Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మనకు లక్ష కోట్ల నష్టం

-కేంద్రం నిర్వాకం.. తెలంగాణకు నష్టం.. కష్టం
-బీజేపీ ప్రభుత్వం ఫెయిల్‌.. ఫెయిల్‌.. ఫెయిల్‌
-రాష్ట్రాలను బలహీన పరచడమే కేంద్రం లక్ష్యం
-ఏకపక్షంగా ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం సవరణ
-పేరుకే పన్నుల్లో 41% వాటా.. ఇచ్చేది 29%
-తెలంగాణకు కేంద్రమిచ్చింది గుండుసున్నా
-గణాంకాలతో సహా వివరణ ఇచ్చిన మంత్రి
-మాది స్పెండింగ్‌.. మీది పెండింగ్‌ ప్రభుత్వం
-మేం పేదలకిస్తున్నం.. మీరు దోస్తులకిస్తున్నరు
-‘డేర్‌ టు డ్రీం’ ఇదీ మా ప్రభుత్వ విధానం
-మరో పోరాటానికి మళ్లీ సిద్ధమవుతున్నాం
-ఎఫ్‌ఆర్‌బీఎం అమలు పర్యవసానాలపై అసెంబ్లీలో చర్చలో మంత్రి హరీశ్‌రావు
-విఫలం.. విషం.. విద్వేషం..
-ఇదీ బీజేపీ పరిపాలన స్వరూపం
-సఫలం.. సంక్షేమం.. సామరస్యం
-ఇదీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఔన్నత్యం

అంతర్జాతీయంగా ముడిచమురు ధర కనిష్ఠ స్థాయికి చేరుకొన్నా.. గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు రాకెట్‌ వేగాన్ని మించి ఆకాశానికి పరిగెడుతున్నాయి. గ్యాస్‌ పొయ్యి మంటకన్నా.. గ్యాస్‌బండ మంటే ఎక్కువగా మండుతున్నది. 7 దశాబ్దాలకు పైగా ప్రజలు సమకూర్చుకొన్న ఆస్తులను అడ్డికి పావుశేరు చొప్పున అమ్మేస్తున్నారు.
– ఆర్థిక మంత్రి హరీశ్‌రావు

కేంద్రంలోని బీజేపీ విధానాల వల్ల తెలంగాణపై రూ.లక్ష కోట్ల ఆర్థిక భారం పడిందని ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. రాష్ట్రాలను బలహీనపరిచేందుకు కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని, అందులో భాగంగా ఏకపక్షంగా ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని అమలుచేస్తున్నదని ధ్వజమెత్తారు. దేశ ఆర్థిక వ్యవస్థ నేడు ప్రమాదపుటంచులకు చేరుకొన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ‘ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం అమలులో కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరి- రాష్ట్ర ప్రగతిపై ప్రభావం’ అనే అంశంపై ఉభయ సభల్లో మంగళవారం జరిగిన లఘుచర్చ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు కేంద్రంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. కేంద్రం, రాష్ర్టాల రుణపరిమితిపై హై పవర్‌ ఇంటర్‌ గవర్నమెంటల్‌కమిటీ వేయాలని 15వ ఆర్థిక సంఘం సూచిస్తే, కేంద్రం పట్టించుకోలేదని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. అందుకు విరుద్ధంగా ఏకపక్షంగా ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని సవరించిందని పేర్కొన్నారు. దీని అమలులోనూ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నదని మండిపడ్డారు. రాష్ర్టాలను బలహీనపరచడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తున్నదన్నారు. కార్పొరేషన్ల పేరిట కేంద్రం పెద్ద మొత్తంలో అప్పులు తీసుకొంటున్నప్పటికీ.. వాటిని రికవరీలో పెట్టడం లేదని, రాష్ర్టాలు ఆ తరహాలో తీసుకొనే రుణాలను మాత్రం రెట్రాస్పెక్టివ్‌ ఎఫెక్ట్‌తో రికవరీ చేస్తమంటున్నదని తెలిపారు. కేం ద్ర ప్రభుత్వం 2017-18లో రూ.81 వేల కోట్లు, 2018-19 లో రూ.లక్షా 58 వేల కోట్ల ను రెవెన్యూ వ్యయం కోసం ఔటాఫ్‌ బడ్జెట్‌ అప్పులు తీసుకొనడాన్ని కాగ్‌ తప్పుపట్టిందని గుర్తుచేశారు. గత ఐదారేండ్లలో 6లక్షల కోట్లు కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం బయట అప్పు తీసుకున్నదని వెల్లడించారు. కేంద్రానికి ఒక నీతి, రారాష్ట్రాలకు ఒక నీతి అన్న చందంగా బీజేపీ సర్కారు వ్యవహరిస్తున్నదని విమర్శించారు.

