-కాకతీపురికి చారిత్రక వైభవం -నాడు ఆజంజాహీ.. నేడు మెగా టెక్స్‌టైల్ పార్కు -సీఎం కేసీఆర్ చొరువతో ఓరుగల్లుకు పునరుత్తేజం -కేఎంటీపీతో భారీగా పెరుగనున్న వస్త్ర పరిశ్రమలు -ఫైబర్ టు ఫ్యాబ్రిక్ పద్ధతిలో అధునాతన వసతులు: మంత్రి కేటీఆర్ -దారాలు, కండె, కాకతీయ శిలాతోరణం గుర్తులతో పైలాన్, లోగోలు
చారిత్రక వరంగల్ ప్రాంతమంటే కాకతీయుల కట్టడాలే కాదు.. శతాబ్దాల చరిత్ర కలిగిన పారిశ్రామిక వాడలు గుర్తుకొస్తాయి. వేయిస్తంభాల శబ్దనాదాల మధ్య పారిశ్రామికీకరణకు నోచుకున్న ఈ ప్రాంతంలో శ్రమజీవుల కష్టమూ కండ్ల ముందు గోచరిస్తుంది. వరంగల్ ప్రాంతంలోని ఆజంజాహీ మిల్లు ఇప్పుడొక అదృశ్యమైన జ్ఞాపకమే. ఇదో ఖాయిలా పడిన మహా పరిశ్రమ. మీల్స్ (అన్నం) పెట్టిన మిల్స్ కాలనీ ఇప్పుడు పడావుపడిన బావిగా మారింది. ప్రభుత్వ రంగంలో నెలకొల్పిన ఏకైక భారీ పరిశ్రమ ఆజంజాహీ మిల్లు. అప్పట్లో ఈ మిల్లు ప్రత్యక్షంగా ఆరువేల మందికి, పరోక్షంగా పదివేల మందికి పైగా ఉపాధి కల్పించింది. ఈ మిల్లు స్థలాన్ని గత ప్రభుత్వాలు గజాల చొప్పున విక్రయించటంతో ఇప్పుడు ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకుండాపోయింది. ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యానికి రోడ్డున పడిన వస్త్రరంగ కార్మికులంతా ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లారు. ఇక్కడి చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దిక్కూదివానం లేక మూతపడ్డాయి. అలా గతించిన చరిత్రకు ఇప్పుడు స్వరాష్ట్రంలో పునరుత్తేజం వస్తున్నది. ఈ ప్రాంత మట్టి వాసన తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడంతో ప్రపంచ స్థాయి ఆడంబరాలతో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు రూపుదిద్దుకోనున్నది. ఈనెల 22న సీఎం కేసీఆర్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు (కేఎంటీపీ)కి శంకుస్థాపన చేయనున్నారు.
దీనిపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం..తాజాగా సేకరించిన గణాంకాల ప్రకారం రాష్ర్టంలో 49 వేల పవర్‌లూమ్స్, 17వేల హ్యాండ్లూమ్స్ ఉన్నాయి. 49 వేల పవర్‌లూమ్స్‌లో వంద ఎకరాల్లో 36 వేల పవర్‌లూమ్స్ కేవలం సిరిసిల్లలోనే ఏర్పాటయ్యాయి. ఒక్క సిరిసిల్లలోనే 8వేల మంది ఉపాధి పొందుతున్నారు. చేనేత వస్త్ర పరిశ్రమలు పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, సిద్దిపేటలో విస్తరించాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి ఇకత్, గద్వాల చీరెలు, వరంగల్ డర్రీస్ వంటివెన్నో వస్త్ర నైపుణ్యానికి అద్దం పడుతున్నవే. టెక్స్‌టైల్ రంగంలో ఇక్కడి నేతన్నలు నిష్ణాతులు. సీమాంధ్ర పాలకుల కుట్రలతో