Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మన పౌల్ట్రీ రంగానికి మరింత ప్రోత్సాహం

కోళ్ల ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. భారతదేశంలో పౌల్ట్రీ ఒక పెద్ద పరిశ్రమ అని, ఈ రంగానికి కావాల్సిన సహాయం అందించేందుకు రాఫ్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. ఎంతటి సమస్య అయినా గంటలో పరిష్కారం చూపించేలా సహకరిస్తామన్నారు.

-అమెరికాకు చికెన్ రెక్కలు ఎగుమతిచేద్దాం -తెలంగాణలో కోళ్ల పరిశ్రమకు విస్తృత అవకాశాలు -భారీ పౌల్ట్రీ సంస్థలు స్థాపిస్తే భూములు ఇచ్చేందుకు సిద్ధమే -పౌల్ట్రీ ఇండియా-2014 ఎక్స్‌పో ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ -పౌల్ట్రీరంగంతో భారీగా ఉపాధి అవకాశాలు: కేంద్రమంత్రి బల్‌యాన్

KCR in Poultry India 2014

కల్తీ లేని స్వచ్ఛమైన చికెన్, గుడ్లు మన రాష్ట్రంలోనే సమృద్ధిగా లభిస్తుంటే అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన పౌల్ట్రీ ఎక్స్‌పో-2014ను సీఎం కేసీఆర్ బుధవారం ప్రారంభించారు. ఎగ్జిబిషన్ అడ్వైజరీ కమిటీ, ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సు మూడు రోజుల పాటు కొనసాగనున్నది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో కోళ్ల పరిశ్రమకు అపారమైన అవకాశాలతోపాటు అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. దాణా కొనుగోలుకు ఖర్చు విపరీతంగా పెరుగుతున్నందున సబ్సిడీ కూడా పెంచామని తెలిపారు. పౌల్ట్రీ రంగానికి బడ్జెట్ కేటాయింపులు రూ.90 కోట్ల నుంచి రూ. 220కోట్లకు తీసుకెళ్లామని, 12వ పంచవర్ష ప్రణాళికలో ఈ పరిశ్రమ అభివృద్ధికి రూ. 2,800కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. భారీ పౌల్ట్రీ సంస్థలు స్థాపించేవారికి అవసరమైతే భూములు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. కొంతమంది కోళ్ల వ్యాపారులు అమెరికా నుంచి లెగ్ పీస్‌లు దిగుమతి చేసుకోవడానికి లాబీయింగ్ చేస్తున్నారని, ఇదే జరిగితే భారతదేశంలో కోళ్ల పరిశ్రమ కుదేలవుతుందని హెచ్చరించారు.

అమెరికా నుంచి ఈ తరహా దిగుమతులను నియంత్రించాలని అదే వేదికపైనున్న కేంద్ర వ్యవసాయ మంత్రి సంజీవ్‌కుమార్ బల్‌యాన్‌కు విజ్ఞప్తి చేశారు. అమెరికాలో కోళ్ల రెక్కలు (వింగ్స్) మాత్రమే తింటారని, వాటిని తెలంగాణ నుంచి ఎగుమతి చేసే అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. కోళ్ల పరిశ్రమ విస్తారంగా ఉన్న మన రాష్ర్టానికి అమెరికా నుంచి నిల్వచేసిన మాంసాన్ని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు.

ప్రస్తుతం మూడు కోట్ల గుడ్లు పంపిణీ చేస్తున్నామని.. దీనిని 5.25కోట్లకు పెంచాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు వారానికి రెండు గుడ్లు మాత్రమే అందిస్తున్నామని, ఇకపై మూడు గుడ్లు పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్నందున అన్ని అంశాలు ప్రస్తావించలేకపోతున్నానని చెప్పారు. కేంద్ర మంత్రి సంజీవ్‌కుమార్ బల్‌యాన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కోళ్ల పరిశ్రమ అనూహ్యంగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. ఈ రంగాన్ని విస్తరించడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం కల్తీ, నకిలీ లేనిదంటే కేవలం గుడ్డు మాత్రమేనని అన్నారు. చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు గుడ్డుతో ఎంతో మేలు చేకూరుతుందన్నారు. తాను ప్రతిరోజు ఉదయం అల్పాహారంలో రెండు గుడ్లు తీసుకుంటానని చెప్పారు. సంక్షేమరంగం తర్వాత అత్యంత ప్రాధాన్యం వ్యవసాయరంగానికి ఇస్తానని ముఖ్యమంత్రి జూన్ 2న చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నారని, అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రూ.1.60లక్షల కోట్ల బడ్జెట్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేవలం మూడు శాతం నిధులు మాత్రమే కేటాయించేవారిని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.8,115 కోట్లు కేటాయించామని చెప్పారు. 14 ఏండ్లుగా పాడి పరిశ్రమలో పెండింగ్‌లో ఉన్న సమస్యకు సీఎం కేసీఆర్ పరిష్కార మార్గం చూపారని పేర్కొన్నారు.

రైతుల నుంచి సేకరించే పాలకు లీటరుకు రూ.4 పెంచిన సందర్భం ఎక్కడా లేదన్నారు. ఇప్పటి వరకు కేవలం 129 ఎకరాల్లో మాత్రమే గ్రీన్‌హౌస్ ఏర్పాటు చేశారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెయ్యి ఎకరాల్లో గ్రీన్‌హౌస్ ఏర్పాటుకు రూ.250 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. అనంతరం పౌల్ట్రీ ప్రొటీన్ అనే బ్రోచర్‌ను మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆవిష్కరించారు. సదస్సులో ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, చింతల కనకారెడ్డి, ఈఏసీ సభ్యులు డీ రాంరెడ్డి, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఈ ప్రదీప్‌రావు, తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జీ రంజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.