Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మల్లన్నకు రైట్‌రైట్

-రిజర్వాయర్ నిర్మాణానికి మార్గం సుగమం -ముందుకొచ్చిన ఎర్రవల్లి రైతులు -మంత్రి హరీశ్‌కు ఒప్పంద పత్రాలు -123 జీవో ప్రకారమే భూములిచ్చేందుకు అంగీకారం -దీక్షా శిబిరాల్లోనే జోరుగా సాగుతున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియ -ముంపు గ్రామాల్లో పర్యటించనున్న హరీశ్‌రావు

Harish-Rao-interaction-with-Erravelli-villagers

కుట్రలు భగ్నమయ్యాయి. కారుమబ్బులు తొలిగిపోయాయి. మల్లన్నసాగర్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. నిన్నటిదాకా ఆందోళనలతో వార్తల్లోకెక్కిన ముంపు గ్రామాలు ఒకదాని వెనుక మరొకటిగా ప్రభుత్వంతో సహకరించేందుకు ముందుకొచ్చాయి. మొన్న ఏటిగడ్డకిష్టాపూర్, నిన్న పల్లెపహాడ్ గ్రామస్థులు ముందుకు రాగా గురువారం ఎర్రవల్లి గ్రామస్థులు కూడా 123 జీవో ప్రకారం తమ భూములను అప్పగించడానికి ముందుకు వచ్చా రు. ప్రధానంగా ఈ గ్రామాల్లోనే ఆందోళనలు జరిగాయి. ఇపుడు ఆ గ్రామాలన్నీ భూములు అప్పగించేందుకు ముందుకు రావటం విశేషం. మల్లన్నసాగర్ ముంపునకు గురయ్యే 8 ప్రధాన గ్రామాలు కూడా అంగీకరించడంతో హర్షం వ్యక్తమవుతున్నది. మరోవైపు ఏటిగడ్డ కిష్టాపూర్‌లో దీక్షలు నిర్వహించిన టెంట్లలో భూములు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగిస్తున్న అధికారులు, ఇపుడు పల్లెపహాడ్, ఎర్రవల్లి గ్రామాల్లో కూడా ఆందోళనలు చేసిన చోటే ప్రత్యేక క్యాంపుల్లో రిజిస్ట్రేషన్లు నిర్వహిం చేందుకు చురుగ్గా ఏర్పాటు చేస్తున్నారు. తాజా పరిణామాలు విపక్షాలకు షాక్ ఇవ్వగా.. ఉత్తర తెలంగాణ జిల్లాల రైతుల్లో ఆనందాన్ని నింపాయి. ఈ నేపథ్యం లో ముంపు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు భరోసా ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు నిర్ణయించారు.

మల్లన్నకు జై కొట్టిన ఎర్రవల్లి.. మల్లన్నసాగర్ నిర్మాణానికి సహకరించేందుకు కొండపాక మండలం ఎర్రవల్లి గ్రామ రైతులు ముందుకు వచ్చారు. సిద్దిపేట ఆర్డీవో కార్యాలయంలో గురువారం రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావును వారు కలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ సందేహాలను మంత్రి ముందు ఉంచారు. మంత్రి వారితో ఓపికగా చర్చించి 123 జీవోవల్ల ప్రయోజనాలు వివరించారు. ముంపు ప్రజలను అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. దీనితో రైతులు సంతృప్తి చెందిన రైతులు తమ భూములు అప్పగించేందుకు ఒప్పంద పత్రాల పై సంతకాలు చేసి మంత్రికి అందజేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ముందు మల్లన్న సాగర్ జై.. జైజై మల్లన్న సాగర్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులపై తమకు పూర్తి నమ్మకముందని రైతులు పేర్కొన్నారు. ప్రాజెక్టుకు భూములివ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ప్రతిపక్ష పార్టీల అసత్యాలను నమ్మేది లేదని తేల్చి చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో సీఎం కేసీఆర్‌కు అండగా ఉంటామని ప్రకటించారు. భూసేకరణను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని రైతులు కోరారు.

