Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మన గెలుపు ఖాయం..

వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ ఘన విజయం ఖాయమని టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. తాము నిర్వహించిన అన్ని సర్వేల్లోనూ ఇదే ఫలితం వెల్లడైందని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టి కొన్నాళ్లే అయినా.. 99శాతం వాగ్దానాలు నిలబెట్టుకున్నామని కేసీఆర్ అన్నారు. ఇవాళ దేశంలోని అనేక రాష్ర్టాలు తెలంగాణలో అమలు చేస్తున్న పథకాల మీద ఆసక్తి చూపుతున్నాయని, బీహార్ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఆయనను గెలిపిస్తే తెలంగాణలో మాదిరిగా వాటర్‌గ్రిడ్ చేపడతానని ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు. శనివారం క్యాంపు కార్యాలయంలో వరంగల్ లోక్‌సభ అభ్యర్థి పసునూరి దయాకర్‌కు పార్టీ ఏ, బీ ఫారంలను, ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ.70 లక్షల చెక్కును కేసీఆర్ అందజేశారు.

CM KCR giving B-form to the warangl TRS MP Candidate Pasunuri Dayakar

-సర్వేలు అద్భుత విజయమంటున్నాయి -99 శాతం వాగ్దానాలు అమలుచేశాం -రాష్ర్టాలు మనవైపు చూస్తున్నాయి -తెల్లకార్డు వారందరికీ వచ్చే ఏడు కల్యాణలక్ష్మి -మన ఒక్క ఇల్లు.. కాంగ్రెస్, టీడీపీల ఏడిండ్లకు సమానం -కాళేశ్వరం స్విచాన్ చేస్తే వరంగల్ నంబర్‌వన్ -వరంగల్ జిల్లా నేతల సమావేశంలో టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ -పార్టీ అభ్యర్థి దయాకర్‌కు ఫారం-ఏ, బీ అందజేత అంతకుముందు మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో వరంగల్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతల సమావేశంలో కేసీఆర్ ప్రసంగించారు. పార్టీ అభ్యర్థి దయాకర్‌కు అడ్వాన్సుగా అభినందనలు తెలిపారు. ఉద్యమకారుడు, దళిత బిడ్డ అయిన దయాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులంతా ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. దయాకర్ పేద అభ్యర్థి అని, అందుకే ఎన్నికల ఖర్చును పార్టీ భరిస్తుందని చెప్పారు. ఎన్నికల్లో తాము పెద్దగా ఖర్చు పెట్టబోమని, కొద్దిపాటి పార్టీ వనరులతోనే ఎన్నికను నెగ్గుకు వస్తామని అన్నారు.

అందరికీ అవకాశం వస్తుంది.. వరంగల్ పార్లమెంటు స్థానాన్ని చాలామంది మిత్రులు ఆశించారని.. అయితే ఏ పార్టీ అయినా ఒక్క అభ్యర్థికే అవకాశం ఇవ్వగలుగుతుందని అన్నారు. రవికుమార్, పరంజ్యోతి, పరమేశ్వర్, ప్రొఫెసర్ సాంబయ్యలాంటి వారు ఆశించారు. దయాకర్ ముందు నుంచి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. గతంలో రెండు, మూడుసార్లు అవకాశాలు దగ్గరిదాకా వచ్చి పోయినయి. అయినా విధేయతతో అటు ఉద్యమంలో, ఇటు ఎన్నికల్లో పనిచేశారు. అలా ముందు నుంచి ఉన్న వారికి పార్టీ తప్పకుండా అవకాశాలిస్తుంది. ఎమ్మెల్సీ పదవుల్లో కూడా ఉద్యమంలో ముందు వరుసలో ఉన్న వారికి మ్యాక్సిమమ్ సర్దుబాటు చేసేందుకు ప్రయత్నిస్తం.

