Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మళ్లీ గెలుపు మనదే

-నా చివరి రక్తపుబొట్టూ తెలంగాణకే అంకితం -500 కోట్లతో రాష్ట్ర రైతు సమాఖ్య ఏర్పాటు -ధరల నిర్ణయాధికారం సమాఖ్యకే.. వరంగల్ ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ -దేశంలో ఎక్కడాలేని విధంగా పరిపాలనా సంస్కరణలు -ప్రాజెక్టులను అడ్డుకుంటున్న కాంగ్రెస్ దద్దమ్మలు, సన్నాసులు -ప్రాణంపోయినా అభివృద్ధి కార్యక్రమాలు ఆగనివ్వనని ప్రతిజ్ఞ

తన చివరి రక్తపు బొట్టునూ తెలంగాణ కోసమే అంకితం చేస్తానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా బంగారు తెలంగాణ సాధించేవరకు మడమ తిప్పబోనని స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతును రాజు చేయాలన్నదే తన లక్ష్యమని కేసీఆర్ చెప్పారు. రైతులు కాలుమీద కాలేసుకుని కూసోని రంది లేకుండా ఉండాలన్న లక్ష్యంతో 500 కోట్లతో రైతు సమాఖ్య ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వచ్చే రోజుల్లో పంటల ధరల నిర్ణయాధికారం రైతు సమాఖ్యకే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదంతోనే టీఆర్‌ఎస్ పార్టీగా 16 ఏండ్లు ప్రస్థానాన్ని కొనసాగించి అధికారం చేపట్టామని, 2019లో కూడా ప్రజల మద్దతుతో బ్రహ్మాండమైన విజయం సాధిస్తామని చెప్పారు. గురువారం సాయంత్రం వరంగల్‌లో ప్రగతి నివేదన సభ పేరుతో జరిగిన బ్రహ్మాండమైన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధించినపుడు రాష్ట్రం విధ్వంసానికి గురై భయంకరమైన పరిస్థితులు ఉండేవని తెలిపారు. కరెంటు సమస్యనుంచి రాష్ర్టాన్ని గట్టెక్కించామని, 40 వేల కోట్లతో దేశంలో ఎక్కడా లేని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటున్నామని, దేశంలోనే అతిపెద్ద పాలనా సంస్కరణలు అమలు చేశామని చెప్పారు. గ్రామీణార్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు వ్యవసాయానుబంధ రంగాలకు భారీగా నిధులు సమకూర్చుతున్నామని చెప్పారు. రాష్ట్రంలోని గొల్లకుర్మలకు 84లక్షల గొర్రెపిల్లలు పంపిణీ చేస్తున్నామని, వీటి వల్ల రానున్న రెండేండ్లలో యాదవులకు నాలుగైదు ఈశాన్యరాష్ర్టాల బడ్జెట్‌ను మించిన సంపద సమకూరుతుందని చెప్పారు.

ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతున్న ప్రాజెక్టులను చూసి తమకు పుట్టగతులుండవనే భయంతో కాంగ్రెస్ కోర్టులకెక్కి అడ్డంకులు సృష్టిస్తున్నదని ఆయన మండిపడ్డారు. వారిని అడుగడుగునా ప్రజలే నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అభివృద్ధిని ఆగనివ్వనని, ఎన్ని బాధలు పడైనా సరే కచ్చితంగా బంగారు తెలంగాణ సాధిస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సభావేదికగా ఓవైపు 16 ఏండ్ల పార్టీ ప్రస్థానాన్ని.. మరోవైపు మూడేండ్లుగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు ఆయన నివేదించారు. టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి 16 సంవత్సరాల పాటు పార్టీ ఎదిగిన తీరును.. ఈ క్రమంలో ఎదురైన అవహేళనలు, సవాళ్లను ఎదుర్కొని ప్రజాబలంతో ముందుకు సాగిన వైనాన్ని వివరించారు. తర్వాత సమైక్యరాష్ట్రంనుంచి విధ్వంసమైన తెలంగాణను వారసత్వంగా తీసుకున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్కో సమస్యను పరిష్కరించి నూతన రాష్ర్టానికి పునాదులు నిర్మిస్తున్న వైనాన్ని వివరించారు. గ్రామీణార్థికాభివృద్ధికి తాము చేపట్టిన ప్రణాళికను వ్యవసాయం, వ్యవసాయానుబంధ రంగాలకోసం చేపట్టిన పథకాలను వివరించారు. రైతులు సంఘాలుగా ఏర్పడవలిసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. సభలో కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే…

