Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మానవీయ కోణంలో బడ్జెట్

-సంక్షేమం, వ్యవసాయం, సాగునీరు, విద్యుత్తు ప్రాధాన్యతలు -ఎస్సీఎస్టీల తొలిపంటలకు పెట్టుబడి ప్రోత్సాహం -పరిశీలనలో బీసీ కులాలకు ప్రోత్సాహకాలు -రైతుల ఆత్మహత్యలకు గత పాలకులదే పాపం -బడ్జెట్ సమాధానంలో ఆర్థ్ధిక మంత్రి ఈటెల రాజేందర్

Etela Rajendar Addressing in Assembly

లక్ష కోట్ల తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మానవీయకోణాన్ని ఆవిష్కరించిందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ కోసం మూడు తరాలు చేసిన త్యాగాలకు ఫలితం ఆవిష్కృతమవుతున్నదని, తెలంగాణ భవిష్యత్తుపై వారు పెట్టుకున్న ఆశలను నెరవేర్చే విధంగా బడ్జెట్ సాక్షాత్కరించిందని పేర్కొన్నారు.

శుక్రవారం శాసనసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి సమాధానమిచ్చారు. దొడ్డి కొమురయ్య, చాకలి అయిలమ్మ నుంచి శ్రీకాంతచారి వరకు అమర వీరులంతా ఆకాంక్షించిన మేరకు రాష్ట్ర బడ్జెట్ ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని, మన నిధులు, మన నీళ్ళు, మన ఉద్యోగాలు, మన వనరులు మనకే దక్కుతాయని ప్రజలు పెట్టుకున్న ఆశలకు అద్దం పట్టామని పేర్కొన్నారు. కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం ఐదు నెలల పాలనపై విపక్షాలు వైఖరి విస్మయాన్ని కలిగిస్తుందన్నారు. పెద్దలు జానారెడ్డితో పాటు మరికొందరు బడ్జెట్‌లోని అంశాలను లోతుగా పరిశీలించకుండానే అంకెలగారడీగా ఉందనడం. ఈ ప్రభుత్వానికి పాలించే హక్కు లేదనడం, ఊహాగానాలతో ఉందని మాట్లాడడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మన వ్యవస్థ ఎక్కడ ఉందో గుర్తించాకే బడ్జెట్ రూపకల్పన జరిగిందని, మన ఊరు-మన ప్రణాళిక, సమగ్ర సర్వే వంటి వాటిని పరిగణలోకి తీసుకుని అనేకసార్లు ముఖ్యమంత్రి స్థాయిలో కూలంకషంగా సమీక్షలు జరిపిన తర్వాతే రూపుదిద్దుకున్న బడ్జెట్‌ను తప్పుపట్టడం సరికాదన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సాగునీరు రంగాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు.

తెలంగాణ పట్ల ఆర్థిక సంఘం ఆసక్తి ఇటీవల 14వ ఆర్థిక సంఘం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో సమావేశమైన సందర్భంలో తెలంగాణ స్వరూపం మీద, తెలంగాణ ఆర్ధిక స్థితిగతుల మీద సీఎం కేసీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చిన తీరుకు ఆర్థిక సంఘం చైర్మన్ అబ్బురపడి ఇంత అవగాహన ఉన్న సీఎంను చూడ లేదని ప్రశంసించారని ఈటెల వెల్లడించారు. నిధులు కేటాయించే సమయంలో తెలంగాణ బాధలు, ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుంటామని హామీ కూడా ఇచ్చారని వివరించారు.

ఇప్పటికే రాష్ర్టానికి 13వ ఆర్థిక సంఘం రూ.3,139కోట్లు కేటాయించిందని, కొత్తగా ఏర్పడిన తెలంగాణకు 14వ ఆర్ధిక సంఘం నుంచి వీలైనంత ఎక్కువ నిధులు వస్తాయన్న ఆశతో ఉన్నామని మంత్రి తెలిపారు. బడ్జెట్ లక్ష కోట్లకు పైగా ఉంటే అప్పులు రూ.18వేల కోట్లు ఉన్నాయని, ప్రణాళికేతర పద్దు కింద రూ.51,981.4కోట్లు కాగా, ప్రణాళిక పద్దు కింద రూ.48,648.47కోట్లు ప్రతిపాదించామన్నారు. రాష్ట్ర అదాయం రూ. 80,093 కోట్లు, రెవెన్యూ ఆదాయం రూ.79,789 కోట్ల మేరకు ఉన్నట్లు మంత్రి వివరించారు.

