దేశంలో నంబర్‌వన్ సీఎంగా మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిలిచారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్వేలో ఈ విషయం వెల్లడైనట్లు విశ్వసనీయ సమాచారం. ఢిల్లీలో ఈ నెల 16వ తేదీన జరిగే రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని మోదీ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటిస్తారని తెలిసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్.. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి పథకం ప్రజలకు చేరేలా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రపథంలో నడిపిస్తున్నందువల్లే దేశంలోని ఉత్తమ ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ నంబర్‌వన్‌గా నిలిచారని భావిస్తున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు మాత్రం ఈ సర్వేలో 13వ స్థానం దక్కిందని తెలిసింది.

-ఐదో స్థానంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ -ఏపీ సీఎం చంద్రబాబుకు 13వ స్థానం -ప్రధాని మోదీ అంతర్గత సర్వేలో సీఎంలకు ర్యాంకులు -ఈ నెల 16న ఢిల్లీలో జరిగే సీఎంల సమావేశంలో ప్రకటించే అవకాశం
ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల రాష్ట్రాల పనితీరుపై సమీక్షించి, అభివృద్ధికి ఆయా ముఖ్యమంత్రులు చేస్తున్న కృషిని బేరీజు వేశారు. మోదీ వెసిన ఈ లెక్కల్లో కేసీఆర్ అగ్రస్థానంలో ఉన్నారు. 29 రాష్ర్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల పనితీరుపై నిర్వహించిన సర్వేలో మన సీఎం కేసీఆర్ నంబర్ వన్ స్థానంలో నిలువడం గర్వకారణం. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ 2వ స్థా నం, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ 3వ స్థానం, గుజరాత్ సీఎం ఆనందిబెన్ 4వ స్థానం, ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ 5వ స్థానంలో ఉన్నారు. మరికొన్ని స్థానాల్లో రాజస్థాన్ సీఎం వసుంధరరాజే సింధియాకు 7, జార్ఘండ్ సీఎం రఘువర్ ప్రసాద్‌కు 14వ స్థానం లభించింది. ఈ ఫలితాలను ఈ నెల 16వ తేదీన అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతున్నది.
ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యమంత్రుల పనితీరుపై ప్రతి మూడు నెలలకు ఒకసారి నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఈ నివేదికలతోపాటు మోదీ నిర్వహించిన సర్వేలోనూ సీఎం కేసీఆర్‌కు ప్రథమ స్థానం లభించింది. వీటితోపాటు కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలతోపాటు ప్రైవేట్ సంస్థల ద్వారా కూడా ఈ విషయమై సర్వేలు నిర్వహించినట్లు తెలిసింది. సీఎం కేసీఆర్ ప్రజలను మెప్పించడం, ప్రజా సంక్షేమాలను అమలు చేయడం, ప్రజాభిమానం చూరగొనడంలో ముందున్నారని సర్వేలు తేల్చినట్లు సమాచారం. దేశంలో ముఖ్యమంత్రుల పనితీరుపై గతంలో అసోచామ్ నిర్వహించి సర్వేలోకూడా కేసీఆర్ బెస్ట్ సీఎంగా నిలిచారు. ఇదే తరహాలో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ కూడా సీఎం పనితీరును ప్రశంసలు కురిపించింది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం అమలుచేస్తున్న ప్రణాళికలు.. తాగునీటి సమస్యల పరిష్కారానికి చేపట్టిన మిషన్ భగీరథ, రాష్ర్టానికి పెట్టుబడులు తీసుకురావడానికి తీసుకువచ్చిన టీఎస్ ఐపాస్ తదితర పథకాలు సీఎం పనితీరు పారదర్శకతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అలాగే రాష్ట్రంలో చేపట్టిన హరితహారం దేశంలోనే సంచలనంగా మారింది. ప్రతి పథకంలో ప్రజలను భాగస్వామ్యం చేసి విజయవంతానికి కేసీఆర్ చేస్తున్న కృషే.. అన్ని సర్వేల్లోనూ ఆయన్ను దేశంలో నంబర్ వన్ సీఎంగా నిలబెడుతున్నాయి.