Public

దయాకర్ తెలంగాణ తల్లి రూపశిల్పిగా వందలాది విగ్రహాలు తయారుచేశారు. విద్యాధికుడు, మంచివాడు. ప్రజలకు అందుబాటులో ఉంటాడనే ఉద్దేశంతో ఇచ్చినం. దానికి అందరినీ పిలిచి వ్యక్తిగతంగా కోరినం. అందరూ కలిసి పని చేయాలని చెప్పినం. అందరికీ అవకాశాలు వస్తాయని చెబితే… ఎవరూ నొచ్చుకోలేదు. అందరూ వచ్చినరు. ఇది మంచి సంకేతం. సమయం, సందర్భం వచ్చినపుడు అర్హత ఉన్న వారికి కచ్చితంగా అవకాశాలు వస్తయని చెప్తే మీరు ఏం నిర్ణయం తీసుకున్నా మంచిదేనని చెప్పినరు. అందరికీ ధన్యవాదాలు.. అని కేసీఆర్ అన్నారు.

99.9 శాతం హామీల అమలు.. కేవలం 16 నెలల్లోనే తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను ప్రజల కోసం తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 30 ఏండ్లుగా ఏ ప్రభుత్వం ఉన్నా.. కరెంటు బాధలు తీరలేదు. తెలంగాణలో ఆరు నెలల కాలంలోనే కరెంటుకు ఇక భయపడాల్సిన పనిలేదనే పరిస్థితులు వచ్చినయి. ఇక రాష్ట్రంలో కరెంటు పోదు. కరెంటు కోతలనేవి ఉండవు. అదే పద్ధతిలో సంక్షేమంలో భారత్‌లోనే తెలంగాణ నంబర్‌వన్‌గా ఉంటుంది. చరిత్రలో ఎవరూ ఊహించని విధంగా పెన్షన్లు ఇస్తున్నం. పేదల పెన్షన్ అంటే గతంలో మొక్కుబడిగా ఇచ్చేవాళ్లు. టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ఛైర్మన్‌గా కడియం శ్రీహరి లెక్కలు వేసి నెలకు రూ.765 సరిపోతయని చెప్పినరు. అయితే దాన్ని వెయ్యి చేయించిన. ఇపుడు 38 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నం. హామీ ఇవ్వకున్నా హాస్టళ్లలో సన్నబియ్యం ఇస్తున్నం. వచ్చే సంవత్సరం కాలేజీ హాస్టళ్లలో కూడా ఇస్తం అన్నారు.

బీపీఎల్ అందరికీ కళ్యాణలక్ష్మి.. కళ్యాణలక్ష్మి పథకం మీద ఎవరూ డిమాండు చేయకున్నా, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకున్నా ప్రారంభించినం. ఇపుడు దళితులు, గిరిజ నులు, మైనార్టీలకు ఇస్తున్నం. ఈ ఆర్థిక సంవత్సరం ఎంతయిందని లెక్కలు తీసినం. అవగాహన వచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కుల, మత తారతమ్యాలు లేకుండా బీపీఎల్ తెల్ల రేషన్‌కార్డు ఉన్న వారందరికీ ఇస్తం. అపుడు బహుశా బీసీలందరికీ ఈ పథకం వర్తిస్తది. మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు పెడతామని హామీ ఇవ్వలేదు. అయినా అమలు చేస్తున్నం. ఏ ఒక్క కులం, మతం వాళ్లకో కాకుండా అందరి కీ అవకాశాలు వస్తే సమాజం నిండుగ ఉంటదని పెట్టినం. చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మార్కెట్ కమిటీ ఛైర్మన్లుగా అవకాశమొస్తున్నది. తండా పంచాయతీలకు అంతా సిద్ధం చేసినం. వచ్చే పంచాయతీరాజ్ ఎన్నికలు తండా పంచాయతీల్లోనే జరుగుతయి అని చెప్పారు.

మన ఒక్క ఇల్లు.. వాళ్ల ఏడిండ్లకు సమానం.. కొంచెం ఆలస్యమైనా సరే.. మేం డబుల్ బెడ్‌రూం కట్టిస్తమన్నం. కట్టిస్తున్నం. ఇప్పుడు అరవై వేల ఇండ్లు కడుతున్నం. వచ్చే సంవత్సరాల్లో పెంచుతం. ఒక్క గదిల ఉంటె ఎంత బాధ ఉంటదో.. అట్ల ఉన్నోళ్లకే తెలుస్తది. అందుకే గ్రామాల్లో రూ.5.04 లక్షలు, పట్టణాల్లోనైతే రూ.5.30 లక్షల ఖర్చుతో కట్టిస్తున్నం. ఇప్పుడు మనం కట్టే ఒక్క ఇల్లు… కాంగ్రెస్, టీడీపీ కట్టిన ఏడు ఇండ్లకు సమానం. అంటే.. ఈ ఏడాది కడుతున్న 60 వేల ఇండ్లు వాళ్లు కట్టిన 4.20 లక్షల ఇళ్లకు సమానమన్నట్టు.

