-గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్ఎస్, ఎంఐఎంలదే గెలుపు -ఎన్నికల నిబంధనలపై జాగ్రత్తగా వ్యవహరించాలి -టికెట్ రానివారికి భవిష్యత్‌లో సముచిత ప్రాధాన్యం -అభ్యర్థులకు బీ ఫాంలు అందజేసిన పార్టీ అధినేత కేసీఆర్ -నియోజకవర్గాలకు పార్టీ ఇంచార్జిల నియామకం -15 నుంచి అన్ని నియోజకవర్గాల్లో సీఎం సభలు -మహా కూటమి ప్రభావం నిల్
రాష్ట్రంలో మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని.. వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని, మహాకూటమి ప్రభావం ఉండదని ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రత్యర్థులు ఎవరనేది ముఖ్యం కాదని, ప్రజలు మనవెంటే ఉన్నారని.. వందకుపైగా సీట్లు గెలవడం ఖాయమని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్నిసీట్లనూ టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు గెలువబోతున్నాయని చెప్పారు. ఇప్పటివరకు బాగా ప్రచారం చేశామని, ఇకపై కూడా ఇదేరీతిలో జాగ్రత్తగా నడుచుకోవాలని సూచించారు. ఆదివారం తెలంగాణభవన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ పార్టీ బీ ఫాంలను అందజేశారు. ముందుగా పార్టీ కార్యాలయం ఆవరణలోని తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాలవేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నందున నామినేషన్ పత్రాలను జాగ్రత్తగా పూర్తిచేయాలని సూచించారు. అవసరమైతే పార్టీ సీనియర్ నాయకులు, న్యాయవాదుల సహకారం తీసుకోవాలన్నారు. ఎన్నికల సంఘం కాల్ సెంటర్‌ను ఏర్పాటుచేసిందని, పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనూ ఎన్నికల సెల్ పనిచేస్తుందని వివరించారు.
ఎలాంటి హడావుడి లేకుండా, సాదాసీదాగా నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు. ఈసారి ఎన్నికల నిబంధనలు మారాయని, వాటన్నింటిపై పూర్తి అవగాహన పెంచుకోవాలని, ఎన్నికల ఖర్చుపై జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఎన్నికల అధికారులు, పోలీసు అధికారులతో మంచిగా వ్యవహరించాలని తెలిపారు. ఎక్కడ క్రిమినల్ కేసులు ఉన్నా వాటి వివరాలన్నింటినీ తెప్పించుకోవాలని, వాటిని తప్పనిసరిగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలన్నారు. లేకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని సూచించారు. రోజువారీ ఎన్నికల ఖర్చును సమర్పించాల్సి ఉంటుందని, దీనికి చార్టెడ్ అకౌంటెంట్లు సహకరిస్తారని పేర్కొన్నారు.

ఆస్తిపాస్తులు, అప్పుల వివరాలకు సంబంధించిన వివరాలన్నింటినీ నామినేషన్ పత్రాలతోపాటు సమర్పించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సభలు ఉంటాయని, అన్ని సభలకు హాజరవుతానని సీఎం కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో బస్తీ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో అద్భుతమైన ఫలితాలు వస్తాయని, అన్నిసీట్లూ టీఆర్ఎస్, ఎంఐఎంలకే వస్తాయని చెప్పారు. ఎన్నికల్లో మహాకూటమి ప్రభావం ఉండబోదని, కూటమిలోని పార్టీల మధ్య ఓట్ల ట్రాన్స్ఫర్ జరుగదని కేసీఆర్ తెలిపారు. టీడీపీకి ఇచ్చిన సీట్లలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు సహకరించరని వివరించారు. రాబోయేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, త్వరలోనే విజయోత్సవాలు జరుపుకుందామని అభ్యర్థులకు భరోసా ఇచ్చారు.
పాటలు పాడి వినిపించిన కేసీఆర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా రూపొందించిన పాటల్లో రెండింటిని సీఎం కేసీఆర్ స్వయంగా పాడి వినిపించారు. పార్టీ ఆధ్వర్యంలో, ప్రముఖ రచయితలతో రాయించిన పాటలు అద్భుతంగా ఉండబోతున్నాయని, త్వరలోనే వీటి సీడీలను అందరికీ అందిస్తామని తెలిపారు. ఈ సీడీకి కేసీఆర్ ముందుమాట రాశారు.. దానిని కూడా ఆయన చదివి వినిపించారు.