సార్ ముందుగా మాట్లాడేవారు.. ఓరుగల్లు.. పోరుగల్లు. ఇదే గ్రౌండ్‌లో అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నం. కానీ కొంచెం బాధగా ఉంది. దుఖఃంగా ఉంది. అన్ని సభల్లో ప్రొఫెసర్ జయశంకర్‌సార్ ముందు మాట్లాడి.. తరువాత నేను మాట్లాడే వాడిని. దురదృష్టం వారు మన మధ్య లేరు. అయినా స్వర్గం నుంచి జయశంకర్ చూస్తున్నారు. ఆశ్వీరాదం చేస్తున్నారు. జయశంకర్ సార్ అమర్ రహే అని స్వర్గానికి వినిపించే విధంగా చప్పట్లతో నివాళి అర్పిద్దాం. ధాన్యం ధర రైతే నిర్ణయించాలి రైతుల రెండు పంటలకు ప్రభుత్వం పెట్టుబడి ఇస్తది. మీ వెంట ఉంటది. అయితే మన కార్యక్రమానికి మనమే కాపలాదారుగా ఉండాలె. ప్లాస్టిక్ ముక్కలు అమ్ముకునెటోల్లకు కూడా సంఘాలున్నయి. రైతుకే లేదు. రైతు సంఘాలు రావాలె. ఎవడైన వాడు తయారుచేసెదాని ధర వాడె చెప్తడు. కానీ మట్టి పిసికి పంటతీసే రైతుకు ఆ పరిస్థితి లేదు. పంట ధర రైతే చెప్పే పరిస్థితి రావాలె. మనం పట్టుబడితె వస్తది. మీ వెంట కేసీఆర్ ఉంటడు. కేసీఆర్ ఉంటే వస్తది.. వస్తదా? దయచేసి చేతులు ఎత్తి చెప్పండి. అందరం అనుకుంటె వస్తది. అట్ల వచ్చిన రోజు రైతు కాలుమీద కాలేసుకుని కూసోని రంది లేకుండ ఉంటడు. – ముఖ్యమంత్రి కేసీఆర్

ఉంటదా అన్నోడో పోయిండు.. టీఆర్‌ఎస్ పార్టీ 16 సంవత్సరాలు ముగించుకుంది. ప్రారంభమైన నాడు ఉంటదా, ముందల పడుతాదా అని, మఖలో పుట్టింది.. పుబ్బలో పోతది ఇంకొకడు మాట్లాడిండ్రు. వాడే పొయిండు కని మనం పోలే. 16 ఏండ్ల్లు పార్టీ.. మూడేండ్లుగా ప్రభుత్వం దిగ్విజయంగా పూర్తి చేసుకొని గమ్యాన్ని ముద్దాడినం. అన్ని వర్గాల ప్రజల ముఖాల్లో చిరునవ్వు చూసే బంగారు తెలంగాణ దిశగా ప్రస్థానమయ్యేది ప్రస్తుత మహాసభ. ఇంత భారీ స్థాయిలో బహిరంగ సభ పెట్టుకోవడానికి భారతదేశంలో ఏ పార్టీకి గుండెలు చాలవు. నాటి నుంచి నేటి వరకు అన్నం తిన్నం. అటుకులు బుక్కినం. ఉపవాసాలు ఉన్నం. లాఠీ దెబ్బలు తిన్నం. రాష్ర్టాన్ని సాధించుకోని వెనక్కి తగ్గలేదు. తెలంగాణ వచ్చింది. వచ్చినంక ఏం జరగాలి? అనేక అవస్థలు, వలసలు వర్ధన్నపేట, పరకాల, వరంగల్ నుంచి లక్షలాదిమంది సూరత్‌కు పోయారు.. టెక్స్‌టైల్ పార్క్ వస్తే మళ్లీ వస్తారు.

