Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మన బాయికాడ మీటర్‌ పెట్టొద్దంటే.. బీజేపీకి మీటర్‌ పెట్టాలె

-మన ఓటు బీజేపీకి పడ్డదంటే.. మన బాయికాడ మీటరు పడ్డట్టే
-జరిగేది రైతు కూలీల బతుకు ఎన్నిక.. మన బతుకుదెరువు ఎన్నిక
-తెలంగాణ ఏమంటున్నదో దేశానికి చూపెట్టాలె.. కేసీఆర్‌ పిలుపు
-మునుగోడులో భారీగా ప్రజాదీవెన సభ.. సీఎంకు జనం నీరాజనం
-తెలంగాణను చూసి కండ్లు మండుతున్నయా?
-వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్లు వద్దంటున్నరు
-దేశంలో మీరు చేసిన గొప్ప పనేందో చెప్పండి
-మోదీ.. నీ గర్వం, అహంకారమే నిన్ను పడగొడ్తది
-ఏంది మీ అహంకారం.. ఈడీ, బోడీలకు భయపడం
-ప్రధానితో కొట్లాడుతున్నా.. నా బలం, ధైర్యం మీరే
-రాష్ట్రంలో రైతుబంధు ఆగదు.. మీటర్‌ పెట్టనియ్య
-నల్లగొండను ఫ్లోరైడ్‌ రహితంగా మార్చుకొన్నాం
-దేశంలోని ప్రజాస్వామిక, ప్రగతిశీల శక్తులన్నింటినీ..
-సీపీఐ, సీపీఎం, టీఆర్‌ఎస్‌ కలిసి ఒక్కటి చేయాలె
-మీరు ఒక్కొక్కరు.. ఒక కేసీఆర్‌ కావాలె.. చర్చ చేయలె
-ఏమరుపాటుగ ఓటేస్తే మన బతుకులు ఆగమైతయి
-మునుగోడు ప్రజా దీవెనసభలో సీఎం కేసీఆర్‌

-‘మన బాయికాడ బీజేపీ మీటరు పెట్టుడు కాదు.. మనందరం కలిసి బీజేపీకి మీటర్‌ పెట్టాలె.. పెడు దామా?’ మునుగోడు సభలో ప్రజలకు సీఎం ప్రశ్న ఇది..
‘పెడదాం.. పెడదాం..’ ఢిల్లీ గద్దె ప్రకంపించేలా ముక్తకంఠంతో జనసందోహం ఇచ్చిన జవాబిది.

-పింఛను మోదీ ఇచ్చే ఆరు వందలు కావాల్నా? కేసీఆర్‌ ఇచ్చే రెండు వేలు కావాల్నా? సీఎం కేసీఆర్‌ మరో ప్రశ్న
రెండు వేలు.. జనమంతా ఒక్కటిగా ఇచ్చిన జవాబు..
నేను బతికి ఉన్నంత వరకు రైతుబంధు ఆగదు.. ఉద్విగ్న స్వరంతో పలికిన కేసీఆర్‌

జై కేసీఆర్‌.. జై తెలంగాణ.. జనం గొంతుల్లోంచి పిక్కటిల్లిన నినాదాలు..
మునుగోడులో శనివారం సీఎం కేసీఆర్‌ అత్యద్భుతంగా చేసిన ప్రసంగానికి జనం అపూర్వంగా స్పందించారు. ప్రశ్నలు, సమాధానాలు, సామెతలు.. తనదైన పంచ్‌లతో ఉద్యమకాలం నాటి ఉత్సాహాన్ని కనపరుస్తూ సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ప్రజలకు ఏది చెప్పాలో.. ఎట్లా చెప్పాలో.. అంతే చెప్పారు. ప్రసంగం మధ్యలో సీఎం ఎంత సూటిగా ప్రశ్నిస్తే.. జనం అంతే దీటుగా జవాబివ్వడం విశేషం. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి చేస్తున్న నిర్వాకాన్ని ఒక్కటొక్కటిగా విడమరిచి చెప్తుంటే.. జన ప్రతిస్పందన ఢిల్లీ వీధుల్లో ప్రతిధ్వనించింది. మునుగోడు ప్రజాదీవెన సభకు జనం సముద్రమై ఉప్పొంగి వచ్చింది. 40 నిమిషాల పాటు సాగిన సీఎం ప్రసంగం ఆద్యంతం తన వాళ్లతో ముచ్చట పెడుతున్నట్టుగా హాయిగా సాగింది.