దీక్ష చేసిన గ్రామాలే ….. వాస్తవానికి ప్రాజెక్టుల అవసరం మీద రైతులకు ముందునుంచీ స్పష్టత ఉంది. ప్రభుత్వానికి ముంపు బాధితుల మీద స్పష్టత ఉంది. అయితే అభివృద్ధికి మోకాలడ్డే విపక్షాల రాజకీయాల కారణంగా అపోహలు తలెత్తాయి. ఫలితంగానే మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ ప్రధానంగా ఏటిగడ్డకిష్టాపూర్, పల్లెపహాడ్, ఎర్రవల్లి గ్రామాల ప్రజలు ఇప్పటి వరకు ఆందోళనలు జరిపారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం పార్టీ నేతలు ఈ గ్రామాల్లో బిచాణా వేసి ప్రజలను రెచ్చగొట్టి ఆందోళన చేయించారు. ఏటిగడ్డకిష్టాపూర్, ఎర్రవల్లి దీక్షలకు మద్దతు ఇస్తున్నామనే పేరుతో ఇక్కడికి వచ్చి స్థానికులను రెచ్చగొట్టారు. ఇదే అదనుగా అనేక సంస్థలు, సంఘాలు ప్రవేశించాయి. నోటికి వచ్చిన ప్రచారాలు చేసి గందరగోళం సృష్టించాయి. అయితే ప్రభుత్వం ఓపికగా గ్రామస్థులతో చర్చలకు తెరతీసింది. ముందు ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్తులు మంత్రి హరీశ్‌రావును కలిసి చర్చలు జరిపారు. అనుమానాలు నివృత్తి కావటంతో భూములిస్తామని అంగీకరించారు. దీక్షలు చేసిన పంచాయతీ వద్దనే భూములు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని ప్రకటించారు. గజ్వేల్, తొగుట తహసీల్దార్లు గ్రామానికి చేరుకొని భూములు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఈ ప్రక్రియను భగ్నం చేయాలని విపక్షాలు యత్నించినా గ్రామస్థులంతా ఓకే మాట మీద నిలబడటంతో వారి పాచిక పారలేదు. దీనితో గంగవెర్రులెత్తిన కొన్ని రాజకీయ పక్షాలు పల్లెపహాడ్, ఎర్రవల్లి గ్రామాల్లో ఆందోళనలను రెచ్చగొట్టాయి. రాజీవ్హ్రదారిపై ధర్నా పేరుతో ప్రజలను రప్పించి పోలీసులపై రాళ్లు రువ్వించారు. విపక్షాల వైఖరిని అర్థం చేసుకున్న పల్లెపహాడ్ గ్రామస్థులు బుధవారం మంత్రి హరీశ్‌రావును కలిసి మాట్లాడారు. చర్చల అనంతరం భూములిస్తామని ప్రకటించారు. ఇక చివరిగ్రామం ఎర్రవల్లి ప్రజలు కూడా వాస్తవాలు గమనించి గురువారం సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌లను కలిసి భూములు ఇవ్వడానికి అంగీకారం తెలిపారు. ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని స్పష్టం చేశారు.

