Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మన పతార పెరిగింది

-ప్రగతిలో మనమే నంబర్‌వన్
‌ -కరోనాలోనూ సంక్షేమాన్ని ఆపలే
-అప్పులు పెరుగలేదు..రిటర్నులు మొదలయ్యాయి

అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణే దేశంలో ముందువరుసలో ఉన్నదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. కరోనా సమయంలోనూ సంక్షేమాన్ని అపలేదని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలేవీ చేయడం లేదని ఆక్షేపించారు. ఆర్బీఐ దగ్గర పతార ఉన్న ఏకైకరాష్ట్రం తెలంగాణ అని చెప్పా రు. ఎన్ని అవరోధాలు వచ్చినా అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. శుక్రవారం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా తెలంగాణ సాధించిన ప్రగతిని ఆయన ప్రస్తావించారు. సీఎం కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

ప్రతిపక్షాల నుంచి నిర్మాణాత్మక సూచనలేవీ
బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైనప్పటినుంచి ప్రతిపక్షాలు రొడ్డ కొట్టుడుగా చెప్పిందే చెప్పింది.. పాడిందే పాడటం తప్ప నిర్మాణాత్మకమైన సూచనగానీ, గుణాత్మకమైన సలహాగానీ ఇచ్చిన పాపాన పోలేదు. అంత బడ్జెట్‌ ఎలా పెట్టారంటూ.. ప్రతిపక్షాలు నానా రాద్ధాంతం చేస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చాక భారతదేశం తొలి బడ్జెట్‌ రూ.192 కోట్లు మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌ తొలి బడ్జెట్‌ రూ.79.25 కోట్లు. ఈ రోజు జాతీయబడ్జెట్‌ చూసినా..రాష్ర్టాల బడ్జెట్‌ చూసి నా వందల కోట్ల నుంచి లక్ష కోట్లకు చేరుకున్నది.

జీడీపీలో మనమే మేలు

కరోనాతో అన్నిదేశాల జీడీపీలు కుప్పకూలినై. 7 శాతంపైగా ఉన్న మనదేశ జీడీపీ -3.8 నుంచి -4లోకి వెళ్లింది. అనేకరాష్ర్టాలు మైనస్‌ జీడీపీలో ఉన్నాయి. కానీ మనం మాత్రం 1.3 ప్లస్‌ జీఎస్‌డీపీ పెంచుకోగలిగాం. దీనికి ప్రధాన కారణం వ్యవసాయమే. గత నాలుగైదేండ్లలో 17.73 శాతం వృద్ధి నమోదుచేసింది వ్యవసాయరంగం.

అప్పులపై గడబిడ వద్దు
రాష్ట్రంలో అప్పులు పెరగలేదు. అప్పులు తీసుకొనే రాష్ర్టాల్లో మనం బాటమ్‌ నుంచి 25 ప్లేస్‌లో ఉన్నం. ఘనత వహించిన రాష్ర్టాలు మనపైన అనేకం ఉన్నాయి. అతి తక్కువ అప్పులు చేసి, పటిష్ఠమైన ఆర్థికవ్యూహం, క్రమశిక్షణను పాటించిన రెండు మూడు రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి. తీసుకున్న అప్పును ఎలా వాడుకోవాలో కూడా మనకే తెలుసు. పదేండ్లలో ఉమ్మడి రాష్ట్రంలో పెట్టుబడి వ్యయం కేవలం రూ.54 వేల కోట్లు ఉంటే.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక ఐదారేండ్లల్లోనే రూ.2,34,153 కోట్లకు పెంచుకున్నం. జీఎస్‌డీపీ పెరుగుదలకు కారణాల్లో పెట్టుబడి వ్యయం ప్రధానమైనది. దీనిద్వారా ఇరిగేషన్‌ ప్రాజెక్టులు వస్తున్నాయి. మంచినీరు, కరెంటు సమస్యలు తీరుతున్నయి. అనేక మౌలికరంగాల వాటా పెరుగుతున్నది. రిటర్న్‌లు వస్తున్నాయి. ఏడాది కాలంలోనే మన రైతాంగం పండించిన పంట రూ.లక్ష కోట్లకు చేరింది. కరో నా సమయంలోనూ సంక్షేమాన్ని ఆపలేదు.

