను గుర్తించింది. సాగునీటి రంగంలో ఉమ్మడి రాష్ట్రంలో తీరని అన్యాయం జరిగింది. అది సవరించడానికి సరైన ప్రణాళిక ఉండాలి. మన నీళ్లు- మన హక్కు. అవి మనకు వచ్చి తీరాలి. ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి రాష్ట్ర శాసన సభకు ఇచ్చిన సమాచారంలో తెలంగాణకు 1280 టీఎంసీల కృష్ణా, గోదావరి జలాలు కేటాయించామని, ప్రాజెక్టుల వారీగా లెక్కలు చెప్పారు. అంటే 1280 టీఎంసీల నీరు తెలంగాణ హక్కు అన్నమాట.

రాష్ట్రంలో కోటి రెండు లక్షల ఎకరాల భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉంది. ఈ భూమిని సాగు చేయడానికి వేయి టీఎంసీల నీరు చాలు. అలానే మిగిలిన 200 టీఎంసీల నీరు ఇతర అవసరాలకు సరిపోతాయి. మనకు ఏది కేటాయిస్తే అది చాలంటున్నాము. అయినా ఆంధ్రప్రదేశ్ ఆటంకాలు కలిగిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో అంతరాష్ట్ర వివాదాలకు తావు లేకుండా తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా డిజైన్ చేయలేదు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకూడదనేదే వారి ఆలోచన. ఉదాహరణకు ప్రాణహిత- చేవెళ్ల. తమ్మిడి హట్టి నుంచి చేవెళ్లకు నీరు ఎలా వస్తుందో అర్థం కాదు. వారు రూపొందించిన ప్రాజెక్టులన్నీ కాగితాలకే పరిమితం. అందుకే నీటి పారుదల ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. అని చెప్పారు.

2018 నాటికి మిగులు విద్యుత్ విద్యుత్ విషయానికి వస్తే కోతలు లేని కరెంటును ప్రస్తుతం అందించగలుగుతున్నాం. భవిష్యత్‌లో 2018 నాటికి మిగులు విద్యుత్ ఉత్పత్తికి రంగం సిద్ధమైంది. పరిశ్రమలు ఉద్యోగాలకు, ఉత్పాదకతకు దోహదపడతాయి. అందుకే ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నాం. ఇంటింటికి నల్లాల ద్వారా నీరు అందించేందుకు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును రూపొందించి అమలు పరుస్తున్నాం. హడ్కో, నాబార్డు లాంటి ఆర్థిక సంస్థలు నిధులను సమకూరుస్తున్నాయి. రాష్ట్రం వివిధ రంగాలలో ముందుకు పోతున్నది. అని కేసీఆర్ వివరించారు.

రాష్ట్ర పునర్నిర్మాణంలో పాల్గొంటాం: మాజీ సైనికోద్యోగులు ముఖ్యమంత్రి కేసీఆర్ సందేశాన్ని అసాంతం విన్న మాజీ సైనికోద్యోగులు తాము రాష్ట్ర పునర్నిర్మాణంలో పాల్గొంటామని తెలియజేశారు. అంతకుముందు మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు, జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు సమస్యలపై విజ్ఞాపన పత్రాలు అందజేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాజీ సైనికులతో కలిసి భోజనం చేసి వారిని గౌరవించలేదని కెప్టెన్ లక్ష్మీకాంతారావు ప్రశంసించారు. ఈ సందర్భంగా గ్రూప్ కెప్టెన్ డీజేరావు రచించిన బంగారు తెలంగాణ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. మాజీ సైనికోద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కెప్టెన్ ఎం సోమేశ్‌రెడ్డి మాట్లాడుతూ మాజీ సైనికులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విషయం గుర్తు చేశారు.

పేరు గొప్ప ఊరు దిబ్బ గత ప్రభుత్వాలు చెప్పినవన్నీ వింటుంటే ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. హైదరాబాద్ నగరానికి ఏమేమో చేశామని గొప్పలు చెపుతారు. అవన్నీ నిజాలు కావు. ఉదాహరణకు జూబ్లీ హాల్ లాంటి సమావేశ భవనం హైదరాబాద్‌లో మరొకటి లేనే లేదు. గత ప్రభుత్వాలు నిర్మించలేదు. ఇప్పుడు జూబ్లీహాలు ఏపీ కౌన్సిల్‌కు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం దానిని వాడుకోలేని పరిస్థితి. ముఖ్యమైన సమావేశాలు నిర్వహించుకుందామంటే నగరంలో సరైన భవనం లేదు. ముఖ్యమంత్రి నివాసానికి పార్కింగ్ స్థలం లేదు. డీజీపీకి కాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కానీ నివసించడానికి సరైన వసతి లేదు. అయినా తామంత మేధావులే లేరన్నట్టు గత ప్రభుత్వ పాలకులు చెప్పుకుంటారు. ఆఖరికి 40 వేల మందికి పైగా ఉన్న మాజీ సైనికోద్యోగులున్నరు. మీ కార్యక్రమాల నిర్వహణకు సరైన భవనమన్నా ఉందా అంటే అది కూడా లేదు. అని సీఎం అన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.