Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మనమే నిర్ణయాత్మక శక్తి

-తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను 16 సీట్లలో గెలిపించండి
-ఢిల్లీ గద్దె ఎవరెక్కాలో శాసిద్దాం
-దేశానికి ఆదర్శంగా రైతుబంధు, రైతుబీమా
-టీఆర్‌ఎస్ సాధించింది సాధారణ విజయం కాదు
-సోమారపు సేవలను వినియోగించుకుంటాం
-టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు
-టీఆర్‌ఎస్‌లో చేరిన రామగుండం ఎమ్మెల్యే
-నాగార్జునసాగర్ కాంగ్రెస్ నాయకులు కూడా..

లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించి 16 సీట్లలో గెలిపిస్తే ఢిల్లీ గద్దెనెక్కేది ఎవరో నిర్ణయించేది తెలంగాణ ప్రజలేనని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు. యాచించేస్థాయి నుంచి శాసించేస్థాయికి ఎదుగాలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే శిరోధార్యమన్న కేటీఆర్.. రాజకీయాల్లో కుర్చీలు శాశ్వతం కాదని, ఏ కుర్చీపైనా ఎవరి పేరూ శిలాక్షరాలతో చెక్కి ఉండదని చెప్పారు. టీఆర్‌ఎస్‌ది పేదల ప్రభుత్వమన్నారు. ఎన్నికల్లో గెలిచినందుకు గర్వపడవద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. వచ్చే పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. సోమవారం తెలంగాణభవన్‌లో వేర్వేరు కార్యక్రమాల్లో రామగుండం స్వతంత్ర ఎమ్మెల్యే కొరుకంటి చందర్, దాదాపు మూడువేల మంది ఆయన అనుచరులు, నాగార్జునసాగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు భగవాన్ నాయక్, లక్ష్మారెడ్డి, అబ్బాస్‌లు కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ జాతీయస్థాయిలో కాంగ్రెస్ కనుచూపుమేరలో కోలుకునే పరిస్థితిలో లేదని, బీజేపీ, ప్రధాని మోదీల గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతున్నదని చెప్పా రు. ఈ రెండు పార్టీలకు కలిపినా 250 సీట్లు దాటే పరిస్థితి లేదన్నారు. సీఎం కేసీఆర్ మానస పుత్రికలైన రైతుబంధు, రైతుబీమా పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని, వీటిని జార్ఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ అమలుచేస్తున్నాయని చెప్పారు. త్వరలోనే కేంద్రం కూడా ఈ పథకాల పేర్లు మార్చి అమలుకు సిద్ధమవుతున్నదన్నారు.

ఇది సాధారణ విజయం కాదు
అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సాధించింది సాధారణ విజయం కాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఓటుతోనే కాంగ్రెస్, బీజేపీకి ప్రజలు బుద్ధిచెప్పారన్నారు. బీజేపీకి 103 స్థానాల్లో డిపాజిట్లు దక్కలేదని, కాంగ్రెస్ 19 సీట్లతో సరిపెట్టుకుందని ఎద్దేవాచేశారు. నల్లగొండ జిల్లాలో ట్రక్కు అడ్డమెచ్చిందని, లేకుంటే మరో రెండు సీట్లు గెలిచేవాళ్లమని చెప్పారు. ఒక్క ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చావుతప్పి కన్ను లొట్టబోయినట్టు ట్రక్కు గుర్తు, టక్కుటమార విద్యలతో గెలిచారని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, ఐదుగురు వివిధ రాష్ట్రాల సీఎంలు, 11 మంది కేంద్రమంత్రులు, కాంగ్రెస్‌నుంచి రాహుల్‌గాంధీ సహా రాజకీయ దురంధరులు ప్రచారదాడి చేసినా.. ప్రజలు కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని భావించారని కేటీఆర్ చెప్పారు. నాగార్జునసాగర్‌లో టీఆర్‌ఎస్‌ను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

ఫ్లోరోసిస్‌ను పట్టించుకోని కాంగ్రెస్ నేతలు కృష్ణానది ఒడ్డున నల్లగొండ జిల్లా ఉన్నా.. రెండు లక్షలమంది ఫ్లోరోసిస్ మహమ్మారి బారిన పడి జీవచ్ఛవాల్లా మారారని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఫ్లోరోసిస్ సమస్యను పరిష్కరించాల్సిన గత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తన సొంత జిల్లా చిత్తూరుకు ఏడు వేల కోట్లు తరలించుకపోవడానికి క్యాబినెట్‌లో పెడితే నాటి జిల్లా మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నల్లగొండ ఫ్లోరోసిస్ గురించి మాట్లాడకుండా నవ్వుతూ సంతకాలు చేశారని విమర్శించారు. పాలన వికేంద్రీకరణలో భాగంగా కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, పంచాయతీలు ఏర్పాటుచేశామని, ఈ క్రమంలోనే నందికొండ, హాలియాలను మున్సిపాలిటీలుగా మార్చామన్నారు.