ఈసారి రంజాన్, బతుకమ్మ, దసరా పండుగలను అద్భుతంగా జరిపినం. బోనాలను కనీవినీ ఎరుగని రీతిలో చేసినం. గోదావరి పుష్కరాలను అద్భుతంగా నిర్వహించినం. 25వేల మెగావాట్ల కరెంటు కోసం చర్యలు తీసుకుంటున్నం. రెండు, రెండున్నర ఏండ్లలో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ల ద్వారా నీళ్లిచ్చేందుకు రూ.40వేల కోట్లతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నం. టెండర్లు కూడా పిలిచినం. రెండు నెలల్లో ప్రజల ముందుకు ఆ పథకం వస్తది అని కేసీఆర్ వివరించారు.

బీహార్‌లో మన వాటర్‌గ్రిడ్ పథకం.. బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆ రాష్ట్ర సీఎం నితీష్‌కుమార్ తాను గెలిస్తే తెలంగాణ లెక్క ప్రతి ఇంటికీ వాటర్ గ్రిడ్ ద్వారా నీళ్లిస్తమని చెబుతున్నరు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మన మంత్రిని పిలిపించుకొని వాటర్‌గ్రిడ్‌పై ప్రజెంటేషన్ చూసిండు. మరికొన్ని రోజుల్లో ఇక్కడికి వస్తున్నరు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంకూడా వాటర్ గ్రిడ్‌ను అమలుకు వాళ్ల టీంను పంపుతున్నది. 16 నెల్లు ఏపాటి? ఇంత తక్కువ సమయంలో రాష్ట్రంలో కరెంటు, నీళ్లు, ఇండ్లు, భారీగా సంక్షేమం అమల్లోకి తెచ్చి అన్ని రంగాల్లో ముందుకుపోతున్నం. ఎన్నికల మ్యానిఫెస్టో అంటే చెప్పిన అంశాలను ఐదేండ్లలో చేసేది.

ఏ ప్రభుత్వానికైనా ఐదేండ్ల సమయం ఉంటది. కానీ మనం ఈ తక్కువ సమయంలోనే ఒక్క కేజీ టు పీజీ తప్ప.. మిగిలిన అన్ని హామీలను 99.9 శాతం అమలు చేస్తున్నం. అందుకే సీఎన్‌ఎన్-ఐబీఎన్ తెలంగాణను నంబర్ వన్ స్టేట్‌గా ప్రకటించింది. ఇండియాటుడే వాళ్లు ఈనెల ఆరో తేదీన ఢిల్లీలో అవార్డు ఇస్తున్నరు. 16 నెలల్లో అదీ 7-8 నెలలు ఐఏఎస్, ఐపీఎస్‌లు అలాట్ కాకున్నా చిత్తశుద్ధితో ఇన్ని పనులు చేసినం..

వాటర్‌పాలసీ తెస్తున్నం.. తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేలా తెలంగాణ వాటర్ పాలసీని రూపొందిస్తున్నాం. త్వరలోనే దానిని ప్రకటిస్తాం. గతంలో ప్రాజెక్టులు గందరగోళంగా ఉన్నయి. కాంట్రాక్టర్ల కోసమే మొదలుపెట్టిండ్రు. కాగ్ కూడా అదే చెప్పింది. దేవాదుల ప్రాజెక్టును చూస్తే ఆశ్చర్యమైతది. రూ.7500 కోట్లు ఖర్చు పెడితే 170 రోజులు నీళ్లు తీసుకోవాల్సింది 60-70 రోజులు కూడా రావడం లేదు. గోదావరి మీద చిన్న ఆనకట్టగానీ, బ్యారేజీగానీ కట్టలేదు. ఇది అప్పటి పాలకుల చిత్తశుద్ధి! ఎస్సారెస్పీ రెండో దశ కింద కాలువలు తవ్వి ఖాళీగ ఉన్నయి, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో 20 ఏండ్ల కింద కాలువలు తవ్వినా ఇవాళ కూడా నీళ్లు లేవు.