ఉపాధి లేక వలసపోయారు. వారంతా దేశంలోని ప్రఖ్యాత టెక్స్‌టైల్ పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. సూరత్, భీవండి, షోలాపూర్, ఇచ్చాల్‌కరంజి ప్రాంతాల్లో తెలంగాణ ప్రాంత వాసులే అధికంగా ఉన్నారు. రాష్ట్రంలో 60 లక్షల బేళ్ల ఉత్పత్తి అవుతుండగా ఇందులో జిన్నింగ్, ప్రెస్సింగ్ పరిశ్రమల్లో వినియోగం అవుతున్నది 10 లక్షల బేళ్లు మాత్రమే. మిగతాదంతా దేశ, విదేశాలకు ఎగుమతి అవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా కేవలం 35 స్పిన్నింగ్ మిల్స్ ఉండగా వీటి సామర్థ్యం కేవలం 9.3 లక్షల బేళ్లు మాత్రమే. దీంతో మన రాష్ట్రంలో పండించిన నాణ్యమైన పత్తి గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌కు ఎగుమతి అవుతున్నది. ఇక్కడి నాణ్యమైన పత్తి ఎగుమతితో గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్‌తోపాటు మిగతా రాష్ర్టాల్లో టెక్స్‌టైల్ పరిశ్రమలు వర్ధిల్లుతున్నాయి.
పారిశ్రామిక రంగంలో పెద్దన్న.. దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగాల్లో వ్యవసాయం తర్వాతి స్థానాన్ని ఆక్రమించింది వస్త్ర రంగమే. ఇందులో మహిళా శక్తికి అండగా నిలిచింది కూడా ఇదే. దేశంలోని పేరొందిన టెక్స్‌టైల్ పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్న వారిలో 60శాతం మహిళలే కావడం విశేషం. వారి నైపుణ్యం వల్లే డిజైన్ల కూర్పు, వస్ర్తాల ఉత్పత్తులు పెద్ద ఎత్తున మార్కెట్‌లోకి వస్తున్నాయని అనేక సంస్థల పరిశీలనలో తేలింది. ప్రపంచంలో వస్త్ర పరిశ్రమ రంగంలో భారతదేశం రెండో స్థానంలో ఉంది. దేశీయ స్థూల జాతీయోత్పత్తిలో ఈ రంగం వాటా 5శాతం. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ (ఐఐపీ)లో 14శాతం. దేశీయ ఎగుమతుల్లో ఈ రంగం 11శాతం వాటాను కలిగి ఉంది. ఉపాధి కల్పనలోనూ టెక్స్‌టైల్ రంగం ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది. దేశంలో 10 కోట్ల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని కల్పిస్తున్నది. ఇందులో ప్రత్యక్ష ఉపాధి 4 కోట్ల మంది. చేనేత కార్మికుల ఆదాయం నెలవారీగా 50 శాతం పెరుగుదలే టెక్స్‌టైల్ పార్కు లక్ష్యం. పవర్‌లూమ్స్ నడుపుతున్న వారికి 30శాతం మేర పెరిగే ఆస్కారం ఉంది. భవిష్యత్తులో రాష్ట్రం నుంచి టెక్స్‌టైల్ రంగ ఉత్పత్తుల ఎగుమతుల వాటాను 20శాతానికి పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నది ప్రభుత్వం. మన దేశంలో పెరుగుతున్న టెక్స్‌టైల్ పరిశ్రమల వాటా 2021 నాటికి 223 బిలియన్ యూఎస్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ప్రస్తుతం టెక్స్‌టైల్ రంగం మార్కెట్ వాటా 108 బిలియన్ డాలర్లు మాత్రమే.