సమైక్య రాష్ట్రంలో జీవన విధ్వంసం.. సమైఖ్య రాష్ట్రంలో జీవన విధ్వంసం జరిగింది. రైతు ఆత్మహత్యలు చేసుకున్నరు.. చేనేత కార్మికుల ఆకలి చావులు. పటాకులు పేలినట్లు ట్రాన్స్‌ఫార్మర్లు , కరెంటు మోటార్లు కాలిపోయేవి. ఇదీ 2014 జూన్ 2న మన ముందు ఉన్న ముఖచిత్రం. ఈ సందర్భంలో ఏం చేయాలి? అన్నింటి కంటే ముందు తొలగించాల్సి బాధ కరెంటు బాధ. చాలా మంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. మేమింత సిపాయిలం మేమే చెయ్యలేదు. నువ్వు చేస్తవా అన్నరు. అద్భుతం చేస్తావా అన్నడు. ఆరు నెలల తిరగకముందే కరెంటు సమస్య తొలగించాం. ఒక్క కరెంటు మోటారు కాలిపోతలేదు. యాసంగిలో 23 జిల్లాల ఆంధ్ర కంటే ఎక్కువగా 9500 మెగావాట్ల లోడు వచ్చినా కరెంటు సైప్లె చేసినం. పరిశ్రమల్లో ఇప్పుడు మూడుషిప్ట్‌లు పనిచేస్తున్నారు. పవర్ హాలిడే లేవు. రూ. 40 వేల కోట్లతో దేశంలో ఎక్కడా లేని విధంగా బ్రహ్మాండమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. 40 లక్షల మందికి పెన్షన్ ఇచ్చేది భారతదేశంలో ఒక్క తెలంగాణనే.

చివరికి ఎక్కడిదాక పోయినం అంటే దవాఖానల్లో పేదలు చనిపోతే శవాలను ఉచితంగా తీసుకపోవడానికి పరమపదం పేరుతో వాహనాలు ఏర్పాటు చేసినం. పేదలకు రూపాయి ఖర్చు లేకుండా ఏజిల్లాకు అయినా తీసుకపోతున్నం. జీవన విధ్వంసం జరిగింది కాబట్టి సంక్షేమ కార్యక్రమంతో కాపాడుకోవాలి. పేదలను, వృద్ధులను, వితంతవులను అదుకోవాలి అనుకున్నం. అలాగే ప్రజలకు మంచి నీళ్ల బాధ శాశ్వతంగా పోవాలి. దాని కోసం రూ. 40 వేల కోట్లతో మిషన్ భగీరథ తీసుకున్నం. ఈ సంవత్సరం చివరి నాటికి గ్రామగ్రామాన కృష్ణా , గోదావరి నీళ్లు వస్తాయి. ఇప్పటికే ఆ పనులు మీ ముందు కనపడుతున్నాయి. తర్వాత పరిపాలన సంస్కరణలు జరగాలి. బెజ్జూరు నుంచి అదిలాబాద్ పోవాలంటే 300 కిలోమీటర్లు. నంగునూరు మండలం నుంచి సంగారెడ్డి పోవాలంటే 220 కిలోమీటర్లు. ప్రయాస. 31 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. 125 మండలాలు,60 పైచిలుకు రెవెన్యూ డివిజన్లు పెంచుకున్నం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పరిపాలన సంస్కరణలు చేశాం.

వృత్తిదారులను ఆదుకుంటాం.. నాయి బ్రహ్మణ సోదరులు మనకు క్షౌరాలు చేస్తేనే మంచిగా ఉన్నం. లేకుంటె గుడ్డేలుగుల్లెక్క కనపడుతం. ఆ సోదరులను ఆదుకోవాలి. 25 వేల నవీన క్షౌరశాలలను ఏర్పాటు చేస్తున్నం. ఈ సంవత్సరమే 25 వేల యూనిట్లు అందిస్తాం. బీసీల్లోని 93 కులాలు నిర్లక్ష్యానికి గురైనాయి. సంచార జీవులున్నరు. రజక సోదరులకు వాషింగ్ మిషన్లు, డ్రైయర్లు సప్లయ్ చేస్తం. వండ్రంగి, కమ్మరి, విశ్వకర్మ తదితర పంచకులాలకు రూ. 200 కోట్లు కేటాయించాం. గీత కార్మికులకోసం 5 కోట్ల ఈత, తాటి మొక్కలు పెంచుతున్నాం. మందు కల్లు బాధ పోవాలి. మంచి కల్లు మళ్లీ రావాలి. గీత కార్మికులు బాధ పోవాలి. వాళ్లు గొప్పగా బతకాలి. మత్స్యకార్మికులకు రూ. 1000 కోట్లు కేటాయించాం. మిషన్ కాకతీయ కింద 19వేల చెరువులు బాగు చేసుకున్నాం. 27 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేశాం. ఈ సంవత్సరం 50 కోట్లు ఉచితంగా పంపిణీ చేస్తాం.

