Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మళ్లీ మగ్గాల సందడి

-ప్రభుత్వ ప్రోత్సాహంతో కొత్త కళ -తెలంగాణ పట్టు చీరలకు భారీ డిమాండ్.. చేనేత కార్మికులకు ఎదురొస్తున్న అవకాశాలు -పట్నంలో పనులు మాని మగ్గాలెక్కిన నేతన్నలు.. పనికోసం పొరుగు రాష్ర్టాల కార్మికుల రాక -సాంకేతిక నైపుణ్యం కలిగినవారికి ఉపాధి దన్ను.. నెలకు రూ.30 వేలకు పైగా సంపాదన -సరికొత్త కంచి చీరలకు అనూహ్య డిమాండ్.. రాజధాని శివార్లలో కార్ఖానాల ఏర్పాటుకు ప్లాన్ -ఆమనగల్లు, హయత్‌నగర్‌లోనూ కొత్తమగ్గాలు

కొరవడిన ప్రోత్సాహం.. ముందుకొచ్చిన ఆధునికత ముప్పు.. చేసిన పనికి గిట్టుబాటు కూలీ దక్కని దుస్థితి! మగ్గాలు వదిలి.. పొట్టచేత పట్టుకుని పట్నానికి వలసలు! ఏటీఎంలోనో, అపార్ట్‌మెంట్లలోనో సెక్యూరిటీగార్డులుగా వెళ్లదీసిన బతుకులు! ఇది చేనేత రంగ దయనీయ గతం!! పెరుగుతున్న చేనేత ఉత్పత్తుల వినియోగం.. చేనేతను ప్రమోట్ చేయడంలో, ప్రోత్సహించడంలో మంత్రి కేటీఆర్ చొరవ! వెరసి.. వలసొచ్చిన పట్నంలోనే మగ్గాలు పెట్టుకుని, కొత్త జీవితంలో ఆధునాతన డిజైన్లను తీర్చిదిద్దుతున్న కళాకౌశలం! ఇది తెలంగాణ రాష్ట్రావతరణ అనంతర ఆశావహ వాతావరణం!

రాష్ట్రంలో చేనేతరంగం కొత్త కళను సంతరించుకుంది. అనూహ్యంగా డిమాండ్ విపరీతంగా పెరిగింది. దీంతో ఒకప్పుడు పొట్ట చేతపట్టుకుని హైదరాబాద్‌కు వలస వచ్చిన చేనేత కార్మికులు.. చిన్నాచితక ఉద్యోగాలను వదిలిపెట్టి.. మగ్గాలపై తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నిండైన చీరెలు, మెండైన బార్డర్లతో సరికొత్త నమూనాలతో చీరలు తయారు చేసే నైపుణ్యం ఉన్న కార్మికులు.. మళ్లీ తమ ప్రతిభను చాటుతున్నారు. వెండిజరీ, నాణ్యమైన సిల్క్‌తో చీరెలను నేయగల నేర్పును సొంతం చేసుకున్న తెలంగాణ చేనేత కార్మికులు.. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. అనంతపురం నుంచి ఇక్కడకు వలస వచ్చినవారు సైతం మళ్లీ చేనేత పనిలో నిమగ్నమవుతున్నారు. బ్రైడల్ కలెక్షన్‌కు అవసరమైన మెటీరియల్ రూపకల్పన సైతం ఇక్కడ సాధ్యపడుతున్నది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబైలకు చెందిన ప్రముఖ డిజైనర్లు కోరుకున్న డిజైన్ల ఉత్పత్తి సామర్థ్యం ఇక్కడే ఉన్నది. అందుకే ఉపాధి లేక పట్నమొచ్చిన వారంతా తిరిగి చేనేత వృత్తుల్లోకి ప్రవేశిస్తున్నారు. ఊర్లకు తిరిగి వెళ్లలేనివారు, పిల్లల చదువులను దృష్టిలో పెట్టుకున్నవాళ్లు హైదరాబాద్‌లోనే ఉంటూ మగ్గాలు నేయడం ఆరంభించారు. ప్రధానంగా ఎల్బీనగర్, హయత్‌నగర్, ఉప్పల్, కాటేదాన్ ప్రాంతాల్లో ఊర్ల నుంచి వలసొచ్చిన వాళ్లు తిరిగి మగ్గాలు నేస్తుండటం విశేషం. నగరశివార్లలో కొందరు మాస్టర్ వీవర్లు ఇండ్లను కొనుగోలు చేస్తున్నారు. కొందరేమో కిరాయికి తీసుకొని నడిపించేందుకు సిద్ధమవుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో ఓ మాస్టర్‌వీవర్ మూడు ఇండ్లను కిరాయికి తీసుకొని మగ్గాలు నేయిస్తున్నారు. త్వరలోనే తుర్కయాంజాల్‌లో ఓ భవంతిని కొనుగోలు చేసి 50 మగ్గాల వరకు నడిపించేందుకు ప్లాన్ చేసుకున్నారు.

