Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మానుకోటే మనకు స్ఫూర్తి

-చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలి
-పాము, ముంగీస పార్టీల పొత్తును చిత్తుచేద్దాం
-గిరిజనుల రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ చిత్తశుద్ధిని శంకించవద్దు
-స్వయంపాలన దిశగా రిజర్వేషన్లనూ సాధించి తీరుతాం
-సింగరేణి ఆధ్వర్యంలో బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ
-రాహుల్ సీట్లిచ్చినా.. బాబు నోట్లిచ్చినా.. ఓట్లేసేది తెలంగాణ బిడ్డలే..
-మహాకూటమిలో సీఎం ఎవరు?
-మహబూబాబాద్, డోర్నకల్ ఆశీర్వాదసభల్లో మంత్రి కేటీఆర్

తెలంగాణ ప్రజలు మానుకోట ఉద్యమస్ఫూర్తిని మరోసారి చాటాలని.. వలసాధిపత్య పార్టీలకు, దురహంకార చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. 40 ఏండ్లపాటు పాము, ముంగీసలా కొట్లాడుకున్న కాంగ్రెస్, టీడీపీలు ఇప్పుడు ఒక్కటయ్యాయని, వారు ఏ ముఖం పెట్టుకుని ప్రజల ముందుకొస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అనైతిక, అపవిత్ర కలయికతో వంచించాలని చూస్తే ఆత్మగౌరవం గల తెలంగాణ బిడ్డలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. గిరిజనుల రిజర్వేషన్ల విషయంలో టీఆర్‌ఎస్ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పులేదని కేటీఆర్ స్పష్టంచేశారు. మా తండాల్లో మారాజ్యం.. మా గూడేల్లో మారాజ్యం అని నినదించిన గిరిపుత్రులకు రాష్ట్రవ్యాప్తంగా 3,400 తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి సీఎం కేసీఆర్ న్యాయం చేశారని చెప్పారు.

ఇదే చిత్తశుద్ధితో గిరిజన రిజర్వేషన్లను కూడా సాధించి తీరుతామని తెలిపారు. శనివారం మహబూబాబాద్‌తోపాటు, డోర్నకల్ నియోజకవర్గం మరిపెడలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాదసభల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. నాలుగున్నరేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమపథకాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతుంటే.. ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అడ్డుకునేందుకు కుట్రలు చేసిందని అన్నారు. అభివృద్ధి నిరోధకశక్తిగా మారిన కాంగ్రెస్ విధానాలను ఎండగట్టేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిది నెలలు ముందుగానే అసెంబ్లీని రద్దుచేసి ప్రజాకోర్టులో తేల్చుకునేందుకు ముందుకొచ్చారని వివరించారు. టీఆర్‌ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ను ఎదుర్కోలేకే కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు అపవిత్ర కలయికతో కూటమిగా ఏర్పడ్డాయని విమర్శించారు. ఢిల్లీలో రాహుల్ సీట్లిచ్చినా.. ఏపీ సీఎం చంద్రబాబు నోట్లిచ్చినా.. చివరకు ఓట్లేసేది మాత్రం తెలంగాణ బిడ్డలేనని.. తమ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకో, అమరావతికో తాకట్టు పెడుతుంటే చూస్తూ ఊరుకునే స్థితిలో లేరని.. మానుకోట స్ఫూర్తితో ఆ పార్టీలను మనోమారు తిప్పికొడుతారని పేర్కొన్నారు. సోనియాగాంధీని గాడ్సేతో పోలుస్తూ అభివృద్ధి నిరోధకపార్టీగా ఛీత్కరించిన చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ పొత్తు ఎలా పెట్టుకున్నదని నిలదీశారు. ఏ ఆత్మగౌరవం కోసమైతే తెలంగాణ ప్రజలు ఉద్యమించారో అదే ఆత్మగౌరవాన్ని చంద్రబాబు వద్ద తాకట్టుపెడుతున్నారని ఆరోపించారు.