మునుగోడు రైతులు పోలింగ్‌ బూత్‌కు వచ్చేముందు ఒకసారి వ్యవసాయ బోరు దగ్గరికి వెళ్లి దండం పెట్టుకొని రావాలె. నా అక్కాచెల్లెళ్లు గ్యాస్‌ సిలిండర్‌కు మొక్కి వచ్చి ఓటెయ్యాలె. గ్యాస్‌ ధర ఎక్కడి నుంచి ఎక్కడికి చేరిందో తలుచుకొని ఓటెయ్యాలె.

బీజేపీ పాలిత గుజరాత్‌లో రూ.600 పింఛను ఇస్తున్నరు. మనం రూ.2 వేలు ఇస్తున్నం. రూ.600 ఇచ్చే ప్రభుత్వం కావాల్నా? 2వేలు ఇచ్చే ప్రభుత్వమా? బీజేపీకి ఓటేస్తే సంక్షేమ పథకాలన్నీ బంద్‌.

అందుకే వస్తున్నవా అమిత్‌షా..
-మా నీళ్లలో వాటా ఇవ్వనందుకే రేపు మునుగోడుకు వస్తున్నవా సమాధానం చెప్పు అమిత్‌ షా. ఎనిమిదేండ్లుగా ఎందుకు కృష్ణా జలాల్లో మా వాటా తేలుస్తలేరు?
-మా వాటా వస్తే చకచక నీళ్లు తెచ్చుకుంటం. తేలినకాడ గోదావరిలో నీళ్లు తెచ్చుకున్నం. ఇక్కడ కూడా రావాలని పనులు మొదలుపెట్టుకుంటే ఎందుకు అడ్డం పెడుతున్నరు? మీ కేంద్ర ప్రభుత్వం పాలసీ ఏందో, కృష్ణా జలాల వాటా ఎందుకు తేలుస్తలేరో, మీ దద్దమ్మ చేతగానితనమేందో, రేపు మునుగోడులో చెప్పాలె.

తాను బతికున్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రైతుల బావుల దగ్గర మీటరు పెట్టనియ్యనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కుండబద్దలు కొట్టారు. అవసరం లేని ఉప ఎన్నికలు తెచ్చే గోల్‌మాల్‌ గాళ్ల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక పార్టీల ఎన్నిక కాదని, రైతులు, కూలీల బతుకు దెరువు ఎన్నిక అని చెప్పారు. శనివారం మునుగోడులో టీఆర్‌ఎస్‌ ప్రజాదీవెన పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ మహాసభనుద్దేశించి మాట్లాడుతూ తెలంగాణలో రైతుల అప్పులు తీరిపోయి సొంతంగా పెట్టుబడి డబ్బు వచ్చేంత వరకు రైతుబంధును ఎవడూ ఆపలేడని స్పష్టం చేశారు. వ్యవసాయం స్థిరీకరణ జరిగితే పల్లెలు బాగుంటాయని, పంటలు పండితేనే ప్రజలు బతుకుతరని, పదిమందికి పని దొరుకుతదని అన్నారు. సభలో సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..

