
-కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చే ఓట్లు ఇవి -ఆగం కాకండి.. ఆలోచించి ఓటువేయండి -ఢిల్లీలో నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ జెండా ఎగురనున్నది -బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే మోదీ, రాహుల్‌కే లాభం -టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణకు ప్రయోజనం -ఈ దేశానికి చౌకీదార్, టేకేదార్లు వద్దు..జిమ్మేదార్, దమ్దార్.. కేసీఆర్ కావాలి -కాంగ్రెస్, బీజేపీలకు జై కిసాన్ ఒక నినాదం..రాష్ట్రంలో దాన్ని విధానంగా మార్చిన కేసీఆర్ -నల్లగొండ రోడ్‌షోలో కేటీఆర్ -ప్రజలతో కిక్కిరిసిన నల్లగొండ వీధులు
ఇప్పుడు జరిగే ఎన్నికలు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వాన్ని బలపర్చేవని, మన సారుకు, మన పదహారుమంది అభ్యర్థుల కారు గుర్తుకు ఓటేద్దామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పిలుపునిచ్చారు. ఇవి దేశం మొత్తానికి దిశానిర్దేశంచేసే ఎన్నికలని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఏ రకంగా పురోగమిస్తున్నదో, ఇక్కడి పేదలు, రైతులు అద్భుతమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా అందుకుంటున్నారో.. దేశమంతటా ఇదేరకమైన ఆచరణ కావాలంటే కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడాలని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్‌గాంధీకి, బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్రమోదీకి మాత్రమే లాభమని, కానీ.. 16 మంది టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ మొత్తానికి ప్రయోజనం కలుగుతుందని వివరించారు. టీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి విజయాన్నికాంక్షిస్తూ.. మంగళవారం నల్లగొండ పట్టణంలో వివేకానంద విగ్రహం నుంచి పెద్ద గడియారం సెంటర్ వరకు నిర్వహించిన రోడ్‌షో అనంతరం మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో కేటీఆర్ ప్రసంగిస్తూ.. ఐదేండ్ల కిందట చాయ్‌వాలా అన్న నరేంద్రమోదీకి ఇవాళ ప్రమోషన్ వచ్చింది. చౌకీదార్ అంటున్నడు. మోదీ వేషం మారింది. దేశం మాత్రం మారలేదు. మరోవైపు ఈ దేశాన్ని మా ముత్తాత, నాయినమ్మ, నాయిన, అమ్మ ఏలినరు కాబట్టి నేను ఈ దేశానికి టేకేదార్ అని రాహుల్‌గాంధీ అంటున్నడు. ఈ దేశానికి ఈ చౌకీదార్, టేకేదార్లు కావాల్నా? లేక ఒక జిమ్మేదార్, జోర్దార్, హసన్దార్, ఇమాన్దార్, వఫాదార్, దమ్దార్ నాయకుడు.. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక కేసీఆర్ కావాల్నా? ప్రజలు ఆలోచించాలని కోరారు.
ఢిల్లీలో సంకీర్ణ ప్రభుత్వమే రాబోతున్నది… దేశంలో పేదరికాన్ని పారదోలుతానని ఐదేండ్లక్రితం అధికారంలోకి వచ్చిన మోదీ తన పాలనాకాలంలో పెద్దపెద్ద డైలాగులు చెప్పినా.. ప్రజలకు చేసింది మాత్రం ఏమీలేదని కేటీఆర్ అన్నారు. ఐదేండ్లలో పదికోట్ల మందికి ఉద్యోగాలిస్తానన్న మోదీ.. ఇచ్చిన ఉద్యోగాలెన్నో ప్రజలు ఆలోచించాలన్నారు. ఐదేండ్లక్రితం ఉన్న పరిస్థితి ఇవాళ మోదీకి లేదని చెప్పారు. మోదీ వేడి తగ్గిందని, ఈసారి బీజేపీకి 150 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. కాంగ్రెస్‌కు వంద సీట్లు కూడా రావన్నారు. ఈ పరిస్థితిలో రేపటిరోజున రాబోయేది కచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వమేనని చెప్పారు. మనం ఒక్క నినాదం మీద మన పదహారు మంది అభ్యర్థులను గెలిపించుకుంటే రేపు ఢిల్లీ జుట్టు మన చేతిలో ఉంటుందని అన్నారు. అందుకే నల్లగొండ ప్రజలు ఆలోచించి దెబ్బకొట్టాలని పిలుపునిచ్చారు. నర్సింహారెడ్డికి వేస్తున్న ప్రతి ఓటు కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్న ఓటుగా గుర్తుపెట్టుకోవాలని అన్నారు.
కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శం స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి జాతీయపార్టీలే దేశాన్ని పాలించాయని, ఇన్నేండ్ల తర్వాత కూడా జాతీయపార్టీలతోనే దేశాభివృద్ధి సాధ్యమని సిగ్గు, లజ్జ లేకుండా చెప్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది ఎవరిని మోసం చేయడానికని నిలదీశారు. ఇప్పటిదాకా పాలించిన కాంగ్రెస్, బీజేపీలు జై కిసాన్ అన్నాయే తప్ప.. ఆ నినాదాన్ని ఎన్నడైనా అమలుచేశారా? అని ప్రశ్నించారు. కానీ.. మన నాయకుడు కేసీఆర్ జై కిసాన్ అనే నినాదాన్ని విధానంగా మార్చి, మొత్తం దేశానికే ఆదర్శంగా నిలిచేలా రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. ఈరోజు ప్రధానికి సైతం మన రైతుబంధు పథకాన్ని కాపీకొట్టక తప్పలేదని ఎద్దేవాచేశారు. తెల్లారిలేస్తే మనమీద దుమ్మెత్తిపోసే పక్కరాష్ట్ర సీఎం కూడా రైతుబంధును కాపీకొట్టి.. అన్నదాత సుఖీభవ అంటున్నాడని చెప్పారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు సైతం ఈరోజు లైన్లోకి వచ్చాడంటే.. అది కేసీఆర్ గొప్పతనం కాదా? ప్రజలు ఆలోచించాలని కోరారు. దేశంలో ఎంతో మంది సీఎంలుగా, ప్రధానులుగా పనిచేశారని, కానీ కేసీఆర్‌లా ఏ ఒక్కరూ రైతుబంధు, రైతుబీమా పథకాలను పెట్టలేదని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఈరోజు కులం, మతం, ప్రాంతం ఏదైనా నిరుపేదలు.. ముఖ్యంగా రైతులు సంతోషంగా ఉన్నారంటే.. అభివృద్ధి, సంక్షేమ పథకాలను కలగలిపి జోడెద్దుల వంటి పాలనను కేసీఆర్ అందిస్తుండడమే కారణమని స్పష్టంచేశారు.
నిజమైన సెక్యులర్ కేసీఆర్ మైనారిటీలు ఐదేండ్లుగా కేసీఆర్ పాలన చూశారు. రాష్ట్ర ప్రజలంతా తనకు ఒక్కటేనన్నవిధంగా ఆయన పాలన చేస్తున్నరు. కల్యాణలక్ష్మితో పేద ఆడబిడ్డల పెండ్లిళ్లకు సాయం చేస్తున్నట్టే.. ముస్లిం ఆడబిడ్డల కోసం షాదీముబారక్ పథకం పెట్టారు. పేద హిందువులకు బతుకమ్మ పండుగకు, పేద ముస్లింలకు రంజాన్‌కు, పేద క్రిస్టియన్లకు క్రిస్మస్కు ప్రభుత్వం తరఫున దుస్తులు పంచుతున్నరు. కేసీఆర్ నిజమైన సెక్యులర్ లీడర్. నిజమైన సెక్యులర్ పార్టీ టీఆర్ఎస్ అని చెప్పారు. మైనారిటీలు టీఆర్ఎస్ను ఆశీర్వదించాలని కోరారు.
మండుటెండలోనూ ఉత్సాహంగా.. పట్టణ ప్రధాన వీధుల్లో సాగిన రోడ్‌షోలో వేలమంది ప్రజలు మండుటెండలోనూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాకారులు ఆటపాటలతో అలరించారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు చాడ కిషన్‌రెడ్డి, చకిలం అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. రోడ్‌షో సందర్భంగా కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్సీ భారతి రాగ్యానాయక్, ఆమె తనయుడు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు స్కైలాబ్‌నాయక్ టీఆర్ఎస్లో చేరారు.

ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్ సారు.. కారు.. పదహారు.. ఢిల్లీలో మన సర్కారు అంటూ తాను చెప్పేది అతిశయోక్తి కాదని కేటీఆర్ అన్నారు. 16మంది ఎంపీలతో ఢిల్లీలో కేసీఆర్ ఏం జేస్తడని ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీచేస్తున్న ఉత్తమ్ అంటున్నాడన్న కేటీఆర్.. తెలంగాణ ఉద్యమంలో పిల్లలు చనిపోతున్నప్పుడు మీరంతా మంత్రులుగా ఇండ్లలో దొంగ సంతకాలు పెడుతున్నప్పుడు.. ఇద్దరే ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్. అలాంటి కేసీఆర్‌కు 16మందిని ఇస్తేనే ఏం జేస్తడో ఉత్తమ్కంటే తెలంగాణ బిడ్డలకు బాగాతెలుసు అని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఎర్రకోట మీద నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ఫెడరల్‌ఫ్రంట్ జెండా ఎగరేయబోతున్నదని కేటీఆర్ తేల్చిచెప్పారు.
ఢిల్లీలో ఎవరికి ఎక్కువ సంఖ్యాబలం ఉంటే వాళ్లమాటే నడుస్తుందని చెప్తూ.. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ప్రధాని మోదీ మనకు చెప్పకుండా ఏపీలో కలిపేయడానికి కారణం ఆనాడు చంద్రబాబుకు ఉన్న ఎంపీల బలమేనన్నారు. రైల్వేశాఖ ఎవరి దగ్గర ఉంటే వారి రాష్ర్టాలకే రైళ్లు తరలిపోతున్నాయని చెప్పారు. మోదీ ప్రధానిగా ఉన్నందుకు బుల్లెట్రైలు గుజరాత్‌కు పోయింది తప్ప హైదరాబాద్‌కో, నల్లగొండకో రాలేదన్నారు. అదే కేంద్రంలో మనోళ్లు గట్టిగా ఉంటే మా రాష్ర్టానికి నిధులు ఎందుకు ఇవ్వరని గల్లాపట్టి నిలదీస్తారని, ఆ సత్తా ఒక్క టీఆర్ఎస్కు మాత్రమే ఉన్నదని చెప్పారు. పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టులకు జాతీయహోదా రావాలన్నా. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలకు నిధులు రావాలన్నా టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో ఉండాలన్నారు.