15వ ఆర్థిక సంఘం సిఫారసులు అమలు చేయదు..
రాష్ర్టాలకు రుణ పరిమితితోపాటు నిధులు కూడా ఇవ్వాలని 15 ఆర్థిక సంఘం సూచించిందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణకు 2020-21లో రూ.723 కోట్లు ప్రత్యేక గ్రాంటు ఇవ్వాలని, పౌష్టికాహారం కోసం రూ.171 కోట్లు, 2021-26 మధ్య స్టేట్‌ స్పెసిఫిక్‌ గ్రాంట్లు, సెంటర్‌ స్పెసిఫిక్‌ గ్రాంట్లు కింద రూ.5,374 కోట్లు మొత్తంగా 6,268 కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసిందని గణాంకాలతో సహా వివరించారు. అంతకుముందు 14 వ ఆర్థిక సంఘం.. మిషన్‌ భగీరథకు రూ.19,205 కోట్లు, మిషన్‌ కాకతీయకు రూ.5వేల కోట్లు, ఇతరవాటికి రూ.817 కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసిందని, కానీ కేంద్రం తెలంగాణకు ఇప్పటివరకు ఒక్క రూపాయి ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఆర్థిక సంఘం సిఫారసులను తుంగలో తొక్కడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారన్నారు. 2014-15 సెంట్రల్‌ స్పాన్స ర్డ్‌ సీం కింద తెలంగాణకు ఇవ్వాల్సిన రూ.495 కోట్ల నిధులను ఏపీకి ఇచ్చారని, దీనిపై వందసార్లు ఉత్తరాలు రాసినా కేంద్రం స్పందించలేదని పేర్కొన్నారు.

విఫలం.. విషం.. విద్వేషం
ఎనిమిదేండ్ల మోదీ పాలన సారాంశం అంతావిఫలం.. విషం.. విద్వేషమేనని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. దేశ ఆర్థిక వృద్ధి 8.2% నుంచి 5.3%కి పడిపోయిందని, ద్రవ్యోల్బణం అదుపు తప్పిందని, విదేశీ మార క ద్రవ్య నిలువలు అడుగంటిపోతున్నాయన్నారు. రూపాయి విలువ డాలర్‌కు రూ.80 కి పడిపోయి అంపశయ్యపైకి చేరిందన్నారు. దీని ప్రభావం దిగుమతులపై తీవ్రంగా ఉన్నదని, విదేశాల్లో చదువుకొనే విద్యార్థులు గతంలో కన్నా ఎక్కువ ఫీజులు చెల్లించాల్సి వస్తున్నదని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర కనిష్ఠ స్థాయికి చేరుకొన్నా.. గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌, నిత్యావసరాల ధరలు రాకెట్‌ వేగాన్ని మించి ఆకాశానికి పరిగెడుతున్నాయని ఎద్దేవాచేశారు. గ్యాస్‌పొయ్యి మంటకన్నా.. గ్యాస్‌బండ మంటే ఎక్కువగా మండుతున్నదని చెప్పారు. ఏ ఇండెక్స్‌ చూసినా అధ్వాన్నంగా దేశం దిగజారిపోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఏడు దశాబ్దాలకు ప్రజలు సమకూర్చుకొన్న ఆస్తులను అడ్డికి పావుశేరు చొప్పున అమ్మి పారేస్తున్నదని తెలిపారు. 8 ఏండ్లలో 23 పీఎస్‌యూలను అమ్మేశారని చెప్పారు. ఈ వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజిస్తున్నారని నిప్పులు చెరిగారు. చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడం వల్లే ఖబరస్తాన్‌ వర్సెస్‌ శాంసన్‌, రంజాన్‌ వర్సెస్‌ దీపావళి, 80 వర్సెస్‌ 20 అనే నినాదాలిస్తూ పబ్బం గడుపుకొంటున్నదని విమర్శించారు.