రైతులనోట్లో మన్నుబోసే కార్యక్రమం
ఇప్పుడు అన్నీ పోయినయి. అన్నీ పోతున్నయ్‌. మిగిలిందేందీ.. రైతులు, భూములు, వ్యవసాయ పంటలు. ఒక్కటే ఎమ్మట పడుతున్నరు ఇగ. ఇది చాలా తీవ్రంగ మునుగోడు పిల్లలంత ఆలోచించాల దయజేసి. మా తల్లులు, మా అక్కాచెల్లెళ్లు, రైతు సోదరులు, రైతు కూలీలు మన నోట్లె మన్నుబోసే కార్యక్రమం జరుగుతా ఉంది. నేను అసెంబ్లీలో చెప్పిన. మీరు టీవీలల్లో విన్నరు, పేపర్లల్లో చదివిండ్రు. దేశం మొత్తంలో 24 గంటలు మోటరు కాలకుండా, ట్రాన్స్‌ఫార్మర్‌ కాలకుండా, నాణ్యమైన కరెంట్‌ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. బీజేపీ పాలించే రాష్ర్టాల్లోనూ లేదు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా దిక్కులేదు. ఇయ్యాల ఉచిత విద్యుత్తు బంద్‌ చేస్తమంటున్నరు. మీటర్‌ పెట్టి వచ్చే కరెంట్‌ బంద్‌ చేయాలని చూస్తున్నరు. బాయికాడ మీటరు పెట్టు కేసీఆర్‌.. పెడతవా పెట్టవా. నేను చచ్చినా పెట్టను. పెట్టగాక పెట్ట అని నేనన్న. బాయికాడ మీటరు పెట్టుడు ఒట్టి ముచ్చట కాదు. దాని వెనుక చాలా మతలబు ఉన్నది. ఎరువుల ధరలు పెంచాలె, కరెంటు బాగ పిరం చేయాలె, పండిన పంటలు కొనద్దు, రైతు తట్టపార కిందపెట్టాలె. ఇక మాతోటి కాదు వ్యవసాయం అని సాలిచ్చుకోవాలె. సాలిచ్చుకుంటె ఏమైతదీ.. మోదీ గారి దోస్తులు పెద్దపెద్దోలు సూటికేసులు పట్టుకొని రెడీగ ఉన్నరు. మీతోటికాదు వ్యవసాయం, మేము చాలా గొప్పవాళ్లం, మేమొస్తం, మీ భూములన్ని మాకు ఇచ్చేయిన్రి. కార్పొరేట్‌ వ్యవసాయం పెడదాం, మీరు ఇందులోనే కూలిపని చేయండి అనే కుట్ర జరుగుతావుంది. తస్మాత్‌ జాగ్రత్త.