అనంతపురం నుంచి వలసలు తెలంగాణ కంచి చీరెలకు డిమాండ్ పెరిగింది. వృత్తి నైపుణ్యం కలిగిన కార్మికులు ఆ చీరెల తయారీలో నెలకు రూ.30 వేలకు పైనే సంపాదిస్తున్నారు. నెలకు డిజైన్లను బట్టి ఒకటీ రెండు నేసినా కుటుంబం హాయిగా గడిచే స్థాయిలో కూలీ గిట్టుబాటు అవుతున్నది. గతంలో చేనేతరంగంలో ఉపాధికి కేంద్రంగా ధర్మవరం ఉండేది. కానీ అక్కడి నుంచే కార్మికులు తెలంగాణకు వలస వస్తుండటం గమనార్హం. తాజాగా కొన్ని కుటుంబాలు ఆమనగల్లుకు వచ్చాయి. కంచి చీరలను నేసేందుకు ఇండ్లను కిరాయికి తీసుకొని అక్కడే ఉంటున్నారు. పెద్దబార్డర్, వెండిజరీ చీరెలను నేస్తున్నారు. కొన్నిరోజులపాటు కొత్త డిజైన్లను నేసేందుకు శిక్షణ ఇచ్చే బాధ్యతను మాస్టర్‌వీవర్లు తీసుకుంటున్నారు. చీరల డిమాండ్ భారీగా ఉండడంతో ఇటీవల ఇద్దరు మాస్టర్‌వీవర్లు కార్మికుల కోసం ధర్మవరం వెళ్లారు. హైదరాబాద్ శివార్లలో నివాస, ఉపాధి సదుపాయం కల్పిస్తే వెంటనే వచ్చేందుకు సిద్ధమని పలువురు కార్మికులు చెప్పారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయడంలో మాస్టర్ వీవర్లు నిమగ్నమయ్యారు.

టెక్నాలజీ అప్‌గ్రేడ్‌తో చేనేత చీరెలు గతంలో చేతితోనే నిలువు పేక, కండెలను తయారుచేసుకునేవారు. ఇప్పుడు ఆసు పోయడంతోపాటు కండెలు పట్టేందుకు సొంతంగా యంత్రాలను తయారు చేసుకుంటుండటంతో పనిభారం తగ్గిందని ఆమనగల్లుకు చెందిన మాస్టర్‌వీవర్ నమస్తే తెలంగాణకు తెలిపారు. ఫ్యాషన్ డిజైనర్లు ఏ డిజైన్ ఇస్తే.. దానికి అనుగుణంగా పింజర్లు, డిజైన్ అట్టలకు పంచింగ్ చేసుకునే పరిజ్ఞానాన్ని సంపాదించుకున్నామన్నారు. ధర్మవరం, కాంచీపురం వెళ్లి ఈ పరిజ్ఞానాన్ని నేర్చుకున్నామని వివరించారు. తమ దగ్గర ధర్మవరం, జనగామ ప్రాంతాలకు చెందిన కార్మికులు మగ్గాలు నేస్తున్నారని, త్వరలోనే మరికొందరిని తీసుకొస్తున్నామని తెలిపారు. ప్రధానంగా తెలంగాణలో నాణ్యతతో కూడిన కంచి చీరెలకు డిమాండ్ పెరిగింది. ఒక్కోచీర రూ.40 వేల నుంచి రూ.లక్షన్నర దాకా పలుకుతున్నది. కంచి చీరెల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కార్మికులకు రానున్న రోజుల్లో ఉపాధి అవకాశాలు పెరుగనున్నాయి. అనేక నకిలీలు మార్కెట్లోకి వస్తున్న నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డిజైనర్లు ఇక్కడివారికే ఆర్డర్లు ఇస్తున్నారు. అందుకే తెలంగాణ చేనేతకు మున్ముందు ఇంకా మంచి రోజులు రానున్నాయని మాస్టర్ వీవర్లు అంటున్నారు.

ధర్మవరం టెక్నాలజీతో.. చేనేతమగ్గంపై నాణ్యత కలిగిన కంచి చీరెలు నేయడం అంత సులువు కాదు. మగ్గం, దానిపై ఉండే పింజర్లు, వేలాడే డిజైన్ల కవర్లు, కదలాడే చైన్లు, లయబద్ధంగా కదిలే మందపు దారాలను చూస్తే చాలు.. దానిలో ఎంతటి నైపుణ్యం ఉంటుందో అర్థమవుతుంది. ఎప్పటికప్పుడు మారే డిజైన్లను బట్టి చీరెలను రూపొందించడం మామూలు విషయం కాదు. ఇప్పటిదాకా అలాంటి పింజర్లు రూపొందించడం ధర్మవరం కార్మికులకే సాధ్యంగా చెప్పుకునేవారు. చాలామంది అక్కడి నుంచే కొనుగోలు చేసేవారు. ఏదైనా చెడిపోయిందంటే తిరిగి అక్కడికే వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడా టెక్నాలజీని కూడా నేర్చుకున్నారు. ఆఖరికి స్టాండ్ మగ్గాన్ని కూడా సొంతంగా తయారుచేయగల నైపుణ్యాన్ని సాధించారు. ఆమనగల్లులో ఓ మాస్టర్ వీవర్ సొంతంగా స్టాండ్ మగ్గాలను తయారుచేసేందుకు ఐరన్ కట్టింగ్, వెల్డింగ్ యంత్రాలన్నీ కొనుగోలుచేశారు. డిమాండ్ పెరుగడంతో బెంగళూరులోని బహుళజాతి కంపెనీలో పనిచేస్తున్న తన తమ్ముడిని కూడా కంచి చీరెల డిజైన్ల తయారీకి నియమించడం విశేషం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.