సఫలం.. సంక్షేమం.. సామరస్యం
సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ సర్కారు ఎనిమిదేండ్ల పాలన సారాంశమంతా సఫలం.. సంక్షేమం, సామరస్యమని మంత్రి హరీశ్‌రావు కీర్తించారు. అప్పు తెచ్చిన ప్రతి రూపాయికీ సార్థకత చేకూర్చామని, క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ చేశామని వెల్లడించారు. 24 గంటల ఉచిత, నాణ్యమైన కరెంట్‌, తాగు నీరు ఇలా ప్రజల అవసరాల కోసం ఖర్చు చేశామని వెల్లడించారు. మన మిషన్‌ భగీరథ దేశానికి ఆదర్శమైందని, ఫ్లోరైడ్‌ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దామని తెలిపారు. రాష్ట్రం అప్పులు పెరగడంపై మాట్లాడుతున్న వారు.. పెరిగిన రాష్ట్ర ఆదాయాన్ని కూడా చూడాలని సూచించారు. సొంత పన్నుల రాబడిలో తెలంగాణ దేశంలో నంబర్‌వన్‌గా ఉన్నదని ఆర్బీఐ చెప్పిన విషయాన్ని వివరించారు. 2015-16 నుంచి 2020-21 మధ్య తెలంగాణ పన్నుల ద్వారా వచ్చిన రాబడిలో సగటున 11.5 వృద్ధితో దేశంలోనే టాప్‌గా నిలిచిందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డనాడు జీడీపీకి తెలంగాణ భాగస్వామ్యం 4 శాతమని.. ఇప్పుడు 4.9 శాతానికి పెరిగిందని తెలిపారు. తెలంగాణ తలసరి ఆదాయం 20 13-14లో రూ.1,12,162 ఉంటే 2021-22 లో రూ.2,75,443 కోట్లకు పెరిగిందని చెప్పారు. దేశం కంటే రాష్ట్ర తలసరి 84% ఎకువని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణ సంపద పెంచి.. ఆ పెంచిన సంపదను పేదలకు పంచుతున్నారని కొనియాడారు. కేంద్రంలా గద్దలకు పంచడంలేదని చురకలంటించారు. సకల జనుల సంక్షే మం తెలంగాణ సర్కారు, సీఎం కేసీఆర్‌ లక్ష్యమని స్పష్టంచేశారు.

చెట్ల కింద మాట్లాడేవాళ్లు సమాధానం చెప్పాలె..
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి హకుగా రావాల్సిన డబ్బులు ఇచ్చుంటే రూ.లక్ష కోట్ల అప్పు తీసుకోవాల్సిన అవసరముండేది కాదని, బీజేపీ వాళ్లు ఆ నిధులు ఇప్పిస్తే దండవేసి సన్మానిస్తామని తెలిపారు. ఎఫ్‌ఆర్‌బీఎంలో కోతల వల్ల ఈ ఏడాది రూ.15,033 కోట్లు బడ్జెట్‌లో ప్లాన్‌ చేసుకొన్న దానికంటే తగ్గిందని, విద్యుత్తు సంసరణల నిబంధన వల్ల రూ.6,104 కోట్లు వదులు కొన్నామన్నారు. 14, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ర్టానికి రూ.లక్షా 5 వేల 812 కోట్లు రావాల్సి ఉన్నదని, అలా ఇచ్చి ఉంటే ఆ మొత్తం తెలంగాణకు మిగులు ఉండేదని చెప్పారు. కేంద్రం చేసిన అప్పును తెలంగాణ పర్‌ కాపిటా అప్పు గా చూపే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