ఏటిగడ్డకిష్టాపూర్ స్ఫూర్తి ఇవాళ ముంపు గ్రామాలు ఏటిగడ్డకిష్టాపూర్ బాటలోనే వస్తున్నాయి. దీక్ష శిబిరాలు ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ఆ గ్రామస్థులే స్వచ్ఛందంగా భూములివ్వడానికి ముందుకు రావడం ఇతర గ్రామాలను ఆలోచింపచేసింది. తమలో తాము చర్చించుకుని మంత్రి హరీశ్‌రావును కలిసి భూములిస్తామని వారు ప్రకటించారు. వాస్తవానికి మల్లన్నసాగర్‌కు సంబంధించి ప్రభుత్వ లక్ష్యాన్ని అర్థం చేసుకుని ముందుగా తొగుట మండలం తుక్కాపూర్ గ్రామస్థులు ముందుకు వచ్చారు. ఎలాంటి ఆందోళనలు లేకుండా స్వచ్ఛందంగా 2040 ఎకరాల పట్టాభూమిని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. గ్రామస్థులంతా ఏకతాటిపై నిలబడ్డారు. వారిని ముందుగా అభినందించాలి. కాగా ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటి వరకు 4,500 ఎకరాల పట్టాభూమిని రెవెన్యూ అధికారులు సేకరించారు. తొగుటలో 1087 ఎకరాల పట్టాభూమి సేకరించాల్సి ఉండగా కేవలం 50 ఎకరాలు మాత్రమే సేకరించాల్సి ఉంది. ఇక్కడ కూడా ఎవరి నుంచి వ్యతిరేకత రావడం లేదు. ఏటిగడ్డ కిష్టాపూర్‌లో 1592 ఎకరాలకు గాను 1100 ఎకరాల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యారు. తొగుట మండలంలోని ఎల్లారెడ్డిపేటలో 64 ఎకరాల సేకరణ పూర్తి అయ్యింది. పల్లెపహాడ్‌లో 813 ఎకరాలు, ఎర్రవల్లిలో 721 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఈ రెండు గ్రామాల్లో రేపటి నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనున్నది. ఈ గ్రామాల బాటలోనే వేములఘాట్, సింగారం, మంగోలు, తిప్పారం, కోనాయపల్లి గ్రామాల ప్రజలు ముందుకు వస్తున్నారు. కాగా ముంపు గ్రామాల్లో భరోసా నింపడానికి మంత్రి హరీశ్‌రావు రెండు రోజుల్లో ఏటి గడ్డకిష్టాపూర్ తదితర గ్రామాల్లో పర్యటించనున్నట్లు తెలిసింది. కుట్ర రాజకీయాలు చేసిన ప్రతిపక్ష పార్టీల నేతలకు తన పర్యటనతో బుద్ధిచెప్పాలని మంత్రి భావిస్తున్నట్లు సమాచారం.

ఫలించిన హరీశ్ సంప్రదింపుల ప్రక్రియ… ముంపు గ్రామాల సమస్యను మంత్రి హరీశ్‌రావు సంప్రదింపుల ప్రక్రియ ద్వారా పరిష్కరించారు. నేరుగా గ్రామస్థులను పిలిచి మాట్లాడటం ఎంతగానో ఉపయోగపడింది. గ్రామాల ప్రతినిధి బృందాల్లో అన్ని కులాలు, వర్గాల వారు ఉండేలా చూసుకుని ఏకాభిప్రాయం వ్యక్తమయ్యేలా జాగ్రత్త పడ్డారు. తన వద్దకు వస్తున్న ముంపు గ్రామాల ప్రజల అపోహలు తీర్చడంలో ఆయన సఫలీకృతులయ్యారు. 2103 చట్టం విషయంలో ప్రతిపక్షాలు చేసిన ప్రచారమే ప్రధానంగా రైతుల్లో అపోహలకు తావిచ్చింది. అయితే ప్రభుత్వం 123 ఎందుకు తెచ్చింది… దానివల్ల మెరుగైన ప్రయోజనాలేమిటి అనేది గణాంకాలతో ఆయన గ్రామస్థులకు వివరించారు, ఇది ఫలించింది. నిన్నటిదాకా 2013 చట్టం కావాలని డిమాండ్ చేసిన వారే ఇప్పుడు 123 జీవో ప్రకారం పరిహారం అందించాలని కోరుతున్నారు. ప్రధానంగా సీఎం కేసీఆర్ రైతులకు అన్యాయం చేయరనే విశ్వాసం వారిని ముందుకు రప్పించింది. ప్రతిపక్షాల మాటలు విని మోసపోవద్దని, కేసీఆర్ ప్రభుత్వం కడుపులో పెట్టుకుంటుందని హరీశ్ ఇచ్చిన హామీతో వారు సంతృప్తి చెందారు.