ఉద్యమ స్ఫూర్తితో పథకాల అమలు పేదలకు కడుపు నింపేందుకు ప్రభుత్వం తెల్లరేషన్ కార్డులకు రూ.9,040 కోట్లు ఖర్చుపెడుతూ 80 లక్షల కార్డులకు ఆరు కిలోల చొప్పున బియ్యం ఇవ్వబోతున్నదని తెలిపారు. వృద్ధులు, వింతుతువుల పింఛన్లకు వెయ్యికోట్లకు పైచిలుకు ఖర్చుచేస్తున్నామని, వికలాంగులకు రూ.1,500లు ఇవ్వబోతున్నామని చెప్పారు. ఒక కుటుంబంలో ఎంత మంది వికలాంగులున్నా అందరికీ పింఛను మంజూరు అవుతుందని మంత్రి ఈటెల స్పష్టం చేశారు. చేనేత కార్మికులు, గీత కార్మికులతో పాటు ఎయిడ్స్ బాధితులకు పింఛన్ల కింద ఇప్పటికే రూ.4వేల కోట్లు ఖర్చుచేసినట్లు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తికాగానే ప్రజాప్రతినిధులందరూ ఉద్యమస్పూర్తితో ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించేందుకు గ్రామాల్లోకి వెళ్ళనున్నట్లు చెప్పారు.

ఎస్సీ ఎస్టీలకు భూ పంపిణీ అణగారిన వర్గాలకు గౌరవం, ఆత్మగౌరవం పెరగాలంటే భూమిపై వారికి హక్కులు ఉండాలని 1953లో హైదరాబాద్‌కు వచ్చిన సంద ర్భంగా రాజ్యాంగనిర్మాత బీఆర్ అంబేద్కర్ అన్నారని, అదే స్పూర్తితో దళితులకు మూడు ఎకరాల భూమి కల్పించేందుకు కార్యక్ర మాన్ని పంద్రాగస్టు నుంచి ప్రారంభించామన్నారు. ఈ ప్రక్రియ ఏడాది పొడుగునా 365 రోజుల పాటు కొనసాగుతుందని, సేద్యానికి పనికివచ్చే భూములను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని, సర్కారీ భూములు అందుబాటులో లేకుంటే కొనుగోలు చేసి ఇస్తుందని వివరించారు.

సమైక్యరాష్ట్రంలో నిర్వీర్యమైన చెరువులు తెలంగాణలో ఈ ఏడు తొమ్మిదివేల చెరువుల పునరుద్ధరణకు రెండు వేల కోట్లు ఖర్చుచేయనున్నట్లు చెప్పారు. ఇంతకాలం నెలకొన్న దుర్బర పరిస్థితులపై పల్లె కన్నీరు పెడుతుందని, ఎన్నాళ్ళీ దుఖం, ఎన్నాళ్ళీ కన్నీళ్ళు అని పాటలు రాసుకున్నాం, అలాంటివి మున్ముందు ఉండవని అన్నారు. ఆనాడు మీరు(కాంగ్రెస్) హంద్రీనీవాకు హారతి పట్టారు, మంత్రులుగా ఉండి తెలంగాణ హక్కులను కాపాడలేదు, అందుకే తెలంగాణ సమాజం మిమ్ముల్ని విశ్వసించలేదు అని అన్నారు.

సాగునీటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఎస్సారెస్పీ కింద 14.4లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందని చెప్పారు, ఇప్పుడు తుమ్మలు, జిలేళ్ళు మొలిచాయి, వరంగల్ జిల్లాకు కూడా నీరు రాలేదన్నారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయబోతున్నారని ప్రకటించారు. మీది(కాంగ్రెస్) మాటల ప్రభుత్వం అయితే మాది(టీఆర్‌ఎస్) చేతల ప్రభుత్వం అన్నారు.

