Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మన వాటా నీళ్లు మనకే

-ఏపీతో కొట్లాటే కృష్ణా జలాల కోసం దేవునితోనైనా తలపడుతాం
-పాలమూరు-రంగారెడ్డిని శరవేగంగా పూర్తిచేస్తాం
-రాష్ట్రంలో ఉన్నన్ని పథకాలు ఎక్కడైనా ఉన్నాయా?
-దేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రం తెలంగాణ
-రాజన్న సిరిసిల్ల తరహాలోనే నారాయణపేటలో టెక్స్‌టైల్‌ పార్కు: మంత్రి కేటీఆర్‌
-మన వాటా నీళ్లు మనకే

కృష్ణా జలాల్లో మన వాటా కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంతోనే కాదు, అవసరమైతే దేవునితోనైనా కొట్లాడుతామని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. వెనుకబడిన పాలమూరు జిల్లాకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్యాయం జరుగనివ్వరని చెప్పారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్‌ శనివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అక్కడ ఏర్పాటుచేసిన సమావేశాల్లో మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కరివెన రిజర్వాయర్‌ దాదాపు పూర్తయిందని, త్వరలో కరివెన నుంచి నారాయణపేటకు కాలువ ఏర్పాటవుతుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. దీనిద్వారా 1.08 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. దీనికోసం భూసేకరణ చేయాల్సి ఉన్నదని, కాలువ నిర్మాణం పూర్తయితే రెండు పంటలు పండుతాయని పేర్కొన్నారు. ఆగస్టు 10న కాలువ భూసేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తారని, దాన్నిఅడ్డుకునే దుర్మార్గపు పార్టీలు ఉన్నాయని చెప్పారు. సాగునీళ్లు రావాలంటే రైతులంతా వేల సంఖ్యలో తరలివచ్చి పాలమూరు పథకం పనులు వేగంగా జరగాలని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పాలని పిలుపునిచ్చారు. రైతులంతా మూకుమ్మడిగా అభిప్రాయాన్ని వెల్లడిస్తే ప్రభుత్వానికి నైతిక స్థైర్యం పెరుగుతుందని పేర్కొన్నారు.

నారాయణపేటలో చేనేత పార్కు
చేనేత కార్మికుల కోసం ఇప్పటికే నేతన్నకు చేయూత, చేనేత మిత్ర అమలుచేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. స్థానిక నేత కార్మికులకు అండగా ఉండాలన్న ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి కోరిక మేరకు రూ.10 కోట్లతో సిరిసిల్ల తరహాలో ఇక్కడ చేనేత పార్కును ఏర్పాటుకు శంకుస్థాపన చేశామని తెలిపారు. రైతుబంధులాగే చేనేత, మరమగ్గాల కార్మికులకు రూ.5 లక్షల జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్టు సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారని కేటీఆర్‌ గుర్తుచేశారు. జిల్లాలో గతంలో తాగునీటి కోసం 14 రోజులు ఎదురుచూడాల్సి వచ్చేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిత్యం శుద్ధజలం అందిస్తున్నామని పేర్కొన్నారు. మనం కష్టపడి పనిచేస్తుంటే ప్రతిపక్ష నేతలు వెటకారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పట్టణంలో రూ.29 కోట్లతో మిషన్‌ భగీరథ పనులు సాగుతున్నాయని, ఇంకా మిగిలి ఉన్న 4 వేల ఇండ్లకు రూపాయికే నల్లా కనెక్షన్‌ ఇస్తామని ప్రకటించారు. వచ్చే ఆరునెలల్లో పట్టణంలో పూర్తిస్థాయిలో తాగునీటి సౌకర్యం కల్పిస్తామని హామీఇచ్చారు.


