Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మన పల్లెలు దేశానికి ఆదర్శం

-దశలవారీగా గ్రామవికాసం
-ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి
-పటిష్ఠ గ్రామీణ ఆర్థికవ్యవస్థ
-ప్రజల జీవన ప్రమాణాల పెంపు, పల్లెప్రగతి కార్యక్రమం, లక్ష్యాలపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రకటన

పల్లెప్రగతి కార్యక్రమం వల్ల గ్రామగ్రామాన అద్భుతమైన ప్రగతి కనిపిస్తున్నదని సీఎం కే చంద్రశేఖర్‌రావు అన్నారు. పల్లెప్రగతి నిరంతర కార్యక్రమమని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో పల్లెప్రగతికి సంబంధించి సీఎం కేసీఆర్‌ ప్రకటన ఇచ్చారు. తెలంగాణ గ్రామాలు దేశంలోనే ఆదర్శంగా రూపుదిద్దుకోవాలనే సదుద్దేశంతో ప్రభుత్వం సమగ్ర గ్రామీణ విధానం అమలు చేస్తున్నదని చెప్పారు. పల్లెల్లో పచ్చదనం.. పరిశుభ్రతతోపాటు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎం ప్రకటన ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.. రాష్ట్ర గ్రామీణ ముఖచిత్రాన్ని మార్చడానికి ప్రభు త్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకొన్నది. ఇందులో భాగంగా రెండు విడుతలుగా పల్లెప్రగతి ప్రత్యేక అవగాహన చైతన్య కార్యక్రమాలు నిర్వహించింది. గ్రామాల వికాసానికి ప్రభు త్వం దశలవారీగా ప్రయత్నం చేస్తున్నది. మొదటిదశలో పల్లె ప్రజలకు జీవనభద్రత కల్పించడం, నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించడం, మిషన్‌ కాకతీయద్వారా చెరువులు బాగుచేయడం, చేతి, కులవృత్తులకు చేయూతనివ్వడం ద్వారా గ్రామీణ ఆర్థికవ్యవస్థను పటిష్ఠం చేయడం, రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్‌, రుణమాఫీ వంటి రైతుసంక్షేమ పథకాలు, ఆసరా పింఛన్ల లాంటి ప్రజాసంక్షేమ పథకాల ద్వారా గ్రామీణప్రజలకు భవిష్యత్తుపై ఆశావహ దృక్పథాన్ని కల్పించింది. మిషన్‌ భగీరథ, 24 గంటల కరంట్‌, రోడ్లు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలాంటి మౌలిక వసతుల కల్పనతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి కృషిచేసింది.

పంచాయతీరాజ్‌ బలోపేతానికి చర్యలు
తెలంగాణ గ్రామీణ ముఖచిత్రం మారాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం సంస్కరణలు అమలుచేసింది. పంచాయతీరాజ్‌ వ్యవస్థ బలోపేతానికి ఆశాఖ స్వరూపాన్నే మార్చేసింది. రాష్ట్రంలో 8,690 గ్రామపంచాయతీలు ఉంటే వాటి సంఖ్యను 12,751కి పెంచింది. గిరిజనులు, ఆదివాసీలు ఎప్పట్నుంచో కోరుతున్నవిధంగా ఎస్టీ ప్రాంతాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటుచేసింది. దీనివల్ల రాష్ట్రంలో 3,146 గ్రామాల్లో ఎస్టీలు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. డీపీవోల సంఖ్యను 9నుంచి 32కు, డీఎల్పీవోలను 28 నుంచి 68కి, మండల పంచాయతీ అధికారులను 438 నుంచి 539కి ప్రభుత్వం పెంచింది. గతంలో 3,396 మంది గ్రామ కార్యదర్శులుండే వారు. ప్రతి గ్రామానికి కచ్చితంగా ఒక గ్రామ కార్యదర్శి ఉండాలన్న ఉద్దేశంతో ఒకేసారి 9,355 మందిని నియమించింది. పంచాయతీ సిబ్బంది వేతనాలు రూ.8,500కు పెంచింది. వారికి రూ.2 లక్షల ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది.

కొత్త పంచాయతీరాజ్‌చట్టం
గ్రామాభివృద్ధిలో పంచాయతీల పాత్రను ప్రభుత్వం క్రియాశీలం చేసింది. అధికారులు, ప్రజాప్రతినిధుల భాధ్యతలు, కర్తవ్యాలను స్పష్టంగా పేర్కొం టూ కొత్త పంచాయతీరాజ్‌ చట్టాన్ని తెచ్చింది. కొత్త చట్టంద్వారా ఎవరి గ్రామాన్ని వారు గొప్పగా తీర్చిదిద్దుకొనేందుకు వార్షిక, పంచవర్ష ప్రణాళికలు రూపొందించుకొనే కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించింది. నిధుల వినియోగంలో పారదర్శకత పాటించడానికి చర్యలు తీసుకుంటున్నది. విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలకు కూడా చట్టంలో కఠిన నిబంధనలు పొందుపరచడంద్వారా పరిపాలనలో జవాబుదారీతనాన్ని పెంచింది.