ఏకగ్రీవాలకు కృషిచేయండి
పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు కృషి చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. గ్రామగ్రామాన గులాబీ జెండా ఎగురాలన్నారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులుగా ప్రచారం చేసుకున్న వారందరూ కేసీఆర్ సునామీలో ఓటమిపాలయ్యారని అన్నారు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మాట్లాడుతూ మరో 30 ఏండ్లు టీఆర్‌ఎస్ అధికారంలో ఉండేవిధంగా అందరం కృషి చేద్దామని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో ప్రభుత్వ సలహాదారు జీ వివేక్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, జీవన్‌రెడ్డి, కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్, రామగుండం మాజీ మేయర్ లక్ష్మీనారాయణ, టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సత్యవతి రాథోడ్, రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, టీఎస్‌టీఎస్సీ చైర్మన్ రాకేశ్, జెడ్పీటీసీ సంధ్యారాణి, టెస్కాబ్ మాజీ చైర్మన్ విజేయందర్‌రెడ్డి, కోటిరెడ్డి, రాంచందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఎదిగిన కొద్దీ ఒదగాలి
సోమారపు, చందర్ గురుశిష్యుల్లా పనిచేయాలి
రాజకీయాల్లో గెలుపుతో గర్వపడవద్దని, ఓటమితో కుంగిపోవద్దని పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ సూచించారు. ఎదిగిన కొద్దీ ఒదగాలని చెప్పారు. రామగుండం నియోజకవర్గంలో సోమారపు సత్యనారాయణ, ఎమ్మెల్యే కొరుకంటి చందర్ గురుశిష్యులుగా ముందుకు సాగాలన్నారు. ఎన్నికల్లో ఘటనలను మర్చిపోయి అంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. సోమారపు సేవలను పార్టీ వినియోగించుకుంటుందని చెప్పారు. రామగుండం నియోజకవర్గానికి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని కేటీఆర్ ప్రకటించారు. మెడికల్ కాలేజీ, మైనింగ్ కాలేజీ మంజూరు చేయిస్తామన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గం నుంచి లక్ష ఓట్లు టీఆర్‌ఎస్ అభ్యర్థికి వచ్చేలా పనిచేయాలన్నారు. పంచాయతీ ఎన్నికల నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో విజయఢంకా మ్రోగించాలని, అన్నింటా గులాబీ జెండా ఎగురాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ శిష్యుడిగా చందర్ పనిచేశారని, ఎన్నికల సమయంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వేరుగా పోటీచేసినా.. తిరిగి సొంతింటికి వచ్చారని చెప్తూ.. టీఆర్‌ఎస్‌లో పుట్టిన మొక్క వృక్షమైనందుకు సంతోషంగా ఉందని చందర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు.

యువకుడైన చందర్‌కు మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారు. ఎమ్మెల్యే కొరుకంటి చందర్ మాట్లాడుతూ గతంలో ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేశామని, రాబోయే రోజుల్లో గ్రామ గ్రామాన గులాబీజెండా ఎగురవేస్తామని చెప్పారు. తిరిగి మాతృసంస్థలోకి వచ్చానంటూ భావోద్వేగానికి గురయ్యారు. మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రమంతటా కేసీఆర్ ప్రభంజనం ఉన్నా.. స్థానికంగా ఉన్న పరిస్థితుల్లో చందర్ గెలిచారని, అయినా.. కాంగ్రెస్ అభ్యర్థికాకుండా ఉద్యమకారుడు గెలువడం సంతోషంగా ఉందని చెప్పారు. తన సహాయ సహకారాలు చందర్‌కు ఉంటాయన్నారు.

90కి పెరిగిన బలం: అసెంబ్లీలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 90కి పెరిగింది. శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 88 స్థానాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రాములునాయక్ ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరారు. సోమవారం పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చేరికతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 90కి చేరుకుంది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.