ఎవుసం పండుగే..
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో వరి భారీగా పండుతున్నదని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఇప్పుడు ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణే నంబర్‌వన్‌గా ఉన్నదని, కందులు, పత్తి, ఆయిల్‌పాం బాగా పండుతున్నాయని తెలిపారు. వ్యవసాయ దిగుబడులతో యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలను కల్పించేలా ఆహారశుద్ధి పరిశ్రమలు స్థాపించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ఆదేశించారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లు ఏర్పాటుచేస్తున్నామని, అందులో ఒకటి నారాయణపేట జిల్లాలోనూ ఉంటుందని చెప్పారు. 250 ఎకరాలకు తగ్గకుండా స్థలం కేటాయిస్తూ ప్రతిపాదన పంపిస్తే మంజూరుచేస్తామని తెలిపారు. జిల్లా కోసం నారాయణపేట, మక్తల్‌ ఎమ్మెల్యేలు చేసిన పోరాటాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుర్తించి నారాయణపేట జిల్లాను ఏర్పాటుచేశారని చెప్పారు. 3,400 గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చినట్టు గుర్తుచేశారు. నారాయణపేటలో త్వరలోనే సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలను ప్రారంభిస్తామని చెప్పారు. జిల్లా ఇచ్చిన కేసీఆర్‌ బిల్డింగులు ఇవ్వకుండా ఆపుతారా?అని అన్నారు.

‘ప్రగతి’ విప్లవం
పట్టణ ప్రగతి వల్ల పట్టణాల రూపురేఖలే మారిపోయాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పదిరోజుల్లో 2,100 స్తంభాలు, 19 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయడం మామూలు విషయం కాదని చెప్పారు. కొత్త పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాలను తేవడమే కాకుండా కఠినంగా అమలు చేస్తున్నామని చెప్పారు. పంచాయతీలకు నెలకు రూ.338 కోట్లు, పట్టణాలకు రూ.148 కోట్లు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఏ పార్టీకి చెందిన పాలకవర్గం ఉన్నా వివక్ష లేకుండా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా జిల్లా ప్రభుత్వ దవాఖానలో 10 పడకల చిన్నపిల్లల ఐసీయూ వార్డును మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అమరవీరుల స్తూపం నిర్మాణానికి, రోడ్ల సుందరీకరణ పనులకు, చేనేత నైపుణ్య శిక్షణ, ఉత్పత్తి, విక్రయ కేంద్రానికి శంకుస్థాపన చేశారు.

చిన్నపిల్లల పార్కు, సైన్స్‌ పార్కులను ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మండలి విప్‌ కే దామోదర్‌రెడ్డి, విప్‌ గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్‌ రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అబ్రహం, నరేందర్‌రెడ్డి, కార్పొరేషన్‌ చైర్మన్లు దేవరి మల్లప్ప, బాద్మి శివకుమార్‌, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ నిజాంపాషా, జడ్పీ చైర్‌పర్సన్లు వనజ, స్వర్ణ సుధాకర్‌రెడ్డి, చేనేత, జౌళిశాఖ కమిషనర్‌ శైలజా రామయ్యర్‌, సీడీఎంఏ సత్యనారాయణ, కలెక్టర్‌ దాసరి హరిచందన, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్‌ శాసం రామకృష్ణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె అనసూయ, టీఆర్‌ఎస్‌ నేతలు విఠల్‌రావు ఆర్య, ఇంతియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్‌ సల్లగుండాలె..
నారాయణపేట చిల్డ్రన్స్‌ పార్కు ప్రారంభించిన తర్వాత సమీపంలో కట్ట మీద కూర్చున్న ఓ వృద్ధురాలితో మంత్రి కేటీఆర్‌ ఆప్యాయంగా మాట్లాడారు. అవ్వా పింఛనొస్తున్నదా? అని అడగ్గా.. వస్తున్నది బిడ్డా అని ఆమె బదులిచ్చింది. నీకు పింఛన్‌ ఎవరిస్తున్నారవ్వా అని అడగ్గానే.. ఇంకెవరు బిడ్డా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇస్తున్నారని సంతోషంతో చెప్పింది. పింఛన్‌ ఎంత వస్తుందవ్వా అనటంతో రూ.2 వేలు వస్తున్నాయి బిడ్డా అని బదులిచ్చింది. ఇంతకు ముందు ఎంతవచ్చేదనడిగితే.. ఎంత ఉత్త రెండు వందలు వస్తుండె. అవి ఏమూలకు సరిపోయేవి కావు. ఇప్పుడు మాలాంటి ముసలోళ్లకు నెలకు రూ.2 వేల పింఛన్‌ ఇస్తున్న కేసీఆర్‌ సల్లగుండాలె బిడ్డా అని దీవించింది.