సిర్పూర్ అభ్యర్థికి మొదటి బీ ఫాం పార్టీ ప్రకటించిన అభ్యర్థులకు అధ్యక్షుడు కేసీఆర్ బీ ఫాంలు అందజేశారు. ఎన్నికల సంఘంలో నమోదైన నియోజకవర్గాల నంబర్ల ఆధారంగా మొదట ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ అభ్యర్థి కోనేరు కోనప్పకు బీ ఫాం అందజేశారు. బీ ఫాం ఇస్తున్న సందర్భంలో నియోజకవర్గాల్లో సర్వేల వివరాలను కేసీఆర్ అభ్యర్థులకు వెల్లడించారు. గజ్వేల్ నియోజకవర్గం అభ్యర్థిగా సీఎం కేసీఆర్‌కు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పార్టీ బీ ఫాం అందజేశారు.

సీట్లు రానివారికి భరోసా పార్టీ అభ్యర్థులను ప్రకటించని 12 స్థానాల్లో టికెట్లు ఆశించి దక్కనివారికి భవిష్యత్‌లో గుర్తింపు ఇస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డిని తెలంగాణభవన్‌కు పిలిపించి మాట్లాడారు. వారికి భవిష్యత్‌లో తప్పకుండా మంచి గుర్తింపు ఇస్తామని, పార్టీ అభ్యర్థి విజయానికి కృషిచేయాలని సూచించారు.
కేసీఆర్ దేవుడు: పువ్వాడ అజయ్ ఇతర రాజకీయపార్టీల్లో బీ ఫాంలు కావాలంటే కోట్లు ఇవ్వాల్సి వచ్చేదని, కానీ టీఆర్ఎస్ బీ ఫాం ఉచితంగా ఇచ్చిన దేవుడు కేసీఆర్ అని ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ చెప్పారు. బీ ఫాం అందుకున్న అనంతరం ఆయన తన సంతోషాన్ని వ్యక్తంచేశారు.
ఆంధ్ర అభిమాని కనకదుర్గ ప్రసాదం టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించాలని ఆంధ్రప్రాంతానికి చెందిన టీఆర్ఎస్ అభిమాని ఆదినారాయణ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పూజలు చేసిన ప్రసాదాన్ని అందజేశారు. తెలంగాణభవన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థులందరికీ ఆయన లడ్డూ, కండువా పంపిణీచేశారు.
నియోజకవర్గాలకు ఇంచార్జుల నియామకం ప్రచారంలో పార్టీ అభ్యర్థులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు.. నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసేందుకు టీఆర్ఎస్ అధిష్ఠానం కొన్ని నియోజకవర్గాలకు ఇంచార్జులను నియమించింది. ఇంచార్జులు ఆయా నియోజకవర్గాల్లో పర్యటించడంతోపాటు, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. అధిష్ఠానం దృష్టికి తీసుకొస్తారు. కొడంగల్, మక్తల్, గద్వాల, అలంపూర్, మానకొండూరు నియోజకవర్గాలకు మంత్రి హరీశ్‌రావు, బెల్లంపల్లి, చెన్నూరు, ఖానాపూర్, ఆసిఫాబాద్లకు ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్రవణ్‌రెడ్డి, ములుగు, మహబూబాబాద్, నర్సంపేటలకు విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కోదాడకు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, హుజూర్‌నగర్‌కు ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, నల్లగొండకు పార్టీ ప్రధానకార్యదర్శి తక్కెలపల్లి రవీందర్రావు, ఇల్లందుకు పార్టీ రాష్ట్రకార్యదర్శి తాతా మధుసూదన్, తుంగతుర్తికి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఇంచార్జులుగా వ్యవహరించనున్నారు. నాగార్జునసాగర్ ఇంచార్జిని త్వరలో నియమించనున్నట్టు తెలిసింది. ఇదిలాఉండగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల బాధ్యతను మంత్రి కేటీఆర్‌కు అప్పగించారు.
15 నుంచి సీఎం కేసీఆర్ సభలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారం తేదీలు దాదాపు ఖరారయ్యాయి. ఇప్పటికే పలు సభల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్.. ఈ నెల 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ప్రతిరోజూ రెండుమూడు సభల్లో ఆయన పాల్గొంటారు. అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా హెలికాప్టర్ ద్వారా ప్రచారసభలకు హాజరవుతారు. సీఎం కేసీఆర్ ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ప్రచారపర్వాన్ని సమీక్షిస్తూనే, మరోవైపు స్వయంగా సభల్లో పాల్గొంటారు. సాధ్యమైనమేరకు ఎక్కువ సభల్లో పాల్గొనేలా సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఏయే నియోజకవర్గాల్లో ఏయే తేదీల్లో పాల్గొంటారనే వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.