ఉచిత కరెంట్‌ బంద్‌ చేస్తరట
బీజేపీ మన బాయికాడ మీటరు పెట్టుడు కాదు.. అందరం కలిసి మనమే బీజేపీకి మీటరు పెట్టాలె.. పెడదామా బీజేపీకి మీటరు? పక్కా మాటేనా? కష్టపడి కొన్ని ఖర్చులు తగ్గిచ్చైనా సరే ఇప్పుడు బ్రహ్మాండంగా అందరికీ కరెంట్‌ ఇస్తున్నాం. పరిశ్రమలు వస్తున్నయి. మన పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతున్నయి. పంటలు మంచిగ పండుతున్నయి. ఎవరికి అక్కరున్నప్పుడు వాళ్లు బోరు పెట్టుకొని సంతోషంగా బతుకుతున్నరు. ఇప్పుడు మనల్ని బతకనీయం, చెడగొడుతమంటున్నరు. మోటర్లకు మీటర్లు ఎందుకు పెట్టుమంటున్నవు? కారణం ఏంది? నిన్నేమైనా బతిలాడినమా పైసలియ్యుమని. మా రైతులు మంచిగ బతకాలని ఉన్నంతలో ఏదో చేసుకుంటున్నం. ఇదే నల్లగొండ జిల్లా రైతుబిడ్డలు, పాలమూరు రైతు బిడ్డలు ఇంకా అనేక జిల్లాల రైతు బిడ్డలు.. పది, ఇరవై ఎకరాలు ఉన్నోళ్లు కూడా హైదరాబాద్‌కు వచ్చి ఆటోరిక్షాలు నడిపారు. మా కండ్లతో మేం చూసినం. బాధపడ్డం. ప్రాజెక్టు కాలేదు.. మాకు నీళ్లు రాలేదు.. కరెంటు రాదు.. రైతాంగం అంత చెట్టుకొకడు, గుట్టకొకడు అయిపోయిడ్రు. నేనే ప్రయత్నం చేసిన.. ఈ రైతులంతా బాగుండాలనే. గ్రామం సల్లగుంటే.. రైతు దగ్గర నాలుగు పైసలుంటే.. రైతులు వడ్లు పండిస్తే తెలంగాణ బ్రహ్మాండంగా ఉంటదని తిప్పలు పడుతున్నం. రైతుబంధు పెట్టుకున్నం, నీళ్లు ఇచ్చుకుంటున్నం. మిషన్‌ కాకతీయతో చెరువులు బాగు చేసుకున్నం, చెక్‌ డ్యాంలు కట్టుకుంటున్నం. ఇప్పుడిప్పుడు కొద్దిగా తెల్లపడుతున్నం. మీకు(మోదీ) కండ్లు మండుతున్నయా? దమ్ముంటే నువ్వు ఉన్నకాడ మా మాదిరిగా చెయ్‌. అక్కడ చేయడం చేతకాదు. ఢిల్లీలో కరెంటు ఉండదు. హైదరాబాద్‌లో ఉంటది. మేం ఇంత పొడుగు, అంత పొడుగు చేసినం అని చెప్పుకుంటున్నరు కదా! దేశ రాజధానిలో మంచినీళ్లకే దిక్కు లేదు. కరెంటు సక్కగ రాదు. ఇదీ వీళ్ల పరిపాలన. ఏమైనా ఉద్ధరించారా? ఏం లేదు. మీరొచ్చిన్నుంచి దేశంలో ఒక్క ప్రాజెక్ట్‌ అయినా కట్టారా? అంటే కట్టలేదు. వీళ్ల సంగతి ఎట్లుందంటే.. ‘మాకు చెయ్య చేతకాదు.. నిన్ను చెయ్యనియ్యం’ అన్నట్టుంది. మీటర్లు పెట్టే నరేంద్రమోదీ బీజేపీ కావాల్నా? మీటర్లు వద్దనే టీఆర్‌ఎస్‌ కేసీఆర్‌ కావాల్నా? గ్రామాలకు పోయాక దయజేసి విద్యావంతులు, చదువుకున్నవాళ్లు, పెద్దలు, యువకులు, రైతుబంధు పొందుతున్న లక్ష మంది రైతులు చర్చపెట్టాలె. నేను మాట్లాడుతున్న.. నేను మీటర్లు పెట్ట అని ప్రధానమంత్రితో కొట్లాడుతున్నానంటే నా బలమేంది? నా బలం మీరే కదా? నా ధైర్యం మీరే కదా. మీరే నన్ను బలహీనపరిస్తే నేను ఏమిచేయాలి రేపు? మీరే నన్ను ఒకవేళ ఆగం చేస్తే.. రేపు ఏమంటరు వాళ్లు, నువ్వు అంత ఒర్లిజెప్పినవ్‌ కదా మునుగోడు పోయి.. అయినా మాకే గుద్దిన్రు అంటరు. నన్ను గుద్ది కిందబడగొడతరు.. మీటర్లు పెడతరు. ఆలోచన చేయాలి దయజేసి.. మునుగోడు నియోజకవర్గం చరిత్రలో ఎన్నడు కూడా బీజేపీకి డిపాజిట్‌ రాలే, ఇప్పుడొస్తదా? ఒకవేళ వచ్చిందంటే మీటర్‌ వస్తది. బీజేపీకి ఓటు పడిందంటే.. మన బాయికాడ మీటర్‌ పడ్డట్టే. ఇది పక్కా.. రాసి పెట్టుకో.

