వరంగల్ లోక్‌సభ ఉపఎన్నికలకు అధికార టీఆర్‌ఎస్ రణభేరీ మోగించింది. ఎన్నికల సంసిద్ధతపై గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో తొలి సమావేశం నిర్వహించింది. వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ నేతలు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఉప ఎన్నికల్లో ప్రచార బాధ్యతలను మంత్రులకు సీఎం అప్పగించారు. లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు సెగ్మెంట్లకు ఏడుగురు మంత్రులను ఇన్‌చార్జీలుగా నియమించారు. పార్టీనుంచి ఎవరిని పోటీ చేయించాలనే విషయంలో నిర్ణయాధికారాన్ని సమావేశం ముఖ్యమంత్రికే అప్పగించింది.
-వరంగల్ ఉప ఎన్నిక ప్రచార సారథులు మీరే
-ఏడు సెగ్మెంట్లకు ఏడుగురు మంత్రులకు బాధ్యతలు
-వరంగల్ పార్టీ కార్యకర్తల భేటీలో సీఎం
-నేడు అభ్యర్థిని ప్రకటించనున్న కేసీఆర్
-వరంగల్ ఉప ఎన్నికకు భేరీ మోగించిన టీఆర్‌ఎస్
-17 లేదా 18న ఎన్నికల ప్రచారానికి కేసీఆర్
-ఉద్యమంలో పనిచేసినవారికే అవకాశం: కడియం
-పరిశీలనలో న్యాయవాది గుడిమళ్ల రవికుమార్ పేరు
ఈ మేరకు టీఆర్‌ఎస్ అభ్యర్థిని సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రకటించనున్నారు. ఉద్యమంలో పని చేసేవారికే అవకాశం ఉంటుందని సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. సమావేశంలో ఇదే అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చిన వరంగల్ జిల్లాకు చెందిన అడ్వొకేట్ జేఏసీ నేత గుడిమళ్ల రవికుమార్ పేరుపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది.
రవికుమార్ పేరు అధిష్ఠానం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.ఏడు సెగ్మెంట్లకు ఏడుగురు మంత్రులు: వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం, వ్యూహాల అమలు బాధ్యతలను ఏడుగురు మంత్రులకు అప్పగిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పరకాల సెగ్మెంట్ బాధ్యతలు ఈటల రాజేందర్‌కు అప్పగించారు. వరంగల్ తూర్పు బాధ్యత తన్నీరు హరీశ్‌రావుకు, వరంగల్ పశ్చిమ బాధ్యత కల్వకుంట్ల తారక రామారావుకు కేటాయించారు. పాలకుర్తి నియోజకవర్గానికి జీ జగదీశ్‌రెడ్డి, భూపాలపల్లికి పోచారం శ్రీనివాసరెడ్డి బాధ్యత వహిస్తారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం బాధ్యత అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి, వర్ధన్నపేట బాధ్యత జోగు రామన్నకు ముఖ్యమంత్రి అప్పగించారు. పార్టీ క్షేత్రస్థాయి ప్రచార కార్యక్రమం నవంబర్ ఒకటిన ఏడు సెగ్మెంట్లలో జరిగే పార్టీకార్యకర్తల సమావేశాలతో మొదలుకానుంది. ఈ సమావేశాలకు ఆయా సెగ్మెంట్ల బాధ్యతలు నిర్వహించే మంత్రులు హాజరుకానున్నారు.
పథకాలపై విస్తృత ప్రచారం గడిచిన పదహారు నెలలకాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమావేశానికి హాజరైన నేతలను ఆదేశించారు. కళ్యాణలక్ష్మి-షాదీ ముబారక్, పింఛన్లు, సన్నబియ్యం, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం తదితర అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి.. ఇంటింటికీ తీసుకెళ్ళాలని, ముఖ్యంగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని, 2014 ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలేకాకుండా.. ప్రజల అవసరాలను గుర్తెరిగి చేపడుతున్న కార్యక్రమాలనుకూడా ప్రజలకు వివరించాలనే అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం.

ఇంటింటికీ ప్రచారం.. భారతదేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు టీఆర్‌ఎస్ సర్కారు చేస్తున్న కృషిని ప్రజలకు వివరించేలా పార్టీ కార్యకర్తలను సన్నద్ధం చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నేతలతో అన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీలు, పథకాలు, వాగ్దానాలు 90 శాతం ప్రారంభమైనట్టు సీఎం వివరించారు. గడిచిన 16 నెలల్లో సర్కారు చేసినవి, చేపట్టినవి, చేపట్టనున్నవాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు వరంగల్ ఉప ఎన్నిక ఒక చక్కటి అవకాశమని సీఎం పేర్కొన్నారు. దీనిని 100శాతం సద్వినియోగం చేసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. గ్రామగ్రామాన ఇంటింటికీ ప్రతి కార్యకర్త తిరిగి, ప్రజలకు అర్థమయ్యే విధంగా సర్కారు పనితీరును, పథకాల అమలును వివరించాలని సీఎం ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయలాంటి ప్రతిష్ఠాత్మక పథకాలు ఇతర రాష్ర్టాలకు స్ఫూర్తి నింపుతున్నాయని సీఎం గుర్తు చేశారు.
ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్ వారి రాష్ట్రంలోనూ వాటర్ గ్రిడ్ పథకాన్ని చేపడతామని చెప్పారని, మిషన్ కాకతీయకు రామన్‌మెగసెసె అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్‌లాంటివారి ప్రశంసలుకూడా అందాయని ప్రస్తావించిన సీఎం.. ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వరంగల్ జిల్లా నేతలకు సూచించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, జీ జగదీశ్‌రెడ్డి, జోగు రామన్న, పోచారం శ్రీనివాసరెడ్డి, చందూలాల్, ఎంపీ వినోద్‌కుమార్‌లతోపాటు వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు టీ రవీందర్‌రావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు, జిల్లా ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఇతర ముఖ్యనేతలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పాల్గొన్నారు.
వరంగల్‌లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయం: కడియం శ్రీహరి ప్రతిపక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా వరంగల్ లోక్‌సభ స్థానంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ధీమా వ్యక్తంచేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని స్పష్టంచేశారు. ఉప ఎన్నికపై కేసీఆర్ సారథ్యంలో జరిగిన వరంగల్ జిల్లా నేతల సమావేశం అనంతరం ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షాలు ఎన్నిరకాలుగా ప్రచారం చేసినా.. క్షేత్రస్థాయిలో ప్రజలు టీఆర్‌ఎస్ వెంటే ఉన్నారని, ఇది తెలుసుకోకుండా ప్రతిపక్షాలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాయని కడియం మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం గడిచిన 16 నెలలుగా చేస్తున్న మంచి పనులు, అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను చూసి ప్రజలు తమకు ఓటేస్తారనే నమ్మకం ఉందని అన్నారు. ఎన్నికల ఫలితాల తరువాత ప్రతిపక్షాలు నోరుమెదపవని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ, బీహార్ ఎన్నికల ఫలితాలను బీజేపీ రెఫరెండంగా స్వీకరిస్తుందా? అంటూ సవాల్ విసిరారు.
ఒకటిన ఏడు సెగ్మెంట్లలో కార్యకర్తల సమావేశాలు నవంబర్ 1న వరంగల్ లోక్‌సభస్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉదయం 11 గంటలకు పార్టీ కార్యకర్తల సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్టు కడియం తెలిపారు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ బాధ్యతను ఒక్కో మంత్రికి అప్పగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పార్టీ అభ్యర్థి ఎంపిక బాధ్యతను కేసీఆర్‌కు అప్పగిస్తూ సమావేశంలో ఏకగీవ్రంగా తీర్మానం చేసినట్లు వివరించారు. నవంబరు 17 లేదా 18 తేదీల్లో సీఎం కేసీఆర్ వరంగల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నారని, ప్రజలు దీనిని గమనిస్తున్నారని ఆయన అన్నారు. ప్రధాన ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌లకు అభ్యర్థులే కరువయ్యారని, మా పార్టీ నుంచి పోటీ చేయండి బాబూ.. అంటూ దీనంగా బతిమాలే పరిస్థితితో ఆయా పార్టీలున్నాయని ఎద్దేవాచేశారు. అలాంటి పార్టీలు టీఆర్‌ఎస్‌ను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.
ఉద్యమంలో పాల్గొన్నవారికే.. వరంగల్ జిల్లాకు చెందినవారికి, ఉద్యమంలో పాల్గొన్నవారికే టిక్కెట్ దక్కుతుందని గతంలో చెప్పామన్న కడియం ఇప్పుడుకూడా అదే చెప్తున్నామని అన్నారు. పార్టీ అధ్యక్షులు కేసీఆర్‌కూడా ఇదే చెప్పారని కడియం పేర్కొన్నారు. వరంగల్ లోక్‌సభకు టీఆర్‌ఎస్ తరఫున పోటీచేసే అభ్యర్థి పేరును శుక్రవారం కేసీఆర్ ప్రకటిస్తారని తెలిపారు.
అభ్యర్థి ఖర్చంతా పార్టీదే: ముఖ్యమంత్రి కేసీఆర్! అభ్యర్థి నిరుపేదైనా మంచి చదువు, భాషపై పట్టు ఉండాలి. ఢిల్లీస్థాయిలో ఉండే పదవి కనుక లాంగ్వేజీ ఉంటే బాగుంటుంది. పార్లమెంట్‌లో మంచిగా మాట్లాడగలిగే సత్తా ఉండాలి. ఈ క్వాలిటీలున్నవారు పేదవారైనా ఫరవాలేదు. నామినేషన్‌తోసహా ఖర్చులన్నింటినీ పార్టీయే భరించి గెలిపించుకుంటాం అని సీఎం కేసీఆర్ వరంగల్ నేతలతో జరిగిన సమావేశంలో భరోసా ఇచ్చినట్టు సమాచారం. పైగా 2001నుంచి ఉద్యమంలో పాలుపంచుకున్న వ్యక్తికే అవకాశం ఉంటుందని స్పష్టంచేశారని తెలిసింది. ఇతర పార్టీలకు చెందిన పలువురు టీఆర్‌ఎస్‌లోకి రావాలనే ఉత్సాహంతో ఉన్నారనే అంశంపై చర్చ జరిగినప్పుడు ఎవరైనా రావాలనుకుంటే ఎలాంటి పదవులు ఆశించకుండా రావాలనే చెప్తున్నాం. పార్టీకి చేసే సేవనుబట్టి, సమయానుకూలంగా వారికీ పదవులు వస్తాయి. ఇదే విషయాన్ని టీడీపీ ఎంపీ గుండు సుధారాణికికూడా చెప్పాం అని సీఎం అన్నారని సమాచారం.