-మళ్లీ ఆరాటం.. పోరాటం నేడే అపెక్స్ కౌన్సిల్ భేటీ -కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి అధ్యక్షతన సమావేశం -వెబినార్‌లో పాల్గొననున్న తెలుగు రాష్ర్టాల సీఎంలు -కేంద్రం తరపున నాలుగు ఎజెండా అంశాలు ఖరారు -రాష్ట్ర వాటా, సీమలిఫ్టుపై గళంవిప్పనున్న సీఎం కేసీఆర్

గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఎట్టకేలకు మంగళవారం జరుగనున్నది. రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ర్టాల సీఎంల అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశానికి సర్వం సిద్ధమయింది. కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన జరుగనున్న ఈ భేటీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. కరోనా నేపథ్యంలో వెబినార్‌ద్వారా సమావేశం కానున్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. సమావేశం మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలవుతుందని తొలుత షెడ్యూల్లో ప్రకటించినా.. గంట ముందుకు జరిపారు. కేంద్రమంత్రితోపాటు జల్‌శక్తి, సీడబ్ల్యూసీ ఉన్నతాధికారులు ఢిల్లీ నుంచి సమావేశంలో పాల్గొంటారు. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నందున ఆయన అక్కడ్నుంచే సమావేశానికి హాజరవుతారని ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి వెబినార్‌లో పాల్గొంటారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల చైర్మన్లు జలసౌధలోని తమతమ చాంబర్ల నుంచి హాజరవుతారు.
నాలుగు అంశాలతో అజెండా అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించే అంశాలపై రెండురాష్ర్టాలు ఎలాంటి లిఖితపూర్వక ఎజెండా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో జల్‌శక్తిశాఖ నాలుగు అంశాలతో ఎజెండాను ఖరారుచేసింది. రెండు నదీ యాజమాన్య బోర్డులు ఇప్పటికే జల్శక్తికి నివేదికలు సమర్పించాయి. జల్‌శక్తిశాఖ సలహాదారు వెదిరె శ్రీరాం పలుమార్లు బోర్డు చైర్మన్లతో భేటీ అయి వివరాలు సేకరించి, కేంద్రమంత్రికి నివేదిక రూపంలో అందించినట్టు తెలిసింది.
తెలంగాణ తరఫున బలమైన వాదనలు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ తరఫున సీఎం కేసీఆర్ బలమైన వాదనలు వినిపించనున్నారు. కొన్నిరోజులుగా జల వనరులశాఖ అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించిన కేసీఆర్.. సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసుకున్నారు. ప్రధానంగా నదీజలాల వివాద ట్రిబ్యునల్-1956లోని సెక్షన్-3 ప్రకారం ఏడాదిలోనే తేల్చాల్సిన తెలంగాణ నీటివాటాను ఆరేండ్లు దాటినా ఇంకా నానబెట్టడంపై సీఎం కేసీఆర్ కేంద్రాన్ని నిలదీయనున్నారు. కృష్ణాజలాల్లో వాటాతోపాటు, గోదావరిలో మిగులు వాటాను కూడా తేల్చాలని డిమాండ్ చేయనున్నారు. పోలవరం వాటాకు సంబంధించి తెలంగాణకు దక్కాల్సిన 45 టీఎంసీల కృష్ణాజలాల అంశాన్ని, పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ భారీఎత్తున నీటిని అవతలి బేసిన్‌కు తరలించడం, గతంలో అనేకసార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం తదితర అంశాలను సీఎం సమావేశంలో ప్రస్తావించనున్నారు.
ఇక.. ఏకపక్షంగా, ఎలాంటి అనుమతుల్లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు పనులను చేపట్టేందుకు ఏపీ సిద్ధమైనందున ఆ ప్రాజెక్టును నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని కేసీఆర్ కేంద్రా న్ని డిమాండ్ చేయనున్నారు. ఏపీ గిల్లికజ్జాలు పెట్టుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ గోదావరి ప్రాజెక్టులపై ఫిర్యాదు చేయడాన్ని నిలదీయనున్నట్టు తెలిసింది. తెలంగాణ ఏ ఒక్క కొత్త ప్రాజెక్టును కూడా చేపట్టడం లేదని.. ఉమ్మడి రాష్ట్రంలో ఆమోదంపొందిన ప్రాజెక్టులను తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా రీడిజైన్ చేసి నిర్మిస్తున్నట్టు తగిన ఆధారాలతోసహా కేంద్రం ముందుంచనున్నారు. ఇప్పటికే సుదీర్ఘ లేఖలో కేంద్రం, ఏపీ వైఖరిపై విరుచుకుపడిన సీఎం కేసీఆర్.. అపెక్స్ కౌన్సిల్ సమావేశం వేదికగా మరోసారి గళం విప్పనున్నారు.
బోర్డుల పరిధిపైనే ప్రధాన దృష్టి రెండురాష్ర్టాల మధ్య సుదీర్ఘంగా ఉన్న అపరిష్కృత అంశాలను తేల్చేందుకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు కేంద్రం ప్రకటించినా.. నదీ యాజమాన్య బోర్డుల పరిధిపైనే ప్రధానంగా దృష్టిసారించనున్నట్టు తెలిసింది. ఈ మేరకు జల్‌శక్తి శాఖ ఉన్నతాధికారులు, శాఖ సలహాదారు కూడా ఇదే అంశంపై బోర్డుల నుంచి సమగ్ర వివరాలు సేకరించారు. దీంతోపాటు శ్రీశైలం, నాగార్జునసాగర్ వర్కింగ్ మాన్యువల్‌ను కూడా ప్రధాన ఎజెండా అంశంగా కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం.
ఎజెండా అంశాలు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై నిర్ణయం కృష్ణా, గోదావరిపై నిర్మించే కొత్తప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను సంబంధిత యాజమాన్య బోర్డులకు సమర్పించడం తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా, గోదావరి జలాల పంపిణీకి కార్యాచరణ ప్రణాళిక (మెకానిజం) రూపొందించడం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలించడం
తెలంగాణ వాదనలు కొత్తరాష్ట్రం తెలంగాణకు ఏడాదిలోనే కేటాయిం చాల్సిన నీటివాటాను ఆరేండ్లయినా తేల్చకపోవడం పోలవరం వాటాకు సంబంధించి కృష్ణాజలాల్లో తెలంగాణకు దక్కాల్సిన 45 టీఎంసీల వాటా పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ భారీఎత్తున నీటిని పెన్నా బేసిన్‌కు తరలించడం.. కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం ఏకపక్షంగా, ఎలాంటి అనుమతుల్లేకుండా చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతలు, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను నిలిపివేయించడం తెలంగాణ ప్రాజెక్టులు కొత్తవి అంటూ చీటికిమాటికి ఏపీ ఫిర్యాదు చేయడం