Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మక్క..వోని రైతు దీక్ష

-సర్కారు మాటకే సై నియంత్రిత సాగుకే జై
-మక్కజొన్న సాగు ఊసెత్తని అన్నదాత
-10 లక్షల ఎకరాలకు బదులు 50 వేలే
-ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రైతుదీక్ష
-ప్రభుత్వం మాటతో రైతులు సంఘటితం
-విజయవంతమవుతున్న నియంత్రితసాగు
-భవిష్యత్తులో సాధించబోయే గొప్ప విజయాలకు నాంది
-వ్యవసాయంపై సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

తెలంగాణ వ్యవసాయరంగం దేశంలోనే ఒక అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించబోతున్నది. తెలంగాణ రైతులు యావత్‌ దేశ రైతాంగానికి ఆదర్శంగా నిలువబోతున్నారు. నిన్నమొన్నటిదాకా ఎవరికి వారన్నట్టుగా అసంఘటితంగా ఉన్న తెలంగాణ రైతులోకం ప్రభుత్వం ఇచ్చిన ఒకే ఒక్క పిలుపునకు స్పందించి సంఘటితమయ్యారు. ఏ ప్రాంతంలో ఏ పంట వేయాలో ప్రభుత్వం ఇచ్చిన సూచనలను వందకు వందశాతం పాటించారనడానికి రాష్ట్రంలో మక్కజొన్న సాగు ఊసు ఎత్తకపోవడమే నిదర్శనం. వానకాలంలో కాకుండా, యాసంగిలో మక్కలు వేసుకుందామన్న ప్రభుత్వం మాటకు ప్రతి ఒక్క రైతు కట్టుబడి ఉండటం చరిత్రాత్మకం.

రాష్ట్రంలో నియంత్రిత వ్యవసాయం అద్భుతంగా విజయం సాధించబోతున్నదని, దేశ వ్యవసాయ చరిత్రలో ఇదొక అద్భుతమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఒక ప్రభుత్వం చెప్తే అసంఘటితంగా ఉన్న రైతులు సంఘటితమై ఆ విధానాన్ని తు.చ తప్పకుండా అనుసరించడమనేది దేశ చరిత్రలో ఇప్పటివరకు ఎక్కడా చూడలేదని వ్యాఖ్యానించారు. అంతటి మహత్తర ఘట్టం ఇప్పుడు తెలంగాణలో ఆవిష్కృతమైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మక్కజొన్న సాగువిషయంలో రైతులు పాటించిన క్రమశిక్షణే ఇందుకు నిదర్శనమని చెప్పారు. నియంత్రిత సాగు, రైతుబంధు, రైతువేదికల నిర్మానం తదితర వ్యవసాయ అంశాలపై సీఎం కేసీఆర్‌ శనివారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ప్రభుత్వం వద్దని చెప్తే రైతులెవరూ మొక్కజొన్న వేయలేదని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. ప్రతి వానకాలంలో మక్కజొన్న 8-10 లక్షల ఎకరాల్లో సాగుచేసేవారని, ఇప్పుడు 50 వేల ఎకరాలు కూడా వేయలేదన్నారు. ఇది కూడా డెయిరీ, పౌల్ట్రీ అవసరాలున్నవారితోపాటు, నిజామాబాద్‌ జిల్లాలో పసుపు, అల్లం తోటల్లో దీన్ని అంతరపంటగా సాగుచేస్తున్నారని తెలిపారు. హైవేల పక్కన మక్కజొన్న కంకులు అమ్ముకొనే రైతులు కొందరు మక్కలు వేశారని తెలిపారు. ఈ రైతులు కూడా ప్రభుత్వ అనుమతి మేరకే సాగుచేశారన్నారు. రైతులు పండించిన పంటలకు మంచి ధర రావటమే లక్ష్యంగా ప్రభుత్వం నియంత్రిత సాగు పద్ధతిని సూచించిందన్నారు.

ఆ ప్రకారమే రైతులు వానకాలం పంటలు సాగుచేస్తున్నారని తెలిపారు. ఇది గొప్ప పరివర్తన అని పేర్కొన్నారు. రైతుల్లోని ఈ ఐక్యత, చైతన్యం భవిష్యత్తులో సాధించబోయే గొప్ప విజయాలకు నాంది పలికిందని, ఇది శుభసూచకమని అన్నారు. నియంత్రితసాగును విజయవంతంచేస్తున్న తెలంగాణ రైతులందరికీ సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. నియంత్రితసాగును ప్రోత్సహించడంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఆ శాఖ అధికారులు ఎంతగానో కృషిచేశారని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. నియంత్రిత సాగు ఉద్దేశాన్ని రైతులకు వివరించి, ఆ దిశగా సన్నద్ధం చేయడంలో కీలకంగా పనిచేశారని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు రైతులకు నియంత్రిత సాగుపై అవగాహన కల్పించారని ప్రశంసించారు. ఎక్కడికక్కడ రైతులు నియంత్రిత సాగుకు మద్దతు తెలుపుతూ ప్రతిజ్ఞలు చేసేలా ప్రేరణ కల్పించారని పేర్కొన్నారు. రైతుల స్పందన ప్రభుత్వానికి ఎంతో స్ఫూర్తినిస్తున్నదని, రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం మరింతగా పనిచేసేలా ప్రేరణగా నిలుస్తుందని సీఎం ప్రకటించారు. ఈ సమావేశంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, రైతుబంధుసమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ముఖ్య కార్యదర్శులు జనార్దన్‌రెడ్డి, రామకృష్ణారావు, నర్సింగరావు, సీడ్‌ కార్పొరేషన్‌ ఎండీ కేశవులు, వ్యవసాయశాఖ ఉపసంచాలకుడు విజయకుమార్‌, డీడీఏ శైలజ, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌ పాల్గొన్నారు.

ఒక సీఎం, ఒక ప్రభుత్వం పిలుపునిస్తే…

అసంఘటిత రంగంగా ఉన్న రైతులు సంఘటితమై చెప్పిన పంటలు మాత్రమే వేయడం వ్యవసాయ చరిత్రలోనే అరుదైనది, అపురూపమైనది. నియంత్రిత సాగు పద్ధతి వందకు వంద శాతం విజయవంతం కావడం శుభసూచకం. రైతుల్లోని ఈ ఐక్యత, చైతన్యం భవిష్యత్తులో సాధించబోయే గొప్ప విజయాలకు నాంది. రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కోసం మరింతగా పని చేసేందుకు ఇది ప్రేరణగా నిలుస్తుంది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.