మద్దతు ధర వస్తది.. కేసీఆర్ మీ వెంట ఉంటడు రైతులు బాగుపడాలి. రూ. 17 వేల కోట్ల రుణ మాఫీ చేసినం. సీఎంగా మొదటి శాసనసభ సమావేశంలో రైతాంగాన్ని ధనిక రైతాంగంగా తయారు చేయాలని చెప్పిన. క్రాప్ కాలనీలను తయారు చేస్తమని చెప్పిన. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే మన కార్యక్రమానికి మనమే కాపలాదారుగా ఉండాలి. ఇనుప ముకలు, ప్లాస్టిక్ సామాన్లు ఏరుకునే వారికి సంఘం ఉన్నది. కానీ, రైతులకు సంఘం లేదు. ఎవడైన వాడు తయారుచేసే దాని ధర వాడే చెప్తడు. కానీ మట్టి పిసికి పంటతీసే రైతుకు ఆ పరిస్థితి లేదు. పంట ధర రైతే చెప్పే పరిస్థితి రావాలె. మనం పట్టుబడితె వస్తది. మీ వెంట కేసీఆర్ ఉంటడు. కేసీఆర్ ఉంటే వస్తది…వస్తదా? దయచేసి చేతులు ఎత్తి చెప్పండి. అందరం అనుకుంటె వస్తది. అట్ల వచ్చిన రోజు రైతులు కాలుమీద కాలేసుకుని కూసోని రంధి లేకుండ ఉంటడు.

రెండు పంటలకు డబ్బులిస్తం.. వానాకాలం, యాసంగి రెండు పంటలకు పెట్టుబడి కింద ఎకరానికి రూ. 4 వేల చొప్పున రెండుసార్లు అందిస్తం. మొదటివిడతగా మే 15 లోపు రైతుకు బ్యాంకులో డబ్బులు జమ చేస్తం. రోహిణికార్తెలోపు ఇస్తం. యాసంగి పంటకు సంబంధించి అక్టోబర్ 15 లోపు వేస్తం. వీటితో పాటు కరెంట్, నీళ్లు ఉచితంగా ఇస్తం. ఇక పెట్టబడికి బాధలేదు. ఇలాంటి సందర్భంలో ఒకాయన అంటడు. రూ.2500 ఇస్తే ఎరువులకు సరిపోతయి కదా అన్నడు. రెండు యూరియా బస్తాలు వస్తయి.. చాలన్నడు. నాకు తెల్వదా? యూరియా రేటు ఎంతుంటదో. నేనుగూడ కాపుదానపోన్నే.. ఒక్క యూరియాతోనే అయిపోతదా? విత్తనాలు ఎవరిస్తరు? పురుగుమందులు కావాలె.అవన్నీ లెక్క పెట్టే ఎకరానికి నాలుగు వేలు అన్న. రైతు ఎవ్వరివద్దకు అప్పు కోసం వెళ్లవద్దు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే ఈ బృహత్తర కార్యక్రమం తెచ్చినం.

రైతు సమాఖ్యకు రూ. 500 కోట్లు.. పంటకు మంచి ధర రావాలె. దానికి నేను ఒక సూత్రం కనిపెట్టిన. దీనికోసం గ్రామంల రైతు సంఘం ఏర్పాటు కావాలె. గ్రామరైతు సంఘాల సమాహారంగా మండల సంఘం,మండల సంఘాల సమాహారంగా జిల్లా..తర్వాత రాష్ట్ర రైతు సంఘం ఏర్పాటు కావాలె. రాష్ట్ర రైతు సమాఖ్యకు ఐదు వందల కోట్ల నిధి ఇస్తం. రాష్ట్ర రైతు సమాఖ్య అధ్యక్షుడు అంటె ముఖ్యమంత్రి ఎంత పవర్‌ఫుల్ ఉంటడో.. అంత పవర్‌ఫుల్‌గ ఉంటడు. మనం పంటలు పండించంగనే.. ఈ గ్రామ, మండల, జిల్లా రైతు సమాఖ్య నాయకులు వ్యాపారుల వద్దకు వెళ్లి రైతు పండించిన పంటకు ధర ఎంతిస్తారని అడిగి, ఎక్కడ, ఎక్కువ ధర వస్తే అక్కడ ధాన్యం అమ్మకాలు జరుగుతాయి. లాభం వస్తది. ఇంతకు మునుపు లాగా రైతులు వ్యాపారుల వద్దకు వెళ్లి వాడు నిర్ణయించిన ధరకే ధాన్యం అమ్మడమంటే ఇక నుంచి జరుగదు. ధాన్యంలో తేమ శాతాన్ని చూసి తక్కువ ధర ఇచ్చేవారు. ఇక నుంచి ఇలాంటి మోసపూరిత వాతావరణం ఉండదు. తేమశాతం మీటర్లు రైతుల చేతుల్లో, రైతు సంఘాల చేతుల్లో ఉంటయి.. దేశంలో ఎక్కడ మంచి ధర వస్తదో అక్కడికి వెళ్ళి రైతు అమ్ముకునేలా చూస్తరు. రైతులకు మద్దతు ధర వస్తది. బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతం.