మోదీ పాలనలో అంతా రోడ్డునపడుతున్నరు
దేశంలో మతపిచ్చి, కులపిచ్చి ఎవరికి మంచిది? ఎవర్ని ఉద్ధరించటానికి? అందరు బాగుండాలి. అందులో మనం కూడా బాగుండాలని కోరుకోవాలి. కానీ, విద్వేషం పుట్టిస్తే పరిస్థితి ఏమిటి? ఈ రోజు దేశం చాలా ప్రమాదంలోకి పోతున్నది. రూపాయి విలువ ఏ ప్రధాని సమయంలోనూ ఇంత దిగజారలేదు. ఒక్క డాలర్‌కు రూపాయి విలువ రూ.80కి చేరింది. ఇదే మోదీ గతంలో నన్ను గెలిపించండి రూపాయి విలువను రూ.50 నుంచి రూ.35కు తీసుకొస్తా అన్నడు. ఇప్పుడేమైంది? దీనిపై చర్చ చేయండి. మోదీ పాలనలో నిరుద్యోగం పెరిగింది. కార్మికులు రోడ్డున పడుతున్నరు. ప్రభుత్వ సంస్థలన్నింటినీ అమ్ముతున్నరు. రైతులను బతుకనిస్తలేరు. పండిన పంటలను కొంటలేరు. ప్రజలంతా వాళ్లను నిలదీయాలె. తెలంగాణ అసెంబ్లీలో ఉండేది 119 మంది ఎమ్మెల్యేలు. ఇందులో 103 మంది టీఆర్‌ఎస్‌ వాళ్లే. మరో ఏడుగురు మిత్రపక్షాల సభ్యులు. మొత్తం 110 మంది. ఇక బయటివి కలిపితే తొమ్మిది తోకలు. ఈ తొమ్మిదిలో రెండు పార్టీలు. మాట్లాడేటోడు మూడు తోకలున్నోడే. మూడు తోకలున్నోడు 110 తోకలున్నోన్ని పడగొట్టి ఏక్‌నాథ్‌షిండేను తెస్తడట.

ఈడీనో.. బోడీనో ఏదైనా పెట్టుకో
ఇది ప్రజాస్వామ్యమేనా? అహంకారమా? కండ్లు మూసుకుపోయాయా? ఎవర్ని పడితే వాళ్లను, ముఖ్యమంత్రులను, పెద్దపెద్ద వాళ్లను కూడా మీ మీద ఈడీ కేసులు పెడతమంటూ బెదిరిస్తున్నరు. నేనొక్కటే చెప్పిన. ఈడీనో! బోడీనో! రా అని చెప్పిన. ఈడీ వాడు నా దగ్గరికి వస్తే వాడే నాకు చాయ్‌ తాగిపిచ్చి పోవాలె. దొంగలు, లంగలు భయపడుతరు. ధర్మంగా, నిజాయతీగా ఉన్నోళ్లు ఈ ఈడీ బెదిరింపులకు ఎందుకు భయపడుతరు? నీ మీద ఈడీ పెడతం అన్నరు. ‘ఈడీనో.. బోడీనో పెట్టుకో. ఏం పీక్కుంటవో పీక్కో’ అని చెప్పిన. ప్రజల కోసం నిలబడేవాళ్లు, ప్రజల కోసం ఆలోచించేవాళ్లు, ప్రజల మేలు కోరేవాళ్లు, పేద ప్రజలకు కడుపునిండా బుక్కెడు అన్నం దొరుకాలనేవాళ్లు నీకు భయపడరు మోదీ! నువ్వు గోకినా, గోకకున్నా నేను నిన్ను గోకుతా అని చెప్పిన.

నీ అహంకారం, గర్వమే నీ శత్రువు
ఇది దేశం. ఎవడి అయ్య సొత్తు కాదు. రాచరిక వ్యవస్థ కాదు. నీ గుండాగిరీ, దుర్మార్గం, ఈ మోసకారి విషయాలు, ప్రజలనే బెదిరిస్తామంటే కుదరదు. నిన్నగాక మొన్న తమిళనాడులో స్టాలిన్‌ మూడోంతుల మెజారిటీతో ముఖ్యమంత్రిగా గెలిచారు. ఆరు నెలల్లో అక్కడి ప్రభుత్వాన్ని పడగొడతమంటరు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ చరిత్రలోనే అత్యధిక ఎమ్మెల్యేలతో గెలిచారు. వాళ్లను పడగొడతమంటరు. అంటే నిన్ను(మోదీ) పడగొట్టేటోడు ఎవడు లేడనుకొంటున్నవా? నిన్ను పడగొట్టడానికి వేరే శత్రువు అవసరం లేదు మోదీ.. నీ అహంకారం, నీ గర్వమే నీ శత్రువవుతది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ప్రజావ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలే నీ శత్రువైతయి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.