భారీ రాయితీలు.. భేషుగ్గా పారిశ్రామిక విధానం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పారిశ్రామికవేత్తల్లో ఓ రకమైన ఆలోచనలు వెంటాడాయి. ఆంధ్రా పెత్తందారులు సైతం పరిశ్రమలన్నీ తరలిపోతాయన్న అపోహలు సృష్టించారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన తెలంగాణ పారిశ్రామిక విధానం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. పరిశ్రమల ఏర్పాటుకు వందశాతం పారదర్శకత, కచ్చితత్వం ఉండటంతో భారత పరిశ్రమల సమాఖ్య, అసోఛామ్, ఫ్యాప్టీ-టీఎస్ వంటి సంస్థలు సీఎం కేసీఆర్ కృషిని అభినందించాయి. పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే అనుమతి ఇచ్చే విధానంతో రాష్ర్టానికి పెట్టుబడులు రావడం మొదలైంది. దీంతో కొత్త రాష్ట్రంలో పరిశ్రమలు భారీగా ఏర్పడ్డాయి. ఈ పరిణామం వస్త్రపరిశ్రమకు మరింత ఉత్తేజాన్ని అందించనుంది. సుమారు రూ.11 వేల కోట్ల పెట్టుబడుల అంచనాతో మొదలుకానున్న మెగా టెక్స్‌టైల్ పార్కుతో తెలంగాణ రాష్ట్రం వస్త్ర ప్రపంచానికి చిరునామాగా నిలువనుంది. టీఎస్-ఐపాస్, టీఎస్-ఐడియా, టీఎస్-ప్రైడ్, టీ-టాప్ పాలసీలను అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర సర్కార్.. పారిశ్రామిక విధానంలో 14 ముఖ్యమైన సెక్టార్లను గుర్తించింది. అందులో టెక్స్‌టైల్ రంగం ఒకటి కావడం విశేషం.
ఆజంజాహీ ఓ ఘనమైన కీర్తి.. వరంగల్‌లో 1933లో 202 ఎకరాల స్థలంలో ఈ భారీ పరిశ్రమను నెలకొల్పినప్పటి నుంచి ప్రభుత్వరంగ సంస్థగానే కొనసాగింది. 1963లో అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీని నిర్వహణ బాధ్యతలు తీసుకుంది. ఆ తర్వాత కేంద్ర జౌళి శాఖకు 1971లో అప్పగించింది. ఎన్‌టీసీ పరిధిలోని కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లోని పదహారు మిల్లులన్నింటిలోనూ భూవిస్తరణ, మానవ వనరులు, భవనాలు, ఇతర వసతులన్నింటిలో అజంజాహీ మిల్లు అగ్రభాగాన ఉన్నప్పటికీ సిక్ యూనిట్‌గా ముద్రవేసి బలవంతంగా మూసివేశారు. ఇక్కడ తయారైన బట్టలు విదేశాలకు ఎగుమతి అయ్యేవి. భారత సైనికుల డ్రెస్ మెటీరియల్ కూడా అప్పట్లో ఈ మిల్లు ఉత్పత్తులు కావడం విశేషం. వరంగల్ నగరానికంతటికీ వీధి దీపాలకు కావాల్సిన విద్యుత్ సరఫరా చేసిన ఘనత ఈ మిల్లుకుంది. ఈ మిల్లు కూత లేనిదే నగర వాసులకు పొద్దుపోయేది కాదు. ఆనాడు అతిపెద్ద కాటన్ మిల్లుగా ఉన్న అజంజాహీ పరిశ్రమలో 42,536 స్పైండిల్స్, 725 ప్లెయిన్ లూమ్స్ ద్వారా 18,120 కిలోల నూలు దారం, 86,853 మీటర్ల బట్ట ఉత్పత్తి అయ్యేది. ఈ మిల్లుకు అవసరమయ్యే ముడిసరుకును మహారాష్ట్రలోని పర్బణీ, జాల్నా, ఔరంగాబాద్ నుంచి తెచ్చేవారు. జనతా బట్ట ఉత్పత్తికి ఈ మిల్లే పేరెన్నికగన్నది. ఈ మిల్లులో సొంతంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కూడా ఉండేది. ఇలా దశాబ్దాల క్రితమే అద్భుతంగా విరాజిల్లిన ఈ ప్రాంతం మళ్లీ సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో కొత్త అందాలను సంతరించుకుంటుండటం గొప్ప విషయం.