కొన్ని ప్రాజెక్టులు ఎట్ల ఉన్నయంటే… సీఎం ప్రారంభించి, హైదరాబాద్ చేరుకునేలోగానే నీళ్లు బంద్ అయితయి. ఎల్‌ఎండీ కాలువ 8500 క్యూసెక్కులకు డిజైన్ చేస్తే మూడువేల క్యూసెక్కులు కూడా పారుతలేవు. మనం దాన్ని రిపేర్ చేసి వచ్చే జూన్‌లోగా మిడ్ మానేరు నుంచి నీళ్లు ఇచ్చేందుకు రూ.130 కోట్లు కూడా విడుదల చేసినం. కృష్ణా, గోదావరిలో మన వాటాను వాడుకునేందుకు చర్యలు చేపడుతున్నం. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాలతో తెలంగాణకు అన్నం పెడదామని చూస్తున్నం. త్వరలోనే ఇరిగేషన్ పాలసీని ప్రకటిస్తం. మిడ్ మానేరు పనులు శరవేగంగా జరుగుతున్నయి. వచ్చే ఏడాది జూన్ వరకు కాళేశ్వరం నుంచి గోదావరిజలాల్ని తరలించి వరంగల్ జిల్లాను సస్యశ్యామలం చేస్తం. కాళేశ్వరం స్విచ్‌ఆన్ అయితే వరంగల్ కళకళలాడుతది అని కేసీఆర్ వివరించారు.

దయాకర్‌కు రూ.70 లక్షల చెక్కు వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్‌కు ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ.70 లక్షల చెక్కును పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అందచేశారు. అభ్యర్థి ఖర్చును పార్టీనే భరిస్తుందని చెప్పిన మేరకు క్యాంపు కార్యాలయంలో శనివారం రాత్రి దయాకర్‌కు చెక్కును ఇచ్చారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఎంపీ అభ్యర్థి గరిష్ఠంగా రూ.70 లక్షల వరకు ఖర్చు చేసుకోవచ్చు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు దయాకర్ కేసీఆర్‌కు కృతజ్ఙతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి,

పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, చందూలాల్, ఎంపీ వినోద్‌కుమార్, జిల్లా ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, ఆరూరి రమేశ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వరంగల్ జెడ్పీ చైర్‌పర్సన్, జిల్లా నేతలు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీఎం వారితో నీటి వనరులపై చర్చించారు. గోదావరి నదిపై మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం… ఆ తర్వాత తుపాకులగూడెం వద్ద మరో బ్యారేజీ ఎలా చేపడతామనే దానిపై గూగుల్ మ్యాప్ ద్వారా వారికి వివరించారు. వచ్చే ఏడాది జూన్ నాటికి వరంగల్, నల్లగొండ, ఖమ్మం (పాక్షికం) జిల్లాల్లో సాగునీటిని ఎలా అందించగలమనే దానిమీద వివరించారు. పార్టీ టికెట్‌ను ఆశించిన రవికుమార్, పరమేశ్వర్, పరంజ్యోతి తదితరులతో కేసీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు.

4న దయాకర్ నామినేషన్ -నేడు అసెంబ్లీ స్థానాల్లో మంత్రుల సమావేశం వరంగల్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న పసునూరి దయాకర్ బుధవారం (ఈ నెల 4న) నామినేషన్ దాఖలు చేయనున్నారు. శనివారం రాత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ నుంచి బీ ఫారం తీసుకున్న ఆయన… సోమవారం మంచి ముహూర్తం ఉండటంతో ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆ తర్వాత నాలుగో తేదీన అధికారికంగా బీఫారంతో సహా నామినేషన్ వేస్తారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలందరూ హాజరుకానున్నారు.

ఉప ఎన్నిక దరిమిలా ముమ్మర ప్రచారంతోపాటు భారీ మెజారిటీతో పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు గులాబీదళం రంగంలోకి దిగనున్నది. ఇందుకుగాను ఆదివారం వరంగల్ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాలు జరగనున్నాయి. నియోజకవర్గాల బాధ్యతను మంత్రులకు అప్పగించిన దరిమిలా.. ఉదయం 11 గంటలకు ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జి మంత్రులు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.