అసంగతమైన విమర్శ
ఇరిగేషన్‌ ప్రాజెక్టులు కడితే 200 మంది కాం ట్రాక్టర్ల దగ్గర సంపద ఉంటదని బట్టి విక్రమార్క విచిత్రమైన వ్యాఖ్య చేశారు. ఎంత అసంగతమైన చర్చ? కాంట్రాక్టర్‌ అనేవాడు ఓ టూల్‌. ఎక్కడైనా ఒక్కటే సిస్టమ్‌ ఉంటది. మనం రాకముం దు ఈపీసీలు, మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లంటూ చాలా తతంగాలుండే. అవన్నీ రద్దుచేసినం. చేసే పనికూడా పటిష్ఠంగా ఉండాలని పదేండ్లపాటు మెయింటెనెన్స్‌ చేయాలని కఠిన నిబంధన పెట్టి నం. ఇరిగేషన్‌ ప్రాజెక్టులు కట్టుడే తప్పన్నట్టు, తద్వారా సంపద కాంట్రాక్టర్ల దగ్గరే ఉంటది అన్నట్టు చెప్పడం కరెక్ట్‌ కాదు.

అన్ని మున్సిపాలిటీల్లో మోడల్‌ మార్కెట్లు..
అంగళ్లు, మున్సిపాలిటీల్లో మోరీల మీద, రోడ్ల మీదపెట్టి చాలా అనాగరికంగా కూరగాయలు పరిస్థితి పోవాలని గజ్వేల్‌లో మోడల్‌ మార్కెట్లు కట్టినం. రాబోయే ఆరేడు నెలల్లో అన్ని మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లు కడతాం. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.500 కోట్లు పెట్టినం. ధూల్‌పేటలో కమ్యూనిటీ హాల్‌ను తప్పకుండా కడతాం. సీఎస్‌, నగరంలోని మంత్రులతో కలిసి ధూల్‌పేట సందర్శనకు వెళ్తా. అక్కడి యువత చెడుమార్గాలు పట్టకుండా వారికి ఉపాధి కల్పిస్తాం. హైదరాబాద్‌లో ధూల్‌పేట బ్లాక్‌డాట్‌ అనే అపవాదును తీసేస్తా.

నాగార్జునసాగర్‌లో 1. 53లక్షల లబ్ధిదారులు
సాగర్‌ ఉప ఎన్నికలు వస్తున్నాయి. నేను మా పార్టీ వాళ్లకు చెప్పిన. మీరు కలుస్తలేరు కలవండీ అని చెప్పిన. నాకే ఆశ్చర్యమేసింది. ఒక్క నియోజకర్గంలోనే 1.53 లక్షల మంది ప్రభుత్వం ద్వా రా లబ్ధిపొందిన వాళ్లున్నారు. అన్ని తీసిచ్చాం. గ్రామాలవారీగా కలవండి అని చెప్పినం.

ఒక్కపైసా డిఫాల్ట్‌ కాలే..
అన్ని రంగాల్లో ప్రగతి సాధించినం. అన్నింటి మించి తెలంగాణ భాషలో ‘పతార’ అంటరు. ఎప్పుడు పడితే అప్పుడు. యాడికిపడితే ఆడికెల్లి అప్పులు తేవడం ఉండదు. ఆర్బీఐకి మనం ఇండెంట్‌ ఇస్తాం. వాళ్లు బాండ్లు పెడ్తరు. ఎల్‌ఐసీ, బ్యాంకులు, ఇంకా ఇతరేతర సంస్థలు బాండ్లు కొంటయి. ఏ రాష్ట్రం బాండ్‌ కూడా ఏడు నుంచి 12 ఏండ్లకే పరిమితమవుతది. ప్రతి మంగవారం ఆర్బీఐ బాండ్లపై నిర్ణయాలు జరుగుతవి. ప్రతివారం బాండ్లు పెట్టగానే ‘తెలంగాణ బాండ్‌ ఉన్నదా’ అని అందరూ చూస్త్తరు. 25 ఏండ్లు, 40 ఏండ్లు బాండ్లు అమ్మే ఏకైక రాష్ట్రం తెలంగాణ. తీసుకున్న అప్పులు చెల్లించటంలో ఒక్క పైసా కూడా డిఫాల్ట్‌ కాలేదు. ఎప్పుడు ఓడీ తీసుకోలె.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.