మన వాటా నీళ్లు మనకే
-మన పథకాల్లాంటివి ఎక్కడైనా ఉన్నాయా?
నారాయణపేటలో అమలవుతున్న పథకాల్లాంటివి ఒక్కటైనా పక్కనే పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటకలో అమలవుతున్నాయా? అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. రైతుబంధు ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.10 వేల పంట పెట్టుబడి కర్ణాటక ఇస్తున్నదా? ఆడబిడ్డ పెండ్లికి రూ.లక్షా పదహారు కర్ణాటకలో ఇస్తున్నరా? ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే 12 వేలు ఇచ్చే పద్ధతి అక్కడ ఉన్నదా? 24 గంటల నాణ్యమైన విద్యుత్తు ఇస్తున్నరా? అని ప్రశ్నించారు. కరోనా సమయంలో దేశమంతా క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే తెలంగాణలో పుట్లుపుట్లుగా పండిన ధాన్యాన్ని ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిందని గుర్తుచేశారు. ప్రతి గ్రామ పంచాయతీకి నర్సరీ, పల్లె ప్రకృతి వనం, 5 వేల ఎకరాలకో రైతువేదిక ఏర్పాటుచేవామని, దేశంలోని ఎక్కడైనా ఇలాంటివి ఉన్నాయా? అని ప్రశ్నించారు. వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఏ ఒక్క పథకం కూడా మనతో సమానంగా అమలుచేయలేనివారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

రైతులకు అండగా ప్రభుత్వం
-మంత్రి నిరంజన్‌రెడ్డి
కరోనాతో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ రైతుబంధు కింద రూ.7,360 కోట్లు విడుదలచేసిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. 15 నెలల్లో రాష్ర్టానికి రూ.లక్ష కోట్ల ఆదాయం తగ్గినా అన్ని రంగాలకూ లోటు లేకుండా నిధుల విడుదల జరిగేలా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని చెప్పారు. కొత్త పంచాయతీ, మున్సిపల్‌ చట్టాలతో పల్లెలు, పట్టణాలు అభివృద్ధికి చిరునామాగా మారాయని, భవిష్యత్తులో పల్లెలు, పట్టణాలకు వ్యత్యాసం ఉండని విధంగా అభివృద్ధి జరుగుతున్నదని పేర్కొన్నారు.

తాటాకు చప్పుళ్లకు బెదరం
-మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
బంగారం, చేనేతకు ఎంతో ప్రసిద్ధి చెందిన ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే తొలి మున్సిపాలిటీ నారాయణపేటలో తెలంగాణ ఏర్పాటుకు ముందు కనీసం మంచినీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ ముందున్నామని, ఈ అభివృద్ధిని ఓర్వలేని కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాల తాటాకు చప్పుళ్లకు భయపడబోమని స్పష్టంచేశారు. మా విశ్వరూపం చూపిస్తే తట్టుకోలేరని, తమ ధ్యాసంతా అభివృద్ధిపైనే ఉందని చెప్పారు. ఏపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామన్నారు.

ఇతర జిల్లాలకు తీసిపోని పేట
-ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి
సీఎం కేసీఆర్‌ హామీమేరకు రూపుదిద్దుకున్న నారాయణపేట జిల్లాను అందరూ వెనకబడిన జిల్లాగా పేర్కొంటారని, కానీ ఏ జిల్లాకు తీసిపోని విధంగా అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అత్యల్ప కరోనా కేసులు కలిగిన జిల్లాగా నారాయణపేట నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహకారంతో బంగారానికి ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతాన్ని బంగారు నారాయణపేటగా మారుస్తామని పేర్కొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.