-రాజకీయ సన్యాసం తీసుకుంటావా? -చంద్రబాబుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు సవాల్

రానున్న ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ కంటే ఎక్కువ సీట్లను టీఆర్ఎస్ గెలుపొందితే.. చంద్రబాబు తన పార్టీ దుకాణాన్ని మూసేస్తారా? అని టీఆర్ఎస్ఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు సవాల్ విసిరారు. ఈ మేరకు వరంగల్‌లో చంద్రబాబు విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఉప ఎన్నికల పార్టీ కాదని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ కంటే టీఆర్ఎస్కు ఎక్కువ సీట్లు వస్తే చంద్రబాబు రాజకీయ సన్యాయం తీసుకుంటారా? అని నిలదీశారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. పోలవరం డిజైన్ మార్చాలని, ఉమ్మడి రాజధాని వద్దని, గవర్నర్‌కు అధికారాలు ఇవ్వవద్దని, సీమాంధ్రలోని అక్రమ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వబోమని, రెండు రాష్ట్రాల విద్యార్థులకు ఉమ్మడి ప్రవేశాలు కల్పించవద్దని కోరుతూ చంద్రబాబుకు తాము సంధించిన ప్రశ్నలకు.. ఆయన ఇంకా సమాధానం చెప్పలేదని గుర్తుచేశారు.
తెలంగాణ భవన్లో గురువారం హరీశ్‌రావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఉప ప్రాంతీయ పార్టీ కంటే అధ్వాన్నంగా బీజేపీ ఆఫీసులో పొత్తుల కోసం టీడీపీ నేతలు పడిగాపుల కాస్తున్నారని విమర్శించారు. ఒకనాడు మోడీలాంటి వ్యక్తి దేశంలో ఉండటానికి అనర్హుడన్న చంద్రబాబే నేడు మోడీ బొమ్మ పెట్టుకుని ఓట్ల కోసం వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీతో పొత్తు చారిత్రాత్మక తప్పిదమని చెప్పిన బాబు.. మళ్లీ అదే పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు మాటమీద నిలబడే వ్యక్తి కాదన్నారు. తెలంగాణ సాధిస్తానని ప్రజలకు మాట ఇచ్చి.. రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ మాటమీద నిలబడే వ్యక్తి అని పేర్కొన్నారు. కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్ష వల్లే డిసెంబర్ 9 ప్రకటన సాధ్యమైందని, అప్పట్లో డిసెంబర్ 5న నిమ్స్‌కు వచ్చి కేసీఆర్ దీక్ష విరమించాలని, కాంగ్రెస్‌కు ప్రాణాలంటే లెక్కలేదన్న బాబు ప్రకటన వచ్చిన రోజు రాత్రికి రాత్రే కుట్ర పన్నారని తెలిపారు.
కేసీఆర్‌ది కుటుంబ పాలన అంటున్న చంద్రబాబు గురివింద గింజ కింద నలుపు తెలువదన్నట్టు మాట్లాడుతున్నారని, టీడీపీలో నిండా కుటుంబసభ్యులే ఉన్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కేసులు, జైళ్లు అనుభవించిన చరిత్ర కేసీఆర్ కుటుంబానిదని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే తెలంగాణ అమరవీరులను ఆదుకుంటామంటున్న చంద్రబాబే.. వారు అమరులు కావడానికి కారణమని ధ్వజమెత్తారు. డిసెంబర్ 9 ప్రకటన వచ్చిన రాత్రి కుట్ర చేయకపోతే 1,200 మంది అమరులయ్యేవారే కాదని పేర్కొన్నారు. ఎన్డీయే హయాంలో తెలంగాణ ఇస్తామంటే ఆయనే అడ్డుకున్నారన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌కు వెళ్లిన సమయంలోనూ విభజనకు వ్యతిరేకంగా జాతీయ నేతలందరినీ కలిశారని, కాళ్లుపట్టుకోవడం ఒక్కటే తక్కువని అన్నారు. ఇలా చేయలేదని చంద్రబాబు జిల్లాల్లోనే ఉన్న వెంక ఆలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధమా?, తెలంగాణ టీడీపీ నేతలు యాదగిరి లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో ప్రమాణం చేయగలరా? అని నిలదీశారు.
తక్కువ సమయంలో ఎక్కువ అబద్ధాలు చెప్పినందుకు చంద్రబాబును గిన్నిస్ రికార్డులో చేర్చాలని ఎద్దేవా చేశారు. తెలంగాణను తనే అభివృద్ధి చేస్తానంటున్న చంద్రబాబు 9 ఏళ్లలో తెలంగాణలో ఒక్క డిగ్రీ కాలేజీని ఎందుకు నెలకొల్పలేదని ప్రశ్నించారు. కులాన్ని బట్టి కాదు…. గుణాన్ని బట్టి దొరతనం చంద్రబాబు గడీల పాలన అంటున్నారని, నిజానికి దొరతనం కులాన్ని బట్టి కాకుండా గుణాన్ని బట్టి వస్తుందని హరీశ్‌రావు పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ జాతీయ నాయకుడు కూడా పెద్దకులానికి చెందినవారేనని, వారిని కూడా దొరలని అనగలరా? అని చంద్రబాబుపై మండిపడ్డారు. ఆంధ్రలోనే చుండూరు, కారంచేడు ఘటనలు జరిగాయని, తెలంగాణలో మాత్రం పోరాటాలున్నాయని అన్నారు. తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేస్తే అందులో చంద్రబాబు ఫొటో పక్కన ఒక్క తెలంగాణ నాయకుడి ఫొటో కూడా లేదని అన్నారు. పొత్తులపై టీఆర్ఎస్ తలుపులు ఎప్పుడో మూసివేసిందని, తమది ఒంటరిపోరేనని కేసీఆర్ పలుమార్లు చెప్పారని తెలిపారు. కాంగ్రెస్ జాతీయ నేతలతో తాము టచ్‌లో ఉన్నామన్న వార్త ఊహగానమేనన్నారు. విలేకరుల సమావేశంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రొళ్ల శ్రీనివాస్, కుత్బుల్లాపూర్ ఇన్చార్జి శంభీపూర్‌రాజు, శ్రీనివాస్‌డ్డి తదితరులు పాల్గొన్నారు. గద్వాల్ ఘటనపై చర్యలు తీసుకోవాలి మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్లో టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి జమాల్‌పై కాంగ్రెస్ నాయకులు దాడిచేయడాన్ని ఖండిస్తున్నామని హరీష్‌రావు అన్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.