‘పల్లెప్రగతి’ సాధించిన విజయాలు
ప్రజలు సంఘటితంగా ఉండి గ్రామాలను తీర్చిదిద్దుకొనే ఒరవడి అలవాటుకావడానికి రాష్ట్రంలో రెండు విడుతలుగా.. గత ఏడాది సెప్టెంబర్‌ 6 నుంచి అక్టోబర్‌ 5 వరకు 30 రోజులు, ఈ ఏడాది జనవరి 2 నుంచి 12 వరకు పదిరోజులు పల్లెప్రగతి కార్యక్రమం జరిగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని, శ్రమదానం చేసి గ్రామా ల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచే పనుల్లో భాగస్వాములయ్యారు. ఏ ఊరికి ఆ ఊరిప్రజలు తమ గ్రామ అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యాలు నిర్ణయించుకుని వార్షిక, పంచవర్ష ప్రణాళికలు, హరిత ప్రణాళిక తయారుచేసుకున్నారు. పారిశుద్ధ్యపనులు నిర్వహించారు.

ప్రతి గ్రామానికి వైకుంఠధామం
-దేశంలో మరెక్కడాలేని విధంగా ప్రతి గ్రామానికి వైకుంఠధామం, నర్సరీ, డంప్‌యార్డు, ట్రాక్టర్‌ ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. పల్లెప్రగతిలో వీటి ఏర్పాటుకు గట్టి ప్రయత్నం జరిగింది. వైకుంఠధామాల నిర్మాణానికి 11,982 గ్రామాల్లో ఇప్పటికే స్థలాల గుర్తింపు జరిగింది. 11,828 గ్రామాల్లో నిర్మాణం ప్రారంభమైంది. మిగతా 154 గ్రామాల్లో త్వరలో వైకుంఠధామాల నిర్మాణం ప్రారంభమవుతుంది. కొద్దిరోజుల్లోనే రాష్ట్రంలోని వందశాంత గ్రామాలు వైకుంఠధామాలు కల్గి ఉంటాయి.
-12616 గ్రామాల్లో డంప్‌యార్డుల ఏర్పాటుకు స్థలాల గుర్తింపు జరిగింది. 12,124 గ్రామాల్లో నిర్మాణ పనులు మొదలయ్యాయి. 492 గ్రామాల్లో త్వరలోనే స్థలాలు గుర్తిస్తారు. ప్రతిఇంటినుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి, దాన్ని డంప్‌యార్డుకు తరలించి ఆ చెత్తతో కంపోస్ట్‌ ఎరువు తయారుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
-12738 గ్రామాల్లో నర్సరీల ఏర్పాటు పూర్తయింది. మిగిలిన 13 గ్రామాలు వివిధ సాగునీటి ప్రాజెక్టులకింద ముంపునకు గురవుతున్నందున అక్కడ నర్సరీలు ఏర్పాటుచేయలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో 10.90 కోట్ల మొక్కలు నాటి 86% సంరక్షించడం జరిగింది. పల్లెల్లో పచ్చదనం పెంచడానికి ఈ ఏడాది రూ.237 కోట్లు ఖర్చయింది. గ్రామబడ్జెట్‌లో 10% పచ్చదనానికి కేటాయించాలన్న నిబంధన వల్ల 2020-21లో రూ.369 కోట్లు గ్రీన్‌ బడ్జెట్‌గా ఏర్పడుతుంది.
-మొక్కలకు నీళ్లుపోయడం, చెత్త సేకరణ కోసం 12,331 గ్రామాల్లో ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. మిగతా 420 గ్రామాలకు త్వరలోనే ట్రాక్టర్లు చేరుకొంటాయి.
-పల్లెప్రగతిలో అన్ని గ్రామాల్లో విద్యుత్‌ సంబంధ సమస్యలు తొలగిపోయాయి. దేశంలోనే తొలిసారిగా 12,751 గ్రామాల్లో ప్రభుత్వం ప్రజాభాగస్వామ్యంతో నాలుగు స్టాండింగ్‌ కమిటీలను ఏర్పాటు చేసింది. వీటిలో 8,20,727 మంది సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వ లక్ష్య సాధన దిశగా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించేందుకు 45 మంది సీనియర్‌ అధికారులతో ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్‌ ఏర్పాటు చేశాం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.