కూటమి నాయకుడెవరు..
మహాకూటమిలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌పార్టీలో 40 మంది సీఎం అభ్యర్థులుగా చెలామణి అవుతున్నారని, నెలకో సీఎం కావాలో.. తెలంగాణ భూమిపుత్రుడుగా ఉన్న సింహంలాంటి కేసీఆర్ సీఎం కావాలో తేల్చేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి సీటుకోసం కాంగ్రెస్ నేతలు చిన్నపిల్లలు మ్యూజిక్‌చైర్ ఆడినట్టే ఆడుతుంటారని.. అదే టీఆర్‌ఎస్‌లో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ నిలకడగా అభివృద్ధి జరుగుతుందని, నాలుగున్నరేండ్లుగా సాధించిన ప్రగతే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఒకవైపు అభివృద్ధిని, మరోవైపు సంక్షేమాన్ని జోడెద్దులుగా ముందుకు తీసుకెళ్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని తెలిపారు.

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కట్టితీరుతాం
ఉద్యమ సమయంలో నినదించినట్టుగానే బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ సాధనకు టీఆర్‌ఎస్ కట్టుబడి ఉన్నదని కేటీఆర్ అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఫ్యాక్టరీకి అనుకూలమా, వ్యతిరేకమా అనే విషయం తేల్చకుండా నాన్చివేత ధోరణి అనుసరిస్తున్నదని దుయ్యబట్టారు. కేంద్రం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మహబూబాబాద్ జిల్లాలో బయ్యారం ఉక్కుపరిశ్రమను స్థాపించి తీరుతామన్నారు. కేంద్రం ముందుకురాకపోతే సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటుచేస్తామని.. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ మాటగా మానుకోట ప్రజలకు అభయం ఇస్తున్నా అని చెప్పారు. ప్రపంచంలోనే అతివేగంగా నిర్మాణమవుతున్న ప్రాజెక్టుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటి అని, ఈ ప్రాజెక్టును ప్రపంచమే కీర్తిస్తుంటే ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు టీడీపీ కావాలని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ప్రాజెక్టులను నిర్మిస్తే తమ భవిష్యత్ అంధకారమవుతుందని కాంగ్రెస్ పార్టీ 200లకు పైగా కేసులు వేస్తే.. చంద్రబాబు ప్రాజెక్టులను ఆపాలంటూ కేంద్రానికి 30కి పైగా ఉత్తరాలు రాశారని చెప్పారు. 40 ఏండ్లపాటు పాము, ముంగీసలా కొట్లాడుకున్న కాంగ్రెస్, టీడీపీలు ఇప్పుడు పొత్తుకూడటంలో ఆంతర్యం తెలంగాణను బీడుగా మార్చే కుట్ర దాగి ఉన్నదని పేర్కొన్నారు.

ముసలి నక్క కాంగ్రెస్‌కు, గుంటనక్క చంద్రబాబుకు మధ్య వీణావాయిద్యం మొదలైందని.. తెలంగాణ కోటి ఎకరాల మాగాణం సాధించాలనే సీఎం కేసీఆర్ సంకల్పం ముందు ఆ వీణ మూగబోవడం ఖాయమని కేటీఆర్ పేర్కొన్నారు. జుట్టు చంద్రబాబు చేతికిచ్చిన కాంగ్రెస్ మనవేలితో మన కంటినే పొడవాలని చూస్తున్నదని.. తెగువ, ధైర్యం, సత్తా, పౌరుషం ఉన్న తెలంగాణ సమాజం మానుకోట స్ఫూర్తితో ఆ కుట్రలను తిప్పికొడుతున్నదని అన్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ బాహుబలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అడ్డుకునేశక్తి ఏ కూటమికీ లేదని అన్నారు. తెలంగాణ ప్రజలకు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ, పథకాలు మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తాయని భావించే ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడ్డాయని ఎద్దేవా చేశారు. కూటమిలో ఉన్నవాళ్లందరూ పెద్దదొంగలని, తెలంగాణను గతంలో దోచుకున్నది సరిపోక మరోసారి అనైతిక పొత్తులతో ప్రజలకు ముందుకొస్తున్నారని విమర్శించారు. మహబూబాబాద్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్, మరిపెడలో డోర్నకల్ అభ్యర్థి రెడ్యానాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభల్లో బంజారాలు తమదైన ప్రత్యేకతను చాటారు. ఈ సభల్లో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు బండ ప్రకాశ్, సీతారాంనాయక్, పసునూరి దయాకర్, పార్టీ నాయకులు సత్యవతి రాథోడ్, మాలోతు కవిత, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, నూకల నరేశ్‌రెడ్డి, గుండు సుధారాణి, నాగుళ్ల వెంకటేశ్వర్‌రావు, బీరవెళ్లి భరత్‌కుమార్‌రెడ్డి, గుడిపూడి నవీన్‌రావు తదితరులు ప్రసంగించారు.