ప్రాజెక్టులను అడ్డుకుంటున్న కాంగ్రెస్ దద్దమ్మలు.. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ దద్దమ్మలు, సన్నాసులు కోర్టులకెళ్లి అడ్డుకుంటున్నారు. భక్త రామదాసు ప్రాజెక్టును కేవలం పదిన్నర నెలల్లోనే పూర్తి చేసి 60 వేల ఎకరాలకు సాగునీరు అందించినం. కాంగ్రెస్ గుండెలు అదిరినై. కాళేశ్వరం పూర్తిచేస్తే ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయితది. పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ చేస్తే మహబూబ్‌నగర్,రంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం అయితది. ఇవన్నీ పూర్తయితే మాకెవడు ఓటేస్తడని, రాజకీయ బతుకులేదని, కాంగ్రెస్ నాయకులు గ్రీన్ ట్రిబ్యునళ్లు, కోర్టులకు వెళ్లి టెక్నికల్ అడ్డంకులు సృష్టించి ఆపిస్తున్నారు. ప్రజలకు ద్రోహం చేస్తున్నరు. కోడిగుడ్డుమీద ఈకలు పీకి ఏదో చేద్దామని చూస్తున్నరు.. కాలుష్యం అనుమతులు లేవని.. తొక్క లేదని.. తొషాణం లేదని అడ్డుకుంటున్నరు..

ప్రాణం పోయినా అభివృద్ధి కార్యక్రమాలు ఆగనివ్వను.. ప్రాణం పోయినా సరే అభివృద్ధిని ఆగనీయను. ఎన్ని బాధలు పడైనా సరే ఖచ్చితంగా సాధిస్తానని మనవి చేస్తున్న. ఇప్పటి వరకు ప్రతి ఎన్నికల్లో బ్రహ్మాండంగా ఆదరించి విజయం అందించారు.. ఉప ఎన్నికలు వచ్చినా లోకల్ బాడీ,అసెంబ్లీ ఉప ఎన్నికలు కావచ్చు. వరంగల్ ఎంపీ స్థానానికి నాలుగు లక్షల 60 వేల మెజార్టీ అందించారు. ఇక మాకు గతి లేదనుకున్నరు. రకరకాల కథలు చేస్తున్నరు. సీపీఐ నారాయణ అన్నడు. హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిస్తే చెవ్వు కోసుకుంటనని అన్నడు..ఓట్లు లెక్కబెట్టే నాడు హైదరాబాద్‌లో ఉండవద్దు.. మీ చెవ్వు పోతదని చెప్పిన. ఒంటి చెవ్వు నారాయణను చూడలేనని చెప్పిన.. ఓడు చెవ్వు కోస్కుంట అంటడు. ఇంకోడు గడ్డం పెంచుకుంట అంటడు. 2019లో గెలిచినంక సూద్దాం.. ఎవడెవడు ఏమేం కోస్కుంటడో..

మంచి పేరు తెచ్చుకుందాం.. టీఆర్‌ఎస్ పార్టీ పిడికెడు మందితో ప్రారంభమై నేడు 75 లక్షల సభ్యత్వాలతో ముందుకు సాగుతున్నది. భారతదేశంలో ఒక మంచి రాజకీయ పార్టీగా తయారైంది. మనమందరం ప్రజల మధ్య ఉండి సంక్షేమ,అభివృద్ధి పనులను చేసి ప్రజల నుంచి మంచి పేరు తెచ్చుకోవాలె. 2019లో బ్రహ్మాండంగా గెలవాలి. ఈ దిశగా చివరి రక్తం బొట్టు వరకు తెలంగాణకే అంకితం చేస్తాను. బంగారు తెలంగాణ కోసం మడమ తిప్పకుండా పోరాడుతాను. తెలంగాణ ప్రజల కోసం పునరంకితమవుతాను.