భట్టీ.. మీ పాలన మాకొద్దు
చర్చ సందర్భంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేసిన ఆరోపణలపై మంత్రి హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ హయాంలో ఖాళీ కుండలు, కందిళ్లు, వరి కంకులు లేకుండా ఒక్కనాడు కూడా అసెంబ్లీ ప్రారంభం కాలేదని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌ కృషి వల్లే కాళేశ్వరం తక్కువ ఖర్చుతో పూర్తయిందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో నాగార్జునసాగర్‌ రూ.122 కోట్లతో ప్రారంభించి రూ.1,183 కోట్లతో, ఎస్సారెస్పీని రూ.40 కోట్లతో మొదలుపెట్టి రూ.4,300 కోట్లకు, జూరాల ప్రాజెక్టును రూ.78 కోట్లతో మొదలుపెట్టి రూ. 1,815 కోట్లతో, పులిచింతల ప్రాజెక్టు రూ.565 ప్రారంభించి రూ.1,816 కోట్లతో, సింగూరు ప్రాజెక్టు రూ.29 కోట్లతో ప్రారంభించి రూ.170 కోట్లతో పూర్తి చేశారని గుర్తుచేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం రూ.16 వేల కోట్లకు జీవో ఇచ్చి పనులు ప్రారంభంకాక ముందే రూ.32 వేల కోట్లకు, ఆ తర్వాత రూ.38 వేల కోట్లకు పెంచారని, 2013లో సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌కు రూ.48 వేల కోట్లకు ప్రతిపాదించి 5 పైసల పని చేయకుండానే 3 రెట్లు పెంచారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయకుంటే ఇంకో రూ.లక్ష కోట్లు పడుతుండెనని వెల్లడించారు. ఆర్‌బీఐ విడుదల చేసిన స్టేట్‌ ఫైనాన్సెస్‌ రిస్‌ అనాలిసిస్‌ ప్రకారం ఎకువ అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాల్లో బీహార్‌, కేరళ, పంజాబ్‌, రాజస్థాన్‌, వెస్ట్‌ బెంగాల్‌ ఉన్నాయన్నారు. తెలంగాణ బాగున్నప్పటికీ స్లీపింగ్‌ రిమార్స్‌ చేయడం సరికాదని భట్టి విక్రమార్కకు హితవు పలికారు.

రాష్ట్రాల రుణాలకేమో షరతులు
ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచడానికి బాయిల కాడ మీటర్లు పెట్టాలంటూ కేంద్రం షరతు విధించిన విషయాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రస్తావించారు. కానీ.. తన గొంతులో ప్రాణం ఉన్నంతవరకు బాయికాడ మీటర్లు పెట్టేది లేదని సీఎం కేసీఆర్‌ తేల్చి చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఇందుకోసం రాష్ట్ర జీఎస్‌డీపీలో 4% ఎఫ్‌ఆర్‌బీఎం అనుమతి ఉండగా అందులో 0.5% వదులుకొన్నామని.. దాని విలువ రూ.6104 కోట్లని వివరించారు. 3.5శాతంతోనే బడ్జెట్‌ రూపొందించుకొని ఆమోదింపజేసుకొన్నామన్నారు. బడ్జెట్‌ ఆమోదం పొందిన తరువాత కోత పెడుతామంటూ కేంద్రం కొర్రీలు పెడుతున్నదని ధ్వజమెత్తారు. దీంతో ఇప్పటికే ప్రణాళిక వేసుకొన్న బడ్జెట్‌ను రాష్ర్టాలు ఎలా అమలుచేస్తాయని ప్రశ్నించారు. రాష్ర్టాలకు ఇచ్చే నిధులను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచినట్టే పెంచి.. సెస్సుల రూపంలో కుదించారని విమర్శించారు. సెస్సుల రూపంలో 2021-22లో ఆదాయంలో 22.56% సమకూర్చుకొన్నదని తెలిపారు. మిగిలిన 78 శాతాన్ని మాత్రమే రాష్ట్రాలకు వాటా పంచారని వివరించారు. వాస్తవంగా రాష్ట్రానికి 42% వాటా అంటే 33,712 కోట్లు రావాల్సి ఉండగా, కేవలం పన్నుల వాటా 29.6 శాతమే వచ్చిందని, 12.4% నష్టపోయామని చెప్పారు.

ఎఫ్‌ఆర్‌బీఎం పేరుతో అభివృద్ధికి ఆటంకం : ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి
పోరాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నారు. కానీ, ఎఫ్‌ఆర్‌బీఎం పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి, టీఆర్‌ఎస్‌ పార్టీకి వస్తున్న ఖ్యాతిని నిలువరించేందుకు మోదీ సర్కార్‌ కుట్ర చేస్తున్నది. తెలంగాణను సీఎం కేసీఆర్‌ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారు. కానీ పార్లమెంట్‌లో సంపూర్ణ మెజార్టీతో అధికారాన్ని చేపట్టిన మోదీ మాత్రం గత ఎనిమిదేండ్లలో కనీసం ఒక్క మంచి పని కూడా చేయలేదు.

ఏకపక్షంగా అమలు దుర్మార్గం : మల్లు భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని ఏకపక్షంగా అమలు చేయడం దుర్మార్గం. కేంద్రం నిర్ణయాలు రోజుకో విధంగా మారుతున్నాయి. బీజేపీ సర్కారు అస్తవ్యస్త నిర్ణయాల వల్ల రాష్ర్టాలు ఆర్థికంగా అనేక ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికే అప్పులతో చేపట్టిన ప్రాజెక్టులు ముందుకు సాగకపోగా, వడ్డీలు పెరిగే ప్రమాదం ఉన్నది.

కేంద్రం అప్పులు దేని పరిధిలోకి? : ఎమ్మెల్యే వివేకానంద
జీఎస్టీ బకాయిలు చెల్లించలేని కేంద్ర ఆర్థిక మంత్రి రాష్ట్రంలో పర్యటిస్తూ రేషన్‌ దుకాణాల్లో ప్రధాని ఫొటో ఎందుకు పెట్టడం లేదని అడుగుతున్నారు?. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తున్నదని పదేపదే అంటున్నారని, మరి కేంద్రం అప్పులు చేయడం లేదా? వారి అప్పులు ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రావా?. యూపీ లాంటి పెద్ద రాష్ట్రాలకూ మన నిధులే వెళుతున్నాయి. అప్పులు చేసి అభివృద్ధి చేస్తున్న రాష్ట్రాలను ప్రోత్సహించకుండా కేంద్రం ఆర్థిక ఆంక్షలు పెట్టడం సరికాదు.

జీఎస్టీ రూపంలో ప్రజలపై ధరల భారం: జీవన్‌రెడ్డి
జీఎస్టీ రూపంలో కేంద్రం ప్రజలపై ధరల భారాన్ని మోపింది. వంటగ్యాస్‌పై సబ్సిడీలను ఎత్తివేసిన మోదీ సర్కారు.. పిల్లలు తాగే పాలు మొదలుకొని శ్మశానాల వరకు అన్నింటిపై పన్నులు వేసింది. రాష్ర్టాలకు నిధుల విషయంలో కేంద్రం వివక్షను విడనాడి అన్ని రాష్ర్టాలను సమానంగా చూడాలి. రాష్ర్టాలు తమ రుణ పరిమితికి లోబడిచేసే అప్పుల్లో కోత విధించరాదు.

తెలంగాణకు తీవ్రనష్టం మౌజంఖాన్‌, ఎంఐఎం ఎమ్మెల్యే
సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉన్నది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం కేంద్రానికి, రాష్ర్టాలకు ఒకేలా వర్తించాలి. కానీ బీజేపీ సర్కారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోతున్నది. రాష్ర్టాల హక్కులపై సీఎం కేసీఆర్‌ పోరాటానికి వెన్నంటి ఉంటాం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.