ప్రతిపక్షాలకు షాక్… తాజా పరిణామాలు విపక్షాలకు షాక్ ఇచ్చాయి. ముంపు గ్రామాల్లో సహజంగా ఉండే అభద్రతను రెచ్చగొట్టి ప్రాజెక్టును నిలిపివేద్దామనుకున్న వారి ఊహలు తలకిందులయ్యాయి. దీక్షా శిబిరాలు నిర్వహించిన గ్రామాలే ప్రభుత్వానికి సహకరించడంతో దిక్కుతోచని స్థితి ఏర్పడింది. అనేక సభలు నిర్వహించిన ఏటిగడ్డ కిష్టాపూర్ జారిపోవడంతో విపక్షాలు హింసను రెచ్చగొట్టేందుకు సైతం యత్నించాయి. అయితే ప్రజలు వీరి ఎత్తుగడలు గ్రహించారు. ఆందోళన వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా, ప్రభుత్వం అందించే ప్రయోజనాలు గుర్తించి ప్రతిపక్షాలకు దిమ్మతిరిగిపోయే షాకిచ్చారు. వాస్తవానికి ప్రాజెక్టుల అవసరం మీద రైతులు ముందునుంచీ స్పష్టంగానే ఉన్నారు. తొగుట మండలం తుక్కాపూర్ గ్రామస్థులు అందరికన్నా ముందు భూములు అప్పగించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అయితే విపక్షాలు చొరబడి ఇతర గ్రామాల్లో అపోహలు సృష్టించాయి. నిజం నిలకడ మీద తేలింది. రైతులు వాస్తవాలు గ్రహించి విపక్షాల కుట్ర రాజకీయాలను తరిమికొట్టారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురయ్యే 8 ప్రధాన గ్రామాలలో ఇప్పటికే ఏడు గ్రామాల్లో భూ సేకరణ పూర్తి కాగా గురువారం ఎర్రవల్లి గ్రామంలో కూడా స్వచ్ఛందంగా భూ సేకరణ జరిగింది. దీంతో ప్రాజెక్టు పనులు వేగంగా ప్రారంభించేందుకు మార్గం సుగమమైందనే ఆనందం సర్వత్రా వ్యక్తమవుతున్నది.

ఎర్రవల్లి త్యాగం వెలకట్టలేనిది : హరీశ్‌రావు ఎర్రవల్లి గ్రామ రైతుల త్యాగాలు వెలకట్టలేనివని, మంచి నిర్ణయం తీసుకున్న రైతాంగానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ముంపు గ్రామాల రైతుల త్యాగాలు అసమానమని ప్రశంసించారు. సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం వద్ద రైతాంగాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజలకు ఏం కావాలో అది చేసే నాయకుడని అన్నారు. తెలంగాణలో కోటి ఎకరాల మాగాణిని సాధించాలనే లక్ష్యంతో మల్లన్న సాగర్ చేపట్టారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు రైతుల్లో లేనిపోని అపోహలు సృష్టించి విధ్వంసాలకు పాల్పడాయని చెప్పారు. కారుమబ్బుల్లా వచ్చిన ప్రతిపక్షాలు పార్టీలు ఆ మబ్బుల్లాగే తేలిపోయాయన్నారు. ముంపు గ్రామాల్లో మిగిలిన ఒకటి రెండు గ్రామాలు కూడా రెండు మూడు రోజుల్లో వస్తున్నాయన్నారు. ఇదే ఎర్రవల్లి గ్రామానికి చెందిన ఓ రైతు వంద గొర్లను అమ్మి బోర్లు వేస్తే ఒక్క బోరు కూడా పడలేదని, ఆ రైతు ఇవాళ సంతోషంగా భూమి ఇవ్వడానికి ముందుకు వచ్చాడని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు అరిచి గీ పెట్టినా, హరిహర బ్రహ్మాదులు అడ్డొచ్చినా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి తీరుతామని స్పష్టం చేశారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన రైతాంగానికి 123 జీవో ద్వారా మెరుగైన నష్టపరిహారం అందిస్తామన్నారు. ఆ పరిహారం కూడా సాధ్యమైనంత త్వరలోనే అందించి వేరే చోట త్వరగా భూములు కొనుక్కునేలా చూస్తామన్నారు. కలిసి రాని వారికి 2013 చట్టం ప్రకారం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్, జాయింట్ కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, సిద్దిపేట ఆర్డీవో ముత్యంరెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు మడుపు భూంరెడ్డి, ఎర్రవల్లి గ్రామ రైతులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.