నాడు నోర్మూసుకున్న సన్నాసులు.. ఉమ్మడి రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ దద్దమ్మలు.. సన్నాసులు పదవుల కోసం పైరవీల కోసం నోర్మూసుకున్నారు కాబట్టే ఈ రోజు ఈ కర్మ. దాని వల్లనే బతుకు దెరువు కోసం వలసలు పోయే ఖర్మ వచ్చింది. వారికి పౌరుషం, రోషం లేదు. వారి నిష్క్రియాపరత్వం వల్లనే తెలంగాణకు ఈ గతి వచ్చింది. 24 లక్షల బోర్లు వేసుకుని బోర్లపడ్డం. కరెంట్‌లేక సచ్చినం. అందుకే తెలంగాణ తెచ్చుకున్నం. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అహంకారంగా మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తెలంగాణకు అడ్డం కాదు.. నిలువు కాదని వెకిలిగా మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు ముసిముసి నవ్వులు నవిండ్రే తప్ప ఒక్కడు కూడా రాజీనామా చేయలే. కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో రాసుకో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని అన్నడు. ఆనాడు ఈ కాంగ్రెస్ నాయకులు అడ్డు చెప్పలేదు. ఇపుడు ప్రాజెక్టులను కడుతుంటే ఎక్కడికక్కడ స్టేలు తెచ్చిఅడ్డుకుంటున్నరు. ఇలాంటి కాంగ్రెస్ సన్నాసులను, శిఖండిలాగా అడ్డంపడుతున్న వారందరినీ నిలదీయాలి.

గ్రామీణార్థిక వ్యవస్థకు జవసత్వాలు.. నూటికి 60 శాతం మంది గ్రామాల్లో బతుకుతున్నరు. వృత్తి పనివారున్నరు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పడాలి. 70 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆ పని చేయలే. మనం చేస్తె ఏమంటున్నరు? గొర్రెపిల్లలు..సాప పిల్లలు అని వెటకారం చేస్తున్నరు. ఏం.. గొర్రెలు, చేపలు అవసరం లేదా? 30లక్షల గొల్లకుర్మలు ఉన్న మన రాష్ట్రంలో ప్రతి రోజు 650 లారీల గొర్రెలు దిగుమతి చేసుకుంటున్నం.. ఒక్క హైదరాబాద్‌కే 350 లారీల గొర్రెలు దిగుమతి అయితున్నయి. సింగరేణి ఇతర పట్టణాలకు మరో 300 లారీలు వస్తున్నాయి. గొర్రెలను దిగుమతి చేసుకునే కర్మ ఏమిటని వాళ్లు ఏనాడూ ఆలోచించలే. ఎందుకు చేయలేదు.. ఎందుకు అలోచించలేదు? మెడకాయ మీద తలకాయ ఉన్నోడు దీని గురించి ఎందుకు అలోచించరు? తెలంగాణ రాష్ట్రంల మనం ఆలోచించినం. ప్రతి గొల్లకుటుంబానికి గొర్రెలు ఉన్నయా లేవా అనే దానితో సంబంధంలేకుండా 21 గొర్రెలు యూనిట్‌గా రాబోయే రెండు సంవత్సరాల్లో 84 లక్షల పిల్లలు అందిస్తాం. మన దగ్గర ఇప్పటికే 50-60 లక్షల గొర్రెలున్నాయి. 84 లక్షల తెస్తున్నాం.. మనం ఇచ్చే వాటితో 1.70 కోట్లు అవుతాయి. రెండు సంవత్సరాలకు మూడు సార్లు ఈనుతయి. ఇవి రెండు సంవత్సరాల్లో 5.50కోట్లు అవుతాయి. వీటిలో 4 కోట్ల గొర్రెలను అమ్ముకుంటే ఒక్కో దాన్ని రూ.5వేలు అనుకున్నా రూ.20వేల కోట్లు గొల్ల కుర్మ సోదరులు సంపద సృష్టించబోతున్నారు. 20వేల కోట్లు అంటే ఈశాన్య భారతంలో రాష్ర్టాల్లో ఐదారు రాష్ర్టాల బడ్జెట్ కంటే ఎక్కువ. అంత శక్తి యాదవ సోదరుల్లో ఉంది. ఇందులో పైరవీలు ఉండవు. ఎవరికీ లంచాలు ఇవ్వద్దు…సొసైటీ మెంబర్లు అయితే చాలు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.