తట్టెడు బొగ్గులేని చోట్ల ప్రాజెక్టులా? తెలంగాణ కరెంటు కష్టాలపై లక్ష దీపాలతో పాదయాత్ర చేసి ఆనాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చాం, అయితే రామగుండం వద్ద విద్యుత్ ప్రాజెక్టు కడితే ఖర్చు ఎక్కువ అవుతుందని, ఆర్టీపీపీ వద్ద కడితే తక్కువ ఖర్చు వస్తుందని ఆయన చెప్పారు, ఆనాడు మాకు లెక్కలు అర్థం కాలేదు, ఇప్పుడు అన్ని లెక్కలు మాకు తెలుస్తున్నాయని వ్యంగ్యంగా అన్నారు. విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ జెన్‌కో కొత్త ప్రాజెక్టులకు వెయ్యి కోట్లు కేటాయించామని ఆర్థిక మంత్రి చెప్పారు.

ఎన్టీపీసీ నాలుగువేల మెగావాట్ల పవర్ ప్రాజెక్టు నిర్ణీత కాలంలో పూర్తి అవుతుందని, ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్లకు ఒప్పందం కుదుర్చుకున్నామని, జెన్‌కో ద్వారా ఆరు వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు పనులను నవరత్న కంపెనీ బీహెచ్‌ఇఎల్‌కు ఇచ్చామని తెలిపారు. అవసరమైతే తెలంగాణ జెన్‌కోలో 15 శాతం మేరకు పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

భవిష్యత్‌లో రాష్ట్రంలో మిగులు విద్యుత్ -ఎమ్మెల్సీల భద్రతపై సీఎంకు నివేదిస్తాం -వక్ప్‌బోర్డు సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి ఈటెల ప్రస్తుతం తీవ్ర కొరతతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ భవిష్యత్తులో 20 వేల మెగావాట్ల మిగులు విద్యుత్ ఉత్పత్తితో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉంటుందని మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఎటువంటి అనుమానాలు అవసరం లేదని చెప్పారు. బడ్జెట్‌పై ఎమ్మెల్సీలు లేవనెత్తిన అంశాలపై శుక్రవారం మండలిలో ఈటెల సమాధానమిచ్చారు.

ఎమ్మెల్సీల భద్రతను ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకువచ్చి, సభ్యులను గౌరవించుకుంటామని తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయాలకు మరిన్ని నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు అరకొర నిధులు విడుదల చేసి నిర్లక్ష్యం చేశారని అన్నారు. వీటిని బలపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని,ఇందుకోసం రోడ్‌మ్యాప్ తయారు చేస్తామన్నారు. వక్ఫ్‌బోర్డులో సిబ్బంది ఇతర సమస్యల పరిష్కారానికి త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. నిజాంషుగర్ ప్యాక్టరీతోపాటు రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమల కోసం ప్రత్యేక విధానం అందుబాటులోకి తెస్తామన్నారు. బీడీ కార్మికుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తుందని చెప్పారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో బీడీ కార్మికుల కోసం ప్రత్యేకంగా నిధులు ఇచ్చిన విషయాన్ని మండలి దృష్టికి తెచ్చారు. వ్యవసాయం, వైద్యం, విద్య, సంక్షేమాలే తమ ప్రభుత్వ ప్రాధాన్యాలని ఆయన పునరుద్ఘటించారు.

హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేస్తాం హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్ కాదు, అడ్డగుట్ట, నామాలగుండు, వారసిగూడ, చార్మినార్ వంటి ప్రాంతాలు గుర్తుకురావాలి, మూసీ పక్కన గుడిసెలు పోవాలి, మురికివాడలు లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఈటల చెప్పారు. ఇప్పటికే నగరానికి సౌకర్యాల కోసం రూ.350కోట్లు ఖర్చుచేశామని అన్నారు. ఇంత చేసినా మీకు ఏం నచ్చలేదని ప్రశ్నించారు. మా నిర్ణయాలే మీకు(విపక్షాలు) దిక్సూచిగా కనిపిస్తాయన్నారు.

త్వరలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామన్నారు. తెలంగాణలో పౌల్ట్రీ పరిశ్రమను ప్రభుత్వం వ్యవసాయ అనుబంధరంగంగా గుర్తించిందని, కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించాలని విజ్ఞప్తి చేసిందని చెప్పారు. మార్కెట్ ఇంటర్వేన్షన్ కోసం బడ్జెట్‌లో రూ.400కోట్లు ప్రవేశపెట్టిన చరిత్ర తమదేనని అన్నారు. రూ.250 కోట్లు గ్రీన్‌హౌస్ కల్టివేషన్ కోసం బడ్జెట్‌లో పెట్టుకున్నామని చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.