జనంతో కిక్కిరిసిన నేషనల్ హైవే
మరిపెడలో బంజారాల మహార్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జాతీయ రహదారిపై దాదాపు రెండు కిలోమీటర్ల మేర ఎటుచూస్తే అటు జనసందోహం కనిపించింది. హెలిప్యాడ్ నుంచి సభాస్థలిదాకా ఖమ్మం- వరంగల్ హైవే గులాబీమయమైంది. ఇసుకవేస్తే రాలనంత జనంతో మరిపెడ మార్మోగింది. రాజీవ్‌గాంధీ సెంటర్ నుంచి బస్టాండ్, కార్గిల్ సెంటర్ మీదుగా సభాస్థలి వరకు రెండు కిలోమీటర్ల పొడవునా 50 నిమిషాలపాటు రోడ్‌షో సాగింది. రోడ్డుకిరువైపులా ప్రజలు నిల్చుని మంత్రి కేటీఆర్‌కు ఘనస్వాగతం పలికారు. ఆయనపై అడుగడుగునా పూలవర్షం కురిపించారు. కేటీఆర్ ప్రజలకు అభివాదం చేస్తూ.. విక్టరీ చూపిస్తూ మీ ఓటు ఎటువైపు అంటూ పలుకరించారు. కారు వైపే అంటూ జనం కూడా అంతే ఉత్సాహంతో చేతులు ఊపారు.

బాయియో.. బియావో..
లంబాడీ భాషలో మాట్లాడి ఆకట్టుకున్న కేటీఆర్ మరిపెడ బహిరంగసభలో కేటీఆర్ లంబాడీ భాషలో మాట్లాడి ఆకట్టుకున్నారు. బాయియో..బియావో వార్‌చ్వోగే (అన్నలు, తమ్ములు, అక్కలు, చెల్లెళ్లూ బాగున్నారా) అంటూ పలుకరించారు. కేటీఆర్ మాటలతో సభకు పెద్దఎత్తున హాజరైన గిరిజనులు మురిసిపోయారు.

పాట పాడిన కడియం..
ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తనశైలికి భిన్నంగా పాటపాడి అలరిస్తే.. మంత్రి కేటీఆర్ నేను రానుబిడ్డో.. పాటను గుర్తుచేస్తూ మరింత రక్తి కట్టించారు. మహాకూటమిపై నిప్పులు చెరుగుతూ కడియం శ్రీహరి.. ఆ గట్టునుంటావా నాగన్న పాటను ఈ గట్టున కేసీఆర్, మంత్రి కేటీఆర్, అభివృద్ధి ఉంది.. మరి ఆ గట్టున దొంగల కూటమి, దోపిడీదారుల కూటమి, మహాకూటమి ఉంది. ఈ గట్టున అభివృద్ధి, ఆ గట్టున దొంగలు ఉన్నారు అంటూ ప్యారడీని లయబద్ధంగా పాడారు. కేటీఆర్ గతంలో, ప్రస్తుతం ప్రభుత్వ దవాఖాల్లో పరిస్థితులను ప్రస్తావిస్తూ నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. నుంచి నేను పోతాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పాటను గుర్తుచేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.