-అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగిస్తాం
-రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతాం
-తెలంగాణను మరింత ముందుకు నడుపుతాం
-ప్రజలకు స్వయంగా లేఖలు రాయనున్న టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే అగ్రగామిగా ఉన్న తెలంగాణను అదేవిధంగా ముందుకు నడపడంతోపాటు రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు వీలుగా మరోసారి టీఆర్ఎస్కు ఓట్లువేసి ఆశీర్వదించాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రజలను కోరనున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు వినూత్న తరహాలో స్వయంగా లేఖలు రాయాలన్న ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు. దాదాపు 83.04 లక్షల కుటుంబాలున్న తెలంగాణలో సుమారు మూడున్నర కోట్ల జనాభా ఉన్నది. టీఆర్ఎస్ ప్రభుత్వాధినేతగా సీఎం కేసీఆర్ గత నాలుగున్నరేండ్ల కాలంలో ప్రజలకు నేరుగా ప్రయోజనాన్ని కలిగించే 40 రకాల పథకాలను తీసుకురావడంతో ప్రతి ఒక్కరికీ రెండు, మూడు పథకాల ద్వారా లబ్ధి చేకూరింది. రైతుబంధు, రైతుబీమా, ఆసరా పెన్షన్లు, రేషన్ బియ్యం, కంటి వెలుగు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఫీజు రీయింబర్స్మెంట్, ఓవర్సీస్ స్కాలర్షిప్, కేసీఆర్ కిట్స్, ఆరోగ్య లక్ష్మి తదితర పథకాలు రాష్ట్రంలోని మెజార్టీ కుటుంబాలకు అందాయి.
మరోవైపు గురుకుల పాఠశాలల్లో చాలామంది విద్యార్థులు చదువుతుండటంతో వారి తల్లిదండ్రులకు సాలీనా రూ.50 వేలవరకు ఖర్చుల భారం తప్పింది. గొల్ల, కుర్మలకు 80 శాతం సబ్సిడీతో గొర్రెలను, గంగపుత్రులు, ముదిరాజ్‌లకు ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేయడంతోపాటు సబ్సీడీపై ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, వృత్తి అవసరాలకు కావాల్సిన సామాగ్రిని పంపిణీచేసి బలహీనవర్గాలకు నూటికి నూరుశాతం సబ్సిడీతో రుణాలు అందించారు. అలాగే ఇల్లులేని వారికోసం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో సింగరేణి, విద్యుత్‌కార్మికులు భారీగా లబ్ధి పొందారు. అలాగే ఔట్సోర్సింగ్ ఉద్యోగులతోపాటు ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, హోంగార్డులు తదితర ఉద్యోగుల వేతనాలు భారీగా పెరిగాయి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల వల్ల దాదాపు రెండు కోట్ల మందికి నేరుగా లబ్ధి చేకూరినట్టు టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నట్లు తెలిసింది. ఎంప్లాయ్ ఫ్రెండ్లీగా ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం, ఆర్టీసీ ఉద్యోగులకు 44 శాతం చొప్పున ఫిట్మెంట్ ఇచ్చి వారికి చేరువైంది.
రాష్ర్టాభివృద్ధిపై పల్లెల్లో చర్చ
వినూత్న పథకాలతో ప్రజలను ఆకట్టుకున్న సీఎం కేసీఆర్.. ఇదేవిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింత ముందుకు నడిపేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలని లేఖల ద్వారా ప్రజలను కోరనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం తెలంగాణ ప్రజలు గత నాలుగున్నర ఏండ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, గత 60 ఏండ్లుగా కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధిని పోల్చిచూసుకుంటున్నారు. దీనిపై రాష్ట్రంలోని పల్లెల్లో ఇప్పటికే చర్చ మొదలైంది. గతంలో ఏనాడైనా పగటిపూట కరెంటు వచ్చిందా? తెలంగాణ రాగానే 24 గంటల కరెంటు ఎలా వచ్చింది? మనవాడు నాయకుడైతేనే మనకు న్యాయం జరుగుతుంది. అలాకాకుండా ఢిల్లీ మీదనో లేక అమరావతి మీదనో ఆధారపడేవారు అధికారంలోకి వస్తే మళ్లీ మనకు కరెంటు కష్టాలతోపాటు నీటి కష్టాలు వస్తాయి. ఈ కష్టాలు రాకూడదంటే మళ్లీ టీఆర్ఎస్కే పట్టం కట్టాలి అన్న చర్చ రాష్ట్రంలోని అన్ని వర్గాల్లో జరుగుతున్నది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్వయంగా ప్రజలకు లేఖలు రాస్తే ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు.