-ఇది మినీ ఇండియా.. కలిసికట్టుగా ఉందాం -రాష్ట్ర జీఎస్డీపీలో హైదరాబాద్ వాటా 50% -ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరిగితే సీమాంధ్రులకూ లాభమే -తెలంగాణలో చిచ్చుపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నం -సోనియా బాధంతా రాహుల్ గురించే -అలాంటి కొడుకు ఉంటే ఏ తల్లికైనా బాధే -కేసీఆర్‌ను ఒంటరిగా ఎదుర్కోలేకే కూటమి -సీమాంధ్రుల సమావేశంలో మంత్రి కేటీఆర్ -టీఆర్ఎస్కు సీమాంధ్రుల సంఘీభావం -జూబ్లీహిల్స్, సనత్‌నగర్ నియోజకవర్గాల్లో కేటీఆర్ రోడ్‌షోలకు విశేష స్పందన
మనమంతా హైదరాబాదీలమేనని, అందరం కలిసికట్టుగా ఉందామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు హైదరాబాద్‌లోని సీమాంధ్రులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ మినీఇండియా లాంటిదని, అన్ని రాష్ర్టాల ప్రజలు ఇక్కడ ఉన్నారని గుర్తుచేశారు. తెలంగాణ జీఎస్డీపీలో 45-50% హైదరాబాద్ నుంచే వస్తున్నదని వివరించారు. తెలంగాణలో ఉపాధి అవకాశాలు, ఆదాయం, వనరులు పెరుగుతుంటే సీమాంధ్రులు కూడా లాభపడుతారని వివరించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తొమ్మిదేండ్లలో హైదరాబాద్‌ను కట్టానని చెప్పుకొనే చంద్రబాబు ఐదేండ్లలో అమరావతిని ఎందుకు కట్టలేకపోయారని ప్రశ్నించారు.
వ్యక్తుల వల్ల కాకుండా హైదరాబాద్‌కున్న గొప్పతనంవల్లనే ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు తరలివస్తున్నాయని చెప్పారు. శనివారం కూకట్‌పల్లిలో సీమాంధ్రులు టీఆర్ఎస్కు సంఘీభావంగా నిర్వహించిన సమావేశానికి పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణారావుతో కలిసి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఏనాడూ కులం, మతం, ప్రాంతంపేరుతో రాజకీయం చేయలేదన్నారు. తెలంగాణ ఏర్పడకముందు టీఆర్ఎస్పై వదంతులు పుట్టించారు.

ఏర్పడితే.. కరంటు ఉండదు.. మతకల్లోలాలు చెలరేగుతాయి.. సీమాంధ్రులపై దాడులు జరుగుతాయి.. రియల్ఎస్టేట్ దెబ్బతింటుంది.. అంటూ అనేకరకాలుగా దుష్ప్రచారం చేశారు అని గుర్తుచేశారు. కానీ, చీమకు కూడా అపకారం తలపెట్టని వ్యక్తి సీఎం కేసీఆర్ పాలనలో అపోహలన్నీ తొలిగిపోయాయన్నారు. 2014 ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో టీఆర్ఎస్ రెండుసీట్లే గెలుచుకుందని, ఆ తర్వాత నిర్వహించిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్కు 99 సీట్లు అందించారని గుర్తుచేశారు.
ఆనాడు గ్రేటర్‌పై గులాబీజెండా ఎగురవేయకుంటే తాను రాజకీయసన్యాసం తీసుకుంటానని సవా ల్ విసిరానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ అనేక సమస్యలు పరిష్కరించడంవల్లనే గ్రేటర్ విజయం సాధ్యమైందన్నారు. హైదరాబాద్‌లో ఏనాడూ కర్ఫ్యూపెట్టలేదని, కరంటు కోతల్లేవని, శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని వివరించారు. ఇంకా ట్రాఫిక్, రోడ్ల సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉన్నదని చెప్పారు. ఇక్కడ బతుకడానికి వచ్చినవారిని కడుపులపెట్టుకొని చూసుకుంటామని ఉద్యమకాలంలోనే చెప్పామని, దానికి తగ్గట్టుగానే టీఆర్ఎస్ పాలనలో ఏనాడూ కులం, మతం, ప్రాంతంపేరుతో రాజకీయం చేయలేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
రాహుల్, చంద్రబాబు వీణ, ఫిడేల్ వాయించుకోవాల్సిందే సీఎం కేసీఆర్‌ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ములేక కూటమికట్టిన రాహుల్, చంద్రబాబు డిసెంబర్ 11 తర్వాత వీణ, ఫిడేల్ వాయించుకోవాల్సిందేనని మంత్రి కేటీఆర్ ఎద్దేవాచేశారు. వారి పొత్తుకు ప్రాతిపదిక లేదని చెప్పారు. కాంగ్రెస్‌కు తోకపార్టీగా టీడీపీ మారడంతో ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తున్నదన్నారు. 450 ఏండ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్‌కు తానే ముగ్గుపోసినట్టు చంద్రబాబు మాట్లాడుతున్నారని, ఆయన మాటలువింటే కులీకుతుబ్‌షా ఏం కావాలని ప్రశ్నించారు. అమరావతిలో గ్రాఫిక్స్ తప్ప ఏమీలేవన్నారు.
సోనియా బాధంతా రాహుల్ గురించే రాష్ట్రంలో ప్రచారానికి వచ్చిన సోనియాగాంధీతో స్థానిక కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెప్పించారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. సోనియాగాంధీకి వాస్తవాలు తెలియవని, స్థానిక విషయాలపై అవగాహనలేదని పేర్కొన్నారు. ఆమె బాధ తెలంగాణ గురించికాదని, రాహుల్‌గాంధీ గురించేనని వ్యాఖ్యానించారు. రాహుల్‌లాంటి కొడుకు ఉంటే ఏ తల్లి అయినా బాధపడుతారని ఎద్దేవాచేశారు. ఆమె మాటలను అపార్థం చేసుకోవద్దన్నారు.
ప్రతిదీ రాజకీయం చేయడం బాబుకు అలవాటే ఏపీలో ప్రతిపక్షనేత జగన్‌పై దాడి జరిగినప్పుడు తాను స్పందిస్తే దానిని కూడా చంద్రబాబు రాజకీయం చేశారని కేటీఆర్ విమర్శించారు. చంద్రబాబుకు ప్రతిదీ రాజకీయంచేయడం అలవాటన్నారు. తనకంటే గంటముందు ఈ దాడిపై సానుభూతి వ్యక్తంచేస్తూ లోకేశ్ స్పందించారని, ఆయన కూడా మాతో కలిశారా? అని నిలదీశారు. హరికృష్ణ చనిపోయినప్పుడు కూడా తాము స్పందించామని, హాస్పిటల్ నుంచి హైదరాబాద్ వరకు మంత్రి జగదీశ్‌రెడ్డి వెంటే ఉన్నారని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర పోలీస్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్‌గుప్తా, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేశ్, రామకృష్ణారెడ్డి, ఆర్ఆర్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, నాగరాజు, అమూల్య, మధుసూదన్‌రెడ్డి, వాసుదేవ్, అడుసుమల్లి వెంకటేశ్వర్రావు, సినీనటుడు విజయచందర్ తదితరులు పాల్గొన్నారు.